Thursday, October 17, 2019
Follow Us on :

‘గ్రీన్’ సిగ్నల్..!

By BhaaratToday | Published On Jul 18th, 2019

ప్రతిభావంతులకు ‘పచ్చ’జెండా. వలస విధానానికి కొత్త ఎజెండా. గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేత. నిపుణులకు పెద్దన్న చేయూత. తెలుగు విద్యార్థులకు లాభమెంత..? భారతీయులకు ప్రయోజనమెంత..? నిన్న‌టి మొన్నటిదాకా భారత్ పై కారాలు మిరియాలు నూరుతూ క‌న్నెర్ర చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారతీయులు తమదేశంలోకి చొరబడి.. తమ ఉద్యోగాల్ని ఎత్తుకుపోతున్నారంటూ గగ్గోలు పెట్టారు. నిపుణులకే ఎంట్రీ అంటూ వీసా, గ్రీన్ కార్డుల జారీ నిబంధనలను కఠినతరం చేశారు. కానీ,  తొలిసారిగా భార‌తీయుల‌కు మేలు చేసే దిశ‌గా పెద్ద‌సారు ఓ అడుగు ముందుకు వేశారు. అమెరికాలో శాశ్వ‌త నివాసానికి ప‌ర్మిష‌న్ ఇచ్చే వ‌ల‌స‌దారుల వీసాల‌పై.. దేశాలవారీగా ఉన్న ప‌రిమితిని ఎత్తివేసే బిల్లును అమెరికా ప్ర‌తినిధుల స‌భ ఆమోదించింది. అమెరికా సిటిజన్‌గా గుర్తింపు పొందాలంటే గ్రీన్ కార్డు తప్పనిసరి. అయితే, ఇన్నాళ్లూ ట్రంప్ ప్రభుత్వం అడ్డమైన ఆంక్షలతో భారతీయులకు నరకం చూపించింది. ఇప్పుడు ట్రంప్‌లో వచ్చిన మార్పుతో గ్రీన్ కార్డుల జారీ తేలిక కాబోతోంది. అమెరికాలో నివసిస్తూ.. ఆ దేశ పౌరసత్వం పొందాలనుకుంటున్న ఐటీ, ఫార్మా నిపుణులు, డాక్టర్లకు కలిసొచ్చే అంశం ఇది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారికి ఇదో శుభవార్తే.

అర్థశతాబ్ద కాలంలో హద్దుల్లేని వాణిజ్యానికి కేంద్రస్థానంగా ఎదిగింది అమెరికా. ఎన్నో దేశాల నుంచి నిపుణులను ఆకర్షించింది. అడ్డుగోడలు లేని సమాజం కావటంతో.. పెద్దయెత్తున విదేశీ నిపుణులు అగ్రరాజ్యానికి క్యూ కట్టారు. దానివల్ల ప్రపంచానికి ఎన్నో శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. ప్రవాసులు అక్కడ సామాజికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూనే.. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అమెరికా విశేషమైన ప్రగతి సాధించటంలో ఎన్నో ఇతర దేశాల భాగస్వామ్యం ఉందనేది వ్యతిరేకించలేని వాస్తవం. ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించిన ట్రంప్.. ఇన్నాళ్లూ వలసలపై కఠినవైఖరి అవలంభిస్తూ వచ్చారు. కానీ, తొలిసారిగా విదేశీ నిపుణులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించారు.

గ్రీన్ కార్డుల విషయంలో ఇన్నాళ్లకు మనకు, చైనాకు అనుకూలంగా ఉండే నిర్ణయానికి అగ్రరాజ్యం మద్దతు తెలిపింది. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వతంగా స్థిరపడటానికి ఉద్దేశించిన.. 'గ్రీన్ కార్డు'ల జారీపై గరిష్ట పరిమితి ఎత్తివేతకు తొలి అడుగు వేసింది.
