Monday, December 09, 2019
Follow Us on :

చె‘న్నై’ పానీ..!

By BhaaratToday | Published On Jun 21st, 2019

ఎండిపోయిన బోర్లు. నిండుకున్న రిజర్వాయర్లు. తమిళనాట నీటి కటకట. తన్నీరు కోసం తంబీల తండ్లాట. నీటి చెమ్మ దొరకని చెన్నపట్నం. గుక్కెడు జలం కోసం ‘జన’విలాపం. మొన్న మహారాష్ట్ర, నేడు తమిళనాడు. దేశానికి ఇస్తున్న సందేశం ఏమిటి..? ‘నీటి’ చుక్క చేస్తున్న హెచ్చరికలేంటి..?

గుక్కెడు మంచినీళ్ల కోసం చెన్నై నగరం విలపిస్తోంది. తమిళనాడు రాష్ట్రం.. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర నీటి సంక్షోభంతో విలవిలలాడుతోంది. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయి. బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. బిందెడు నీళ్లు కావాలంటే.. లక్కీ డ్రాలో గెలవాల్సిందే. మంచినీళ్ల కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. వంటలకు నీళ్లు లేక హోటళ్లు మూతపడుతున్నాయి. తమ వల్ల కాదని హాస్టళ్లు చేతులెత్తేశాయి. ఎక్కడ నీళ్లు ఎక్కువ వాడాల్సి వస్తుందోనని.. తమకిష్టమైన సాంబారు కూడా చేసుకోవడం లేదు తమిళ తంబీలు. ఇదీ ప్రస్తుతం తమిళనాడును వెంటాడుతున్న దుర్భర నీటి కష్టం. చెన్నైలో ఓవైపు నీటి ట్యాంకర్ల వద్ద నీటియుద్ధాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార, విపక్ష పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. నీటిఎద్దడిపై డీఎంకే ఆందోళన చేస్తుంటే.. ఏమంత ఎద్దడి లేదంటూ కొట్టిపారేస్తోంది అధికార అన్నాడీఎంకే. జలాశాయాలు అడుగంటిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పక్క రాష్ట్రాల నుంచి చైన్నై రావాల్సిన నీరు రావడం లేదని చెబుతోంది పళని సర్కార్. నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. నీరు లేనిదే ఈ సృష్టి లేదు. జన జీవనం లేదు. నాగరికతే లేదు. మనుషులను కలిపింది నీరు. అదే నీటి కరవు ఇప్పుడు మనుషులను విడదీస్తోంది. దేశాల మధ్య నీటి యుద్ధాలకు బీజం వేస్తోంది. అడుగడుగునా తన అన్ని అవసరాలను తీర్చే ప్రకృతిని మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. నేటి నీటి సంక్షోభానికి అదే కారణం. ప్రపంచం అంతా ఇదే తీరు. ఇక, దేశంలో ఏటికేడు తగ్గిపోతున్న తలసరి నీటి లభ్యత వెన్నులో భయం పుట్టిస్తోంది. నన్ను అధిగమించండి చూద్దాం అంటూ సవాలు విసురుతోంది. దీనికి జవాబు చెప్పవసినది మనమే. మార్చుకోవసినది జీవన విధామే. నీటిని పొదుపు చేసే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే ప్రస్తుతం ఫ్రాన్స్‌, అమెరికా, చైనా తరువాత, మనం అతిపెద్ద నీటి సమస్యను ఎదుర్కోవసి వస్తుందని అంతర్జాతీయ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా సమిష్టి చర్యలకు శ్రీకారం చుట్టకపోతే.. భవిష్యత్తులో నీటి సంక్షోభం తీవ్రతరంగా మారిపోతుంది. భవిష్యత్తు తరాల ప్రాణాలకు ముప్పు తప్పదు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టకపోతే... వారి భవిష్యత్తు అంధకారవుంది. 

