Thursday, September 19, 2019
Follow Us on :

‘ఫ్రంట్’ పాలి‘ట్రిక్స్’..!..

By BhaaratToday | Published On May 7th, 2019

మళ్లీ కేసీఆర్ ‘ఫెడరల్’ పరుగులు. మూడో కూటమికి ప్రయత్నాలు. కేరళ, తమిళనాడు పర్యటనలు. పినరయి, స్టాలిన్ లతో చర్చలు. ‘సంకీర్ణ’ లక్ష్యం నెరవేరుతుందా..? దక్షిణాది టూర్లు ఫలితాన్నిస్తాయా..? గులాబీ బాస్ తో కలిసొచ్చేదెవరు..? కాంగ్రెసేతర ‘దోస్తీ’ సాధ్యమేనా..? ‘ఫ్రంట్’ పాలి‘ట్రిక్స్’..!.. 

ఓవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి. మరోవైపు దంచికొడుతున్న ఎండల వేడి. ఇంకోవైపు మరో రెండు వారాల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు. ఇన్ని.. ఉత్కంఠ పరిణామల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరో రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. రెండోసారి ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను తెరపైకి తెచ్చారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కోట కేరళ నుంచి తన ప్రయత్నాలను ప్రారంభించారు. గతంలో ఓసారి కోల్‌కతా నుంచి.. మరోసారి ఒడిషా నుంచి ఫ్రంట్ ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. ఈసారి కేరళను ఎంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప‌రిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఇలా పొరుగు రాష్ట్రాల మ‌ద్దతు కోసం ప‌రుగులు పెట్టడం రాజ‌కీయ ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంది. ఈసారి ఎన్నిక‌ల్లో పిన‌ర‌య్ పార్టీకి పెద్ద‌గా సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. కాంగ్రెస్ కూట‌మికే సీట్లు ఎక్కువ‌గా వ‌చ్చే వీలుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాంటివేళ‌లో పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చల వల్ల ఫలితం వుంటుందా..? కమ్యూనిస్టులు కేసీఆర్ తో కలిసి నడుస్తారా..? అన్నిది ఆసక్తికరంగా మారింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హావా..! కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలి..! ఈ పార్టీలతో సమాఖ్య కూటమి కట్టాలి. కేంద్రంలో చక్రం తిప్పాలి.. ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం..! లోక్ సభ ఎన్నికల ముందు సమాఖ్య టూర్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ లోక్ సభ ఎన్నికలకు ముగింపు దశకు చేరుకున్న సమయంలో రాష్ట్రాల బాట పట్టారు కేసీఆర్. మరి, కేసీఆర్ ఊహిస్తున్నట్టుగా ఫెడరల్ ఫ్రంట్ ముందడుగు వేస్తుందా..? కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెడుతుందా..?

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు శైలి ఒక్కోసారి ఒక్కోలా వుంటుంది. చేసే ప్ర‌తి ప‌నికి ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసి అంద‌రి దృష్టిని త‌న మీద‌కు మ‌ళ్లించుకుంటారు. మ‌ళ్లీ కొన్నాళ్లు సైలెంట్ అయిపోతారు. మ‌ళ్లీ వార్తల్లో నిలుస్తారు. ఇలా ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌ని రాజ‌కీయ చ‌తుర‌త‌తో ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట ఆయన చేప‌ట్టిన ద‌క్షిణ‌భార‌త‌దేశ విహార యాత్ర దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అప్పుడెప్పుడో గుణాత్మక మార్పుకోసం జాతీయ రాజకీయాల్లో వేలుపెడతా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ సీఎంలతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్‌కి ఒక రూపం తేవాలని అప్పట్లో బాగానే ప్రయత్నం చేశారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో కలిసి కేంద్రాన్ని శాసిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ గురించి తెగ తిరిగారు కేసీఆర్. మళ్లీ కాస్త విరామం తీసుకున్నారు. ఏపీలో తన చిరకాల మిత్రుడు చంద్రబాబుని కాదని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కొడుకు కేటీఆర్ రాయబారం నడిపారు.  ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిస్తే కేంద్రంపై వత్తిడి తేవచ్చన్నారు. అంతా బాగానే ఉంది. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండుదశల ఎన్నికలు మాత్రమే మిగిలి వున్నాయి. సాధారణ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంటుండటంతో ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించిన పనులలో స్పీడును పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి వచ్చే పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రాల బాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు మళ్లీ బీజేపీ ఒంటరిగా.. దేశంలో అధికారంలోకి వస్తుందని అంచనాలుండేవి. అయితే, ఆ తర్వాత మెజార్టీ తగ్గి మిత్రపక్షాలతో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి గద్దెనెక్కుతుందని సర్వేలు హోరెత్తాయి. దీంతో తన ఫెడరల్ ఫ్రంట్ ను పక్కనపెట్టిన కేసీఆర్.. కూటమి రాజకీయానికి తెరతీశారు. గడిచిన పోలింగ్ సరళి చూశాక మోదీ మళ్లీ రావడం కష్టమేనని.. బీజేపీ 140 సీట్లు దాకా మాత్రమే వస్తాయని కేసీఆర్ కు సమాచారం అందిందట..! అందుకే ‘ఫెడరల్ ఫ్రంట్’ కోసం మళ్లీ ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టేందుకు కేసీఆర్ నడుం బిగించారని చెబుతున్నారు. రెండో విడత ఫెడరల్ ఫ్రంట్ టూర్ లో మొదట కేరళలో అడుగుపెట్టారు సీఎం కేసీఆర్. కేరళ రాజధాని తిరువనంతపురం ఎయిర్‌ పోర్టులో తెలుగు సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ నేరుగా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లారు. తెల్లపంచ కట్టుకున్న సీఎం.. స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ ఉన్నారు.  పద్మనాభ స్వామిని దర్శించుకున్న తర్వాత.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ లోకి కమ్యూనిస్టులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక కేరళ పర్యటన తర్వాత కేసీఆర్ తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నెల 13న డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తో భేటీ కానున్నట్టు సమాచారం. దేశ రాజకీయాలపై కేసీఆర్‌-స్టాలిన్‌ చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, సోమవారం ఉదయం కర్నాటక సీఎం కుమారస్వామి, కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేరళ, తమిళనాడు పర్యటనల తర్వాత కేసీఆర్ కర్నాటకకు కూడా వెళ్తున్నట్లు సమాచారం. కుమారస్వామితో భేటీ అయితే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉన్నట్లు వినికిడి. అంతేకాదు, కేరళ, తమిళనాడు, కర్నాటక పర్యటనల తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్, యూపీపల్లోనూ కేసీఆర్ పర్యటించవచ్చునని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఓసారి ఢిల్లీ టూర్ కూడా చేపడుతారని కూడా సమాచారం. 70 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయని ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా రాష్ట్రాల హక్కులను రాష్ట్రాలకు దక్కకుండా చేస్తున్నాయని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ కూటమి ఏర్పాడాల్సిన అవసరం ఉందని, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలుస్తున్నారు. అయితే, ఇన్నాళ్లూ స్తబ్దుగా వుండి.. ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్న వేళ మళ్లీ ఫెడరల్ పాట పాడటం ఆసక్తికరంగా మారింది. అయితే, దీనివెనుక మరో కారణం కూడా వున్నట్టు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తాజాగా కేసీఆర్ టూర్ మొత్తం రాష్ట్ర రాజ‌కీయ కోణంలో సాగుతున్న‌దే త‌ప్పించి.. మ‌రేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గత 15 రోజులుగా తెలంగాణ‌లో ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హారం ర‌చ్చ ర‌చ్చ‌గా సాగుతోంది. ఎంతకూ స‌ద్దుమ‌ణ‌గ‌టం లేదు. ఇలాంటివేళ‌లో వ్యూహాత్మ‌కంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌స్తావ‌న తేవ‌టం ద్వారా ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌వ‌చ్చ‌ని.. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల టూర్ ను ఆయన ఎంచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక‌వైపు తెలంగాణలో కామ్రేడ్స్ తో స‌ఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌ని కేసీఆర్.. అదే స‌మ‌యంలో వారి ముఖ్య‌మంత్రితో భేటీ కావడం.