ఇకపై అమెరికాలో ఉద్యోగం వస్తే.. భారతీయులు ఉంటారో లేదో అన్న సంశయం ఇక అక్కర్లేదు. అంతేకాదు, ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయులకు సైతం ఇది నమ్మలేని శుభవార్త. ఇంతవరకు అమల్లో వున్న.. ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీచేయాలన్న నిబంధన తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అమెరికా వెళ్లాలనుకునేవారికి ఆ దేశం రెండు రకాల వీసాలు జారీ చేస్తుంది. వృత్తి, ఉద్యోగ రీత్యా, పర్యటనల కోసం, అక్కడ ఉన్న కుటుంబసభ్యులను చూసి రావడం కోసం నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలు ఇస్తుంది. అయితే, ఈ వీసాలకు కాలపరిమితి ఉంటుంది. మనందరికీ బాగా చిరపరిచితమైన హెచ్‌1బి వంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇక, రెండో రకం.. ఇమ్మిగ్రెంట్‌ వీసాలు. అంటే వలసదారుల వీసా అన్నమాట. అమెరికాలో శాశ్వతనివాసానికి వీలు కల్పించే వీసా ఇది. ఈ తరహా వీసాలు ఏడాదికి ఒక్కో దేశానికి 7 శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ఇప్పుడు ఈ నిబంధనను తొలగించేందుకు తీసుకొచ్చిన ‘ఫెయిర్‌నెస్‌ ఆఫ్‌ హై-స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ యాక్ట్‌, 2019’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రాట్..  చెందిన జో లోఫ్‌ గ్రెన్‌, అయోవాకు చెందిన రిపబ్లికన్‌ కెన్‌ బక్‌ ఈ బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరి 7న ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న బిల్లుపై ఓటింగ్‌ జరగ్గా.. 435 మంది సభ్యుల్లో 365 మంది దీన్ని ఆమోదించారు. 65 మంది వ్యతిరేకించారు. దీంతో మెజారిటీ సభ్యుల మద్దతుతో  ‘ఫెయిర్‌నెస్‌ ఆఫ్‌ హై-స్కిల్డ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ యాక్ట్‌, 2019’ ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతిభ ఆధారంగానే విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీచేస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెద్దసంఖ్యలో గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం భారతీయుల గ్రీన్ కార్డు దరఖాస్తులు ఆమోదం పొందాలంటే 70 ఏళ్లు పడుతుందని అంచనాలున్నాయి. తాజా బిల్లు ఆమోదంతో దరఖాస్తులు పెట్టుకున్న వారి కలలన్నీ నెరవేరనున్నాయి. పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలిపోతున్న భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద గుడ్ న్యూస్. ఇక ఈ బిల్లులో మరో మంచి వార్త కూడా ఉంది. 'ఫ్యామిలీ స్పాన్సర్డ్‌' విభాగంలో కూడా కోటాను 15 శాతానికి పెంచాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. అంటే గ్రీన్ కార్డుల జారీ ఒకేసారి ఎనిమిది శాతం పెరనుందన్నమాట. కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డు అంటే.. ఇప్పటికే అమెరికాలో శాశ్వత నివాసం పొందినవారు.. వేరే దేశంలో ఉన్న తన కుటుంబసభ్యులకు శాశ్వత నివాసం కోసం చేసుకునే దరఖాస్తుల ఆధారంగా ఇచ్చే గ్రీన్‌ కార్డుల సంఖ్య కూడా పెరగడంపై ఎన్నారైలు, భారతీయ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేయడం.. భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలవారికి ఎక్కువగా కలిసొస్తుంది. గ్రీన్‌కార్డుల జారీపై పరిమితిని ఎత్తివేయడం వల్ల ఈ మూడు దేశాలవారికీ ఉపయోగమే. కానీ.. ఏటా ఉండే 7 శాతం పరిమితినే పూర్తిగా చేరుకోని దేశాలకు చెందినవారు, ఇప్పటికే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నిపుణులైన ఉద్యోగులకు దీనివల్ల నష్టం కలిగే ప్రమాదం ఉంది. అందుకే 2020 నుంచి 2022 దాకా సమయాన్ని సంధికాలంగా పరిగణించి.. ఈబీ-2, ఈబీ-3, ఈబీ-5 కేటగిరీలకు చెందిన వారికి.. ఈ మూడేళ్లపాటు నిర్ణీత శాతం ఉద్యోగ వీసాలను రిజర్వు చేసేలా బిల్లు ప్రతిపాదించింది. గ్రీన్‌కార్డుల జారీలో దేశాలవారీ పరిమితిని అయితే ఎత్తేస్తూ ప్రతిపాదన చేశారుగానీ.. అమలులో, అన్ని గ్రీన్‌కార్డులూ ఒకే దేశానికి పోకుండా జాగ్రత్త పడ్డారు. అన్‌రిజర్వుడు వీసాల్లో 85 శాతానికి మించి వీసాలు ఒకే దేశానికి చెందినవారికి కేటాయించకూడదనే షరతు పెట్టారు.

