Thursday, September 19, 2019
Follow Us on :

‘బాండ్’.. బి కేర్ ఫుల్..!..

By BhaaratToday | Published On Apr 13th, 2019

ఎన్నికల బాండ్లకు సుప్రీం అంగీకారం. కానీ, విరాళాల గోప్యతపైనే ఆగ్రహం. దాతల పేర్లు వెల్లడించాలని రాజకీయ పార్టీలకు ఆదేశం. బాండ్ల పథకంపై ఆందోళనలు. ఈసీ, కేంద్రం భిన్నవాదనలు. ‘బాండ్’.. బి కేర్ ఫుల్..!.. 

రాజకీయ పార్టీల నిధుల కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఎన్నికల బాండ్లలో దాతల వివరాలను ఈసీకి చెప్పాల్సిందేనని రాజకీయ పార్టీలకు మొట్టికాయలు వేసింది. దాతల వివరాలను సీల్డ్‌ కవర్‌లోమ అందచేయడానికి సమయం ఇచ్చిన సుప్రీం.. బాండ్ల పిటిషన్‌ పై త్వరలోనే సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మనదేశంలో ఎన్నికలు ఖర్చుతో కూడిన వ్యవహారం. టికెట్లు పొందాలన్నా, ప్రచారం చేసుకోవాలన్నా, ఓట్లు సాధించాలన్నా ప్రతి దానికీ పైసలతోనే పని. పోలింగ్ పూర్తయ్యే చివరి నిమిషం వరకూ చేతి నిండా డబ్బుండాలి. భారత్ లో ఎన్నికలు ఇప్పుడు ఖరీదైన వ్యవహరాం. మరి పార్టీల వ్యయ ప్రక్రియ పారదర్శంగా జరగుతుందా..? అంటే లేదనే చెప్పాలి. అందుకోసమే ఎన్నికల బాండ్ల పథకాన్ని తెరపైకి తెచ్చింది కేంద్రం. మరి, ఈ పథకం సత్ఫలితాలనిస్తోందా..? రాజకీయ పార్టీలకు కార్పొరేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలివ్వడమనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. చిన్న, పెద్ద, అధికార, ప్రతిపక్ష తేడా అనేది లేకుండా పలు పార్టీలకు నిధుల సాయాన్ని అందజేస్తుంటారు. వీటిని ఆయా పార్టీలు తమ కార్యకలాపాలకు అవసరమయ్యే పలు ఖర్చుల కోసం వినియోగిస్తుంటాయి. ఈ ఖర్చులు పారదర్శకంగా జరగాలనే.. కేంద్రం ఎన్నికల బాండ్లకు శ్రీకారం చుట్టింది. మరి, ఈ పథకంపై ఎందుకు వివమర్శలు వస్తున్నాయి..? ఈ పథకంలో వున్న లోపాలేంటి..?

రాజకీయ పార్టీల నిధుల కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంను యధావిధిగా కొనసాగించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల బాండ్లకు సంబంధించిన దాతలు వివరాలు, వారి బ్యాంకు ఖాతాల సమాచారాన్ని మే 30లోగా సీల్డ్‌ కవర్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని రాజకీయ పార్టీలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సీల్డ్‌ కవర్‌లో సమర్పించే నివేదికలో ఎవరు, ఎంత నిధులిచ్చారనే వివరాలను పొందుపర్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే సమగ్ర విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వ్యయం, రాజకీయ పార్టీల విరాళాల పద్ధతిని ప్రక్షాళన చేసి క్రమబద్దీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను ఇటీవల తెరపైకి తెచ్చింది. ప్రతియేటా నాలుగుసార్లు ఈ ఎలక్టోరల్ బాండ్లు అందుబాటులో వుంటాయి. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరులో ఎలక్టోరల్‌ బాండ్ల ను.. వ్యక్తులు లేదా సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్లను జారీ చేసిన రోజు నుంచి 10 రోజుల వరకు మాత్రమే వీటిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయి. ఆ లోగా రాజకీయ పార్టీలు తమ ఖాతాలోకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాన్ని జమ చేసుకోవాలి. గత ఎన్నికల్లో ఒక్క శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఈ బాండ్లను తీసుకునేందుకు వీలుంటుంది. రాజకీయపార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత లోపించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓతో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బాండ్ల జారీపై స్టే విధించాలని, దాతల పేర్లను బయటపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏడీఆర్ కోరింది. దీనిపై గురువారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో పారదర్శకత అవసరమని అభిప్రాయపడింది. ఏయే రాజకీయపార్టీకి ఎవరు ఎంత మొత్తం విరాళం ఇస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని చెప్పింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లను జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు క్యాష్ రూపంలో మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే ఏప్రిల్‌-మేకు సంబంధించిన ఎన్నికల బాండ్ల కొనుగోలు సమయాన్ని 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించాలని సుప్రీంకోర్టు ఆర్థికశాఖను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయపార్టీలు నిధులు సమీకరించడంపై కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఎదుట భిన్న వాదనలు వినిపించాయి. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కేంద్రం తన అఫిడవిట్‌లో కోరింది. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఎన్నికల బాండ్లు కొనుగోలుదారుల వివరాలు బహిర్గతం చేయాలని స్పష్టంచేసింది. మరోవైపు ఎన్నికల బాండ్ల పథకంలో ఏడీఆర్ తరఫు న్యాయవాది లోపాలను ఎత్తిచూపారు.  ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి ప్రభుత్వం నిధులందజేసే విధానం మనకు లేదు. రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులు, సంపన్నులు, కంపెనీల నుంచి నిధులు స్వీకరిస్తాయి. వీరంతా తమ రాజకీయ పార్టీ గెలువాలని కోరుకుంటారు. ఒకవేళ వారు కోరుకున్న పార్టీ గెలువకపోతే వీరంతా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల వారి పేర్లను గోప్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం తరఫును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని నివారించేందుకు బాండ్లను ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. కొందరు షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారని బాండ్ల వల్ల అలాంటి పరిస్థితి తలెత్తదని కోర్టుకు విన్నవించారు. అయితే, వేణుగోపాల్ వాదనలతో ఈసీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ విభేదించారు. ఎలక్టోరల్ బాండ్ పథకంలో దాతల వివరాలను దాచిపెట్టడమంటే గోప్యతను చట్టబద్ధం చేసినట్టవుతుందన్నారు. గోప్యత పోయి పారదర్శకత నెలకొల్పాలని.. తాము సంస్కరణలను కోరుతున్నామని.. ఈ నేపథ్యంలో మనం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనుకకు వేయకూడదు అని చెప్పారు. తాము ఈ పథకానికి వ్యతిరేకం కాదని, దాతల పేర్లు రహస్యంగా ఉంచడానికే వ్యతిరేకమని ద్వివేది స్పష్టం చేశారు. ఏడీఆర్ సంస్థ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఎలక్టోర్ బాండ్ పథకంలోని పలు లోపాలను ఎత్తిచూపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగాలన్న స్ఫూర్తి ఈ పథకం విరుద్ధమని, ప్రభుత్వ నిర్ణయం తిరోగమన చర్య అని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల ఎక్కువగా లబ్ధిపొందినది అధికార పార్టీయేనని చెప్పారు. ఈ పథకంపై స్టే విధించాలని లేదా దాతల పేర్లను వెల్లడించాలని కోరారు. ఈ పథకం కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకేనంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. ప్రభుత్వం-కార్పరోట్లు 'క్విడ్‌ ప్రో కో' అవుతున్నారని.. బీజేపీకి వచ్చిన విరాళాల్లో 95 శాతం ఈ ఇటువంటివేనని చెప్పారు. ముగ్గురి వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసే వారి వివరాల గురించి సుప్రీంకోర్టు ఆరాతీసింది. బాండ్ కొనేవారి పూర్తి సమాచారం బ్యాంకుల వద్ద ఉంటుందా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అటార్నీ జనరల్.. కస్టమర్లకు సంబంధించిన కేవైసీ బ్యాంకుల వద్ద ఉంటాయని సమాధానం ఇచ్చారు. ఏజీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కేవైసీ ఉన్నంత మాత్రాన వారు బాండ్ల కొనుగోలుకు చెల్లించిన డబ్బు బ్లాక్ మనీ అవునో కాదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఆ తర్వాత తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిన ధర్మాసనం.. ఎన్నికల బాండ్ల పథకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ.. దాతల పేర్లు మాత్రం వెల్లడించాలని తీర్పు వెలువరించింది.

