Thursday, September 19, 2019
Follow Us on :

మామా.. మళ్లీ వస్తున్నాం..!..

By BhaaratToday | Published On May 6th, 2019

త్వరలో ఇస్రో చారిత్రక ప్రయోగం. చంద్రయాన్ - 2 కు ముహూర్తం. సిద్ధమవుతున్న ల్యాండర్, రోవర్లు. రాకెట్ స్పీడుతో సన్నాహాలు. తొలి ప్రయత్నంలో నీటి జాడల అన్వేషణ. ఈసారి జాబిల్లి దక్షిణ ధృవంపై పరిశోధన. మామా.. మళ్లీ వస్తున్నాం..!.. 

చంద్రయాన్ వన్ ప్రయోగం ద్వారా ఇప్పటికే చరిత్ర సృష్టించిన ఇస్రో.. మరోసారి జాబిల్లిని అందుకునేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని మరింత పకడ్బందీగా రెడీ చేస్తోంది. తొలి ప్రయత్నంలోనే నీటి జాడల్ని అన్వేషించిన ఇస్రో.. ఈసారి జాబిల్లి చీకటి కోణాన్ని ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు నెలల్లో చందమామను మరోసారి పలకరించనుంది మన ఇస్రో. చంద్రుడిపై నీటి జాడలున్నాయా..? అక్కడ మనిషి మనుగడ సాధ్యమేనా..? అనే విషయాలపై అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు దశాబ్దాలుగా అన్వేషణలు జరుగుతున్నాయి. ఏ దేశానికి సాధ్యం కాని దాన్ని మన ఇస్రో సుసాధ్యం చేసింది. జాబిల్లిపై నీటిజాడల్ని కనిపెట్టిన నాసా శాస్త్రవేత్తలకు చంద్రయాన్ వన్ ప్రయోగం ఆసరా ఇచ్చింది. 1960 వ దశకంలో బుడిబుడి అడుగులతో ప్రారంభమైన ఇస్రో ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగుతోంది. అగ్రదేశాలు సైతం అబ్బురపడేలా ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుంది భారత్. ఓవైపు కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూనే.. మరోవైపు దేశ రక్షణ రంగానికి చేదోడుగా నిలిచే అనేక ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసింది ఇస్రో. ఇప్పుడు చంద్రయాన్, మంగళ్ యాన్, గగన్ యాన్ వంటి ప్రాజెక్టులతో చరిత్ర సృష్టించేందుకు సిద్ఠమవుతోంది.

ఎన్నో విజయాలతో ప్రపంచమే భారత్‌ ను చూసి గర్వపడేలా చేసిన ఇస్రో మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్‌-1ను విజయవంతంగా ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. మరోసారి జాబిల్లిపై పరిశోధనలకు సిద్ధమైంది. చంద్రయాన్ - 2 ప్రయోగానికి ఇస్రో అంతా సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జులై 9 నుంచి 16 తేదీల మధ్య చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఇస్రో.  గతంలో చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-1 ప్రయోగం ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు చంద్రుడిపై నీటి జాడను కొనుగొనడంలో నాసాకు భారత ప్రయోగం దోహదపడింది. ఇప్పుడిదే స్ఫూర్తితో చంద్రయాన్‌-2 ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్-1 ప్రయోగంతో పోల్చితే ఈసారి ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. కేవలం ఇంపాక్టర్, ఆర్బిటార్‌తోనే చంద్రయాన్-1 ప్రయోగాన్ని నిర్వహించారు. కానీ, చంద్రయాన్-2లో రోవర్‌ను కూడా జతచేయనున్నారు. జీఎస్ఎల్వీ ఎం.కె.-3 వాహకనౌక ద్వారా మూడు మాడ్యూల్స్ చంద్రుడిపైకి పంపనున్నామని ట్విట్టర్ లో ప్రకటించింది ఇస్రో. ఈసారి ప్రయోగం ద్వారా చంద్రుడిపై చీకటి తలాన్ని అన్వేషించనుంది ఇస్రో. ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే ఈ ప్రాంతంలోకి రోవర్‌ను దించలేదు. చంద్రయాన్ - 2 ప్రయోగంతో ఇప్పుడు ఇస్రో ఆ సాహసం చేయబోతోంది. చంద్రయాన్ - 2 ప్రయోగం ద్వారా పంపించే రోవర్లు చంద్రుడిపి చీకటి కోణాన్ని అన్వేషించనున్నాయి. