Friday, July 19, 2019
Follow Us on :

‘క్యాష్’ ల్యాండింగ్..!..

By BhaaratToday | Published On May 9th, 2019

మొన్న కింగ్ ఫిషర్. నిన్న జెట్ ఎయిర్ వేస్. నేడు ఎయిర్ ఇండియా. పీకల్లోతు అప్పులు. రెక్కలు తెగిన విహంగాలు. నష్టాల బాటలో విమానయానం. ఇబ్బందుల్లో గగన విహారం. ‘క్యాష్’ ల్యాండింగ్..!.. 

ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ చేతులెత్తేసింది. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా కూడా అదే బాటలో పయనిస్తోంది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి జారుకుంటోంది. 50 వేల కోట్ల నష్టాలతో గాల్లోకి ఎగరలేక ఇబ్బందులు పడుతోంది. కేంద్ర ప్రభుత్వం సైతం సాయానికి ముందుకు రాకపోవడంతో సంస్థ మనుగడ ఆందోళనకరంగా మారింది. సామాన్యులకు విమానయానాన్ని చేరువ చేయడంకోసం కేంద్రం ఉడాన్ వంటి పథకాలను అమలు చేస్తోంది. అంతేకాదు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా విమనాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఓవైపు విమానయాన రంగాన్ని కొత్తపుంతలు తొక్కించాలని కేంద్రం భావిస్తుంటే.. మరోవైపు విమానయాన సంస్థలు మాత్రం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి విలవిలలాడుతున్నాయి. అసలు విమానయాన సంస్థలు నష్టాల బాట పట్టడానికి కారణమేంటి..? ఎయిరిండియా పీకల్లోతు అప్పుల్లో ఎలా కూరుకుపోయింది..? ఆకాశన్నంటుతున్న ఇంధన ధరలు. విమానయాన సంస్థల మధ్య తీవ్రమైన పోటీ. యాజమాన్యాల అసంబద్ధ నిర్ణయాలు. వెరిసి.. విమానయాన సంస్థలు నేలచూపులు చూస్తున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. విమానయాన సంస్థల నష్టాలకు అనేక కారణాలున్నాయి.

ఇప్పటికే కింగ్ ఫిషర్ కథ కంచికి చేరింది. మొన్నటికి మొన్న జెట్ ఎయిర్ వేస్ చేతులెత్తేసింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ.. ఎయిర్ ఇండియా కూడా ఇక ఎగరలేనంటోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ గాల్లోనే గిరికీలు కొడుతోంది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో.. రెక్కలు తెగిన విహంగంలా కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా సంస్థ.. కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు కూడా సమాయానికి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతేడాది నవంబర్ నుంచి జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారు. నిజానికి, మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగానే.. ఎయిరిండియా ఉద్యోగులకు కూడా నెలజీతం చివరి పనిదినం రోజునే చెల్లించాలి. కానీ, తదుపరి నెల రెండోవారానికి కూడా జీతాలు అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, నిధుల సమీకరణ కోసం ఎయిరిండియా పడరాని పాట్లు పడుతోంది. చివరికి సిబ్బంది నివాస సముదాయాలను అమ్మకానికి పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని తమ సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాలని కోరింది. ఇక్కడి వసంత్‌ విహార్‌ కాలనీలో ఎయిరిండియాకు 800 ఫ్లాట్లు ఉండగా.. వీటిలో 676 ఫ్లాట్లలో ఎయిరిండియా సిబ్బంది నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వీటిని ఖాళీ చేయించి వేలం వేసి నిధులు సమకూర్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది.  నిధులను సమకూర్చుకునేందుకు ఇప్పటికే సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాల్సిందిగా కోరింది ఎయిరిండియా. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లోని వారే ఎక్కువ కావడంతో.. ఇప్పటికిప్పుడూ ఖాళీ చేయాల్సి వస్తే పిల్లల పాఠశాలలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీడియాతో కానీ, సోషల్‌ మీడియాలో కానీ కంపెనీకి చెందిన ఎలాంటి వివరాలను పంచుకోకూడదని ఎయిరిండియా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు విమానాల్లో సాంకేతిక లోపాలు ఎయిరిండియాను భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. ఎయిరిండియా వద్దనున్న 127 విమానాల్లో.. 