Saturday, December 07, 2019
Follow Us on :

నింగిలో ‘నిఘా’ నేత్రం..!..

By BhaaratToday | Published On Apr 2nd, 2019

మొన్న ‘శాటిలైట్ కిల్లర్’. నేడు ‘రాడార్ ట్రాకర్’. కక్ష్యలో ఇమిడిన ‘ఇమిశాట్’. ఇక శత్రువు కదలికలే ‘టార్గెట్’. గగనతలంపై ఇస్రో జయకేతనం. పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం విజయవంతం. నింగిలో ‘నిఘా’ నేత్రం..!.. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు.. విజయాలు అలవాటుగా మారాయి. ఇటీవలికాలంలో ఇస్రో ప్రయోగాలకు ఎదురులేకుండా పోతోంది. ముఖ్యంగా ఓటమన్నది ఎరుగని పీఎస్ఎల్వీ.. ఇస్రో కీర్తిని మరింత పెంచింది. రక్షణ అవసరాల కోసం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా.. ఇంటలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్ తో పాటు.. విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది ఇస్రో. డీఆర్డీవో, ఇస్రో సాధించిన ఘనతకు.. ఇప్పుడు దేశమంతా గర్వపడుతోంది. పీఎస్ఎల్వీ-సీ45 ప్రయోగం సక్సెస్ పట్ల జేజేలు కొడుతోంది. ఇమిశాట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఇమిశాట్ గొప్పతనమేంటి..? ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకుని శత్రువుకు మన సైన్యం ఎలా చెక్ పెడుతుంది..? అదెలా సాధ్యం..?  దేశ సరిహద్దు రక్షణకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండాలంటే.. బలమైన సైనిక పాటవం కావాలి. అత్యాధునిక ఆయుధాలుండాలి. వాటిని సరైన దిశలో నడిపించగల సమర్దవంతమైన నాయకత్వం కావాలి. కానీ, ఇవి మాత్రమే ఉంటే.. ఇప్పుడు లాభం లేదు. అంతరిక్షం నుంచి దూసుకువచ్చే ముప్పును కూడా తట్టుకోగలగాలి. అందుకే.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది భారత్. శత్రుదేశాల ఉపగ్రహాల పనిపట్టే.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. 

భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇస్రో, డీఆర్డీవో వెన్నుదన్నుతో.. శత్రుదేశాలను నివ్వెరపరిచేలా భారత నిఘా వ్యవస్థలోకి తిరుగులేని ఆయుధం రంగప్రవేశం చేసింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. పరాజయం అంటూ ఎరుగని ఈ రాకెట్.. రక్షణ రంగానికి సంబంధించిన ఇమిశాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. డీఆర్డీఓకి చెందిన ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షార్ కేంద్రంలోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి సోమవారం ఉదయం 9 గంటల 27 నిమిషాలకు నింగిలోకి ఎగిసిన పీఎస్ఎల్వీ సీ45 రాకెట్.. 17 నిమిషాల తర్వాత 753.6 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ఇమిశాట్ ను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. అక్కడ నుంచి 1 నిమిషాల 50 సెకన్లలో నాలుగు దశలను పూర్తిచేసిన పీఎస్ఎల్వీ లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. వీటిని 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టింది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 47వది కాగా, షార్ చేపట్టిన 71వ ప్రయోగం. ఇక 2019లో ఇది ఇస్రో చేపట్టిన రెండో పీఎస్ఎల్వీ ప్రయోగం. అంతేకాదు, ఎక్కువ సమయం ప్రయాణించిన రాకెట్ ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. గతేడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ40 ప్రయోగానికి 2 గంటల 21 నిమిషాల సమయం పట్టింది. ఇక, తాజా ప్రయోగం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. పీఎస్ఎల్వీలో ఇంధనాన్ని మండించడానికి అధునాత బూస్టర్లను