ఇదిలావుంటే, ఈ బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఎన్నో ఆటంకాలు ఎదర్కోవాల్సి రావచ్చని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా అంతర్గత భద్రత విభాగం ఈ బిల్లును తాము సమర్థించబోమని చెబుతోంది. అంతేకాదు, భారత్‌, చైనా వంటి దేశాలకు మేలు కలిగించే ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిందని సంబరపడిపోవాల్సిన పని లేదంటున్నారు విదేశాంగ నిపుణులు. ఎందుకంటే.. ఇది చట్టంగా మారాలంటే దీనికి సెనెట్‌ ఆమోదం కూడా కావాలి. అక్కడ రిపబ్లికన్ల బలం ఎక్కువ. ఆ తర్వాత, దానిపై అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం పెట్టాలి. అప్పుడే కొత్త వలస విధానం అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు సెనేట్ ఆమోదం లభిస్తుందా..? లేదా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. 2011లో కూడా అమెరికా ప్రతినిధుల సభ ఇలాంటి బిల్లును ఆమోదించింది. కానీ సెనేట్ పట్టించుకోకపోవడంతో అది చట్టరూపం దాల్చలేదు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదనే ఆశిద్దామని ఆశావహులు అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన కమలాహ్యారిస్‌, ఆమెతోపాటు మైక్‌ లీ అనే మరో సెనేటర్‌ ప్రతిపాదించిన ఎస్‌-386 బిల్లు త్వరలోనే సెనేట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ప్రతిభ ఆధారంగా, చట్టబద్ధమైన వలసల విషయంలో ట్రంప్‌ నిజంగానే సీరియ్‌సగా ఉంటే.. ఆయన ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి సహాయం చేయాలని.. ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన జో లోఫ్‌గ్రెన్‌ అన్నారు. ఇదిలావుంటే, గ్రీన్ కార్డుల విషయంలో మరో అడుగు ముందుకేసింది అమెరికా. ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్ కార్డుల కోటాను 12 నుంచి ఏకంగా 57 శాతానికి పెంచేందుకు సిద్ధమమైంది. దీనిపై ట్రంప్ అల్లుడు, ఆయనకు సీనియర్ అడ్వైజర్ అయిన జారెడ్ కష్నర్ వైట్ హౌస్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రకటన చేశారు. ట్రంప్ చేపట్టిన వలస సంస్కరణల ప్రాజెక్టుకు కష్నర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే కాంగ్రెస్ ముందుకు రానుంది. కొత్త విధానం ద్వారా ప్రతిభ ఉన్నవారు గ్రీన్ కార్డులు పొందే అవకాశముంటుందని, దీంతో పాటు వచ్చే పదేళ్లలో అమెరికా పన్ను ఆదాయం 500 బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నది కుష్నర్ అభిప్రాయం. అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న వలస విధానం చాలా పాతది. ఈ విధానంలో ప్రతిభ ఆధారంగా కేవలం 12 శాతం మందికి మాత్రమే గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. అయితే కెనడాలో ఇది 53 శాతం ఉండగా, న్యూజిలాండ్‌లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్‌లో 52 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ దీన్ని 57 శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. ప్రస్తుత విధానం వల్ల నైపుణ్యం కలిగిన యువతకు అవకాశాలు లభించడంలేదని, అందుకే కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాజా నిర్ణయం హెచ్ 1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత టెక్కీలకు మేలు చేకూర్చనుంది.

