Monday, December 09, 2019
Follow Us on :

‘స్టార్’ వార్స్..!..

By BhaaratToday | Published On Apr 29th, 2019

‘ఊర్మిళ’ తళుకులు. ‘సన్నీ’ మెరుపులు. ఎన్నికల ‘రింగ్’ లో విజేందర్. పొలిటికల్ ‘పిచ్’ పై గంభీర్. రాజకీయ తెరపై సినీ తారలు. ఓట్ల వేటలో క్రీడా కుసుమాలు. మరి, పోల్ ‘బాక్స్’ బద్దలు కొట్టేదెవరు..? పాలిటిక్స్ గేమ్ లో గెలిచేదెవరు.? ‘స్టార్’ వార్స్..!.. 

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి గతానికి మించిన స్థాయిలో సినిమా వాళ్లు బరిలో వున్నారు. భారత ప్రజాస్వామ్యంలో గతంలో కూడా సినిమా వాళ్లు పోటీ చేసిన సందర్భాలు, వారు నెగ్గిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ లే కాదు.. ప్రాంతీయ పార్టీల తరఫున కూడా చాలా మంది సినిమా వాళ్లు పోటీ చేశారు. కొందరు ఇండిపెండెంట్స్ గా కూడా పోటీ చేశారు. మరి, వీరంతా సత్తా చాటుతారా..? పొలిటికల్ యాక్షన్ లో విజయం సాధిస్తారా..? రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి తారలు రావడం కొత్తేమీ కాదు సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం లేదా ఏదో పార్టీల తరపు నుంచి పోటీ చేయడం ఎప్పటినుంచో వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అభిమానులే అండగా కొందరు తారలు ఎన్నికల బరిలో దిగి సూపర్ హిట్ అవ్వాలని.. సినీ చరిష్మాతో రాజకీయాలలో రాణించాలనుకుంటున్నారు.  సినీ గ్లామర్ కాకుండా.. రాజకీయాలను ఆకర్షిస్తున్న మరో ఇండస్ట్రీ స్పోర్ట్స్. మన దేశంలో మైదానంలో రాజకీయాలు, రాజకీయాల్లో ఆటలు సహజమే. అందుకే, చాలామంది క్రీడాకారులు మైదానాన్ని వదిలి రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. వారిలో కొందరు విజయం సాధించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలామంది క్రీడాకారుల పేర్లు మారుమోగుతున్నాయి.

బాలీవుడైనా, టాలీవుడైనా, కోలీవుడైనా మకుటం లేని మహారాజుల్లా, మహారాణుల్లా ఏలినవారంతా ఎన్నికల రణక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఈసారి సినీ గ్లామర్ ను గట్టిగానే నమ్ముకున్నట్టుంది. ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా అనేక మంది సినిమా వాళ్లకు కమలం పార్టీ ఎంపీ టికెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున సినీ సెలబ్రిటీలను పోటీ చేయించడానికి బీజేపీ చాన్నాళ్లుగానే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. ఇందుకోసం గతంలో అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి అనేక మందిని కలిశారు. మాధురీ దీక్షిత్, కపిల్ దేవ్ వంటి వాళ్లను కూడా కలిసి అమిత్ షా వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించినట్టుగా వార్తలు వచ్చాయి. వారికి బీజేపీ తరఫున ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు షా ఆసక్తి చూపించారట. అయితే వారు రాలేదు కానీ.. వేరే వాళ్లు మాత్రం పార్టీలోకి క్యూకట్టారు.  ఇప్పటికే పలువురు సినీ తారలు బీజేపీ తరఫున ఎంపీలుగా పోటీకి దిగారు. ఉత్తరాదిన హేమమాలిని బీజేపీ తరఫున రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన హేమమాలిని.. 2014 లో బీజేపీ తరఫున మథుర నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ తరఫున ఎంపీగా నెగ్గిన జయప్రద, ఈసారి ఆ పార్టీతోనే తలపడుతూ ఉన్నారు. బీజేపీ తరఫున రామ్ పూర్ నుంచి పోటీలో ఉన్నారు. తాజాగా కమలదళానికి మరో ప్రముఖ హీరో అభ్యర్థిగా దొరికాడు. అతడే సన్నీడియోల్. ఒకనాటి ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి బీజేపీ ఎంపీ టికెట్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. పంజాబ్ నుంచి సన్నీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లేదా అమృత్ సర్ నుంచి సన్నీ పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే అమిత్ షాతో సమావేశమైన సన్నీ డియోల్.. పోటీ విషయంపై చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సన్నీడియోల్ తండ్రి ధర్మేంద్ర బీజేపీ నుంచి పోటీచేశారు. రాజస్థాన్ లోని బికనీర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఈసారి సన్నీడియోల్ దాదాపుగా గురుదాస్ పూర్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా విజయం సాధించారు. కొంతకాలం క్రితం ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి సన్నీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోందట. ఇక, భోజ్ పురి సూపర్ స్టార్ రవి కిషన్ కూడా బీజేపీ తరఫున బరిలో వున్నారు. యూపీలోని గోరఖ్ పూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తాజాగా పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. అధికారం చేతిలో ఉన్న వేళా విశేషమో ఏమో కానీ.. బీజేపీకి చాలా మంది సినీ సెలబ్రిటీలు దొరుకుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన మలయాళీ నటుడు సురేష్ గోపీ కూడా బీజేపీ తరఫున బరిలో నిలిచారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగతున్న సురేష్ గోపీ.. ఈసారి లోక్ సభలో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక బీజేపీకి తామేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. పార్టీకి సినీ గ్లామర్ అద్దుతోంది. తొలిసారి రాజకీయ రణరంగంలోకి దిగిన.. రంగీలా భామ ఊర్మిళా మాతోండ్కర్ కు ముంబై నార్త్ నుంచి బరిలోకి దింపింది హస్తం పార్టీ. గతంతో నటుడు గోవిందా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ప్రచారంలో ఊర్మిళ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక బాలీవుడ్ వెటరన్ స్టార్, బీజేపీకి గుడ్ బై చెప్పిన శత్రుఘ్ను సిన్హా.. ఈసారి కాంగ్రెస్ తఫురన పాట్నా సాహిబ్ నుంచి బరిలోకి నిలిచారు. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పై ఆయన పోటీచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు.. ఇతర పార్టీల నుంచి కూడా పలువురు సినీ నటులు పోటీలో వున్నారు. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి మున్ మున్ సేన్.. తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్నారు. అంతేకాదు, మిమి చక్రవర్తి, నస్రత్‌ జహాన్‌ వంటి తారల తళుకుబెళుకులతో తృణమూల్‌ ఓట్లు దండుకునే పనిలో ఉంది. తన విలక్షణ నటనతో దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో వున్నారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. దక్షిణాది భాషల్లో ఒకప్పటి గ్లామరస్ తార, దివంగత కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ భార్య.. సుమలత కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవలే అంబరీష్ మరణించడంతో.. రాజకీయంగా ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి మండ్య లోక్ సభ స్థానం నుంచి పోటీలో వున్నారు సుమలత. ఇలా సినీతారలు తమ గ్లామర్‌నే పెట్టుబడిగా పెట్టి నాలుగు ఓట్లు సంపాదించడం రాజకీయ పార్టీలకు కొత్తేం కాదు. మన ఎన్నికల వ్యవస్థలో ఆది నుంచి ఈ ధోరణి కనిపిస్తూనే ఉంది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో నటులు హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ, పైడి లక్ష్మయ్య లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి బ్యాలెట్‌ బాక్స్‌ దగ్గర తమకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సినిమా నటీనటులు రికార్డు స్థాయిలో పోటీ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 22 మంది లోక్‌సభ బరిలోకి దిగారు. వీరిలో 12 మంది గెలిస్తే, 10 మంది ఓడిపోయారు. దేవ్, హేమమాలిని, కిరణ్‌ఖేర్, మూన్‌మూన్‌ సేన్, పరేష్‌ రావెల్, చిరాగ్‌ పాశ్వాన్, ఇన్నోసెంట్, మనోజ్‌ తివారీ, మురళీమోహన్, సంధ్యారాయ్, శతాబ్ది రాయ్, బాబుల్‌ సుప్రియో నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇక రాఖీ సావంత్, మహేష్‌ మంజ్రేకర్, అపరాజిత మొహంతీ, జావేద్‌ జాఫ్రే, నగ్మా, నవనీత్‌ కౌర్‌ రాణా, రమ్య, రవికిషన్, బప్పీలహరి, గుల్‌ పానగ్‌లు ఓటమి పాలై ఇంటిదారి పట్టారు. కొందరు తారలు రాజకీయాలపై ఆసక్తితో బరిలోకి దిగుతుంటే.. మరికొందరు తారలకు రాజకీయాలపై ఆసక్తి వున్నా లేకున్నా.. వారిపై వల విసురుతూ బరిలో నిలుపుతున్నాయి రాజకీయ పార్టీలు. రారమ్మంటూ పార్టీ కండువాలు కప్పుతున్నాయి. సినీ రంగానికి చెందిన వారికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు.. ఎన్నో ప్రాంతీయ పార్టీలు కూడా టిక్కెట్లిచ్చి వారి సినీ గ్లామర్ ను వాడుకున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సినీ గ్లామర్.. గతంలోకంటే ఎక్కువగా తళుకులీనుతోంది. మరి, వీరిలో లోక్ సభలో అడుగుపెట్టేదెవరు..? ఇంటిదారి పట్టేదెవరో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

సినీతారలు రాజకీయాలకు కొత్త కాదు. భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన ప్రముఖులెందరో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ. తమిళనాట అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే పార్టీలు కూడా ఒకప్పుడు సినీకళాకారులు స్థాపించినవే. అభిమానులే అండగా కొంత మంది తారలు పార్టీలు పెట్టి హిట్ అయితే మరి కొందరు సరిగ్గా పార్టీని నడపలేక ప్లాపులు మూటగట్టుకున్నారు. నిజానికి, సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం 1940లోనే మొదలైంది. తమిళనాట ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి, తెలుగు సీమలో జగ్గయ్య, ఎన్టీఆర్‌, కృష్ణ, జమున నుంచి బాలకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ, రోజా వరకు బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా, హేమ మాలిని, కిరణ్‌ ఖేర్‌ ఇలా ఎందరో తారలు లోక్‌సభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ తమ వాణి వినిపించారు. వీరిలో కొందరు పెద్దల సభలోఅడుగు పెట్టారు. ఈ సారి కూడా అనేక మంది తారలు ఎన్నికల బరిలో దిగుతున్నారు.  ఇక కమల్ హాసన్, పవన్ కల్యాణ్ లాంటి వారు పార్టీలు కూడా పెట్టారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేన అభ్యర్థిగా నరసాపురం బరిలో నిలిచారు. ఇక తృణమూల్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఈ సారి ఐదుగురు తారలకు లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. ఎన్నికల్లో ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తికి టికెట్ కేటాయించారు. జదావ్‌పూర్ నుంచి చక్రవర్తి పోటీ చేయనున్నారు. ఇక మూన్‌మూన్ సేన్‌, శతాబ్ది రాయ్, నస్రత్ సహాన్‌లు, సినీనటుడు దేవ్ బరిలో ఉన్నారు. ఇక కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్, మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత బరిలోకి దిగుతున్నారు. ఇక మాండ్య నియోజక వర్గం నుంచే సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ కూడా పోటీ పడుతున్నారు.  యూపీ నుంచి బీజేపీ తరపున హేమమాలిని, కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్ బరిలో ఉన్నారు. ఇక బీహార్ లో కాంగ్రెస్ తరపున శతృఘ్న సిన్హా పట్నా సాహెబ్ నియోజక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. మొత్తానికి తారలు పార్టీలకు ఉన్న ప్రజాదరణ కంటే ప్రజల్లో తమకున్న పాపులారిటీని ఓట్లుగా మల్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీరిలో గెలిచేది ఎవరో మే నెల లోనే తేలుతుంది.

