Thursday, October 17, 2019
Follow Us on :

ఆపరేషన్ నాకౌట్

By BhaaratToday | Published On Jun 12th, 2019

మంత్రులకు టార్గెట్లు. కరప్షన్ కింగులకు రిటైర్మెంట్లు. బడ్జెట్ కు కొత్త సొబగులు. ఆర్థికరంగంలో పెనుమార్పులు. శాఖల ప్రక్షాళన దిశగా అడుగులు. అవినీతిపై మోదీ మెరుపుదాడులు. ఆపరేషన్ నాకౌట్..!.. 

రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఏళ్ల తరబడి పలు శాఖల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి బూజును దులుపుతున్నారు. ఇప్పటికే ఆర్థిక, ఐటీ శాఖల్లో 12 మంది అవినీతి అధికారులపై వేటువేసిన మోదీ సర్కార్.. మిగతా శాఖల్లో అక్రమాలపైనా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. దీంతో రాజకీయ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓవైపు అవినీతిని ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు పాలనను కూడా పరుగులు పెట్టిస్తున్నారు మోదీ. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక రంగంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న మోదీ సర్కారు.. ఈసారి బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల విలీనాన్ని వేగవంతం చేయడంతో పాటు.. నల్లధనాన్ని తగ్గించేందుకు, డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ప్రజాభిప్రాయ సేకరణకు పెద్దపీట వేసిన మోదీ సర్కార్.. కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఓవైపు రోజురోజుకీ పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ఉగ్రముప్పు నేపథ్యంలో.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. గత జనవరిలో చివరిసారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మోదీ సర్కార్.. రక్షణ రంగానికి పెద్దయెత్తున నిధులు కేటాయించింది. ఇక రాఫెల్ వంటి అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రోదిచేసుకుంటున్న భారత్.. ఈసారి కూడా డిఫెన్స్ కు భారీగా కేటాయింపులు చేసే అవకాశం వుంది.

పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠిన నిర్ణయాలతో గత ఐదేళ్లలో కీలక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మోదీ.. ఓవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపుతూనే.. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించారు. ఇక భారతీయుల ఆశీస్సులతో మరోసారి ఢిల్లీ పీఠం అధిరోహించిన మోదీ.. అప్పుడే అవినీతిపై కూకటివేళ్లతో పెకిలించడానికి సిద్ధమయ్యారు. అవినీతిరహిత పాలన అందిస్తామని మొదటి నుంచీ చెబుతూ వస్తున్న మోదీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు మోదీ. అవినీతి ప్రక్షాళనలో భాగంగా మోదీ 2.0 సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పలు శాఖల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి అధికార యంత్రాంగంపై మోదీ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ.. యూపీఏ కాలం నుంచి రాజకీయ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారుల గుండెల్లో మోదీ రైళ్లు పరుగెట్టిస్తున్నారు. ఐటీ, ఆర్థికశాఖల్లో కొందరు అవినీతి జలగలు, కీచకుల చిట్టా బయటపడటంతో.. ఆ శాఖల్లోని 12 మంది అవినీతి అధికారుకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమయ్యారు మోదీ. వీరందరినీ రాజీనామా చేయాలని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ ర్యాంకుల్లోని అధికారులతో పాటు.. ఇన్‌ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌ మెంట్ కమిషనర్‌ ను రాజీనామా చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసింది. 12 మంది అధికారుల్లో కొందరు అవినీతికి పాల్పడినట్లు, మరికొందరు చట్టాలను అతిక్రమించినట్లు తెలుస్తోంది. ఇంకొందరు అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా సీబీఐ విచారణలో బయటడినట్టు సమాచారం. జాయింట్ కమిషనర్ ర్యాంక్ అధికారి అశోక్ అగర్వాల్, ఐఆర్ఎస్ అధికారి ఎస్‌.కె. శ్రీవాత్సవ, మరో ఐఆర్ఎస్ అధికారి హోమి రాజ్వాంశ్, బీబీ రాజేంద్ర అనే మరో అధికారి వంటి పలువురు ఈ రాజీనామా జాబితాలో ఉన్నారు. వీరందరూ జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. బలవంతపు వసూళ్లు, అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం వీరిపై ఈమేరకు కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో ఇలాంటి అధికారులపై మోదీ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఆర్ధిక శాఖలో పని చేస్తున్న 8 మందిపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది. వీరిలో చీఫ్ కమిషనర్లు, ప్రిన్సిపల్ కమిషనర్లు, కమిషనర్లు ఉన్నట్టు ప్రభుత్వం ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఐటీ జాయింట్ కమిషనర్ అశోక్ అగర్వాల్ ని 1999 నుంచి 2014 వరకు సస్పెన్షన్ లో ఉంచినట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి మీద సీబీఐ విచారణ జరపకుండా అడ్డుపడ్డాడని ఈయనపై ఆరోపణలున్నాయి. చంద్రస్వామి తన ఆదాయానికి మించి 12 కోట్ల మేర ఆస్తులను సంపాదించాడని అప్పట్లోనే అభియోగాలు వచ్చాయి. అలాగే 1989 బ్యాచ్ కు చెందిన రెవెన్యూ సర్వీసు అధికారి ఎస్.కె. శ్రీవాస్తవ.. ఇద్దరు మహిళా అధికారులను లైంగికంగా వేధించాడట. అవినీతికి, వ్యభిచారానికి పాల్పడాలని వారిని ఒత్తిడి చేశాడని, పన్నులు చెల్లించకుండా ఎగగొట్టాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఈ ‘అవినీతి జలగ’ తనపై శాఖాపరమైన విచారణ జరగకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో గత 10 సంవత్సరాల్లో 75 పిటిషన్లు దాఖలు చేశాడట. పైగా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా ఎక్కాడని తెలిసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చైర్మన్, సభ్యులపై ఆరోపణలు చేసినందుకు ఇతనికి 15 రోజుల సాధారణ జైలు శిక్ష కూడా పడింది. హోమీ రాజ్ వంశ్ అనే అధికారి అవినీతికి పాల్పడి 3 కోట్ల 17 లక్షల విలువైన ఆస్తులను సంపాదించినట్టు తేలింది. ఇతడ్ని అరెస్టు చేసి సస్పెండ్ చేశారు. ఇలా మొత్తం 12 మంది అవినీతి అధికారులపై కేంద్రం కొరడా ఝలిపించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులను ఏకకాలంలో వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నిర్బంద పదవీ విరమణ చేయాల్సిన అధికారులను గుర్తించాలంటూ.. కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసెస్ 1972 చట్టంలోని నిబంధన 56 జే ప్రకారం ఒక అధికారికి 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేసే అధికారం ఉంటుంది. పనిచేయని అధికారులపై వేటు వేసేందుకు ఉద్దేశించిన విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధించారు. ఈ మేరకు వీరిపై సమీక్ష నిర్వహించిన సంబంధింత శాఖ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 12మందిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇలా ఓవైపు శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు పాలనను పరుగులు పెట్టించేదిశగా మోదీ అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పేదరిక నిర్మూలనపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు. గత ఐదేళ్లపాటు అధికారులు శ్రమించి పనిచేయడంతోనే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందన్న మోదీ.. వారిపై ప్రశంసలు గుప్పించారు. ప్రభుత్వ పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సర్కారు పట్ల సానుకూలత వల్లే మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు బోలెడు అంచనాలను పెట్టుకున్నారని.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మరింత శ్రమించాల్సి ఉందన్నారు మోదీ. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మన విజన్ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమైన అంశాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు.  అవినీతిని తగ్గించడానికి, సమర్థవంతమైన పాలన కోసం టెక్నాలజీ వాడకాన్ని మరింత పెంచాలని సూచించిన మోదీ.. విభాగాల వారీగా రియల్ టైం డ్యాష్‌ బోర్డులను క్రియేట్ చేయడం లాంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జితేందర్ సింగ్‌లు పాల్గొన్నారు. 