ఎన్నికల వ్యయ ప్రక్షాళన కోసం కేంద్రం ఎలక్టోరల్‌ బాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్నికల్లో నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ పథకాన్ని ప్రవేశిపెట్టామని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. గతేడాది పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఎలక్టోరల్‌ బాండ్లు పత్రాల రూపంలో ఉంటాయి. ప్రతి ఏడాది నాలుగు నెలలు.. అంటే, జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరులో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఆ నెలల్లో ఫలానా తేదీ నుంచి పది రోజుల వరకు మాత్రమే వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తులు లేదా సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి చెందిన నిర్దేశిత శాఖల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. రూ.1000, రూ.10,000, రూ.లక్ష, రూ.10 లక్షలు, రూ.కోటి డినామినేషన్‌తో ఈ బాండ్లు లభ్యమవుతాయి. బాండ్లను కొనుగోలు చేసే ముందు ఆ వ్యక్తులు గానీ, సంస్థలు ముందుగా బ్యాంకుకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. చెక్‌, లేదా ఆన్‌లైన్‌ పద్ధతిలో వీటిని కొనుగోలు చేయొచ్చు. బాండ్లపై కొనుగోలుదారు పేరు ఉండదు. కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులు పాటు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయి. ఆలోగా ఆ రాజకీయ పార్టీలు నిర్దేశిత ఎస్‌బీఐ బ్యాంకు శాఖాలో తెరిచిన తమ ఖాతాలోకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపేణా వచ్చిన విరాళాన్ని జమ చేయించుకోవాలి. మనదేశంలో ఎన్నికలు ఖర్చుతో కూడిన వ్యవహారం. టికెట్లు పొందాలన్నా, ప్రచారం చేసుకోవాలన్నా, ఓట్లు సాధించాలన్నా ప్రతి దానికీ పైసలతోనే పని. పోలింగ్ పూర్తయ్యే చివరి నిమిషం వరకూ చేతి నిండా డబ్బుండాలి. భారత్ లో ఎన్నికలు ఎందుకింత ఖరీదైనవి గామారాయనేది చర్చకు దారితీస్తోంది. ఎన్నికల వ్యవస్థను మరింత ఓపెన్‌ గా మార్చటానికిగవర్నమెంట్ చర్చలు తీసుకుందా..? అవి ఫలితాలను ఇస్తున్నాయా..? ఓటర్లు ఇంకా ప్రలోభాలకుగురవుతూనే ఉన్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ఖర్చుకు ఎలక్షన్ కమిషన్ లిమిట్ పెట్టింది. లోక్ సభ క్యాండిడేట్ కు రూ.70లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్థికి రూ.28 లక్షలదాక అనుమతించింది. రాష్ట్రాన్ని బట్టి ఈ పరిమితి మారుతుంది. ఎలక్షన్లలో పోటీ చేసే క్యాండిడేట్లు ఈసీకి ఇచ్చే లెక్కలు చిత్రంగా ఉంటాయి. వాళ్లుఖర్చు చేసే ప్రతి రూ.100ల్లో మూడో వంతు కన్నాతక్కువే లెక్క చూపిస్తున్నారు . ఓవరాల్ గా 50వ వంతు ఖర్చుకే ఆధారాలు చూపుతున్నారు .2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల ఖర్చు రూ.50 వేల కోట్లకు చేరనుందని​ అంచనా. ఈ నంబర్లు అంచనాలే.వాస్తవానికి ఇవి ఇంకా ఎక్కువే. ఎందుకంటే, ఈవ్యయంలో మెజారిటీ భాగం లెక్కల్లోకి రాని క్యాష్ రూపంలో ఉంటుంది. ఈ లావాదేవీలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరగవు. పార్టీలు అఫీషియల్ గారిపోర్ట్ ఇవ్వటానికి ఛాన్స్ ఉండదు. ఎన్నికలు కాస్ట్​లీగా మారటానికి సవాలక్ష కారణాలున్నాయి. లోక్‌‌‌‌ సభ సెగ్మెంట్ల పరిమాణం విస్తరిస్తోంది. ‘గిఫ్టులు’ ఇస్తే తప్ప ఓటేసే ప్రసక్తే లేదంటున్న ‘ఇండిపెండెంట్ ఓటర్లు’ పెరుగుతున్నారు. బరిలో నిలుస్తున్న క్యాండిడేట్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ పోటీ తీవ్రంగా మారుతోంది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, పొలిటికల్ కన్సల్ టెంట్లు, వాలంటీర్లగ్రూపులు; ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారం వగైరా వన్నీపరిగణనలోకి తీసుకోవాలి. అభ్యర్థులు ఈసీకి చెప్పాపెట్టకుండా చేసే ఖర్చుని ఎక్స్‌‌‌‌పెండిచర్‌‌‌‌ రిపోర్టులో చూపించే వ్యయంతో పోల్చితే ‘నక్కకీనాగలోకానికీ ఉన్నంత తేడా’ ఉంటోంది. ఈసీ ఈతేడాని సాక్ష్యాలతో పట్టుకునే ఛాన్స్ లేదు. క్యాండిడేట్ల వ్యయంపై లిమిట్ పెట్టారు గానీ, పార్టీల ఖర్చు పై పరిమితి లేదు. పార్టీలు ఎంత ఖర్చు పెట్టాయి..? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? అనేది చెబితే సరి పోతుంది. ఈ నిధుల ట్రాన్స్ పరెన్సీ కోసం కేంద్రం అమలుచేస్తున్న ఎలక్టోరల్ బాండ్లు కూడా సత్ఫలితాలను ఇవ్వట్లేదనే చెప్పాలి.