20 విమానాల ఇంజిన్లలో సమస్యలు తలెత్తాయి. దీంతో అవి కార్యకలాపాలు ఆపేశాయి. వీటి ఇంజిన్లను మార్చడానికి సంస్థ వద్ద నిధులు లేవని ఒక సీనియర్‌ అధికారి చెబుతున్నారు. ఇందుకు కనీసం 1500 కోట్ల వరకు కావాలని.. నిధులు వచ్చే సూచనలు లేనందున.. ఇప్పుడప్పుడే ఆ విమానాలు ఎగరవని ఆయన అంచనా వేస్తున్నారు. గతేడాది చివరి నుంచీ వీటికి కొత్త ఇంజిన్లను బిగించాలని ఎయిరిండియా విఫల యత్నాలు చేస్తూనే ఉంది. నిలిచిన విమానాల్లో 14 విమానాలు ఎ-320, నాలుగు విమానాలు బి-787-800, రెండు బి-777 విమానాలు ఉన్నాయి. వీటి కార్యకాలాపాలు నిలిచిపోవడంతో.. సంస్థకు రోజుకు 6 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది.  ఇక జెట్‌ ఎయిర్‌వేస్‌ తరహాలోనే ఎయిరిండియా కూడా తన అంతర్జాతీయ విమానాల నిర్వహణ విషయంలో భారీ నష్టాలను చవిచూస్తోంది. దీనికితోడు, పాకిస్థాన్‌ తన ఆకాశమార్గాన్ని మూసివేయడంతో ఎయిరిండియాకు భారీ నష్టం వాటిల్లింది. పాకిస్థాన్‌ లోని జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాక్‌ తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై పాక్‌ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 27 నుంచి పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఈ ఆంక్షల కారణంగా భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ నష్టం వాటిల్లింది. పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో అమెరికా, యూరప్‌ వెళ్లేందుకు భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు ప్రయాణించే దూరం ఎక్కువగా ఉండటంతో పాటు సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో రోజుకు 6 కోట్ల చొప్పున ఎయిరిండియా 300 కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిరిండియా పౌర విమానయాన శాఖను ఆశ్రయించి నష్టపరిహారం కోరినట్లు సమాచారం. మరోవైపు, సంస్థ ఆర్థిక నష్టాలు రోజువారీ కార్యకలాపాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సంస్థ సర్వర్ డౌన్ కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో అనేక విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. దాదాపు ఆరు గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాసే పరిస్థితి ఎదురయ్యింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాలు దేశీయ, విదేశీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. గత నెల 27న ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున 12 గంటల 20 నిమిషాల సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇమ్మిగ్రేషన్ చెకింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్వర్ సాంకేతిక లోపం కారణంగా ఎయిరిండియా సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు ప్యాసింజర్లు పొడవాటి క్యూలైన్లు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఎయిరిండియాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతేడాది జూన్ 23న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా 25 సర్వీసులను అలస్యంగా నడిపింది ఎయిరిండియా.

సామాన్యుడికి ఆకాశయానాన్ని చేరువ చేయడం కోసం మోదీ సర్కార్ రెండేళ్ల క్రితం ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులోభాగంగా 2017 ఏప్రిల్ 27న ప్రధాని మోదీ.. సిమ్లా - ఢిల్లీ మార్గంలో నడిచే తొలి ప్రాంతీయ విమాన సేవలకు ప్రధాని మోదీ పచ్చా జెండా వూపారు. అలాగే, కడప - హైదరాబాద్‌, నాందేడ్ ‌- హైదరాబాద్‌కు విమాన సేవలను కూడా ప్రారంభించారు. మధ్య తరగతి ప్రజల అభిలాష తీర్చేందుకే ఉడాన్‌ విమాన సేవలు ప్రారంభించినట్టు తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. దేశంలో చిన్న, మధ్య తరహా విమానాశ్రయాల అనుసంధానానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.10 ఖర్చు అవుతుందని.. ఉడాన్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు మాత్రమే ఉంటుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయ్యిందని, అయితే ఇప్పటికీ 70–75 ఎయిర్‌పోర్టులే అందుబాటులో ఉన్నాయని, ఉడాన్‌ ద్వారా 30కిపైగా కొత్త ఎయిర్‌పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ వల్ల టైర్‌–2, టైర్‌–3 నగరాలను అభివృద్ధి బాట పట్టించవచ్చని.. దేశానికి అవి ప్రగతి చక్రాలుగా పనిచేస్తాయని చెప్పారు. ఈ పథకం జాతీయ సమగ్రతకు దోహదం చేస్తుందని, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల కలయిక సాధ్యపడుతుందని అన్నారు. మరోవైపు ఉడాన్ పథకంలో విమానాశ్రయాల అభివృద్ధిపైనా కేంద్రం దృష్టి సారించింది. ఈ ఏడాది జోరుగా విమానాశ్రయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు ఈ ఏడాది మహర్దశ పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం ఆరు ఎయిర్ పోర్టులను బహుముఖంగా అభివృద్ధిపర్చేందుకు నిర్ణయం జరగ్గా.. అందులో తెలంగాణలోని శంషాబాద్, ఏపీకి చెందిన విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రణాళికలు పట్టాలెక్కితే వరంగల్, నిజామాబాద్, కొత్తగూడెం కూడా త్వరలో లిస్ట్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత 12 నెలల్లో పది కొత్త ప్రదేశాలకు కనెక్టివిటీ ఏర్పడింది. కాలికట్, అమృత్ సర్, వదోదర, పోర్ట్ బ్లెయిర్, ఉదయ్ పూర్ తదిరత ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఓవైపు కేంద్రం విమానాశ్రయాల అభివృద్ధితో పాటు.. విమానయానాన్ని మధ్యతరగతి ప్రజలకు చేరువ చేసేదుకు కృష్టి చేస్తుంటే.. మరోవైపు విమానయాన సంస్థలు నేలచూపులు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఎయిర్ ఇండియా నష్టాలకు కొంతమేర ఉడాన్ పథకం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్కువ టికెట్ ధరలకు విమానాలను నడపడం వల్ల.. సంస్థకు గిట్టుబాటు కావడం లేదనే వాదన వినిపిస్తోంది. అయితే, కేవలం ఉడాన్ వల్లే ఎయిర్ ఇండియా దెబ్బతిన్నది చెప్పలేం. నిజానికి, ఎయిర్ ఇండియా నష్టాల్లో ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎయిర్ ఇండియా నష్టాలు ఇప్పటివి కాదు. కొన్నేళ్లుగా ఆ సంస్థ మెల్లమెల్లగా అప్పుల్లో కూరుకుపోతూ వస్తోంది. ఇప్పుడవి తడిసి మోపెడయ్యాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఎయిర్ ఇండియా పరిస్థితికి అనేక కారణాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఎయిరిండియా 9 వేల కోట్ల రుణంతో ప్రారంభించింది. అయితే వాటిని తీర్చడానికి సంస్థ దగ్గర చిల్లిగవ్వ లేదు. దీంతో ప్రభుత్వం మరోసారి బెయిలౌట్ ప్రకటించి అమలు చేస్తే తప్ప సంక్షోభం బారి నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. అయితే, ఇప్పటికే అడపాదడపా డబ్బులు సర్దుతున్న కేంద్ర ప్రభుత్వం.. బెయిలౌట్ ఇవ్వమబోమని తేల్చేసింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వాయిదాలకు కూడా ఎయిరిండియా వద్ద డబ్బులు లేకపోవడంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 23 తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే వరకు ఎయిరిండియా పరిస్థితి ఆగమ్యగోచరమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికే ఆర్థిక శాఖ వద్దకు వెళ్లి ఎయిరిండియా, పౌరవిమానయాన శాఖ పరిస్థితి వివరించినట్లు తెలుస్తోంది. కొన్ని రుణాలకు వాయిదాలను చెల్లించడానికి కూడా సంస్థ వద్ద డబ్బులు లేవని సమాచారం. ఎయిరిండియా రుణాలను ఎగవేయకుండా ఉండాలంటే.. ఆ డబ్బుల కోసం కార్యకలాపాలను నిలిపివేయడం తప్ప మరో అవకాశం కనిపించడం లేదని సంస్థ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే ప్రభుత్వం కూడా కొత్తగా ఎటువంటి బెయిలౌట్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో సంస్థ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే ఇది ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థే కాబట్టి ప్రభుత్వమే సహాయం చేయాల్సి ఉందని ఎయిరిండియా అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు వేచిచూడాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రస్తుతమున్న అధికార పార్టీనే తిరిగి పీఠమెక్కితే మాత్రం ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందంటున్నారు. అటువంటప్పుడు ఎయిరిండియా చెల్లించాల్సిన రుణాలపై ఎటువంటి ఆందోళన అవసరం ఉండదు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ వస్తే వారి అభిమతం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే జెట్‌ ఎయిర్‌ వేస్‌ కున్న అప్పులతో పోలిస్తే ఎయిరిండియా రుణాలే చాలా ఎక్కువ. కాకపోతే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి విమానాలు ఇంకా ఆకాశంలో తిరగగలుగుతున్నాయి. తన ఖాతాల్లో 54 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. గతేడాది 76 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించాలని ప్రయత్నించినా.. అది సఫలం కాలేదు. 