Thursday, October 17, 2019
Follow Us on :

దిద్దు‘బాట’లో..!..

By BhaaratToday | Published On Jun 7th, 2019

కాంగ్రెస్ లో అసంతృప్తి మంటలు. ఎస్పీ ‘పరివార్’ గొడవలు. బీఎస్పీలోనూ లుకలుకలు. ఉనికి కోసం జేడీఎస్ పాట్లు. తృణమూల్ కు తప్పని అగచాట్లు. అరవింద్ కేజ్రీవాల్ ‘ఆప్’సోపాలు. ప్రక్షాళన దిశగా బాబు అడుగులు. విపక్ష పార్టీల్లో ఓటమి సెగలు. బహిర్గతమవుతున్న విభేదాలు. దిద్దు‘బాట’లో..!.. 

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీతో విపక్ష పార్టీలన్నీ కకావికలమైపోయాయి. ఒక్క డీఎంకే మినహా.. యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ చావుదెబ్బ తిన్నాయి. ఎస్పీ-బీఎస్పీ కూటమి కూడా చెల్లాచెదురైపోయింది. అటు వామపక్షాల అడ్రస్ గల్లంతైంది. దీంతో ఇప్పుడు ఆ పార్టీల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఓటమికి కారణాలపై అంతర్గత విబేధాలు రాజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకీ ఆ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. యూపీలో ఎస్పీ-బీఎస్పీ మైత్రి బీటలువారడానికి.. బీజేపీతో పాటు.. అనేక కారణాలున్నాయి. కేవలం బీజేపీనీ ఓడించాలనే లక్ష్యమే తప్ప.. జననాడిని ఎస్పీ-బీఎస్పీలు అంచనావేయలేపోయాయనే విమర్శలున్నాయి. నిజానికి, పాతికేళ్ల శత్రుత్వాన్ని పక్కనపెట్టి.. చేతులు కలపడంతోనే.. జనానికి నెగిటివ్ సంకేతాలిచ్చారనేది రాజకీయ విశ్లేషకుల మాట. దీంతో ఆ రెండు పార్టీలు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడాలేకుండా దాదాపు అన్ని విపక్ష పార్టీలకు షాకిచ్చారు కమలనాథులు. బెంగాల్ లో మమత, కర్నాటకలో జేడీఎస్, ఢిల్లీలో ఆప్ వంటి పార్టీలు చావుదెబ్బ తిన్నాయి. వామపక్షాల పరిస్థితైతే మరింత దారుణంగా తయారైంది. ఇక బీజేపీతో తలపడకపోయినా.. ఏపీలో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇలా లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీల అధినేతలంతా పార్టీ రిపేర్లపై దృష్టిసారించారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్ష పార్టీల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఓటమికి కారణాలు వెతుక్కునే క్రమంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఓటమికి కారణం మీరంటే మీరంటూ నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఘోర పరాజయంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఎన్నికల్లో కనీసం 80 నుంచి 100 స్థానాలు సాధిస్తామని అంచనా వేసిన హస్తం పార్టీకి తీవ్ర నిరాశ ఎదురయింది. కనీసం గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ హోదాను పొందలేకపోయింది. దాంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని పాతతరం నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సీనియర్‌ నేతలు పి.చిదంబరం, అశోక్‌ గెహ్లాట్, కమల్‌నాథ్‌లపై రాహుల్‌ విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనం. పార్టీలో యువతకు పెద్దపీట వేయాలనుకున్న తనకు పార్టీలో స్వేచ్ఛ లేకుండాపోయిందని రాహుల్ ఆవేదన వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన అభిప్రాయంతో వృద్ధనేతలు ఏకీభవించడం లేదు. రాహుల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్ష పదవి చేపట్టిననాటి నుంచే స్వేచ్ఛగా ప్రయోగాలు చేస్తున్నారని అంటున్నారు. అధ్యక్షుడయిన తరువాత వాటిని మరింతగా కొనసాగిస్తున్నారని,.. ఇక ఆయనకు స్వేచ్ఛలేనిది ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. తన లోపాలను వేరేవారిపై నెట్టి వేయడానికే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. మొత్తానికి, సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. దాదాపు 60 ఏళ్లపాటు పాలించిన ఆ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమేనా..? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇంకా పట్టువీడడం లేదు. మొన్నటి సార్వత్రిక సమరంలో కేరళ, పంజాబ్, తమిళనాడుల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకి 26 శాతం ఓట్లు, 91 సీట్లు రాగా.. ఎన్డీఏ 45 శాతం ఓట్లతో, 353 సీట్లు కొల్లగొట్టింది. ఇతర పార్టీలు 29 శాతం ఓట్లు, 97 సీట్లు వచ్చాయి. విడివిడిగా చూస్తే కాంగ్రెస్‌కు 19.5 శాతం, బీజేపీ 37.4 శాతం ఓట్లువచ్చాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 440 సీట్లకు పోటీ చేసి 206 సీట్లు సాధించింది. 28.55 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ యూపీఏ-2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. 464 సీట్లకు పోటీ చేసి 19.5 శాతం ఓట్లతో 44 సీట్లను తెచ్చుకున్నా, లోక్‌సభలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 423 సీట్లకు పోటీ చేసి 19.8 శాతం ఓట్లతో 52 సీట్లను గెలుచుకుని, ప్రతిపక్ష హోదా లభించక మరింతగా నీరసపడింది. ఏపీ, బెంగాల్, ఒడిశా, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బిహార్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మట్టికరచింది. ఈ రాష్ట్రాల్లో ఇప్పట్లో కోలుకుంటుందనే నమ్మకం లేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్ కుమారుడు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడు నుంచి గెలిచి ఉండకపోతే.. ఆయన రాజకీయ చరిత్ర మరింత మసకబారిపోయేది. అమేథీలో రాహుల్ పరాజయం ఆ పార్టీ శ్రేణులను కుంగదీసింది. యూపీలో సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇంతటి వైఫల్యాలను మూటకట్టుకున్నా కాంగ్రెస్ నేతలు తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. రాహుల్ చుట్టూ పాతతరం నేతలు, తప్పుదారి పట్టించే నాయకులున్నారనేది.. కాంగ్రెస్ పార్టీలోని కొన్ని వర్గాల వాదన.  యువతరానికి ప్రాధాన్యం లేనందున కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రజలకు దూరమవుతోంది. రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వస్తే జనం విరగబడి ఓట్లు వేస్తారనుకునే భ్రమలు పటాపంచలయ్యాయి. ప్రజలు వ్యక్తి ఆరాధన సంస్కృతిని ఏవగించుకుంటున్నారని తాజా లోక్ సభ ఎన్నికలు రుజువు చేశాయి. 18 నుంచి 40 ఏళ్ల వయసు వారు కాంగ్రెస్ పనితీరును ఆమోదించడం లేదని తేల్చేశాయి. సెక్యులర్ భావాలున్న తమ పార్టీకే ఓటు వేయాలన్న.. సోనియా, రాహుల్, ప్రియాంక విజ్ఞప్తిని జనం పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారంలో, అంతకుముందు ప్రధాని మోదీని రాహుల్ ఇష్టం వచ్చినట్లు విమర్శించడాన్ని జనం ఆమోదించలేదు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ వల్ల అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పదే పదే చేసిన ఆరోపణలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. దేశంలో 85 శాతం ఉన్న హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోకపోవడం పెద్ద తప్పని ఈ ఎన్నికలు రుజువుచేశాయి. మైనారిటీల కొమ్ముకాసే విధానాల వల్ల ఆ పార్టీ ప్రధాన జనజీవన స్రవంతికి దూరమైందనే వాదన వినిపిస్తోంది. సెక్యులర్ ముసుగులో కుహనా లౌకికవాదాన్ని నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అందుకే ప్రాంతాలకు అతీతంగా జనం ఆ పార్టీకి గుణపాఠం చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం తలుపులు తెరిపించిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదే అన్నది నిర్వివాదాంశం. అయినప్పటికీ హిందువుల మనోభావాలను గౌరవించాలన్న ధ్యాస ఇప్పటి తరం కాంగ్రెస్ నేతలకు లేదు. రామమందిరం