వినియోగించారు. మొత్తం నాలుగు దశల్లో ఒక్కో దశలో 12.2 టన్నుల బరువును మోసుకుపోయే సామర్థ్యంతో రూపొందించి, మూడు వేర్వేరు కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మొదటి పేలోడ్‌లోని ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సముద్ర జలాల్లోని నౌకల గురించి సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే రెండో పేలోడ్‌ ఆటోమేటిక్‌ ప్యాకెట్‌ రిపీటింగ్‌ సిస్టమ్‌లోని రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ ప్రయోగాత్మకంగా అధునాతన సాంకేతికతకు సంబంధించి పరిశోధనలు నిర్వహించనుంది. ఇక మూడో పేలోడ్‌‌లో అమర్చిన అడ్వాన్స్‌డ్‌ రిటార్డింగ్‌ పొటెన్షియల్‌ అన్‌లైజర్‌ ఫర్‌ ఐనోస్పిరిక్‌ స్టడీస్‌ ద్వారా రాబోయే ఆరు నెలల్లో వాతావరణంలోని ఐనోస్పియర్‌పై పరిశోధనలు చేపడతారు.  మూడో దశలో 508 కిలోమీటర్ల ఎత్తున దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశించిన తర్వాత నాలుగో దశకు వెళ్ల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. నాలుగో దశలో 485 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేర్చే సమయంలో ఇంజిన్ రెండుసార్లు మొరాయించింది. దీంతో ఇంజిన్ రీ-స్టార్ట్ చేసి తక్షణమే లోపాన్ని సరిదిద్ది పేలోడ్‌ను విజయవంతంగా నాలుగు దశకు చేర్చారు. ఇక ప్రయోగం విజయవంతం చేసినందుకు ఇందులో భాగస్వామైన వారందరికీ ఇస్రో చైర్మన్ కే శివన్ శుభకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రిశాట్, కార్టోశాట్ 3, చంద్రయాన్-2 సహా మరో 30 ప్రయోగాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నింగిలోకి పంపిన ఉపగ్రహాలు తమ కక్ష్యలో చేరడంతో తమ ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్నామని శివన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఒకేసారి 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా జంబో ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. గతేడాది ఫిబ్రవరి 15న జరిగిన 'పీఎస్ఎల్‌వీ-సీ37' రాకెట్ రికార్డు స్థాయిలో ఏకంగా 104 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోని వివిధ కక్ష్యల్లోకి విజయవంతంగా చేరిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్‌కు చెందినవి. మిగతా 101 ఉపగ్రహాలూ విదేశాలకు చెందినవే.

తాజాగా ప్రయోగించిన 436 కేజీల ఇమిశాట్ ఉపగ్రహాన్ని భారత రక్షణ అవసరాలకోసం డీఆర్డీవో రూపొందించింది. ఇది తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ రక్షణశాఖకు చేదేడో వాదోడుగా నిలుస్తుంది. శత్రు దేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచార సేకరణ కోసం భారత్ విమానాలపైనే ఆధారపడుతోంది. ఇకపై అంతరిక్షం నుంచే ఈ పని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎక్కడున్నాయో తెలుసుకోవడమే ఇమిశాట్ పని. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24 గంటలు నిఘావేసే అవకాశం దక్కుతుంది. సాధారణంగా, శత్రుదేశాల విమానాలు, క్షిపణులను పసిగట్టడంలో రాడార్లదే కీలకపాత్ర. ఒకవిధంగా సైన్యాలకు రాడార్లు గుండెకాయ లాంటివి. అలాంటి రాడార్లనే ఇమిశాట్ లక్ష్యంగా చేసుకుని నిఘా వేస్తుంది. ప్రత్యర్థికి చెందిన రాడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నిత్యం ఓ కన్నేసి ఉంచే ఇమిశాట్.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రక్షణ దళాలతో పంచుకుంటుంది. తద్వారా యుద్ధం సమయాల్లో శత్రుదేశాల రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు మన సైన్యానికి వీలు కలుగుతుంది. రాడార్ల సాయం లేకుండా యుద్ధం చేయడం అంటే ఆత్మహత్యాసదృశమే. ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే రాడార్లు లేకుండా ఏ దేశ సైన్యం అయినా ఏమీ చేయలేదు. సరిగ్గా ఆ పాయింట్ ను ఆధారంగా చేసుకుని డీఆర్డీవో ఇమిశాట్ కు రూపకల్పన చేసింది. ఈ ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్ మెంట్ శాటిలైట్ ను ‘ప్రాజక్ట్ కౌటిల్య’ పేరుతో అభివృద్ధి చేశారు. ఇమిశాట్ కోసం భారత ప్రభుత్వం దాదాపు 432 కోట్లు ఖర్చు చేసింది. దీన్ని ఇజ్రాయెల్ దేశానికి చెందిన ‘సరాల్’ నిఘా ఉపగ్రహం స్ఫూర్తితో రూపొందించారు. ఇది ఇరవైనాలుగు గంటలు నిఘా వేసే ఉపగ్రహం కావడంతో దీన్నుంచి తప్పించుకోవడం శత్రుదేశాలకు అసాధ్యం. డీఆర్డీవో నిపుణులు దీనికి ముద్దుగా ‘రాడార్ కిల్లర్’ అని పేరుపెట్టారు. ఈ ప్రయోగం వల్ల రక్షణరంగం మరింత బలోపేతం అవుతుంది. భారత్‌ నిఘా విభాగంలోకి ఈ ప్రయోగంతో సరికొత్త అస్త్రం వచ్చి చేరినట్టయింది. భారత్‌ వద్ద ఇప్పటికే దాదాపు 8కిపైగా  నిఘా శాటిలైట్లు ఉన్నట్టు తెలుస్తోంది. కార్టోశాట్‌ సిరీస్‌లోని నాలుగు శాటిలైట్లు పూర్తిగా సైనిక అవసరాల కోసమే పనిచేస్తాయంటున్నారు. ఇక నుంచి శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని కనిపెట్టడం మన రక్షణ శాఖకు చాలా తేలిక కానుంది. అంటే సొంతంగా అంతరిక్ష ఫ్లాట్‌ ఫామ్ అందుబాటులోకి రానుంది. ఇదిలావుంటే, రాకెట్ ప్రయోగం సందర్భంగా ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఓవైపు దేశమంతా ఇస్రో ఘనతకు కీర్తిస్తూ.. శాస్త్రవేత్తలకు ప్రశంసలు కురిపిపిస్తుంటే.. రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నప్పుడు ఇండిగో విమానానికి చెందిన పైలట్‌ వీడియోను తీశారు. ఈ ప్రయోగ సమయంలో ఇండిగో విమానం ప్రయోగ కేంద్రానికి 50 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌ కెప్టెన్‌ కరుణ్‌ కారుబయా.. నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్‌ ను వీడియో తీశారు. దానిని ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. విమానం కుడి వైపు ఉన్న కిటికీ నుంచి పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్‌ లాంచ్‌ను మీరూ చూడొచ్చు. అది మన రాకెట్టే..’ అని ప్రయాణికులకు చెప్పారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ‘బ్యూటీ.. వావ్‌.. అమేజింగ్..’ అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

తరచుగా చైనా, పాకిస్థాన్ నుంచి సైనికులు మన భూభాగంలో ప్రవేశించడం, మనం సైన్యం తిరిగి స్పందించడం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, మోదీ సర్కార్ అధికారింలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశాలు చేస్తున్న ఈ ఆగడాలకు చెక్ పెట్టాలని డిసైడయ్యింది భారత ప్రభుత్వం. ఒకవైపు తీవ్రవాదులు, మరోవైపు పొరుగు దేశాల నుంచి డోక్లాం వంటి ఆక్రమణ చర్యలు. ఇవన్నీ భారత ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. సాంకేతికతను ఉపయోగించుకుని, ఇలాంటి వాటి గుట్టు రట్టు చేయడానికి, దేశానికి రక్షణ కవచంలా అన్ని సరిహద్దుల్నీ నిరంతరం సైనికుడిలా కాపలా కాయడానికి ఉపగ్రహాలను ఉపయోగంచుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది.  