29 వేల కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాన్ని ఒక ప్రత్యేకావసరాల సంస్థ అయిన ఎయిరిండియా అసెట్‌ హోల్డింగ్‌ గా మార్చింది. దీంతో ప్రతీ ఏటా ఎయిరిండియా కంపెనీ చెల్లించే 4,400 కోట్ల వడ్డీలో.. ప్రభుత్వం 2,700 కోట్లు చెల్లించే బాధ్యత నెత్తికెత్తుకుంది. ఆ తర్వాత అయినా ఆ కంపెనీ పుంజుకుంటుందనుకున్నా.. అలా జరగలేదు.  ఆర్థిక పనితీరు ఎంత మాత్రం మారలేదు. పైగా రుణాలపై వడ్డీల భారాన్ని ప్రభుత్వం మోయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని అందుకోలేకపోయింది. యూపీఏ హయాంలో ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ను విలీనం చేయాలన్న నిర్ణయం వల్లే ఎయిరిండియా ప్రస్తుత స్థితికి కారణమన్న వారు లేకపోలేదు. విలీన ఆలోచన మంచిదే అయినా.. రూట్ల విషయంలో అప్పటి ప్రభుత్వ ప్రదర్శించిన ఉదారత చేటు తెచ్చిందనే వాదన వినిపిస్తోంది. గల్ఫ్‌ దేశాలకు చెందిన ఎమిరేట్స్‌, ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ లకు కొన్ని మార్గాలకు చెందిన హక్కులను ఇవ్వడంతో అప్పటి దాకా ఆ మార్గాల్లో లాభాలు కొల్లగొట్టిన ఎయిరిండియాకు ఇబ్బందులు వచ్చాయి.  ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిరిండియా విలీనంపైనా.. ఆ తర్వాత జరిగిన రూట్ల హేతుబద్ధీకరణపైనా గట్టి విమర్శలే వచ్చాయి. దీనికి తోడు 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మరింత ఇబ్బందులకు గురిచేసింది. ఇక ప్రభుత్వాధికారులు తమ కుటుంబాలతో సహా చేసే ఉచిత ప్రయాణాలు కూడా దెబ్బతీశాయి. దీంతో ఎయిరిండియా రుణాల కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. గల్ఫ్‌ విమానయాన సంస్థలకు ఆకాశ మార్గాల హక్కులకు విక్రయించడం కోసమే ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ విలీనం జరిగిందని ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ విలీనం తర్వాత సంస్థ ఏనాడూ నికర లాభాలను పొందిన పరిస్థితి లేదు. గత పదేళ్లలో నష్టాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. 2017-18లో ఎయిరిండియా నష్టం 5348 కోట్ల 70 లక్షలకు చేరింది. అంటే సంస్థకు ప్రతిరోజూ 15 కోట్లు నష్టం వాటిల్లుతోందన్నమాట. అంతేకాదు, ఎయిరిండియా అనుబంధ సంస్థలదీ నష్టాల బాటే. అందుకే గతేడాది ప్రభుత్వం అందులో వాటాను విక్రయించాలని గట్టిగా ప్రయత్నించినా.. ఈ తెల్ల ఏనుగును కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కనుక కొత్తగా కొలువు దీరనున్న ప్రభుత్వం.. ఎయిరిండియాను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

భారత విమానయాన రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పదేళ్ల కాలంలో రెండు పెద్ద విమానయాన కంపెనీలు మూతపడ్డాయి. సామర్థ్యానికి మించి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం.. నిర్వహణ లోపాలు ఈ కంపెనీలను ముంచుతున్నాయి. 2012లో విజయ మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ భారీగా అప్పుల పాలై.. రుణాలు చెల్లించలేక ఆ సంస్థ యాజమాని లండన్‌ పారిపోయారు. మొన్నటికి మొన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడంతో 25 ఏళ్ల ప్రస్థానాన్ని అర్థంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా కూడా అదే బాటలో నడుస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.  ఈ మూడు పరిణామాలు ప్రస్తుత భారత విమానయాన పరిశ్రమ రంగంలో చర్చనీయాంశం అయ్యాయి. గత 54 మాసాలుగా భారత విమాన ప్రయాణికు సంఖ్య రెండంకెల వృద్ధితో ముందుకు సాగుతూ.