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ - 3 రాకెట్‌ ద్వారా ప్రయోగించే చంద్రయాన్ - 2 ఉపగ్రహంలో ఆర్బిటర్, ల్యాండర్‌ విక్రమ్, రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఉంటాయని.. ఇవి సెప్టెంబర్‌ నాటికి అక్కడికి చేరుకుంటాయని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. వీటి ద్వారా తాము సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈసారి ప్రయోగం ద్వారా చంద్రుడి భూగర్భం, అక్కడ లభించే ఖనిజాలు, నీటి కణాల కోసం తాము అన్వేషిస్తామని తెలిపారు. ముఖ్యంగా చంద్రుడి లక్షణాలపై అధ్యయనం చేయనున్నామని అన్నారు.  జీఎస్‌ఎల్వీ మార్క్ - 3 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత అది చంద్రుడి కక్ష్యకు చేరుకుంటుంది. అనంతరం ఆర్బిటర్‌ నుంచి విక్రమ్ ల్యాండర్‌ విడిపోయి దక్షిణ ధ్రువం దగ్గరగా దిగుతుంది. అందులో నుంచి ప్రజ్ఞాన్‌  రోవర్‌ బయటకు వచ్చి 300 నుంచి 400 కిలోమీటర్ల మేర పయనించనుంది. అక్కడే 14 రోజులపాటు ఉండి చంద్రుడి ఉపరితలాన్ని వివిధ కోణాల్లో పరిశీలించనుంది. అక్కడ పరిస్థితులకు సంబంధించిన సమాచారం, ఫోటోలను 15 నిమిషాల్లో ఈ రోవర్ పంపుతుందని శివన్ తెలిపారు. అంతేకాదు, ఇందులో 13 పేలోడ్స్ ఉంటాయని, వీటిలో మూడు ప్రాగ్యాన్ రోవర్‌లోనూ, మిగతా 10 ల్యాండర్, ఆర్బిటర్‌లో‌ను అమర్చనున్నట్టు తెలిపారు. వాస్తవానికి దీనిని గతేడాది ఏప్రిల్‌లో ప్రయోగించాల్సి ఉండగా, 2019 జనవరికి వాయిదా వేశారు. కానీ, చంద్రయాన్‌-2 డిజైన్లలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ప్రయోగంలో మరింత ఆలస్యమైంది. చంద్రయాన్‌-2లో ల్యాండర్‌తో పాటు రోవర్‌ ఉంటుంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగితే రోవర్‌ దాని చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేయనుంది. ఫిబ్రవరిలో రోవర్‌, ల్యాండర్‌ను పరీక్షించారు.  ఈ సమయంలో ల్యాండర్‌ బరువును మోసేలా కాళ్లు బలంగా లేకపోవడంతో విరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు అప్పట్లో భావించారు. ఏప్రిల్‌ నాటికి ల్యాండర్‌ సిద్ధం కాకపోవడంతో మే నెలలో ప్రయోగం నిర్వహించలేకపోయారు. తాజాగా, దీనిని జులై 9 నుంచి 16 మధ్య చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రో ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపైకి రాకెట్‌ను పంపిన నాలుగో దేశంగా నిలుస్తుంది. చంద్రుడిపైకి తొలిసారిగా భారత్ 2008 అక్టోబరు 22న చంద్రయాన్‌ను పంపింది.  ఈసారి కూడా ప్రయోగం విజయవంతమై చంద్రుడిపై పరిశోధనల విషయంలో మరో అడుగు ముందుకుపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

చందమామపై మంచురూపంలో నీళ్లు ఉన్నట్లు గతంలో నాసా ప్రకటించింది. ఇది పదేళ్ల క్రితం భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌–1 ప్రయోగం ద్వారానే సాధ్యమైంది. చంద్రయాన్-1 అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు నీటి నిల్వలున్న విషయాన్ని స్పష్టం చేసారు. చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతోపాటు నివాసానికి అవసరమయ్యే నీటిని ఇక్కడి నుంచే పొందవచ్చని అప్పట్లో ప్రకటించారు. చంద్రుడి దక్షిణ ధృవం దగ్గర లూనార్‌ క్రేటర్స్‌లో మంచు మొత్తం ఒకేచోట నిక్షిప్తమై ఉండగా.. ఉత్తర ధృవ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు. చంద్రయాన్‌-1 అంతరిక్ష నౌకలో మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడిపై ఉపరితలంపై నీటి ఆనవాళ్లను నాసా గుర్తించగలిగింది. అయితే, నీటి ఆనవాళ్లు ఎక్కువగా ధృవ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపిన శాస్త్రవేత్తలు, అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 156 డిగ్రీల సెల్సియస్ కంటే ఎప్పుడూ ఎక్కువగా లేదని తెలిపారు. చంద్రుడి భ్రమణ అక్షం చాలా తక్కువగా ఉండటంతో సూర్య కిరణాలు ఈ ప్రాంతాన్ని తాకవని దీంతో ఇక్కడ ఎప్పుడూ చీకటిగా ఉండటంతో పాటు చాలా చల్లగా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గత పరిశీలనలో చంద్రుడి ధృవప్రాంతాల్లో నీటి జాడలు ఉండొచ్చు అని చెప్పిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ నీటి జాడలు ఉన్నట్లు అప్పట్లో ధృవీకరించారు. అందుకే, ఈసారి చంద్రయాన్ - 2 ప్రయోగం ద్వారా జాబిల్లి దక్షిణ ధృవంపై ప్రయోగాలకు ఇస్రో నడుం కట్టింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా అక్కడ రోవర్ ను దించలేదు. తొలిసారి ఆ సాహసాన్ని చేస్తోంది భారత్. ఇదిలావుంటే, చంద్రయాన్, సహా పలు ప్రతిష్టాత్మక ప్రయోగాలన్నీ పూర్తిచేసి.. 