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో చ‌ర్చ‌లు జరపడం.. ఇంటర్ బోర్డు వ్యవహారం నుంచి జనం దృష్టిని మరల్చడానికే తప్ప.. మరేమీ లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా మొదట కమ్యూనిస్టుల మైత్రి కోసం కేసీఆర్ ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వాస్త‌వానికి గ‌తంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్రస్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు వామ‌ప‌క్షాల‌ను అందులోకి చేర్చుకోవాల‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. ఆయ‌న పూర్తిగా ప్రాంతీయ పార్టీల‌పైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లోకి వామ‌ప‌క్షాల‌ను తీసుకురావాల‌న్న వ్యూహం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే క‌నిపిస్తోంది. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇప్పటికే అన్ని చోట్లా ఆ పార్టీ తన ప్రాబల్యం కోల్పోతూ వస్తోంది. పార్లమెంట్ సీట్ల విషయంలోనూ.. ఎన్ని గెలుచుకుంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. ఎన్నికల ఫలితాల తర్వాత కమ్యూనిస్టులకు వచ్చే కొద్ది పాటి సీట్లు అయినా సరే.. అత్యంత కీలకమేనన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ తన మూడో విడత ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను.. కమ్యూనిస్టులతో చర్చల ద్వారానే ప్రారంభించినట్టు తెలుస్తోంది. నిజానికి కేరళలోని కమ్యూనిస్టులకు, టీఆర్ఎస్‌కు రాజకీయ పరంగా ఒక సారూప్యత ఉంది. ఇద్దరికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో అటు కేసీఆర్ కానీ.. ఇటు పినరయి విజయన్ కానీ.. రెండు పార్టీలకు కేంద్రంలో మద్దతివ్వాలని అనుకోరు. ప్రాంతీయ పార్టీల కూటమినే అధికారంలోకి రావాలని కోరుకుంటారని రాజకీయవర్గాల అంచనా. అయితే.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలన్నీ.. బీజేపీ కోసమేనన్న చర్చ గతంలో నడిచింది. ఇప్పుడు.. కూడా దేశ రాజకీయాల్లో అదే అభిప్రాయం ఉంది. నిజంగా.. కేసీఆర్ కలిసే రాజకీయ నేతల్లోనూ అదే అభిప్రాయం ఉంటే మాత్రం ఈ సారి కూడా పెద్దగా ప్రయోజనాలు లభించకపోవచ్చు. ఎందుకంటే.. కమ్యూనిస్టులు.. ఆరు నూరైనా.. బీజేపీకి మద్దతిచ్చే ప్రయత్నం మాత్రం చేయరు. ఏ ప్రయోజనం లేకపోయినా.. బీజేపీకి అడ్డుకట్ట వేయాడనికైనా… కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో అత్యంత మాటకారి అయిన కేసీఆర్.. తన చాతుర్యంతో… కమ్యూనిస్టులను ఫెడరల్ ఫ్రంట్‌లోకి చేర్చగలిగితే… తాజా రాజకీయాల్లో అది గొప్ప మలుపవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలావుంటే, థర్డ్ ఫ్రంట్ పేరుతో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక్క ఒడిషా సీఎంను మిన‌హా అంద‌రితోనూ ట‌చ్ లో ఉన్నారు. పైగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచార‌ం కూడా చేశారు. మోదీకు ధీటుగా స‌మ‌ర్థుడైన నేత‌గా చంద్రబాబు ఎంపికే స‌రైన‌ద‌నే భావ‌న ప్రాంతీయ పార్టీల్లోకి తీసుకురావ‌టంలో చంద్రబాబు విజ‌య‌వంతం అయ్యారంటూ తెలుగు త‌మ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ టూర్ నిజంగానే ఉత్కంఠ‌ రేపుతోంది. చంద్రబాబు వైపు తాము ఉన్నామంటూ సంకేతాలు పంపిన నేత‌లు.. కేసీఆర్ మాట‌ల‌తో ఏకీభవిస్తారా..? అనేది సందేహంగా మారింది. ఎందుకంటే బీజేపిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్న స్థాయిలో కేసీఆర్ వ్యతిరేకించలేక పోవడం, అంతర్గతంగా అవగాహనతో ముందుకు వెళ్తున్నారన్న వాదనలు కాస్త ఇబ్బందికరంగా మారింది.  అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన ఏం చేసినా... అందులో ఏదో ఒక రాజకీయ కోణం ఉంటుందనే చాలామంది విశ్లేషిస్తుంటారు. కేరళ సీఎం విజయన్‌తో చర్చల ద్వారా జాతీయస్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేయడానికి సుముఖంగానే ఉన్నట్టు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ కేరళ టూర్ వెనుక మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం జాతీయస్థాయిలోని నేతల్లో ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీలు పోరాటం చేసిన సమయంలోనూ కేసీఆర్ వారికి మద్దతు ఇవ్వలేదనే అపవాదు ఉంది.  