ఎలక్టోరల్ బాండ్ల పథకం పైకి బాగానే కనిపిస్తున్నా.. దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా తమకు ఎలాంటి ప్రయోజనం లేనిదే ఏదీ ఊరకనే ఇవ్వరు. డబ్బు విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికలకు ముందు నోట్లు పంచినా.. పార్టీలకు కార్పొరేటు సంస్థలు నిధులు కుమ్మరించినా వాటి వెనుక ఆ నాయకుల, కార్పొరేట్‌ సంస్థల స్వప్రయోజనాలు దాగి ఉంటాయన్నది నలుగురి నోళ్లలో నానే మాట. అయితే అందరు రాజకీయ నాయకులు, కార్పొరేట్లు ఇలాగే ఆలోచిస్తారని అనలేం కానీ ఎక్కువ మందిలో స్వలాభాపేక్షే అసలు ఉద్దేశమని చెప్పొచ్చు. అందుకే ఎన్నికల విధానాల్లో సంస్కరణలు తెచ్చేందుకు అటు కేంద్ర ఎన్నికల కమీషన్‌, ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతుంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది ఎలక్టోరల్‌ బాండ్లు. రాజకీయ నాయకులకు కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే విరాళాల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. అయితే దీనివల్ల పారదర్శకత మాటేమో కాని అధికారిక పార్టీకి ఎక్కువ మేలు జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు కార్పొరేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలివ్వడమనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. చిన్న, పెద్ద, అధికార, ప్రతిపక్ష తేడా అనేది లేకుండా పలు పార్టీలకు నిధుల సాయాన్ని అందజేస్తుంటారు. వీటిని ఆయా పార్టీలు తమ కార్యకలాపాలకు అవసరమయ్యే పలు ఖర్చుల కోసం వినియోగిస్తుంటాయి. అయితే ఈ తరహా వచ్చే విరాళాల్లో ఎక్కువ భాగం తెలియని వ్యక్తుల నుంచే వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అవినీతి చేసి ఆర్జించిన సొమ్ము, నల్ల ధనాన్ని ఎక్కువగా పార్టీలకు విరాళాల రూపంలో తరలిస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకే దీనిని దృష్టిలో ఉంచుకొని రాజకీయ విరాళాల లావాదేవీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్రం 2017-18లో ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటివల్ల ప్రతి విరాళానికి లెక్కాపత్రం ఉండటంతో పాటు నల్లధనాన్ని అరికట్టే వీలుంటుందన్నది ప్రభుత్వం చెబుతున్నమాట. పైగా విరాళం ఇచ్చిన దాత వివరాలను గోప్యంగా ఉంచే వీలుండటంతో ‘ఆ పార్టీకి ఇచ్చారు.. మాకివ్వరా’ అంటూ విరాళాల కోసం కార్పొరేటు కంపెనీలపై రాజకీయ పార్టీల ఒత్తిళ్లు కూడా తగ్గుతాయని కూడా అంటోంది. అయితే విశ్లేషకులు, ఇతర రాజకీయ పార్టీలు మాత్రం ప్రభుత్వ అభిప్రాయంతో విభేదిస్తున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చిన దాతల పేర్లు బయటకు వెల్లడయ్యే అవకాశం లేదు. బ్యాంకు ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయి. ఈ బాండ్ల ద్వారా విరాళం అందుకున్న రాజకీయ పార్టీకి దాత ఎవరో అధికారికంగా తెలియదు కాబట్టి సదరు పార్టీ ఎన్నికల సంఘానికి బాండ్ల ద్వారా ఎంత సొమ్ము సమకూరిందో చెబుతుందే కాని దాతలెవరో వెల్లడించే అవకాశం ఉండదు. విరాళం ఇచ్చిన కంపెనీ తన బ్యాలెన్స్‌ షీట్‌లో ఎంత సొమ్ము వెచ్చించి బాండ్లను కొనుగోలు చేసిందో చూపుతుంది తప్ప వాటిని ఏ పార్టీకి ఇచ్చిందో వెల్లడించదు. ఈ ప్రక్రియ అంతా పూర్తి గోప్యతతో జరుగుతుండటంపై ఇతర పార్టీలే కాదు కొందరు విశ్లేషకులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోనే ఎస్‌బీఐ పనిచేస్తుండటంతో అధికారిక పార్టీకి ఫలానా కార్పొరేట్‌ సంస్థ విరాళమిచ్చిందనే విషయం తెలిసే అవకాశం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల ఎక్కువమంది అధికారిక పార్టీకే విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపవచ్చన్నది వారి వాదన. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలన్నాకున్నా.. ఇస్తే ఆ విషయం అధికారిక పార్టీకి తెలిసే అవకాశం ఉంటుందని భావించి ఆ కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.. తమకు కావాల్సిన పనులు జరగాలంటే అధికారిక పార్టీకి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. 2019లో ఇప్పటివరకు 1,716.05 కోట్లు రూపాయల బాండ్ల కొనుగోళ్లు జరిగినట్టు తెలుస్తోంది. 2018లో ఇదే సమయంలో రూ.1056.73 కోట్ల బాండ్లను కొనుగోలు చేశారు. దేశంలోని జాతీయ పార్టీల మొత్తం విరాళాలకన్నా బీజేపీ అందుకున్నవి 12 రెట్లు అధికమని గత జనవరిలో ఏడీఆర్‌ స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన విరాళాల విలువ రూ.437 కోట్ల 4 లక్షలు. బీజేపీ సహా జాతీయ పార్టీల విరాళాల మొత్తం 469 కోట్ల 89 లక్షలు అని ఏడీఆర్‌ తెలిపింది. అంటే మిగతా పార్టీలన్నిటికీ అందిన మొత్తం రూ.32.85 కోట్లు మాత్రమే. ఏటా ఎన్నికల కమిషన్‌కు జాతీయ పార్టీలు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏడీఆర్‌ ఈ వివరాలను వెల్లడించింది.  ఏడీఆర్‌ నివేదిక ప్రకారం కాంగ్రెస్‌కు రూ.26.658 కోట్లు, ఎన్‌సీపీకి రూ.2.087 కోట్లు, సీపీఎంకు రూ.2.756 కోట్లు, సీపీఐకి రూ.1.146 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.20 లక్షల విరాళాలు అందాయి. నిజానికి, రూ.20 వేలకుపైగా విరాళాలుగా అందిన వివరాలనే ఆయా పార్టీలు ఎన్నికల కమిషన్‌కు అందిస్తాయి. బీఎస్పీకి రూ.20 వేలకుపైగా విరాళాలు అందినట్టు రికార్డుల్లో లేదు. బీజేపీ, కాంగ్రెస్‌కు అధిక మొత్తంలో రూ.164.30 కోట్లమేర విరాళాలు అందించిన సంస్థ ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌. ఇందులో బీజేపీకి రూ.154.30 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.10 కోట్లు ఆ సంస్థ అందించింది.  బీజేపీకి అందిన మొత్తంలో ఈ సంస్థ నుంచి అందింది 35 శాతం కాగా, కాంగ్రెస్‌కు 38 శాతం. ఈ రెండు పార్టీలకు కార్పొరేట్‌ సంస్థల నుంచే అధిక మొత్తం అందాయి. కార్పొరేట్ల నుంచి బిజెపికి రూ.400.23 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.19.29 కోట్లు అందాయి. బిజెపికి 2977మంది, కాంగ్రెస్‌కు 777మంది, సీపీఐకి 196మంది, సిపిఐకి 176మంది, ఎన్‌సీపీకి 42మంది, తృణమూల్‌కు 38మంది విరాళాలు ఇచ్చారు. బీజేపీకికి ఒక్క ఢిల్లీలోనే 208 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో రూ.71.93 కోట్లు, గుజరాత్‌లో రూ.44.02 కోట్లు, కర్నాటకలో రూ.43.67 కోట్లు, హర్యానాలో రూ.10.59 కోట్లు వచ్చాయి. ఇలా రాజకీయ పార్టీలకు వేల కోట్లు సమకూర్చి పెడుతున్న ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణల కోసం పోరాడుతున్న ఏడీఆర్.. ఈ పథకంపై పోరాటం చేస్తోంది. అయితే, బాండ్ల పథకాన్ని కొనసాగించవచ్చన్న సుప్రీం కోర్టు.. దాతల వివరాలు వెల్లడించాలని ఉత్తర్వులివ్వడం స్వాగతించాల్సిన పరిణామం. దీంతో పార్టీలకు ఇబ్బడి ముబ్బడిగా కోటానుకోట్లు కట్టబెట్టే సంస్థలు, వ్యక్తులు ఆచితూచి బాండ్లు కొనుగోలు చేసే అవకాశం వుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

-ఎస్. కె. చారి