2014లో తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా మోదీ కార్యదర్శులతో ఇలాగే ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సెక్రటరీలతో 8 గ్రూపులను ఏర్పాటు చేసిన మోదీ.. రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతోనూ నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మోదీ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టబోతున్నారు. దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న రెండో మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఒక్కరే మహిళా ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెజ్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పడి దాకా మరెవ్వరూ కూడా మహిళా ఆర్థిక మంత్రి కాలేదు. అలాగే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఇందిరా గాంధీ 1970-71లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడంతో ఆహె ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 1970లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి 48 ఏళ్లు గడిచిపోయాయి. ఇదిలావుంటే, ఆర్థిక రంగంలో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న మోదీ సర్కారు.. ఈసారి బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి 10 లక్షల కన్నా ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే పన్ను విధించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. నల్లధనాన్ని తగ్గించేందుకు, డిజిటల్ పేమెంట్లను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ రిటర్నులకు ఉపయోగపడేందుకు వీలుగా హైవాల్యూ లావాదేవీలకు ఆధార్ ను అనుసంధానం చేసేలా నిబంధన తీసుకురావాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 50వేల కంటే ఎక్కువ లావాదేవీలకు బ్యాంకులు పాన్ నంబరును అడుగుతున్నాయి. దాని స్థానంలో ఆధార్ నంబర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక, యూపీఏ ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టి.. 2009లో తీసేసిన బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని కూడా మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అన్నింటి కంటే కీలకమైన విషయం ఏమిటంటే.. అత్యధికంగా ట్యాక్స్ కట్టే వ్యక్తులు ప్రధాని మోదీతో చాయ్ తాగే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈసారి బడ్జెట్ రూపకల్పనలో వినూత్నంగా అడుగులు వేస్తోంది మోదీ సర్కార్. బడ్జెట్ పై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించే కొత్త సంప్రదాయానికి మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈసారి బడ్జెట్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ ఎలా ఉండాలో... బడ్జెట్‌లో మీకేం కావాలో చెప్పాలంటూ ప్రజల్ని సలహాలు, సూచనలు కోరుతోంది కేంద్ర ప్రభుత్వం. ఎవరైనా బడ్జెట్‌పై సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన mygov.in వెబ్‌సైట్‌లో కామెంట్స్ పోస్ట్ చేయొచ్చని స్పష్టం చేసింది. జూన్ 20 వరకు ఈ అవకాశం కల్పించింది. అంతేకాదు, బడ్జెట్‌ విషయంలో అన్ని వర్గాల నుంచి వస్తున్న సూచనలు తప్పక పరిగణనలోకి తీసుకుంటానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మేధావులు, ఆర్థికవేత్తలు, సామాన్యులు మీడియాలో పంచుకుంటున్న అభిప్రాయాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా ద్వారా విలువైన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, ఔత్సాహికులకు రుణపడి ఉంటానని నిర్మాలా సీతారామన్ స్పష్టం చేశారు. బడ్జెట్ విషయంలో వస్తున్న సూచనలను తన టీమ్‌తో సమన్వయం చేసుకుంటున్నానని.. ప్రతీ ఒక్కరి అభిప్రాయం విలువైందని.. మరిన్ని సలహాలు, సూచనలు చేయాలంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.  ఇదిలావుంటే, రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన నిర్మలా సీతారామన్‌కు.. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పట్ల అనుసరిస్తున్న వైఖరి, వాణిజ్య ప్రాధాన్య హోదా రద్దు చేయడం ఆర్థికవేత్తలను కలవరపెడుతున్నాయి. అంతేకాకుండా ట్రంప్‌ ఆంక్షల కారణంగా అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంలో మొదటిసారిగా ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తోన్న నిర్మలా సీతారామన్‌కు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ విలువైన అభిప్రాయాలను వివిధ మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. అంతేకాదు.. బడ్జెట్ రూపకల్పనలో అన్ని శాఖల అభిప్రాయాలను తీసుకుంటున్నారు నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా వివిధ శాఖలతో వరుసబెట్టి భేటీలు నిర్వహిస్తున్నారు. తొలిసారి వ్యవసాయ రంగానికి చెందిన సంఘాలు, పరిశ్రమ సంబంధిత అధికారులు, వ్యవసార రంగ ఆర్థిక నిపుణులతో భేటీ అయి చర్చించారు. ఇందులో వ్యవసాయ రంగ వృద్ధి, రైతుల ఆదాయం పెంచడం వంటి అంశాలకు చెందిన సలహాలు, సూచనలు తీసుకున్నారు. పశు సంరక్షణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.  ఇక ఈనెల 23 వరకు ఆర్థికవేత్తలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరపనున్నారు నిర్మలా సీతారామన్. 2019-20 బడ్జెట్‌ రూపకల్పనలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఈనెల 20న జరిగే జీఎస్‌టీ మండలి సమావేశం సందర్భంగా తమ సలహాలను కేంద్రానికి ఇవ్వనున్నారు.  ఇదిలావుంటే, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాల కల్పనపై 2019 కేంద్ర బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. బడ్జెట్ సమర్పణకు మరో 30 రోజులు మాత్రమే ఉండటంతో బడ్జెట్ సన్నాహకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బడ్జెట్‌లో చేర్చాల్సిన అంశాలకు సంబంధించి కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అధికారులతో చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రత్యక్ష పన్నుల సరళీకరణపై కూడా ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు దూసుకుపోయే విధంగా బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేసే అవకాశం వుంది. అంటే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పుంజుకునేలా బ్యాంకులు కీలక పాత్ర వహించే సూచనలున్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. 2018-19 లో భారత ఆర్ధిక వృద్ది రేటు 6.8 శాతం మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించనున్న బడ్జెట్ పై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ ఒక రోడ్ మ్యాప్ మాదిరి ఇది వుండవచ్చునంటున్నారు. గత ఏడాది మొదలు పెట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియకు మరింత ఊతమిచ్ఛేలా కొత్త విత్త మంత్రి ప్రయత్నించవచ్ఛునని తెలుస్తోంది. ఇక గ్రామీణాభివృద్ది, రైతుల సంక్షేమ పథకాలు వంటి వరాలు ఈ బడ్జెట్లో ఉంటాయని భావిస్తున్నారు. నల్లధన కట్టడికి మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. అటు మధ్యతరగతి, నిమ్న వర్గాల సంక్షేమానికి నిర్మలా సీతారామన్ తాయిలాలు ప్రకటించవచ్చునని కూడా తెలుస్తోంది. అలాగే బడా వాణిజ్య వర్గాల పట్ల మోడీ సర్కార్ కొంత ‘ పదునైన ‘ చర్యలకు ఉపక్రమించవచ్చని అంటున్నారు. రెండో సారి ప్రధానిగా తనను ఎన్నుకున్నందుకు మోదీ ఈ బడ్జెట్ లో ఎవరిని. ఎలా కరుణిస్తారో, ఎవరిని ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.