నిర్మాణంపై బీజేపీ సర్కారు పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటన చేసి ఉంటే.. ఆ పార్టీకి హిందూ ఓటు బ్యాంకు దూరమయ్యేకాదనే వాదన వుంది. ఇక, కాంగ్రెస్ అధినాయకత్వం మన వైమానిక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌లో చేసిన సర్జికల్ దాడులను శంకిస్తూ ప్రకటనలు చేసింది. ప్రధాని మోదీని, మన సైనికులను, రక్షణశాఖను, సీబీఐ, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. అందుకే ప్రజలు మరసారి మోదీవైపే మొగ్గుచూపారు. బీజేపీకి 2014లో కంటే అఖండ మెజారిటీతో గెలిపించారు. దళితులు, బీసీలు, అగ్రవర్ణాల్లో మెజారిటీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీ బీసీలు, దళితులు, బడుగు వర్గాలకు దూరమైంది. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవసరమైన అజెండా కాంగ్రెస్ వద్ద లేదనే విమర్శ బాహాటంగానే వినిపిస్తోంది. రాహుల్, ఆయన బృందంలోని నాయకులు ప్రజలను నమ్మించడంలో విఫలమయ్యారు. గతేడాది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన ప్రజలే.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ షాకిచ్చారు. ఇంత జరిగినా.. హస్తం పార్టీలో హస్తం పార్టీలో తప్పటడుగులు పడుతూనేవున్నాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రెండోసారి కూడా మోదీ చేతిలో ఓడిపోవడంతో ఇక తాను అన్ ఫిట్ అని.. వేరే వాళ్లకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని పదవి వదులుకున్నారు. వెంటనే వేరే అధ్యక్షుడిని నియమించాలని తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని సీడబ్ల్యూసీపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, రాహుల్ రాజీనామాకు సోనియాతో పాటు.. పార్టీ నేతలు ఒప్పుకోవడం లేదు. రాహుల్ స్థానంలో ఓ సీనియర్ నేత లేదా.. ఓ జూనియర్ కు కానీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. లేదంటే మరో ఐదేళ్లకు కూడా మోడీని తట్టుకొని రాహుల్ నిలబడడం కష్టమంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా మళ్లీ సోనియా గాంధీని ఎన్నుకోవడం కూడా తప్పేనంటున్నారు రాజకీయ విశ్లేషకలు. ఇప్పటికే వయోభారం, అనారోగ్య సమస్యలతో పార్టీకీ దూరంగా వుంటూ వస్తున్న ఆమెను మరోసారి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోవడంపై కాంగ్రెస్ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోనియా స్థానంలో మరోనేతను ఎన్నుకుని ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది. మళ్లీ సోనియాను ఎన్నుకోవడం ద్వారా. గాంధీ కుటుంబం అధికారం లేకుండా ఉండలేదనే సంకేతాన్ని ఇచ్చినట్టయింది. కానీ, గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తులను నియమిస్తే ఆ పార్టీ నేతలు భరించే స్థితిలో లేరు.  ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త యువరక్తం ఎక్కించి.. యువనేతలకు కీలక పదవులను అప్పగించి, కాలదోషం పట్టిన విధానాలకు పాతర వేయాలి. ఆ పార్టీ బతికి బట్టకంటాలంటే సంస్థాపరంగా ప్రక్షాళన చేసి, అన్ని విధాలా పటిష్టం చేసుకోవాలి. ఆ పార్టీ మనుగడకు ఇప్పట్లో వచ్చే ముప్పేమీలేదు. విధానాలు మార్చుకోకుండా ఇలాగే కుటుంబ పార్టీగా కొనసాగితే, ఐదేళ్ల తర్వాత మరో డజను సీట్లు పెరుగుతాయే తప్ప.. అధికారంలోకి రావడం కల్ల. బీజేపీ ఏకపక్ష విధానాలకు చెక్ పెట్టేందుకు బలమైన ప్రతిపక్షం ఉండాలి. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో విఫలమైంది. మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. బీజేపీ వైభోగాన్ని చూసి విచారించే బదులు, లోపాలను సరిదిద్దుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలితేనా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యమవుతుంది.

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి వైఖరి మొదటి నుంచి అనుమానాస్పదమే.. కొద్దిరోజుల క్రితం యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకొని అధికార బీజేపీని చిత్తుగా ఓడించింది. దీంతో మాయ రెచ్చిపోయారు. మా మహాకూటమిని ఎదుర్కోవడం బీజేపీ వల్ల కాదని బీరాలు పలికారు. అఖిలేష్ తో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ మహాకూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో మాయా మరోసారి కూటమి నుంచి బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మాయవతి ప్రకటించడం బీజేపీ శ్రేణులకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి యూపీ ప్రజలు జాతీయ కోణంలో కాకుండా రాష్ట్రీయ కోణంలో ఆలోచిస్తారు. ఎస్పీ-బీఎస్పీ కలిసి ఉంటే వారికే ఓటేస్తారు. అందుకే ఇప్పుడు మాయవతి తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా బీజేపీ శిబిరాన్ని సంతోషపెట్టగా.. ఎస్పీ అఖిలేష్ యాదవ్ ను షాక్ కు గురిచేసింది. ఆది నుంచి మాయావతి లో దూకుడు ఎక్కువ. స్థిరంగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండరని విశ్లేషకుల భావన వుంది. ఓడినా.. గెలిచినా కట్టుబడి ఉండే రకం కాదు. అందుకే అలా ఓడగానే ఇలా ప్రత్యర్థులకు అస్త్రాలను అందిస్తుంటారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ పార్టీకి పట్టం కట్టడంతో ఎస్పీతో దోస్తీకి స్వస్తి పలికారు. నిజానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీలు అయిన ఎస్పీ- బీఎస్పీకి ఓటేస్తే అది వేస్ట్ అన్న భావన ఆ రాష్ట్ర ప్రజల్లో ఉంటుంది. అందుకే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జాతీయ కోణంలో ఆలోచించి బీజేపీ-కాంగ్రెస్ ను గెలిపించారు. అలా అని కూటమి విచ్చిన్నం చేసుకుంటే మాత్రం మునిగేది మాయావతియే. రాష్ట్ర అసెంబ్లీ విషయంలో ఓటర్లు స్థానిక పార్టీల వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి తొందరపడి మాయావతి ముందేకూసి ఎస్పీతో దోస్తీ కట్ చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యూపీ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ ఓటమితో.. అఖిలేష్ యాదవ్ పైనా విమర్శలు వినిపిస్తున్నాయి. తండ్రి మాటను లెక్క చేయకుండా అఖిలేష్ చతికల పడ్డారు. తండ్రి ఏర్పరిచిన ఓటు బ్యాంకునంతా ఆరేళ్లలో హరీమనిపించారు. దూకుడు నిర్ణయాలు, దూరాలోచన లేకపోవడం వంటి అంశాలు అఖిలేష్ ను రాజకీయంగా దెబ్బతీసాయన్నది ఆపార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో రెండే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన తన తండ్రి ములాయం సింగ్ బాటలో అఖిలేష్ నడవలేదు. భారతీయ జనతా పార్టీని పూర్తిగా అణిచివేయాలనుకోవడంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లో పడేశాయంటున్నారు. ఇక యూపీలో ఎస్పీ చతికలబడటానికి మరోకారణం.. అబ్బాయి, బాబాయి మధ్య అంతర్గత పోరు.  ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివ్‌పాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకొని పోటీ చేశారు. ఈ కారణంగా యాదవుల ఓట్లు చీలిపోయి ఎస్పీకి తీవ్ర నష్టం కలిగించాయి. దాంతో ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు ములాయం సూచించారు. అయితే ఇందుకు అవకాశం లేదని అఖిలేశ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఇది జరిగితే పార్టీలో ‘తరం మార్పు’ ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని అంటున్నారు. చిరకాల ప్రత్యర్థి మాయావతి పార్టీతో పొత్తు వద్దని ములాయం వారిస్తున్నా తనకు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి అడ్డులేకుండా చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ మాయావతితో చేతులు కలిపారు. కానీ సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా ఐదు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. చివరికు మాయావతి, ములాయం సింగ్ ఒకే వేదికపైకి వచ్చి కలసి ఉన్నామని సంకేతాలు పంపినా ప్రజలు దానిని తిప్పికొట్టారు. మొత్తం మీద అఖిలేష్ యాదవ్ రాంగ్ స్టెప్ లతో తండ్రి మాటను లెక్క చేయకుండా పార్టీని కష్టకాలంలోకి నెట్టారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అడుగుపెట్టడం అసంభవం అనే పరిస్థితి నుంచి.. అక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. క్రితం సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అక్కడ జస్ట్ ఖాతాను తెరిచింది. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీ అక్కడ మమతా బెనర్జీకి  ప్రధాన ప్రత్యర్థిగా మారింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోగా..  అక్కడ బీజేపీ సంచలన స్థాయి ఫలితాలను సాధించింది. ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే బీజేపీ అక్కడ ఇంతటితో ఆగేలా లేదు. మోదీ అంటే ఊగిపోతున్న మమతా బెనర్జీని గద్దె దించి ఆ పార్టీ అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ లో ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ గా బండి నడిపించారు. అసలు ఉనికే లేని చోట తమ ఊపు ఏమిటో చూపించారు. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలన్న తదుపరి లక్ష్యం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు అసలే ఓటమి భారంతో కుంగిపోయిన మమతా బెనర్జీని బీజేపీ అడుగడుగునా అడ్డుతగులుతూనేవుంది. దీదీ ఎక్కడికి వెళ్తున్నా బీజేపీ కార్యకర్తలు జైశ్రీరాం నినాదాలతో విరుచుకుపడుతున్నారు. దీంతో బీజేపీకి పోటీగా ఆమె జైహింద్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. హిందుత్వ శక్తులను ఎదుర్కోవడానికి ఇదే మార్గమని ఆమె భావిస్తున్నారు. ఇదిలావుంటే, బీజేపీ ప్రభావాన్ని అంచనా వేసిన దీదీ.. మరో రెండేళ్లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో మమతా బెనర్జీ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ పీకే జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇటీవలే ఏపీలో పాగా వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ సహకారం అందించారు. ఆ పార్టీకి స్ట్రాటజిస్టుగా పని చేశారు. ఈ పరిణామాల్లో మమత కన్ను పీకే మీద పడింది. రాజకీయ వ్యూహాలను సమీక్షించుకోవడానికి ఐ ప్యాక్ తో ఒప్పందం చేసుకుని ఆమె పీకే సహకారం తీసుకోబోతోందని సమాచారం. ఇందులో భాగంగా పీకేతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు మమతా బెనర్జీ. అధికారికంగా ఎవరూ ధృవీకరించికపోయినా.. భేటీ మాత్రం జాతీయ స్థాయిలో కలకలం రేపుతుంది. మొత్తానికి బీజేపీ కొట్టిన దెబ్బకు దీదీ ముందే మేల్కొన్నారు. ఇక దక్షిణాదిలో కమలనాథుల జోరు ముందు నిలవలేక చతికిలబడిన మరో పార్టీ జేడీఎస్. మొత్తం 28 లోక్ సభ సీట్లలో ఏకంగా 25 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ జయకేతనం ఎగువేసింది. దీంతో జేడీఎస్ కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. దీంతో జేడీ(ఎస్)లో అప్పుడే ముసలం మొదలైంది. పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు ఎ.హెచ్.విశ్వనాథ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ - జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఇటీవలి ఎన్నికల్లో కూటమి వైఫల్యానికి కుమారస్వామియే కారణమని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది.  