Sunday, August 25, 2019
Follow Us on :

‘చేతి’రాత..!..

By BhaaratToday | Published On Apr 4th, 2019

 భారీ వరాలు.. బరువైన హామీలు. కీలక అంశాలతో పాటు పలు ప్రమాదకర వాగ్దానాలు..! అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇది జనం గొంతుక అంటున్న హస్తం నేతలు. అబద్ధాల పుట్ట అంటూ విపక్షాల విసుర్లు. ‘చేతి’రాత..!.. 

ఓటరు దేవుడే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వండివార్చింది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆఖరి అస్త్రాన్ని సంధించింది. జనంపై భారీ వరాలే కాదు.. బరువైన హామీల వర్షం కురిపించింది. పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. హామీల పుస్తకంలో ‘హస్త’క్షరాలు లిఖించించింది. కమలనాథుల కంటే ముందే ‘వరాల’ చిట్టా విప్పిన రాహుల్.. ఈసారి ‘జయం మనదేరా’ అంటూ సంకేతాలిచ్చారు. ఇంతకీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది..? హస్తం పార్టీ హామీల పుస్తకం అధికారాన్ని కట్టబెడుతుందా..? ఈ ‘ప్రామిస్ బుక్’ ఓట్లు కురిపిస్తుందా..? కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన ఎన్నిక‌ల మేనిఫెస్టోపై బీజేపీ మండిపడుతోంది. అమ‌లుకాని హామీలే కాకుండా.. మేనిఫెస్టోలో ప్ర‌మాద‌క‌ర అంశాల‌ను పొందుపురిచార‌ని కమలనాథులు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పార్టీ మేనిఫెస్టో ప్రజల్ని కష్టాల్లోని నెట్టేసేలా వుందని.. పూర్తి అవగాహనారాహిత్యంతో మేనిఫెస్టో రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హమ్ నిభాయేంగే’ అంటూ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మానిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానాల చిట్టా పెద్దగానే ఉంది. మరి, ఆ వాగ్దానాలను అమలు చేయడం సాధ్యమా..? అనే విషయంలోనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశభద్రతకు సంబంధించిన కొన్ని అంశాల ప్రస్తావన, కశ్మీరీ పండిట్ల లాంటి కొన్ని అంశాలను విస్మరించడంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇంతకూ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉంది..? దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా ఉందా..? దేశాన్ని ముక్కలు చేసేదిగా ఉందా..? ఉగ్రవాదులకు అండగా నిలిచేదిగా ఉందా..?