2022లోగా చంద్రునిపైకి మానవుడిని పంపుతామని అంటున్నారు ఇస్రో చైర్మన్‌ శివన్. దీంతోపాటు వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య–ఎల్‌1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలను తెలుసుకుంటామని అన్నారు. ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తం అవుతోందని తెలిపారు. అంతేకాదు, ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా 2021 డిసెంబర్ నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇటీవలే ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. అంతేకాదు, వ్యోమగామి బృందంలో మహిళ కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. భారత అంతరిక్ష చరిత్రలో గగన్‌యాన్ కీలక మలుపు అని చెప్పారు.  2020 డిసెంబర్‌ లో తొలి మానవ రహిత రోదసి యాత్రను, 2021 జూలైలో రెండో యాత్రను చేపడతామని శివన్ తెలిపారు. ఇవి పూర్తయిన తర్వాత 2021 డిసెంబర్‌లో మానవ సహిత యాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. గగన్‌యాన్‌కు సంబంధించి వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ మనదేశంలోనే ఇస్తామని, తదుపరి అడ్వాన్స్‌డ్ శిక్షణ రష్యాలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యోమగాముల బృందంలో మహిళ కూడా ఉండాలని, అదే తమ లక్ష్యమని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకూ శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు.  భారత వాయుసేన సహాయంతో భారతీయులే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని, చివరి దశలో మాత్రం విదేశీ సంస్థ సహకారం కూడా తీసుకుంటామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం విజయవంతమైతే మానవులను స్వతంత్రంగా రోదసిలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గగన్‌యాన్ ప్రాజెక్టు గురించి ప్రకటిస్తూ 2022 నాటికి భారత పుత్రిక లేదా పుత్రుడు అంతరిక్షంలోకి జాతీయ జెండాను మోసుకెళతారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.  గతేడాది 26 రోదసి ప్రయోగాలు చేపట్టినట్లు శివన్ తెలిపారు. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్-11ను కూడా గతేడాది ప్రయోగించారు. ఇక ఈ ఏడాది ఇస్రో 32 ప్రయోగాలు చేపట్టనుంది. ఇందులో 14 రాకెట్లు, 17 ఉపగ్రహాలు, ఒక టెక్ డెమో మిషన్ ఉండనుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని 2020 నాటికి చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చవకైన వాహన నౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ఈ ఏడాది జూలైలో పరీక్షించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.  అంతేకాదు, అంగారక గ్రహంపై మరింత లోతైన అధ్యయనానికి మంగళయాన్‌-2 ప్రయోగాన్ని సిద్ధం చేస్తోంది ఇస్రో. 2020 నాటికి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవలికాలంలో అగ్రదేశాలకు దీటుగా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో సత్తా చాటుతోంది. వేలమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందన్నట్టు.. చిన్న ప్రయోగాలతో మొదలైన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయాణం.. అప్రతిహతంగా కొనసాగుతోంది. మనదేశానికి సంబంధించిన ఎన్నెన్నో రోదసీ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి.. భారత అంతరిక్ష సంస్థ.. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను సైతం అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెడుతూ దూసుకుపోతోంది. ఆర్యభట్టతో మొదలైన ఈ రోదసీ ప్రయాణం మరికొన్ని సంవత్సరాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు అప్రతిహతంగా సాగుతోంది. ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలో ఎన్నో అద్భుతాలు సాధించిన సంపన్న దేశాలు సైతం విస్మయం చెందేలా.. తొలి చంద్రయాన్ ప్రయోగాన్ని.. మార్స్ రోవర్ ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతం చేసింది. ప్రతి ఏడాదిలోనూ రోదసీ ప్రయోగంలో కొత్త పుంతలు తొక్కుతూ భారతదేశానికి అన్ని విధాలుగా సాంకేతిక ఊతాన్నిస్తున్న ఇస్రో.. 2018లో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుని.. వాణిజ్యపరంగా కూడా అంతరిక్ష ప్రయోగాలను మరింత సుసంపన్నం చేసుకుంటోంది. గతేడాదిలో ఇస్రో సాధించిన విజయాలు ప్రపంచ దేశాల మన్ననలను అందుకున్నాయి. ‘ఇస్రో’ 2018లో ప్రయోగించిన  పెద్ద ప్రయోగాలలో కార్టోశాట్-2 సీరీస్ కింద ప్రయోగించిన రిమోట్ సెన్సింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఒకటి. జిశాట్-6 కమ్యూనికేషన్ ఉపగ్రహంతో పాటు ఐఆర్ఎన్ఎస్ఎస్ స్పేస్ సెగ్మెంట్ కిందకు వచ్చే ఎనిమిది నావిగేషన్ శాటిలైట్లు, జిశాట్-29 కమ్యూనికేషన్ శాటిలైట్, భూగ్రహం పరిశీలన కోసం ప్రయోగించిన హైసిస్, ఫ్రాన్స్ నుంచి ప్రయోగించిన ఏరియాన్-5తో కూడిన జిశాట్-11 మిషన్ ఉపగ్రహవాహకంలు కూడా వీటిల్లో ఉన్నాయి. జీశాట్-11 మిషన్ కమ్యూనికేషన్ విస్తృతికి సంబంధించి ప్రయోగం. గతేడాది డిసెంబర్ 19న జీఎస్ఎల్వీ ఎఫ్-11 ద్వారా ఇస్రో ప్రయోగించిన జీశాట్-7ఏ ఉపగ్రహం సైనిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించింది. పూర్తిగా భారత వైమానిక దళ అవసరాలను తీర్చడంతో పాటు దీనికి మరింత శక్తిని, పుష్టిని ఈ ఉపగ్రహం అందించగలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత శక్తి వంతమైన వైమానిక దళాలకు దీటుగా భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ ఉపగగ్రహం అత్యంత క్రియాశీలకం కాబోతోంది. దీనివల్ల అనేక రకాలుగా ఎయిర్‌ఫోర్స్ బలోపేతం కావడంతో పాటు అది ప్రయోగించే అన్‌మ్యాండ్ ఏరియల్ వాహకాలను, డ్రోన్‌లను పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. భారత దేశంలో కనెక్టివిటీ అన్నది పెరుగుతున్న జనావసరాల దృష్ట్యా ఎంతో ముఖ్యం. గతంతో పోలిస్తే అత్యంత జనాభా కలిగిన భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ అవసరాన్ని తీర్చుకోవడంతోపాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకూని ఇస్రో చేసిన ప్రయోగం జీశాట్-11 అంతకుముందు వరకు ప్రయోగించిన ఉపగ్రహాలతో పోలిస్తే ఇది అత్యంత భారీ ఉపగ్రహం. ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగ విజయాన్ని ఇస్రో సాధించింది. జీశాట్-2 ఉపగ్రహం ద్వారా దేశ వ్యాప్తంగా 16 జీబీపీఎస్ డేటా అనుసంధానంతో ఇస్రో అందించగలుగుతుంది. సాంకేతికంగా ఎంత పరిజ్ఞానం ఉన్నా, రోదసీ పరిశోధనలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న దేశాలు సైతం అబ్బురపడే రీతిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పీఎస్‌ఎల్వీ సి-43ని ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా విదేశాలకు చెందిన 30 వాణిజ్య ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. ఈ ప్రయోగం ఏ విధంగా చూసినా అంతరిక్ష పరిశోధనలో ఎంతో కీలకమైనదే. ఐసీస్ అనే ఉపగ్రహం ఔటర్ స్పేస్‌లో వున్న వాటిని గుర్తించి అనుపానులను అందించగలుగుతుంది. ఈ ప్రయోగ విజయం ద్వారా అంతకుముందు వరకు ప్రయోగించిన వాటిని కలుపుకొని 28 దేశాలకు చెందిన మొత్తం 270 ఉపగ్రహాలను