ఈ అపవాదును తొలగించుకోవడం కోసమే కేసీఆర్ కేరళ టూర్ కు వెళ్లారని.. లెఫ్ట్ పార్టీలకు చెందిన సీఎంతో చర్చలు జరపడం ద్వారా బీజేపీకి తాము దూరమనే సంకేతాలను జాతీయ నేతలకు ఇవ్వాలని ఆయన యోచించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. తాను బీజేపీకి దూరమని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను కూడా తనవైపు తిప్పుకోవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావాలని భావిస్తున్న కేసీఆర్.. ఇందుకోసం తన తొలి పర్యటనలో లెఫ్ట్ పార్టీ పాలనలో ఉన్న కేరళను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మ‌మ‌త‌, అఖిలేష్‌, కుమార‌స్వామి, ప‌ట్నాయ‌క్ త‌దిత‌ర నేత‌ల‌కు బీజేపీతో ఎంత వైరం ఉందో.. కాంగ్రెస్‌తోనూ అదే రాజ‌కీయ వైరం కొన‌సాగుతుంది. దీంతో వారంతా తనకు మద్దతు ఇస్తారన్న ఆశతో వున్నారు కేసీఆర్. మే 23 ఫ‌లితాల త‌రువాత‌, బీజేపీ, కాంగ్రెస్‌కు స‌రైన మెజార్టీ రాకుంటే ప్రాంతీయ‌ పార్టీలు గెలుచుకున్న ఎంపీ సీట్లే కీల‌కం కానున్నాయి. ఏపీ, తెలంగాణ‌లో 42 మంది ఎంపీలున్నారు. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. తెలంగాణ‌లో అధిక‌సీట్లు గులాబీపార్టీ సాధిస్తుంద‌నే అంచనా తారా స్థాయిలో ఉంది. కాబ‌ట్టి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ ఎంపీ సీట్లున్న నేత‌లు వారికి కావాల్సి ఉంటుంది. అందుకోసం ప్రాంతీయ పార్టీల్లో బలమైన నేతలు ఏకమైతే ఫెడరల్ ఫ్రంట్ మరింత బలీయంగా ముందుకు వెళ్తుందనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఫలితాల ముందు కేసీఆర్ పర్యటన ఎలా ఉన్నా, రేపు ఫలితాల తర్వాత దీని ప్రభావం ఎక్కువాగా ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అందులోనూ కేసీఆర్ దక్షిణ రాష్ట్రాల పర్యటన కూడా వ్యూహాత్మకమనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే స‌మ‌యంలో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా ఏదైనా జరగొచ్చనే విశ్లేషణ కూడా నడుస్తోంది. ఏపీలో వైసీపీకి అనుకున్నంత మంది ఎంపీలు గెలవకపోతే చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్లేందుకు కూడా ఓ ఆప్షన్ ను కూడా కేసీఆర్ పక్కన పెట్టుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. బాబుతో ప్రయాణంలో తేడా వస్తే స‌న్నిహితుడు జ‌గ‌న్ నుంచి కూడా మ‌ద్దతు పొంద‌వ‌చ్చనేది అవ‌త‌లి వైపున ఉన్న బీజేపీ, కాంగ్రేసేత‌ర పార్టీల ఆలోచ‌న కావ‌చ్చనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ముందుచూపులో భాగంగానే కేసీఆర్ తో స్నేహానికి మొగ్గుచూపుతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంశంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి..! ఇది ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన సందర్భంలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్య..! అంతేకాదు, లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంలోనూ కేసీఆర్ తోపాటు ఆయన కుమారుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పదే పదే ఇదే అంశాన్ని ప్రచారం చేశారు. బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కేసీఆర్ చేసిన కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం రావాలనే ప్రకటన గత డిసెంబర్ మాసం నుంచి కూడా చర్చకు వస్తూనే ఉంది. ప్రస్తుతం బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు  ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకునే శక్తి ఒక్క ప్రాంతీయ పార్టీలకే ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్నాటకలో అధికార మార్పిడి జరిగినా ఆశ్చర్యపోయేది లేదని అంటున్నారు విశ్లేషకులు..! రాష్ట్రంలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలుచుకునే నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపునకు వస్తారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసివున్న జేడీఎస్ కూడా ఫలితాల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ వైపు వస్తుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే కర్నాటక సీఎం కుమారస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ తోను మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా లేదని అంటున్నారు. ఈ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ తో కలిసి నడుస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఢిల్లీల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంటే.. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కాగా.., పంజాబ్, మిజోరం రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పాలనలో కొనసాగుతోంది.  గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత కేసీఆర్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయ్ ను ఆ రాష్ట్రానికి వెళ్లి కలిశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు  పోషించాల్సిన కీలకపాత్రపై చర్చించారు. అలాగే పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీని కలిశారు. మమతా బెనర్జీ కూడా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు తెలిపారు. ఇక గత డిసెంబర్ లో ఆయన తమిళనాడుకు వెళ్లిన కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశం జరిపారు. ఆ తర్వాత కర్నాటక సీఎం కుమారస్వామిని సైతం కలిశారు. అలాగే మాజీ ప్రధాని దేవెగౌడతోనూ మంతనాలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో  జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఝార్ఖండ్ మాజీ సీఎం  హేమంత్ సోరెన్ ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోరారు. అనుకున్నట్లుగా ఫెడరల్ ఫ్రంట్ పై చర్చకు శ్రీకారం చుట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. అంతేకాదు ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 16 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ప్రచారం కూడా  చేశారు. ఎంఐఎం అధినేత అసద్ కూడా కేసీఆర్ కు మద్దుతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్.., పార్టీ బాధ్యతలను సైతం కుమారుడు కేటీఆర్ కు అప్పగించేశార ఇంట గెలిచిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటాలే తలంపుతు ఉన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆశించిన ఫలితాలు దక్కలేదు. అలాగే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధికారానికి దూరమైతే.. పార్టీ బాధ్యతలను లోకేశ్ కు అప్పగించి చంద్రబాబు కూడా ఇక పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను మళ్లీ వేగవంతం చేశారు కేసీఆర్.  ఇదిలావుంటే, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌, బీఎస్పీ, ఎస్పీ పార్టీల అధినేతలు సైతం సీఎం కేసీఆర్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం.. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కూటమి కట్టిన పార్టీలు సైతం.. ఎన్నికల ఫలితాల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ దిశగా వస్తాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. వారు భావించినట్లుగానే.. కాంగ్రెస్ తో లోక్ సభ ఎన్నికల ముందు వరకు కలిసివున్న మమతా బెనర్జీ సైతం.. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు. తనతో కేసీఆర్ అఖిలేష్ మాయావతి అంతా టచ్లో ఉన్నారని ఆమె చెబుతున్నారు. తామంతా కలిసి ప్రధానిగా ఎవరుండాలో డిసైడ్ చేస్తామంటున్నారామె! అయితే ప్రస్తుతం కేంద్రంలో కూటముల గందరగోళమే నెలకొందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. జేడీఎస్ - తెలుగుదేశం వంటి పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వెంట తిరుగుతూ ఉన్నాయి. మరికొన్ని పార్టీలు బీజేపీతో ఉన్నాయి. ఇంకా కొన్ని పార్టీలు తటస్థంగా ఉన్నాయి. టీఆర్ఎస్ - బీజేడీ - వైఎస్సార్సీపీలు తటస్థంగా ఉన్నట్టుగా ప్రకటించుకున్నాయి. ఇక కమ్యూనిస్టులు - బీఎస్పీ-ఎస్పీ -టీఎంసీ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో గట్టిగా పోరాడుతున్నాయి. కానీ అదే సమయంలో జాతీయ స్థాయిలో మాత్రం మితృత్వం అని ప్రకటించుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఎటు వెళ్తారనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదని చెబుతున్నారు.

-ఎస్. కె. చారి