సాధారణంగా చెన్నై నగరం నీటి పేరుచెబితే భయంతో వణుకుతుంది. ఎందుకంటే.. దేశంలో వరదల తాకిడికి ఎక్కువగా గురయ్యే నగరం అదే. కానీ, ఇప్పుడదే చెన్నై నీటి చుక్క కోసం తపిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడితో తమిళ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుట మహా సముద్రం కనిపిస్తున్నా.. కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు విలవిలలాడుతున్నారు. స్నానాలు చేసి రెండు, మూడులు రోజులవుతున్నా భరిస్తున్న చెన్నై వాసులు.. మంచినీటి కోసం మాత్రం దాహం.. దాహం అంటూ తపిస్తున్నారు. పుజల్, పాండీతో సహా.. చెన్నై నగరానికి దాహార్తిని తీర్చే రిజర్వాయర్లన్నీ అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం ఆగచాట్లు పడుతున్నారు. నీటి ట్యాంకర్లు బుక్ చేసినా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. నీళ్లు లేక హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో కేవలం ఒక గంట పాటు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. ఆ గంటలోనే స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం అన్నీ పూర్తికావాలి. లేదంటే అంతే. మరోవైపు నీళ్లు ఎక్కువగా వాడాల్సి రావడంతో.. తమకిష్టమైన సాంబారును కూడా వదులుకుంటున్నారు చెన్నై ప్రజలు. కొన్ని హోటళ్లలో సాంబారు వండటం లేదు. నీళ్లు లేక కొన్ని హోటళ్లను పూర్తిగా మూసేశారు. చెన్నై నగరవాసుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రతి రోజు 80 కోట్ల లీటర్ల నీరు అవసరం. అయితే ప్రభుత్వం ప్రతి రోజు 50 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో నీటి కోసం చెన్నైవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల వద్ద మహిళలు రోజంతా బారులు తీరుతున్నారు. ఉదయం 4 గంటలకు బయటకు వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తమ వంతు రావడం లేదని, కుటుంబానికి పది బిందెలకు మించి నీరు సరఫరా కావడం లేదని గృహిణులు ఆవేదిన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా చెన్నైకి నీటిని తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.  ఒక్క చెన్నైలోనే కాదు.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం బావుల వద్ద మహిళలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నారు. గంటల కొద్దీ వేచిచూసినా.. ఆ బిందె నిండుతుందో కూడా చెప్పడం కష్టమే. కొన్ని చోట్ల లక్కీ డ్రాలు వేసి మరీ నీళ్లు తోడుకోవాల్సి పరిస్థితి నెలకొంది. తాగటానికి నీళ్లు ఇస్తే చాలంటూ.. వీధుల్లోని ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పటంతో.. ట్యాంకర్ల దగ్గర మంచినీటికి టోకెన్ల సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి రెండు టోకెన్ల చొప్పున ఇస్తున్నారు. వీధిలోకి ట్యాంకర్ వచ్చినప్పుడు.. ఈ టోకెన్లు చూపిస్తే నాలుగు అంటే నాలుగు బిందెలు మాత్రమే ఇస్తున్నారు. మంచినీటికి కోటా పెట్టి.. కడుపు మంట రేపుతున్నారు. అప్పుడ‌ప్పుడూ వ‌స్తున్న వాట‌ర్ ట్యాంక‌ర్ల ద‌గ్గ‌ర దాదాపుగా యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాగునీటి కోసం జ‌నం కొట్లాట‌ల‌కు దిగుతుండ‌టంతో, కొన్ని ప్రాంతాల్లో పోలీసులే ద‌గ్గ‌రుండి మ‌రీ నీటి స‌ర‌ఫ‌రా చేయిస్తున్నారు.  ఇక కూలీ నాలీ చేసుకుంటూ చిన్న చిన్న బస్తీల్లో నివసించేవారి పరిస్థితి మరింత విచారకరంగా మారింది. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి కోసం పొద్దంతా పడిగాపులు కాయాలి. తమవంతుకు వచ్చే బిందెడు నీళ్లతో కుటంబం గడవడం కష్టంగా మారుతోంది. డబ్బులిచ్చి బయట నుంచి తెప్పించుకుందామన్నా.. ఇదే అదనుగా పెరిగిన ధరలు వారిని భయపెడుతున్నాయి. జ‌నం నీటి అవ‌స‌రాల‌ను అవ‌కాశంగా తీసుకుంటున్న కొంద‌రు ట్యాంక‌ర్ య‌జ‌మానులు, బిందె నీటిని 50 రూపాయ‌లకు అమ్ముతున్నార‌ట‌. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చే కుటుంబాలు.. సాధారణ అవసరాలకు కూడా ప్రతీరోజూ నీళ్లను కొనుగోలు చేయాలంటే తమవల్ల కాదంటున్నారు.  నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని చెన్నైలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆంక్షలు విధించాయి. కొన్ని సంస్థలు ఇంటి వద్దే పనిచేయమంటే, మరికొన్ని సంస్థలు భోజనం ఇంటి నుండే తెచ్చుకోమని సూచిస్తున్నాయి. అంతేకాదు, భోజనం చేసేందుకు డిస్పోజబుల్‌ ప్లేట్స్‌ తెచ్చుకోవాలని చెప్పారు. ఐటీ సంస్థల్లో తాగునీటికి చాలావరకు ఇబ్బంది లేకపోయినా, వాడుక నీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులను వీలైతే ఇంటి నుంచే ప్రాజెక్ట్ వర్క్స్ పూర్తి చేయమని చెబుతున్నాయి. ఆఫీస్ లలో నీళ్లు లేక వాష్‌ రూమ్స్‌ లాక్ చేస్తున్నారు.  మరోవైపు నీటి కొరత కారణంగా మెట్రోరైలు స్టేషన్లలోను ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. అలాగే, ఉద్యానవనాలన్నీ పచ్చదనాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో చిన్నవి, పెద్దవి కలిపి 637 వరకు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులకు రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ పార్కులలోని పూల చెట్లు, పచ్చిక బయళ్లు పచ్చదనాన్ని కోల్పోతున్నాయి. ఇక చెన్నై ఎదుర్కొంటున్న ఈ నీటి సంక్షోభాన్ని చూసి అక్కడికి వెళ్లాలనుకునేవారు కూడా భయపడుతున్నారు. తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. 

ప్రజలు ఇంత దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎటువైపు చర్యలు లేవని చెన్నైవాసులు మండిపడుతున్నారు. మరోవైపు మున్సిపల్ మంత్రి వేలుమణి మాత్రం నీటి కొరత కారణంగా హోటల్స్ మూతపడుతున్నాయన్న వార్తలను ఖండించారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. హోటల్స్‌లో ప్లేట్లకు బదులు అరటి ఆకులను వినియోగిస్తే నీటి వినియోగం కూడా తక్కువవుతుందని సలహా ఇచ్చారు. గ‌త 144 సంవ‌త్స‌రాల్లో లేనంత క‌రువు 2016లో త‌మిళ‌నాడుకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత నుంచీ ఏటా తుపానులు రావ‌డం మిన‌హా జ‌లాశ‌యాలు నిండ‌టం లేదు. ఇక రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఈశాన్య రుతుపవనాలు ముగిసిన రోజు నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 191 రోజులపాటు చెన్నైలో వర్షం కురవకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్ర‌ధానంగా పూండి, పుళ‌ల్, చోళ‌వ‌రం, చెంబ‌రంబాక్కం, రెడ్ హిల్స్, వీరాణం త‌దిత‌ర జ‌లాశ‌యాలు పూర్తిగా ఎండిపోయాయి. ఈ నాలుగు రిజర్వాయర్లలో 11.05 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే గత ఆదివారం ఉదయానికి వాటిలో కేవలం 0.027 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు మాత్రమే ఉంది. ఇందులో పూండి రిజర్వాయర్‌లో 24 మిలియన్‌ ఘనపుటడుగుల నీరు నిల్వ ఉండగా, సెకనుకు 15 ఘనపుటడుగుల నీటిని నగర అవసరాల కోసం చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు తరలిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ నీరు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోవడంతో రాళ్లక్వారీల్లోని నీటిని శుద్ధీకరించి వినియోగిస్తున్నారు. అయితే చాలా రోజులుగా క్వారీల నుంచి నీటిని తోడుతున్నందువల్ల ఆ క్వారీలు కూడా త్వరలోనే ఎండిపోయే పరిస్థితి నెలకొంది. చెన్నైకి తాగునీరు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా జ‌లాలు కూడా స‌ర‌ఫ‌రా అవ్వ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో భూగ‌ర్భ జలాలు త‌గ్గి ల‌క్ష‌లాది బోర్లు ఎండిపోయాయి. అటు త‌మిళ‌నాడు జ‌ల‌మండ‌లి అధికారులు కూడా తాగునీరు అందించ‌డంలో విఫ‌లం అవుతున్నారు.  