భారతదేశంలో క్రీడాకారులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్త విషయమేమీ కాదు. గతంలో రాజకీయ మైదానంలో అడుగుపెట్టిన ఎంతోమంది తమదైన ముద్ర వేశారు. కాలం కలిసి రాక మధ్యలోనే వదిలివెళ్లిన వారు కూడా ఉన్నారు.  ప్రతి ఎన్నికల్లోలాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ దిగ్గజ క్రీడాకారులు కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రత్యర్థులుగా కూడా తలపడుతున్నారు. రాజకీయ ఆటగాళ్లల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఒకరు. ఢిల్లీకి చెందిన గంభీర్‌ ఇటీవలే కషాయ కండువా కప్పుకున్నారు. ఊహించని విధంగా కీలక తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మాజీ ఓపెనర్‌ ఇప్పుడు రాజకీయ అరంగేట్రంలో గెలుపు సాధిస్తాడా అనేది క్రికెట్‌ ఆటగాళ్లతోపాటు అటు అభిమానుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. ఇక, ఇన్నాళ్లు బాక్సింగ్‌ రింగ్‌లో దిగ్గజాలను మట్టి కరిపించిన విజయేందర్‌ సింగ్‌ కూడా ఈ ఎన్నికల యుద్ధంలో ప్రత్యర్థులతో తలపడనున్నారు. ఒలింపిక్‌ పతక విజేత అయిన విజయేందర్‌ ప్రజాక్షేత్రంలో దక్షిణ ఢిల్లీ లోక్‌ సభ స్థానంలో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. దేశ రాజధాని నగరంలో వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేస్తున్న గంభీర్‌, విజయేందర్‌.. మే 12న జరగనున్న ఆరో విడత ఎన్నికల్లో గెలిస్తే భవిష్యత్‌ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. క్రీడాకారులే ప్రత్యర్థులుగా తలపడుతున్న జయపుర గ్రామీణ లోక్‌ సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒలింపిక్‌ పతక విజేత షూటర్‌ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ బీజేపీ నుంచి బరిలో నిలిచారు. ఆయనపై ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతక విజేత, అథ్లెట్‌ కృష్ణ పూనియా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 16వ లోక్‌సభ ఎన్నికల్లో జయపుర గ్రామీణం నుంచి పోటీ చేసి గెలిచిన రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ మోదీ కాబినేట్‌లో మంత్రిగా ఉన్నారు. కొంతమంది మాత్రమే ఇలా ఆటలోనూ, ఓటులోనూ గెలుపొందారు. ఆ కోవలో ముందు వరుసలో ఉండే వ్యక్తి రాజ్యవర్ధన్‌. ఆయన తరహాలోనే కృష్ణ పూనియా సైతం అదే రాష్ట్రం నుంచి గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాదుల్‌పూర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. వీరితో పాటు మాజీ క్రికెటర్‌ కీర్తీ ఆజాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. క్రికెట్‌ రాజకీయాల్లో రాణించిన కీర్తి అజాద్‌ ఈ ఎన్నికల్లో ఝార్ఖండ్‌లోని ధన్‌బాగ్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 1983 ప్రపంచ కప్‌ సాధించిన భారత జట్టులో సభ్యుడైన ఆజాద్‌ బీజేపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసి బిహార్‌లో ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అయితే కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీని బహిరంగంగా విమర్శించడంతో ఆజాద్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక భారత క్రికెట్‌లో విజయవంతమైన క్రికెట్‌ కెప్టెన్లల్లో అజారుద్దీన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌లో చేరిన అజారుద్దీన్‌ 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మొరాయిదాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్‌లోని టోంక్‌ సవాయి మాధోపూర్‌ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి సొంత రాష్ట్రం తెలంగాణలోని సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయాలని భావించినా కుదరలేదు. కాంగ్రెస్‌ నుంచి ప్రధాన ప్రచారకర్తగా ఉన్న అజారుద్దీన్‌ పోటీ చేసే స్థానాన్ని పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. రాజకీయాల్లో మెరిసిన మరో క్రీడాకారుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ. మైదానంలో అందరూ సిక్సర్ల సిద్దూగా పిలిచే సిద్దూ 2004లో కమలం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమృత్‌సర్‌ స్థానం గెలుపొందిన సిద్ధూ.. 