తొలి విడత లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఓటరు దేవుళ్లే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను వండివార్చింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పలు ఆకర్షణీయ అంశాలను ప్రకటించారు కాంగ్రెస్ పెద్దలు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. హస్తం గుర్తును సూచించేలా మేనిఫెస్టోలో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్.. కామ్-ధామ్, షాన్, సుశాసన్, స్వాభిమాన్, సమ్మాన్ ప్రధానాంశాలుగా మేనిఫెస్టో రూపొందించింది. పేదలకు ఆర్థిక భరోసా, యువతకు ఉపాధి కల్పన, రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలకు పెద్దపీట వేశారు. అంతేకాదు, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, వృద్ధి పెంపు వంటి అంశాలను ఏరికూర్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, గౌరవప్రదమైన జీవనం, గ్రామీణ ఆర్థిక పరిపుష్టితో పాటు సుపరిపాలన, జాతీయ భద్రత, పన్నుల సంస్కరణలు వంటి అంశాలకు ప్రధాన్యమిచ్చారు. ‘హమ్ నిభాయేంగే’ అంటూ 55 పేజీల మ్యానిఫెస్టోను మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మంగళవారం కాంగ్రెస్ మానిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలుచేసి అన్నదాతల్ని రుణ విముక్తుల్ని చేస్తామని ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షులు. రైతులకు కనీస మద్దతు ధర అమలు, పంటకు గిట్టుబాటు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ, సంస్థాగత రుణ సౌకర్యం, మార్కెటింగ్ వసతులు కల్పిస్తామని చెప్పారు. రైల్వే బడ్జెట్ తరహాలో ఏటా ప్రత్యేకంగా కిసాన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, రైతుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు. విద్యారంగానికి కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని, జీడీపీలో 6 శాతం మొత్తాన్ని కేవలం విద్యపైనే ఖర్చు చేస్తామని రాహుల్ వెల్లడించారు. 1 నుంచి 12 తరగతుల వరకు ఉచిత విద్యను తప్పనిసరి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్ని బలోపేతం చేసి, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ప్రతి పేదవాడికి చేరువ చేస్తామన్న రాహుల్.. అధికారంలోకి రాగానే ఆరోగ్య సంరక్షణ హక్కు చట్టం తీసుకువస్తామని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి కార్పొరేట్ దవాఖానాల స్థాయిలో ఉచిత వైద్యసేవలు, మందులు, ఆరోగ్య పరీక్షలు, ఔట్ పేషెంట్ సేవలు అందజేస్తామని హామీల వర్షం కురిపించారు. జీఎస్టీని ఎప్పుడూ గబ్బర్‌ సింగ్ ట్యాక్స్ అంటూ ఎగతాళి చేసే రాహుల్.. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మూడు దశల్లో ఉన్న పన్నును అత్యంత సరళీకరించి ఒకే దశలో పన్నును విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జీఎస్టీ ఆదాయంలో గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు కూడా భాగం కల్పించనున్నట్లు చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. భద్రతా బలగాల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచుతామన్న ఆయన.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసి సైన్యాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. బలగాల్ని దశలవారీగా ఆధునికీకరించే చర్యలు చేపడతామని తెలిపారు. ఇక చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును 17వ లోక్‌సభ తొలి సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదం పొందుతామని రాహుల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే బీజేపీ సర్కారు ఐదేళ్లలో కుదుర్చుకున్న రాఫెల్ సహా పలు ఒప్పందాలపై దర్యాప్తు చేపడతామని ప్రకటించారు రాహుల్. మోదీ హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలపైనా విచారణ చేపడుతామని అన్నారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పించే 370వ ఆర్టికల్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపిన రాహుల్... భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే కేంద్ర సాయుధ బలగాల చట్టాన్ని అధికారంలోకి రాగానే సమీక్షిస్తామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కశ్మీర్ పోలీసులకు ప్రత్యేక బాధ్యతల్ని కల్పిస్తామని తెలిపారు. మూక హత్యలు, దాడులు తదితర నేరాలను నివారించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని.. పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మండలి సలహా ప్రకారమే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకునేలా చట్టాన్ని సవరిస్తామన్నారు. అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని అన్నారు రాహుల్ గాంధీ. 2020 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4 లక్షల ఉద్యోగాలతోపాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 18 లక్షల ఉద్యోగాల్ని భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామపంచాయితీ, పట్టణ స్థానిక సంస్థల్లో 10 లక్షల మంది సేవామిత్ర పోస్టులను సృష్టిస్తామని.. అలాగే రాష్ర్టాల్లోనూ 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో వారు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కల్పిస్తామన్నారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పని రోజుల్ని 100 నుంచి 150కి పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ తరుపుముక్కగా భావిస్తున్న న్యాయ్ పథకంతో పేదరికంపై యుద్ధం ప్రకటిస్తామని రాహుల్ చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి ఏటా 72 వేలు అందజేసి పేదరికంపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. న్యాయ్ పథకం ద్వారా ఐదు కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. పదేళ్లలో యూపీఏ పాలనలో 14 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారని.. 2030 నాటికి దేశం నుంచి పేదరికాన్ని పారదోలడమే తమ లక్ష్యం అని అన్నారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని, సక్షేమం అందిస్తామని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం. మేనిఫెస్టో కమిటీకి ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. రైతులు, యువత, మహిళలు, పేదలు, దేశ రక్షణ, పారిశ్రామిక రంగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎన్టీఏ ప్రభుత్వం హయాంలో 4 కోట్ల 70 లక్షల కోట్ల ఉద్యోగాలు పోయాయని చిదంబరం విమర్శించారు. లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశామని చిదంబరం చెప్పారు. ఇక వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను రూపొందించామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. 2030 నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు. అన్ని వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తూ పకడ్బందీగా రూపొందించిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ‘న్యాయ్’ పథకం తమకు ఓట్లు కురిపస్తుందన్న ఆశతో వున్నారు హస్తం పెద్దలు. 