చెన్నై తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కండలేరు జలాశయం నుంచి ఏటా 12 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. కండలేరు జలాశయంలో 6.40 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే చెన్నైకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుంది.  ప్రస్తుతం 4.58 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటంతో ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. అటు రుతుపవనాల ప్రభావంతో ఆశించిన మేరకు వర్షాలు కురవక పోవడంతో అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో చెన్నై నగరంలో నీటి ఎద్దడి మరింత పెరిగిపోయింది. చెన్నై నగరంలో నెలకొన్న నీటి సమస్యపై ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు. భూగర్భ జలాలు తగ్గిపోతుండటం వల్లే చెన్నైలో నీటి కొరత ఏర్పడిందని పళనిస్వామి అన్నారు. అయితే ఇది మీడియాలో చూపించినంత పెద్ద సమస్య మాత్రం కాదంటూ వ్యాఖ్యలు చేయడంపై నగర వాసులు మండిపతున్నారు. నీటి ఎద్దడి నివారణకు తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందన్నిరు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. ఇందుకోసం 500 కోట్లు కేటాయించామన్నారు. తాగు నీటి ఎద్దడిపై అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదిక కోరామని.. ఏ జిల్లాకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించి తగినన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇక చెన్నైకు సరిపడా నీటి సరఫరాకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు మంత్రి జయకుమార్. 2016-17లో రాష్ట్రంలో తీవ్ర కరవు నెలకొన్నప్పుడు చెన్నైలో రోజుకు 475 మిలియన్‌ లీటర్లు సరఫరా చేశామని... ఇప్పుడు కూడా రోజుకు దాదాపు అదే స్థాయిలో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక నుంచి కావేరీ జలాలు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. నీటి సమస్య తీర్చాలని విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి.  తాజాగా డీఎంకే కార్యకర్తల ఆందోళన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. నీటి సమస్య తీర్చడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాదాపు 400 మంది కార్యకర్తలు కోయంబత్తూరులో ఆందోళన చేపట్టారు. నీటి ఎద్దడితో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని.. లేకుంటే ముఖ్యమంత్రి ఆయన్ను డిస్మిస్‌ చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఇంత తీవ్రం అయ్యే వరకు ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో నీటి సమస్యపై తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసింది. సముద్రంలో వృథాగా చేరుతున్న వర్షపు నీటిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టారంటూ ప్రశ్నలు సంధించింది. వేలూరులోని కాలువలో కలుషిత జలాలు విడుదలను అడ్డుకోవాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. జల నిర్వహణ, తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలకు సంబంధించిన జీవోలను సమర్పించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జల వనరుల్లోని ఆక్రమణల తొలగింపు, పూడికతీతకు చేపట్టిన చర్యల గురించి నివేదిక సమర్పించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్లు పంపాలని ప్రజాపనుల శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు.