అమెరికాకు వెళ్లడమే ఓ సవాల్. తీరా అక్కడకు వెళ్లాక.. ఆ దేశ పౌరులుగా గుర్తింపు పొందటం మరో సవాల్. అలా గుర్తింపు పొందాలంటే గ్రీన్ కార్డ్ ఉండాలి. ఆ కార్డ్ ఉంటే.. ఎన్నో సదుపాయాలు, అక్కడి పౌరులకు లభించే వెసులుబాట్లూ భారతీయులకూ లభిస్తాయి. ఈ గ్రీన్ కార్డ్ కోసం అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సమస్యేంటంటే అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి 1.40 లక్షల గ్రీన్ కార్డుల్ని మాత్రమే జారీ చేస్తోంది. అందులోనూ అన్ని దేశాల వారికీ అవి దక్కేలా చేస్తోంది. ఫలితంగా ఒక్కో దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్ కార్డులు లభించట్లేదు. గ్రీన్ కార్డు దక్కక.. దాని కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు చాలా మంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం.. అడ్డమైన రూల్స్ తీసేయాలని డిసైడైంది. అదే జరిగితే అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉంటున్న భారత్, చైనా ప్రజలకు ఎంతో మేలు. ఇక ‘హెచ్‌ఆర్‌1044 బిల్లు’కు ప్రతినిధుల సభ ఆమోదం పట్ల.. అమెరికాలోని అగ్రస్థాయి ఐటీ కంపెనీలు కూడా దీన్ని స్వాగతించాయి. సెనేట్‌ కూడా దీనికి వీలైనంత త్వరలోనే ఆమోదం తెలపాలని కోరాయి. ప్రతిభ గలవారికి న్యాయం చేసే విషయంలో సెనేట్‌ కియ్రాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ అభిప్రాయపడింది. అటు, గూగుల్, వాల్ మార్ట్ వంటి సంస్థలు కూడా ఈ బిల్లుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈబీ వీసాల కింద యుఎస్ ఏటా 1.4 లక్షలమందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తోంది. హెచ్-1బీ వీసాలతో అమెరికాకు వఛ్చి గ్రీన్ కార్డు కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇక, జాన్ కర్టిస్ అనే సభ్యుడు ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. దీనివల్ల ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్డ్ సిస్టం అనే విధానం అమల్లోకి వస్తుందని, ఫలితంగా అమెరికన్ కంపెనీలు గ్లోబల్ ఎకానమీలో అత్యంత నిపుణులైనవారిని జాబ్స్ లోకి తీసుకోవడానికి వీలవుతుందని అన్నారు. వారు ఎక్కడ పుట్టినా.. ఏ దేశానికి చెందిన వారైనా సరే పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఇక బిల్లును చట్ట రూపంలోకి తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని.. ప్రతినిధుల సభలో బిల్లును ప్రతిపాదించిన జో-లాఫ్ గ్రెన్ అన్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, వాషింగ్టన్ లోని సీటెల్ ఏరియా, న్యూయార్క్ లోని ట్రై స్టేట్ ఏరియా, న్యూజెర్సీ, కనెక్టికట్ వంటి ప్రాంతాలవారంతా ఈ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక ‘హెచ్‌ఆర్‌1044 బిల్లు’కు ప్రతినిధుల సభ ఆమోదం పట్ల.. అమెరికావ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో ఎక్కువ మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే. వాళ్లలో ఎక్కువ మంది ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్, వైద్య రంగాలకు చెందిన వాళ్లే. తెలుగు రాష్ట్రాల నుంచి హెచ్1బి వీసాపై అమెరికాలో లక్ష మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. 