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. అది ప్రజలను వంచించేందుకు విడుదల చేసిన మ్యానిఫెస్టో అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట అని, దాని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి అబద్దపు హమీలే ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే రీతీలో హామీలను ఇస్తుందని మండిపడ్డారు. 2004 లో ప్రతి గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పిస్తామని హమీ ఇచ్చారని.. కానీ, 2014 వరకు కూడా 18 వేల గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీది మేనిఫెస్టో కాదని.. ప్రజలను వంచించే అబద్దాల పుట్ట అని అభివర్ణించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ ముప్పేట దాడి ప్రారంభించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన కాసేపటికే.. బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే.. దేశాన్ని విభజించే దిశగా ఆ పార్టీ కదులుతున్నట్లుగా అనిపిస్తోందని జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దిశగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్న జైట్లీ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఉగ్రవాదంపై పోరు సాగించడం కూడా దుర్లభంగానే మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధికి అవసరమైన విషయాలను వదిలేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో అల్లకల్లోలం సృష్టించే అంశాలను ప్రస్తావించిందని కూడా జైట్లీ తనదైన మార్కు పంచులు విసిరారు. దేశాన్ని ముక్కలు చేసే దిశగా కాంగ్రెస్ మేనిఫెస్టో సాగిందని కూడా జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు, జిహాదీలకు రక్షణ కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందంటూ మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం మావోయిస్టులు, జిహాదీల చేతుల్లో ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ, కేంద్ర సాయుధ బలగాలను తగ్గిస్తామని, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షిస్తామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పిందన్న జైట్లీ.. ఐపీసీ నుంచి 124-A సెక్సన్ తొలగిస్తే.. దేశ ద్రోహం అనేది నేరం కిందకు రాదని.. అది చాలా ప్రమాదకరమని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని తుక్డే తుక్డే గ్యాంగుగా అభివర్ణించిన జైట్లీ.. ఆ కమిటీ రూపొందించిన మేనిఫెస్టోకు ఆమోద ముద్ర వేసిన రాహుల్ గాంధీ సొంత నిర్ణయాలు తీసుకునే సత్తా లేని నేతగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరు ట్వంటీ సిక్స్ బై లెవన్ తో (26/11)తో ప్రారంభం కాలేదని, భారత్ ను విడగొట్టాలని చూస్తున్న శక్తులు చాలాకాలంగా దేశంలో చురుకుగా పనిచేస్తున్నాయని జైట్లీ అన్నారు. '70 ఏళ్ల పాటు సాగించిన తప్పిదాలే ఇవాళ కశ్మీర్ పరిస్థితికి కారణమ‌ని, చట్టబద్ధ పాలనను మేము ఏర్పాటు చేస్తుంటే, ఉగ్రవాదుల, చొరబాటుల రూల్స్‌ కోసం కాంగ్రెస్ పాటుపడుతోందని విమర్శించారు. కశ్మీర్ పండిట్ల ప్రస్తావన నామ‌మాత్రంగా నైనా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చోటుచేసుకోలేదని అన్నారు. ఇక జీఎస్‌టీ సింగిల్ శ్లాబ్‌పై మాట్లాడుతూ, ప్రతి వస్తువుపై ఒకే రేటు ఎలా వేయగలమని జైట్లీ ప్రశ్నించారు. 'పేదరికపు రేఖకు దిగువన ఉన్నవారు ఎక్కువ జీఎస్‌టీ ఉన్న వస్తువులను ఎలా కొనుగోలు చేయగలుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అర్ధంలేని హామీలని అన్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కూడా జైట్లీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని, ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు. తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. ఏపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని సీఎం చంద్రబాబు అంగీకరించారని.. ఆ తర్వాత ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఏపీ ఆమోదించిన ప్యాకేజీ ప్రకారం నిధులు అందుతాయని ఆరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇక దేశ ద్రోహులను, వేర్పాటువాదులను సంతోషపరిచేలా కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉందని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో అబద్ధాల పుట్ట అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. దేశ భద్రతపై కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీకి ఎదురైన వైఫల్యాలను ఈ మ్యానిఫెస్టోలో వెల్లడించారని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, తర్వాత బాలాకోట్‌లో ఐఏఎఫ్ దాడులపై విపక్షాలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్‌కు ఉపకరిస్తున్నాయన్నారు. సాయుధ బలగాల చట్టంలో సవరణలు తీసుకురావడం ద్వారా.. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించింద‌ని.. బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమాత్రం అభివృద్ధికి బాటలు వేసేలా లేదని అంటున్నారు కమలనాథులు.