పొరుగుదేశాలు చైనా, పాకిస్థాన్‌లతో ముప్పు పొంచి ఉంటుందని, దేశానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరమని భావించిన మోదీ సర్కార్.. గత జనవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. రాఫెల్ యుద్ధ విమానాలు కోనుగోలతో పాటు.. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో.. రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లుకు పైగా కేటాయించింది.  సైనికులకు ప్రత్యేక అలవెన్స్‌ లతో పాటు.. దేశ రక్షణకు అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్‌ మ్యాన్‌ వన్‌ పెన్షన్‌‌ ను మోదీ ప్రభుత్వం అమలు చేసింది. ఈసారి కూడా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. మరోవైపు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సైతం.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపులను తగ్గించలేదు. 2019 - 2020 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 7,022 బిలియన్ రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇమ్రాన్ సర్కార్. ఇందులో రక్షణ రంగానికి 1,150 బిలియన్ రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ లో కూడా సరిగ్గా ఇంతేమొత్తం కేటాయించిన పాక్ ప్రభుత్వం.. ఈసారి కూడా రక్షణరంగానికి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో.. మునుపెన్నడూ లేనివిధంగా రక్షణ రంగంలో కోతకు ఇటీవల పాక్ ఆర్మీ అంగీకరించింది. ఈ విషయంలో మొన్నటికి మొన్న పాకిస్థాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు కూడా తెలిపింది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్  పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ గఫూర్ గత మంగళవారం దీనిపై ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు, రక్షణ రంగానికి కేటాయింపుల తగ్గింపునకు అంగీకరించిన సైన్యానికి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ, అంతలోనే ఉగ్రదేశం తన వైఖరిలో మార్పు చోటుచేసుకుంది. ఓవైపు నిత్యావసర ధరలు మండిపోతున్నా.. సంక్షేమం అట్టడుగు స్థాయికి పడిపోయినా.. జీడీపీ భయపెడుతున్నా.. సాయం చేసేందుకు ఐఎంఎఫ్ ఆంక్షలు విధించినా.. రక్షణ రంగానికి కేటాయింపుల విషయంలో పాక్ వెనక్కి తగ్గలేదు. దీంతో పాకిస్తాన్ ఉగ్రనీతి మరోసారి బయటపడిందంటున్నారు రక్షణ రంగ నిపుణులు. దీంతో భారత్ కూడా ఈసారి రక్షణ రంగానికి కేటాయింపుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోదని.. అందుకు తగిన విధంగా భారీగా కేటాయింపులుంటాయని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

- ఎస్ కె చారి