అమెరికాలో విద్వేషపూరిత హత్యకు గురైన తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కుచిబొట్ల భార్య సునయన ఈ బిల్లు కోసం పోరాటం చేశారు. ఈ బిల్లుకు ఆమోదం లభించడం తమ జీవితంలో కీలకమైన రోజని, ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం తాము ఎదురుచూస్తున్నామని, తమ ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయని ఆమె చెప్పారు. 2017 ఫ్రిబవరిలో కాన్సస్ సిటీలో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ హత్యతో తను ఇమ్మిగ్రేషన్కు సంబంధించి ఎన్నో కష్టాలు పడ్డానని, దేశంలో ఉండే హక్కును కోల్పోయానని ఆమె చెప్పారు. ఈ రోజు బిల్లు పాసవ్వడంతో తనకు ప్రశాంతత దొరికిందని, తన సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని సునయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తానికి, గ్రీన్ కార్డులపై ఆంక్షల్ని తొలగిస్తే.. అవి దక్కని వారికి వాటిని దక్కించుకునే ఛాన్స్ దొరుకుతుంది. కొత్త నిర్ణయాల ప్రకారం 2020లో 15 శాతం మాత్రమే ఆంక్షలు ఉంటాయి. 2021, 2022ల్లో 10 శాతం మాత్రమే ఆంక్షలు ఉంటాయి. 2023 నుంచీ ఆంక్షలనేవి ఉండవు. అంతేకాదు, గ్రీన్ కార్డులపై ఆంక్షలు ఎత్తివేస్తే.. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.  ఇదిలావుంటే, ఏ ప్రాతిపదికన గ్రీన్ కార్డు ఇస్తారన్న అంశానికి సంబంధించిన విధివిధానాలు త్వరలో రానున్నాయి. ఒక్కసారి గ్రీన్‌కార్డ్ వస్తే చాలు.. ఇక అమెరికా పౌరులుగా లెక్క. ఫలితంగా శాశ్వతంగా ఇల్లు కట్టుకోవచ్చు, ఉద్యోగాలు ఈజీగా దక్కుతాయి. భార్య లేదా భర్త కూడా ఉద్యోగం చేయవచ్చు. ఈ చివరి అంశం ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది.

అమెరికాలో 1965 నాటికి భారత సంతతికి చెందిన ప్రజలు కేవలం 15 వేలు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 35 లక్షల వరకు పెరిగింది. అంతకుముందు 1946లో చేసిన లూక్–సెలర్ చట్టం ఫలితంగా ఏడాదికి 100 మంది భారత సంతతి వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వడం మొదలయ్యాక వలసపోయే వారి సంఖ్య పెరిగింది. ఈ కోటా చట్టాన్ని తొలగించి, 1965లో అధ్యక్షుడు డెమొక్రాట్ అయిన లిండన్ జాన్సన్ హయాంలో తెచ్చిన ‘ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం’ ఫలితంగా భారత్ నుంచి వలసొచ్చే డాక్లర్లు, ఇంజనీర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1990ల్లో వచ్చిన ఐటీ విప్లవం తర్వాత 2000 సంవత్సరం నుంచి భారతీయుల వలస ఎన్నో రెట్లు పెరిగింది. రెండు మూడేళ్ల క్రితం వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఏటా దాదాపు 35 వేల మంది విద్యార్థులు అమెరికాలో పీజీ చదువులకు వెళ్లేవారు. వారిలో ఎక్కువ శాతం మంది అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడే అవకాశం వుండేది. కానీ, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. హెచ్1బీ వీసాలను కఠినతరం చేయడంతో భారతీయ టెక్కీల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోవడం ప్రారంభమైంది. అమెరికాలో నివసిస్తున్న ప్రస్తుత భారత సంతతి జనాభా ఒక శాతం దాటిపోయిందని అంచనా. దాదాపుగా 35 లక్షల మంది భారతీయులు వివిధ వీసా హోదాల్లో అమెరికాలో జీవిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభా దాదాపు మొత్తం 33 కోట్లు. అంటే ప్రతి వంద మంది అమెరికన్లలో ఒకరు భారత సంతతి వారే. జీవనోపాధి, మెరుగైన జీవనశైలి కోసం ఇతర దేశాలకు వలసపోయిన భారతీయుల్లో అత్యధికులు అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఇక అమెరికాలో స్థిరపడి, నివసిస్తున్న ఆసియావాసుల్లో జనాభా రీత్యా చూస్తే.. 