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆ పార్టీకి మేలు చేసే విషయం పక్కనపెడితే.. ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి మాత్రం సరికొత్త ప్రచారాస్త్రాలను అందించింది. తాము అధికారం లోకి వస్తే 1870 సెడిషన్ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో లో ప్రకటించడం సంచలనంగా మారింది. దేశంలో పెరిగిపోతున్న మావోయిజం, ఉగ్రవాద సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. జాతీయవాదులకు ఆగ్రహం తెప్పించే నిర్ణయమిది. పార్టీ ఏదైనా సరే చట్టాలను దుర్వినియోగం చేస్తే ఆ చట్టాలపై ప్రజలకు సదభిప్రాయం పోయే అవకాశం ఉంది. ఈ పరిణామం కఠిన చట్టాల రద్దుకు దారి తీస్తే అంతిమంగా అది దేశభద్రతకు ముప్పు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో పై బీజేపీ విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు తెరదీశాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైందిగా బీజేపీ అభివర్ణించింది. దేశాన్ని ముక్కచెక్కలు చేసే ఎజెండాతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని విమర్శించింది. జిహాదీలు, మావోయిస్టుల ఉక్కు కౌగిలిలో కాంగ్రెస్ చిక్కుకుందని ఆరోపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం దేశద్రోహం ఇక ఎంతమాత్రం నేరం కాకుండా పోతుందని వ్యాఖ్యానించింది. జిహాదీలు, మావోయిస్టులను కాపాడేలా భద్రతాదళాలను ప్రాసిక్యూట్ చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ విమర్శలు గుప్పించింది. కశ్మీరీ పండిట్లను కశ్మీర్ కు దూరం చేయడాన్ని ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టింది. ఇక సంపద, సంక్షేమానికి తమ మేనిఫెస్టో పెద్దపీట వేసినట్టు కాంగ్రెస్ చెబుతోంది. అయితే, ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుతుంది. అధికారం పొందడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయపార్టీలు ఎంతకైనా తెగిస్తుంటాయి. ఎలాంటి వాగ్దానాలైనా చేస్తుంటాయి. అందుకే పదేళ్ళ క్రితమే సుప్రీం కోర్టు కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ విషయంలో ఆయా పార్టీలతో చర్చించి కొన్ని మార్గదర్శకాలను తయారు చేయాల్సిందిగా అప్పట్లో సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. రాజకీయ పార్టీలు మాత్రం ఎలాంటి వాగ్దానాలనైనా చేసే హక్కు తమకు ఉందని వాదించాయి. ఎన్నికల సంఘం కూడా సూత్రప్రాయంగా దాన్ని అంగీకరించినప్పటికీ కొన్ని వాగ్దానాలు కొన్ని సందర్భాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అడ్డంకిగా ఉంటాయని భావించింది. అందుకే ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం పార్టీలు చేసే వాగ్దానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉండాలి. పార్టీలు చేసే వాగ్దనాలు తగిన ఆర్థిక సమాచారంతో ఆచరణసాధ్యంగా ఉండాలి. నెరవేర్చేందుకు సాధ్యం కాని హామీలను ఆయా పార్టీలు ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని హామీలు ఆచరణసాధ్యమయ్యేలా కనపించడం లేదు. హస్తం పార్టీ ఎడాపెడా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మరెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పణంగా కూడా పెట్టాల్సి ఉంటుందనేది ఆర్థిక విశ్లేషకుల అంచనా. ఇదిలావుంటే, అవగాహనరాహిత్యంతో కాంగ్రెస్ పలు అంశాల్లో తప్పుడు వాగ్దానాలను చేసిందని కమలనాథులు మండిపడుతున్నారు. నిజానికి ఇలాంటి అంశాలు సాధారణమైనవేమీ కాదు. ఆర్థికపరంగా, భద్రతపరంగా, సామాజికపరంగా వివిధ అంశాల్లో దేశానికి జాతీయ విధానాలు ఉండాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జాతీయ విధానాల నుంచి వైదొలిగే విధంగా వాగ్దానాలు ఉండకూడదు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో పై గతంలో ఎన్నడూ లేనంత చర్చ ఇప్పుడు జరుగుతోంది. బీజేపీ మేనిఫెస్టో, వామపక్షాల మేనిఫెస్టోలు, ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోలు కూడా ప్రజల ముందుకు వస్తే ఆయా పార్టీల తీరుతెన్నులపై ప్రజలు ఒక అవగాహనకు వచ్చేందుకు వీలవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- ఎస్. కె. చారి