దీంతో దేశానికి అన్ని వైపుల సరిహద్దుల్ని పరిరక్షించే విధంగా దేశాన్ని నిరంతం గస్తీ కాస్తూ, శత్రువులపై డేగ కన్ను వేసే ఒక ఉపగ్రహాలను తయారుచేయాల్సిందిగా, ప్రభుత్వం నుంచి ఇస్రో, డీఆర్డీవోలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో అధునాత అంతరిక్ష ఆయుధాల రూపకల్పనకు డీఆర్డీవో, ఇస్రోలు శ్రీకారం చుట్టాయి. ఇటీవలికాలంలో సైనిక అవసరాల కోసం  పలు ప్రయోగాలను విజయంతంగా పూర్తిచేశాయి. గతేడాది డిసెంబర్ 19న జీఎస్ఎల్వీ-ఎఫ్11 ప్రయోగంతో ఈ తరహా ప్రయోగాల ప్రక్రియ వేగవంతమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్11 ద్వారా సైనిక అవసరాలకు ఉపయోగపడే జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. జీశాట్‌-7ఏ తో మొట్టమొదటిసారిగా వైమానిక దళ అవసరాలకు ప్రత్యేకంగా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది ఇస్రో. ఈ ఉపగ్రహం ఎయిర్స్ ఫోర్స్ సమాచార వ్యవస్థకు ఎంతగానో తోడ్పడుతోంది. భారత వాయుసేనకు 70 శాతం, సైన్యానికి 30 శాతం సేవలు అందిస్తోంది. కేయూ బ్యాండ్‌ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్ల అందిస్తున్న జీశాట్-7ఏ విమానాలకు ఎంతగానో ఉపకరిస్తోంది. దీంతో గగనతలంలో రెండు యుద్ధ విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరం అయ్యింది. వైమానిక దళ యుద్ధవిమానాలు, గగనతలంలో ముందస్తు హెచ్చరికలు చేసే అవాక్స్ విమానాలు, డ్రోన్లు, నేల మీదున్న రాడార్‌ కేంద్రాలు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహం సంధానిస్తుంది. తద్వారా భద్రమైన ఒక కేంద్రీకృత నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తుంది. దీనివల్ల శక్తిమంతమైన మరో కమ్యూనికేషన్‌ మార్గం వైమానిక దళానికి అందుబాటులోకి వస్తుంది. భూతల మౌలిక వసతులు లేని, సంకేతాలు అందని మారుమూల ప్రాంతాల్లో తలెత్తే కమ్యూనికేషన్‌ ఇబ్బందులు తప్పినట్టయింది. యుద్ధ సమయంలో ఎయిర్‌ కమాండ్‌ను, కంట్రోల్‌ సిస్టమ్‌ను సమీకృతం చేయడం చాలా ముఖ్యం. ఆ పాత్రలో జీశాట్‌-7ఏ ఒదిగిపోతుంది. బయటి నుంచి వచ్చే ముప్పును పసిగట్టి వెంటనే అప్రమత్తం చేస్తుంది. అప్పటికప్పుడు ఒక విమానం నుంచి మరో విమానానికి, నేలమీదకు కమ్యూనికేషన్‌ సేవలు అందిస్తుంది జీశాట్-7ఏ. నిఘా డ్రోన్లు సేకరించే వీడియోలు, చిత్రాలను భూ కేంద్రాలకు చేరవేస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మరింత మెరుగ్గా ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యాన్ని వైమానిక దళానికి అందిస్తుంది. యుద్ధసమయంలో పోరాట విమానాల మధ్య మరింత మెరుగైన సమన్వయానికి సాయపడుతుంది. నిర్దిష్ట విమానం శత్రువుదా.. మన దేశానిదా అన్నది గుర్తించడంలో తోడ్పాటు అందిస్తుంది.  జీశాట్‌-7ఏ ఉపగ్రహం డ్రోన్‌ కార్యకలాపాలకు మరింత ఊతమివ్వనుంది. ప్రస్తుతమున్న భూతల కేంద్రాల ద్వారా కాకుండా అంతరిక్షం నుంచి వీటిని నియంత్రించవచ్చు. ఫలితంగా వీటి పరిధి, సామర్థ్యం పెరుగుతుంది. అమెరికా నుంచి సాయుధ ప్రిడేటర్‌-బి.. సీ గార్డియన్‌ డ్రోన్లను భారత్‌ కొనుగోలు చేయనున్న నేపథ్యంలో.. దీనికి ప్రాముఖ్యం ఏర్పడింది. సుదూరం నుంచే శత్రు లక్ష్యాలపై క్షిపణులను ఈ డ్రోన్లు ప్రయోగించగలవు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లపై దాడికి అమెరికా ఈ డ్రోన్లను ఉపయోగించింది. ఉపగ్రహాల సాయంతో 12వేల కిలోమీటర్ల దూరంలో నెవాడా నుంచే వీటిని నియంత్రించేవారు. ఆ తరహా సామర్థ్యం ఇప్పుడు భారత్‌కు లభిస్తుంది. మరికొన్నేళ్లలో జీశాట్‌–7సీ ఉపగ్రహాన్ని ప్రయోగించి నెట్‌వర్క్‌ ఆపరేషన్లను బలోపేతం చేయడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇక మొన్నటికి మొన్న పరీక్షించిన ఏ-శాట్ మిసైల్ కూడా రక్షణ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేదే. ‘మిషన్ శక్తి’ పేరుతో మార్చి 27న భారత్ చేపట్టిన ఏ-శాట్ ప్రయోగం విజయవంతమైంది. డీఆర్డీవో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ యాంటీ శాటిలైట్ వెపన్ ను విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలో 300 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాన్ని ఏ-శాట్ తో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా కూల్చివేశారు. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో.. ఎంతో టెక్నిక్ తో మన శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ ఆపరేషన్ ను కేవలం మూడు నిమిషాల్లో కంప్లీట్ చేసి సత్తా చాటారు. ఏదైనా లొకేష‌న్ల‌పై శత్రుదేశాల శాటిలైట్ నిఘా పెడితే.. దాన్ని యాంటీ శాటిలైట్‌ మిసైల్ తో పేల్చేస్తారు. ఇప్పటివరకు ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే వుంది. తాజా ఏ-శాట్ ప్రయోగం ద్వారా ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఏ-శాట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన భారత్.. లోయ‌ర్ ఆర్బిట్‌లో ఏదైనా ఉప‌గ్ర‌హం సంచ‌రిస్తే, దాన్ని కేవలం మూడు నిమిషాల్లో పేల్చివేయగల శక్తిని సముపార్జించుకుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్ అంతరిక్షంలో సూపర్ పవర్ గా అవతరించింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ స్పేస్ సెంటర్ గా ఎదిగింది. మిష‌న్ శ‌క్తి ఆపరేషన్ విజయవంతం కావడంతో డీఆర్‌డీవో లోని ప్రతి శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్రధాని మోదీ కృత‌జ్క్షత‌లు తెలిపారు. ఈ చర్యతో మన శాస్త్రవేత్తలు దేశ‌ గౌర‌వాన్ని పెంచారని.. వారి ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని కొనియాడారు. అంత‌రిక్షం ఇప్ప‌డో జీవ‌న‌శైలిగా మారింద‌న్న మోదీ.. యాంటీ శాటిలైట్ దేశానికి కొత్త బ‌లాన్ని ఇస్తుంద‌ని తెలిపారు. విశ్వ‌దేశాల‌కు ఈ విష‌యాన్ని చెప్పాల‌ని ఉంద‌న్నారు. ఆధునిక టెక్నాల‌జీని దేశ ప్ర‌జ‌ల రక్షణ కోసం వాడ‌నున్న‌ట్లు ఆయ‌న స్పష్టం చేశారు. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి అన్న ప్రధాని మోదీ. అయితే ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రయోగం కాదని.. కేవలం మన దేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడం కోసం చేసింది మాత్రమేనని స్పష్టం చేశారు. అంతరిక్షంలో శాటిలైట్‌ను పడగొట్టడం అనేది అత్యంత అరుదైన విజయమని తెలిపారు. అంతరిక్ష నియమాలను అనుసరించే మిష‌న్ శ‌క్తి.. ఆపరేషన్ పూర్తిచేశామని అన్నారు ప్రధాని మోదీ. ఈ చర్య ద్వారా సుర‌క్షిత‌మైన‌, స‌మృద్ధిమైన‌, శాంతిపూర్వ‌క దేశాన్ని నిర్మిస్తామ‌న్నారు. భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌ను అందుకునేందుకు ఆధునిక టెక్నాల‌జీని ఆహ్వానించాల్సిన అవ‌స‌రం ఉందన్న ఆయన.. అంత‌రిక్ష శ‌క్తిగా భార‌త్‌కు గుర్తింపు ఉంద‌ని, అమెరికా, ర‌ష్యా, చైనా స‌ర‌స‌న ఇప్పుడు మనం కూడా నిలిచామని అన్నారు. ఇది ప్ర‌తి భార‌తీయుడికి గర్వకారణమని తెలిపారు. శాటిలైట్‌ను పేల్చివేయడంలో విజయం సాధించిన భారత్ శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భారతపై నిఘా పెట్టే ఇతర దేశాల శాటిలైట్లను కూల్చడంతో పాటు వారి కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది ధ్వంసం చేయనుంది. మొన్న జీశాట్-7ఏ, నిన్న ఏ-శాట్, తాజాగా ఇమిశాట్.. ఇలా రక్షణ అవసరాలకోసం అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేసింది భారత్. సరిహద్దు దేశాలతో రోజురోజుకూ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా అధునాత నిఘా ఉపగ్రహాలను తయారు చేస్తూ శత్రుదేశాలు సవాలు విసురుతోంది.

- ఎస్. కె. చారి