ఇస్రో రోదసీలోకి పంపింది. ఇది ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థకు కూడా సాధ్యపడని విజయం. ఇతర దేశాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చడమే గాకుండా ఎప్పటికప్పుడు దేశీయంగా పెరుగుతున్న అవసరాలను సైతం తీర్చడంలో ఇస్రో క్రియాశీలక భూమికను పోషిస్తూనే వచ్చింది. ఇందులో భాగంగా జీ-శాట్ 29 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ద్వారా కమ్యూనికేషన్ల పరంగా సరికొత్త పుంతలు తొక్కింది. జీశాట్-29 అనే ఉపగ్రహం ఇటు జమ్మూ కాశ్మీర్, అటు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల అవసరాలను తీర్చడానికే ఉద్దేశించింది కావడం గమనార్హం. డిజిటల్ టెక్నాలజీని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలన్న ఆలోచనే ఈ ప్రయోగానికి కారణమైంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన కేఏ/కేయూ బ్యాండ్ అత్యంత శక్తివంతమైనది. ఈ ట్రాన్స్ పౌండర్‌లు దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల కమ్యూనికేషన్ అవసరాలను మరింతగా తీర్చే అవకాశం ఉంటుంది. 2018లో అంతరిక్షరంగం పరంగా మరికొన్ని సరికొత్త కార్యక్రమాలను కూడా భారత్ చేపట్టింది. వాటిల్లో ఉపగ్రహ నిర్మాణాల్లో ప్రవేటు సంస్థలను కూడా చేర్చింది. యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ రకరకాల విక్రేతలతో వర్క్ ఆర్డర్ కాంట్రాక్టులపై సంతకాలు చేసింది. ఇవి అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, ఉపగ్రహ పరీక్షలు వంటి వాటిల్లో సహాయపడతాయి.  ఈ విక్రేత సంస్థలు 2023 సంవత్సరానికి ముందుగా ప్రయోగించేందుకు 27 ఉపగ్రహాలను తయారుచేస్తాయి. ఈ ఉపగ్రహాలలో ఏడు కమ్యూనికేషన్‌కు సంబంధించినవి కాగా, పన్నెండు భూగ్రహ పరిశీలనకు ఉద్దేశించినవి. వీటితోపాటు ఐదు నేవిగేషన్, మూడు సైన్స్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. ఇస్రోకు 2018 సంవత్సరం మరో విధంగా కూడా మరుపురానిదని చెప్పాలి. ఎందుకంటే ‘ఇస్రో’ ఒక గొప్ప మైలురాయిని అధిగమించింది. 250 పైగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే కాదు వాటిని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి అపూర్వ మైలురాయిని చేరుకుంది. ఇలా మొత్తం 269  విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షం లోకి ప్రయోగించింది.  2019లోనూ సత్తా చాటుతోంది ఇస్రో. ఈ ఏడాదిని కూడా విజయంతోనే ప్రారంభించారు మన శాస్త్రవేత్తలు. జనవరి లో పీఎస్‌ఎల్‌వీ-సీ44 రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి సమాచారాన్ని అందించే మైక్రోశాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో. ఇక పీఎస్‌ఎల్వీ - సీ 45 ప్రయోగం ద్వారా శత్రువులకు హెచ్చరికలు పంపింది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు మరో 28 విదేశీ ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త రాకెట్ శత్రుదేశాల రాడార్ల బండారం బట్టబయలు చేస్తోంది. ఇక గత ఫిబ్రవరిలో జీశాట్ - 31 ఉపగ్రహాన్ని విజయంవతంగా నింగిలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. జీశాట్‌ 31 ఉపగ్రహం కమ్యూనికేషన్‌ సేవల్ని మరింత సమర్థంగా అందించబోతోంది. ఈ శాటిలైట్‌ మన దేశానికి మాత్రమే కాదు.. దేశం చుట్టుపక్కల ఉన్న దీవులకు కూడా సిగ్నల్స్ అందిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరిచేలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ -2 కు శ్రీకారం చుట్టింది ఇస్రో. అంతేకాదు భవిష్యత్తులో మంగళ్ యాన్, ఆదిత్య - ఎల్ 1 ప్రయోగాలతో పాటు.. గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి మానవులను పంపించి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రాకెట్ వేగంతో పరుగులు పెడుతోంది.

-ఎస్. కె. చారి