వేసవి వచ్చిందంటే నీటి కొరత గురించి గుర్తుకొస్తుంది. అంతకుముందు నీటి అవసరం పెద్దగా లేకపోవడం వల్ల నీళ్ల గురించి ఎవరికీ పట్టింపు వుండదు. వేసవిలో భూగర్భల జాలాలు అడుగంటినప్పుడు మళ్లీ నీటి గురించి వెతుక్కునే పరిస్థితులు, నీటి కటకటలు మొదలవుతాయి. ఇక ఎక్కడ చూసినా దాహార్తులే. గుక్కెడు మంచినీటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు. అందుబాటులో వున్న జలాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల తలెత్తే పరిణామాలివి.  ప్రస్తుతం తమిళనాడు లాగే.. గతంలో మహారాష్ట్ర కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2016లో తీవ్ర కరువు తాండవించినప్పుడు మరఠ్వాడాలోని లాతూరు వంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా మంచినీరు లభించలేదు. దీంతో రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సివచ్చింది. మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో సగానికిపైగా కరువు కోరల్లో మగ్గుతున్నాయి. ఈ తాలూకాల్లోని దాదాపు 30 వేల గ్రామాలు నీటి ఎద్దడితో అలమటిస్తున్నాయి. వందకు పైగా పల్లెలు నరకం చూస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర మాత్రమే కాదు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సైతం నీటి ఎద్దడి ఎక్కువగా వుంటోంది. ముఖ్యంగా మహానగరాల్లో ప్రతీ ఏటా నీటి ఎద్దడి పెరుగుతూనేవుంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో.. వర్షపు నీరు నేల ఒడికి చేరడం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అటు వరుస కరువుకాటకాలతో వర్షాలు లేక జలశయాలు నిండటం లేదు. దీంతో నగరాలకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. దీంతో ప్రస్తుతం దేశంలో అనేక నగరాలు.. చెన్నై అంత కాకపోయినా.. అంతో ఇంతో నీటి ఎద్దడిని ఎదుర్కొంటూనేవున్నాయి. ఒకప్పుడు భారత్ లో జలవనరులకు కొదవ వుండేది కాదు. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండోస్థానంలో వున్న భారత్ లో జలవనరుల పరంగానూ ఏ దేశానికీ తీసిపోదు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఓ జీవనది భూ ఉపరితలాన్ని సస్యశ్యామలం చేస్తోంది. చెరువులు, వాగులు, వంకలు ఇలా జలవనరులతో భారతావని కళకళలాడుతూవుంటుంది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏడాది పొడవునా నీటితో ప్రవహించిన జీవనదులే నిర్జీవమవుతున్నాయి. అభివృద్ధి మాటను కాలుష్య కోరల్లో చిక్కుకుని చిక్కి శల్యమవుతున్నాయి. దేశంలో సాగునీటి కోసం దాదాపు 70 శాతం, వ్యక్తిగత అవసరాల కోసం 80 శాతం భూగర్భ జలాల పైనే ఆధారపడుతున్నారు. మన నీటి అవసరాలకు ఆదరువుగా వున్న భూగర్భ జాలాలు అందనంత లోతుకు చేరుకున్నాయి. అంటే పంటలు పండేందుకు ఆధారమైన నేల పొరల్లోని నీటిని వాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలే చేయాల్సి వస్తోంది. ఇలా పరిమితికి మించి వినియోగంతో భూగర్భల జలాలు మరింతగా ఆవిరైపోయే ప్రమాదం వుంది. డిమాండ్ సరఫరా మధ్య అసమతుల్యత కారణంగా పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2025 నాటికల్లా మనదేశం నీటి కొరతను ఎదుర్కోక తప్పదని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 300 పైగా జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నట్టు 2015లోనే ప్రభుత్వమే రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఎక్కువగా వున్నాయి. తాగునీటి కొరత వలన ఎక్కువగా యూపీలో 50 జిల్లాలు ప్రభావితమయ్యాయి. మొత్తం 13 రాష్ట్రాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. ఈ 13 రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా వున్నాయి. దేశంలో పెరిగిపోతున్న జనాభాకు ప్రస్తుతం వున్న నీటివనరులు సరిపోవడం లేదు. కలుషిత వాతావరణంతో స్వచ్ఛమైన నీరు