మరోవైపు మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప సమయంకోసం ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎక్కువ కాలం పట్టదని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆయన.. సీఎం కుర్చీ మళ్ళీ తననే వరించవచ్చునన్న కొండంత ఆశతో ఉన్నారు. జేడీ-ఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడల ఓటమి తదితరాలు కర్ణాటకలో బీజేపీ ఆశలను చిగురింపజేస్తున్నాయి. సంకీర్ణ కూటమి తనకు తానే కూలిపోవచ్ఛునని కమలనాథులు భావిస్తున్నారు. అటు బీజేపీ ప్రభంజనం ముందు దేశరాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. మొత్తం ఏడింటికి ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ముప్పు తప్పదని గ్రహించిన అరవింద్ కేజ్రీవాల్.. అప్పుడే ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళా ఓటర్లను ఆకట్టకునేందుకు ఆప్ సరికొత్త ఆలోచనలకు తెరలేపింది. మెట్రో రైళ్లు, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు.. తద్వారా ప్రజా రవాణాను వినియోగించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ, జాతీయ పార్టీలను కకావికలం చేశాయి. ఈ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలను మట్టి కరిపించింది. 175 శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 151 స్థానాలను కైవసం చేసుకుంది. 25 లోక్ సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 22 ఎంపీ స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరంగా అయ్యాయి. ఈ ఎన్నికల బరిలో నిలిచిన అధికార తెలుగుదేశం పార్టీకి దక్కినవి కేవలం మూడంటే మూడు ఎంపీ స్థానాలు మాత్రమే. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఎక్కడ మిస్ అయ్యాం.. ఏది మిస్‌చేశాం.. అనే అంశాలపై విశ్లేషిస్తూనే.. కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈసారి మోదీ దెబ్బకు వామపక్ష పార్టీలు సైతం కకావికలమయ్యాయి. దేశంలో సీపీఐ, సీపీఎం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నది. ఈ ఎన్నికలలో వామపక్షాలకు వచ్చినవి కేవలం ఐదు లోక్ సభ స్థానాలు మాత్రమే. స్వంతంత్ర భారత చరిత్రలో వామపక్షాలు ఇంత తక్కువ స్థానాలతో మిగలడం గతంలో ఎన్నడూ లేదు. వామపక్ష ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలో సైతం వామపక్షాలకు దక్కినది ఒకే ఒక్క ఎంపీ సీటు అంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వామపక్షాలకు బలం ఉందని భావించే పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వామపక్షాలు అసలు ఖాతీయే తెరవలేదు. పలు చోట్ల వామపక్ష అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటీకు ఎక్కవ ఓట్లు పడ్డాయంటేనే దేశంలో వామపక్షాలకు ఉన్న ప్రజాదరణ ఏమిటో అర్ధమౌతుంది. దీంతో వామపక్ష పార్టీలు సైతం ప్రక్షాళనకు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని.. ఆ పార్టీల ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకర్‌ రెడ్డి, సీతారాం ఏచూరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వామపక్షాల అపజయాలకు తాము పూర్తి బాధ్యత వహిస్తామని, తమ స్థానంలో మరొకర్ని నియమించవచ్చునని వారిద్దరూ తమ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో చెప్పినట్లు సమాచారం. మరో రెండు మూడు నెలల్లో జాతీయ మండలి సమావేశాల్లో ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించడమే కాకుండా.. పార్టీలను పెద్దయెత్తున ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ ప్రభంజనం ముందు కకావికలైన విపక్ష పార్టీలు పునరుజ్జీవం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రక్షాళనకు నడుం కట్టాయి.

-ఎస్. కె. చారి