2009లోనూ విజయం సాధించారు. 2014లో అమృత్‌సర్‌ స్థానం ఆశించిన ఆయన.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంజాబ్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ పాకిస్థాన్‌కు వెళ్లి కర్తార్‌పూర్‌ నడవాకు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. బాలాకోట్‌పై వైమానిక దాడి అనంతరం సిద్ధూ వార్తల్లో నిలిచారు. ఈసారి పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడి తన రాజకీయ పురోగతిని చిక్కుల్లో పడేసుకున్నారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించిన వారిలో ఫుట్‌ బాల్‌ ఆటగాడు ప్రసూన్‌ బెనర్జీ తృణమూల్ నుంచి, షూటర్‌ నారాయణ సింగ్‌ బీజూ జనతాదళ్‌ నుంచి ఎంపీలుగా గెలిచారు. 2004లో అథ్లెటిక్‌ జ్యోతిర్మయి సిగ్ధర్ పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌ నుంచి పోటీచేసి గెలిచారు. మాజీ హాకీ కెప్టెన్‌ అస్లాం షేర్‌ ఖాన్‌ 1984లో లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 1991లోనూ గెలిచారు. ఆ తర్వాత నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.  క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ 1991, 1998లో అమ్రోహా నియోజకవర్గం నుంచి పోటీచేశారు. మాజీ హకీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ ఒడిశా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న మేరికోమ్‌ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.  అయితే, క్రీడా మైదానంలో సత్తా చాటినా.. రాజకీయ మైదానంలో నెగ్గుకురాని క్రీడాకారులు కూడా వున్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుత ఫీల్డర్ గా గుర్తింపు పొందిన మాజీ క్రికెటర్, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్ కైఫ్‌.. పొలికల్ పిచ్ పై మాత్రం రన్నౌట్ అయ్యాడు. 2014లో కాంగ్రెస్‌లో చేరిన కైఫ్.. అదే సంవత్సరం యూపీలోని ఫుల్‌ పూర్‌ నుంచి పోటీ చేశారు. అయితే, బీజేపీ చేతిలో ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన రాజకీయాలను వదిలేశారు. భారత ఫుట్‌బాల్‌ జట్టుకు పదేళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్న భుటియా వంద మ్యాచ్‌లు ఆడారు. ఆయన నాయకత్వంలో భారత జట్టు మూడు సార్లు దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ కప్పు గెలుచుకుంది. 2014లో డార్జిలింగ్‌ నుంచి తృణమూల్‌ టికెట్‌పై పోటీ చేశారు. 2016లో సిలిగురి నుంచి బరిలో దిగారు. అయితే, రెండుసార్లూ ఆయన పరాజయం పాలయ్యారు. గతేడాది ఆయన హంరో సిక్కిం పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన గ్యాంగ్‌టక్‌ నుంచి శాసనసభకు పోటీ పడ్డారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ అయిన దిలీప్‌ టిర్కీ మూడు ఒలింపిక్స్‌ సహా 400కుపైగా అంతర్జాతీయ హాకీ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివాసీ అయిన దిలీప్‌ 2012లో ఒడిశా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో సుందర్‌ గఢ్‌ లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, బీజేడీ అభ్యర్థి జాల్‌ ఓరమ్‌ చేతిలో ఓడిపోయారు. ఇక టైగర్‌ పటౌడీగా సుపరిచితులైన మన్‌సూర్‌ అలీఖాన్‌ పటౌడీ 21 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అయ్యారు. 1971లో గుర్‌గావ్‌ నుంచి, 1991లో భోపాల్‌ నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండుసార్లూ కూడా విజయం సాధించలేకపోయారు.

-ఎస్. కె. చారి