1.25 శాతంతో చైనా, 1.2 శాతం ఫిలిపీన్స్ దేశాలకు చెందినవారు మొదటి, రెండు స్థానాల్లో ఉండగా.. భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. ఉన్నది ఒక శాతమేగాని భారతీయ అమెరికన్లు అత్యంత సంపన్నవర్గంగా గుర్తింపుపొందారు. సహజంగానే విద్యలో అందరికన్నా ముందున్నారు. అమెరికా ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభకు ఐదుగురు, సెనేట్ కు ఒకరు ఎన్నికయ్యారు. తద్వారా చట్టసభల్లో కూడా ఒక శాతం ప్రాతినిధ్యం సంపాదించారు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి జనాభాలో.. నివాస హక్కు ఉన్న తెలుగువారి సంఖ్య ఇటీవల బాగా పెరిగి దాదాపు 3 లక్షలకు చేరింది. అంటే.. దాదాపు 8.5 శాతం ఉంది. అమెరికాలోని భారత సంతతిలో సంఖ్య రీత్యా హిందీ మాతృభాషగా ఉన్న వర్గం మొదటి స్థానంలో ఉండగా.. ఇటీవలి వరకూ రెండో స్థానంలో ఉన్న గుజరాతీలను తెలుగువారు అధిగమించి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారని అమెరికా యూనివర్సిటీ అధ్యాపకులు దేవేష్ కపూర్, సంజయ్ చక్రవర్తి ‘ది అదర్ ఒన్ పర్సెంట్ - ఇండియన్స్ ఇన్ అమెరికా’ అనే పుస్తకంలో వెల్లడించారు. అలాగే.. చట్టవ్యతిరేకంగా ప్రవేశించకపోయినా భారతీయులు కొందరు వీసా గడువు దాటి అమెరికాలో గడుపుతున్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. 2015లో టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాపై వచ్చిన భారతీయులు దాదాపు 15,000 మంది అనుమతించిన కాలాన్ని మించి అమెరికాలో బసచేశారని ఓ సర్వేలో తేలింది.

అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో 95 వేల మంది పీహెచ్డీ గ్రహీతలు ఉన్నారు. మిగిలినవారిలో 40 శాతం పట్టభద్రులు. అదే స్థానికులైన శ్వేత, నల్లజాతి అమెరికన్లలో 12 శాతం మందికి మాత్రమే ఈ డిగ్రీలున్నాయి. అలాగే, ఇక్కడి భారత సంతతివారి సగటు వార్షికాదాయం లక్ష డాలర్లు దాటిపోయింది. 2015-16 సంవత్సరంలో కోటీ 33 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదవడానికి వెళ్లారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే 25 శాతం పెరిగారు. అమెరికాలో చదువుకునే ప్రతి ఆరుగురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయడే. గ్రాడ్యుయేట్ స్థాయిలో చూస్తే ప్రతి ఐదుగురు విదేశీ విద్యార్థుల్లో ముగ్గురు, పీజీ స్థాయిలో ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ముగ్గురు భారతీయులే. విదేశీ విద్యార్థుల సంఖ్య 7 శాతం పెరిగి, పది లక్షలకు చేరింది. వారి ద్వారా ఏటా అమెరికాకు 3,300 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. ఈ గణాంకాలు చాలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయులు ఎంతగా భాగస్వామ్యం అయ్యారో చెప్పడానికి. భారతీయుల కాంట్రిబ్యూషనే ఇంత వుంటే.. ఇతర దేశాల ప్రవాసుల సహకారాన్ని కూడా కలుపుకుంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వలసవాదుల పునాదులపైనే పటిష్టంగా ఎదిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి విదేశీ మానవ వనరులను వద్దనుకున్నారు డొనాల్డ్ ట్రంప్.. అధికారం చేపట్టిన నాటి నుంచి వీసాలు, గ్రీన్ కార్డుల మంజూరు విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చారు. దీంతో అమెరికా చదువులు, ఉద్యోగాలకు కోసం వేయికళ్లతో ఎదురుచూసే భారతీయ విద్యార్థులు, నిపుణులు.. ఒక దశలో ఇక అమెరికా అంటేనే విరక్తి చెందే స్థితికి వచ్చారు. కానీ, గ్రీన్ కార్డుల విషయంలో తొలిసారిగా విదేశీ నిపుణులకు అనుకూలంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.