అందడం మహాభాగ్యంగా మారుతోంది. గత 50 ఏళ్ళలో అందుబాటులోని పరిశుభ్రమైన నీటి శాతం 3 వేల క్యూబిక్ మీటర్ల నుంచి 1020 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. ఆరువేల క్యూబిక్ మీటర్లుగా వున్న ప్రపంచ సగటుకు మనం అందనంత దూరంలో వున్నాం. భవిష్యత్తులో ఈ లెక్కల శాతం మరింత దిగజారిపోయే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. కిక్కిరిసిపోతున్న భారత జనాభాలో నీటి లభ్యతకు, డిమాండ్ కు మధ్య అంతరం అందనంత ఎత్తుకు చేరిపోతోంది. శరవేగంగా సాగుతున్న పట్టణీకరణతో మహా నగరాలు దాహం కేకలతో అలమటిస్తున్నాయి. పల్లెల్లో తలసరిన రోజుకు 40 లీటర్ల డిమాండ్ వుంటే, నగరాల్లో మూడు రెట్లు అధికంగా 135 లీటర్ల డిమాండ్ వుంటోంది. ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై వంటి మహా నగరాల సంగతి చెప్పనవసరం లేదు. పెరిగిపోతున్న డిమాండ్, తరిగిపోతున్న వనరులు, ఉన్నవాటిని సరిగా ఉపయోగించుకోలేని దయనీయం నీటి కష్టాలను కళ్ల ముందుకు తెస్తోంది. నీటి కొరత కారణంగా ఇప్పటికే జల యుద్ధాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆ జగడాలు సర్వసాధారణంగా మారిపోయే అవకాశం వుంది. వరుస కరువు కాటకాలతో దేశ జనాభాలో పావు వంతు మంది నీటి కొరతను ఎదుర్కొంటూనేవున్నారు. ఇప్పటికే తాగునీటికి కోసం కిలోమీటర్ల కొద్దీ దూరాలు నడిచి మంచినీటిని తెచ్చుకునే దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. మంచినీటి ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటి వద్ద జరిగే నీటి యుద్ధాలు వేసవిలో నిత్యకృత్యం యూపీలో అయితే నీటి కొరతను ఎదుర్కొనేందుకు రైళ్లలో వందల కిలోమీటర్ల దూరాలకు నీటిని తరలించిన సందర్భాలు వున్నాయి. ఇక వ్యవసాయం కోసం వందలాది అడుగుల లోతున బోర్లు తవ్వినా నీరు పడని పరిస్థితి. ఎకరం పొలంలో ఒక్కోసారి పది బోర్లు వేసి భగీరథ ప్రయత్నం చేసినవారెందరో. యూరోపియన్ కమిషన్ వేసిన లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 2 కోట్ల కన్నా అధికంగా బోరు బావులున్నట్టు తెలుస్తోంది.  ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని దాదాపు 32 దేశాలు తీవ్రస్థాయిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అతి వేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వున్న భారత్ లో పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 6 కోట్ల 30 లక్షల మంది ప్రజలు సురక్షితమైన తాగునీటికి దూరంగా వున్నట్టు చెబుతోంది ఐక్యరాజ్య సమితి. సురక్షితమైన తాగునీరు లేక నీటి సంబంధిత వ్యాధులతో ప్రపంచ జనాభాలో ఏటా 35 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు ఐరాస చెబుతోంది. కారు ప్రమాదాలు, ఎయిడ్స్ కన్నా ఈ మరణాలే ఎక్కువగానే వుంటున్నాయి. ఈ గణాంకాలు భవిష్యత్తు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.  నిజానికి దేశంలో జలవనరులకు కొరత లేదు. కానీ, వాటి వినియోగంలోనే తేడా. అందుకే జల సంరక్షణ విధానాలు లేకుండా ఇష్టా రాజ్యంగా వినియోగిస్తున్నందు వల్లే ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెప్పే మాట. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనా మన దేశంతో పోల్చితే 28 శాతం నీటిని తక్కువగా వినియోగిస్తోందని తెలుస్తోంది. సమస్య ఎక్కడుందన్నది ఈ లెక్కల ద్వారా తెలిసిపోతుంది. అమెరికా వంటి దేశాల్లో నీటి వినియోగానికి సంబంధించి సీలింగ్ వుంటుంది. జల సంరక్షణపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడం, వృథా చేసిన వారికి జరిమానా విధించడం వంటి కఠిన చర్యల కారణంగా మంచినీటిని కాపాడుకునే అవకాశం వుంటుంది. దేశంలో నీటిమీటర్ల వినియోగం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నా, అవి మెరుగైన ఫలితాలను ఇవ్వాల్సిన అవసరముంది.

-ఎస్. కె. చారి