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత విమానయాన రంగంలో ఊహించని వృద్ధి కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో.. విమానయాన సంస్థలు నష్టాల బాట పట్టడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే దేశంలో విమాన ఇంధనం ధరలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది డాలర్‌తో రూపాయి విలువ కూడా ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరడంతో ఎటిఎఫ్‌ ధలు అమాంతం ఎగిశాయి. ఈ ధరలు అన్ని విమానయాన కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం చూపాయి. నిర్వ హణ వ్యయంలో ఎటిఎఫ్‌దే అధిక వాటా. ఇంధన ధరలకు తోడు తీవ్ర పోటీ విమానయాన కంపెనీలను సంక్షోభంలో పడేయడం తో పరిశ్రమలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని.. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న విమానయాన నిపుణులు పర్వేజ్‌ దమానియా అన్నారు. జెట్‌ సేవలు నిలిచిపోవడంతో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న పౌర విమాన యాన రంగం ప్రతిష్ట మసకబారుతుందన్నారు.  భారతీయ విమానయాన రంగంపై ప్రపంచవ్యాప్తంగా గొప్ప అంచనాలు వ్యక్తమవుతుంటే.. వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ఏటేటా విమాన ప్రయాణీకులు పెరుగుతున్నారని గణాంకాలు చెబుతుండగా, కేంద్ర ప్రభుత్వం సైతం సామాన్యులకూ విమానయోగాన్ని కల్పిస్తూ మార్కెట్‌ను విస్తరింపజేస్తోంది. అయితే, గడిచిన 21 ఏళ్లలో 12 విమానయాన సంస్థలు మూతబడటాన్ని చూస్తే.. దేశీయ విమానయాన రంగం ఎంత సంక్షోభంలో వుందో అర్థం చేసుకోవచ్చు.  గత నలభై ఎళ్లలో ఎన్నో విమానయాన సంస్థలు మూతపడ్డాయి. వాయుదూత్, సహారా ఎయిర్‌లైన్స్, ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌ లైన్స్, ఎన్‌ఈపీ, దమానియా ఎయిర్‌ వేస్ మూతపడ్డాయి. అంతేకాదు, మోదీలుఫ్ట్, అర్చనా ఎయిర్‌ వేస్, ఎయిర్ డెక్కన్, పారామౌంట్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఎండీఎల్‌ఆర్, ఎయిర్ పెగాసూస్ వంటి సంస్థలు కూడా చేతులెత్తేశాయి. వీటిలో సహారా ఎయిర్‌ లైన్స్‌ను జెట్ టేకోవర్ చేయగా, ఎయిర్ డెక్కన్‌ ను కింగ్‌ఫిషర్ కొనుగోలు చేసింది. అలాగే మోదీ లుఫ్ట్.. స్పైస్‌ జెట్‌ గా అవతరించింది. ఇలా విమానయాన సంస్థలు మూతపడుతుండటంతో వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతోంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ చేతులెత్తేయడంతో.. ఆ సంస్థకు 22 వేల మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. కొన్నినెలలుగా జీతాల్లేక భార్యాబిడ్డలను పోషించుకోలేక నరకయాతన పడుతున్నారు. ఇక తాత్కాలికంగా సేవల్ని నిలిపివేస్తున్నట్టు ఇటీవల జెట్ యాజమాన్యం ప్రకటించగానే.. ఢిల్లీ, ముంబయిలో శాంతియుత నిరసన చేపట్టారు. సంస్థను స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు సైతం.. ఇన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని భోరున విలపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత పిల్లకు తిండి పెట్టడం కూడా కష్టమవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుకొచ్చి తమ కుటుంబాలను కాపాడాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు. తమ ఉద్యోగ ప్రభావం తమ పిల్లల మీద పడుతోందని.. ఇప్పుడు తామంతా రోడ్డున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా జీతాల్లేక నరకయాతన అనుభవిస్తున్నామని.. పిల్లల చదువులు, ట్యూషన్‌ ఫీజులు కట్టడానికి కూడా తమ దగ్గర డబ్బుల్లేవంటూ భోరున విలపించారు. కొందరు ఉద్యోగులు.. తాము తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. జెట్ ఎయిర్ వేస్ లో దాదాపు 6 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతం వస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ముందుకొచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా నష్టాల బాట పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జెట్ ఎయిర్ వేస్ పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఉద్యోగులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో.. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం సంస్థను ఆదుకుంటుందనే ఆశతో వున్నారు.

-ఎస్. కె. చారి