Thursday, September 19, 2019
Follow Us on :

వందేళ్ల గాయం..

By BhaaratToday | Published On Apr 13th, 2019

స్వరాజ్య కాంక్షపై తుపాకీ గుళ్లు. తెల్లోడి రక్తదాహానికి వందేళ్లు. జలియన్ వాలాబాగ్ లో ‘డయ్యర్’ మృత్యు పాచిక. భారతజాతి గుండెలపై చెదరిపోని నెత్తుటి మరక. ఏళ్లు గడిచినా మరుపురాని చేదు జ్ఞాపకం. క్షమాపణకు సైతం నోరురాని బ్రిటిష్ దురహంకారం. వందేళ్ల గాయం.. 

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన చర్య జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. బ్రిటిష్ వలస పాలకు నిరంకుషత్వానికి, కర్కషత్వానికి బలమైన ఉదాహరణ. స్వరాజ్యం కోసం గొంతెత్తిన  వందలాది అమాయకులను బలిసుకుంది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. ఆ ఘటన జరిగి వందేళ్లు పూర్తయింది. జనరల్ డయ్యర్, మైఖేల్-ఒ-డయ్యర్ ల రాక్షసత్వానికి వందల మంది బలైన దుర్మార్గపు ఘటన అది.  జలియన్ వాలాబాగ్ దుర్మార్గంపై.. ఇన్నేళ్లలో బ్రిటిష్ సర్కార్ ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు.  ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా నరరూప రాక్షసులిద్దరినీ వెనకేసుకొచ్చింది. దారుణ ఉదంతం జరిగి వందేళ్లు పూర్తయినా.. బ్రిటిష్ వైఖరిలో మార్పు లేదు. ఓ బాధాకరమైన ఘటన అంటూ మొసలి కన్నీరు కార్చడం తప్ప.. ఏనాడూ క్షమాపణ కోరిన పాపాన పోలేదు. తరాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా కొన్ని దురంతాలకు సంబంధించిన జ్ఞాపకాలు చెదిరిపోవు. అవి పదే పదే గర్తుకొస్తూ.. ఆగ్రహాగ్నిని రగిలిస్తూనే ఉంటాయి. ప్రపంచ చరిత్రలోనే ఒక నెత్తుటి అధ్యాయంగా మిగిలిపోయిన జలియన్ వాలా బాగ్ దుర్ఘటన కూడా అలాంటిదే. వందేళ్ల నాటి నెత్తుటి గాయాన్ని గుర్తుచేసుకుని భరతజాతి కన్నీటి పర్యంతమైంది. స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించింది.

1919 ఏప్రిల్ 13.. భరతజాతి చరిత్రలో ఓ చీకటి రోజు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం గొంతెత్తిన ప్రజలపై తుపాకీ గుళ్లు వర్షించిన రోజు. రక్తపిపాసి జనరల్ డయ్యర్ దురహంకారం పడగ విప్పిన రోజు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అత్యంత చీకటి ఘట్టం జలియన్ వాలా బాగ్ దురంతం. ఆ ఘటన జరిగి వందేళ్లు పూర్తయింది. జనరల్ డయ్యర్, మైఖేల్ ఒ డయ్యర్ ల రాక్షసత్వానికి వందల మంది బలైన దుర్మార్గపు ఘటన అది.  1919లో బ్రిటీష్ ప్రభుత్వం రౌలత్ చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా, కోర్టు తీర్పు చెప్పకుండా ప్రభుత్వం నిర్బంధించొచ్చు. దీంతో జాతీయవాదులు రౌలత్ సత్యాగ్రహం చేపట్టారు. ఎక్కడ చూసిన సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, హర్తాళ్లు. ఆందోళనను అణచాలని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేసింది. పంజాబ్ లో ముఖ్య నాయకులు సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ లను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లింది. దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్ సర్ ప్రజలు 1919 ఏప్రిల్ 13 వైశాఖీ పండుగ రోజున జలియన్ వాలాబాగ్ లో సభ నిర్వహించారు. వేలాదిగా పిల్లాపాపలు, ముసలివాళ్లు, మహిళలు కుటుంబ సమేతంగా బాగ్ కు వెళ్లారు. ఆరున్నర ఎకరాల స్థలంలో ఉన్న జలియన్ వాలాబాగ్ లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా ఒకటే దారి. సాయంత్రం నాలుగున్నరకు సభ ఉన్నట్టు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ కు తెలిసింది.  దీంతో  మైఖేల్ ఆదేశాలతో.. బాగ్ కు వెళ్లిన బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కాల్పులు జరిపించాడు. డయ్యర్ ఆదేశాలతో ఎటువంటి హెచ్చరికలు లేకుండానే బ్రిటిష్ సైన్యం కాల్పులకు తెగబడింది. మధ్యలో కొందరు సైనికులు గాలిలోకి కాల్పులు జరిపితే.. ‘గాల్లోకి కాల్పులు జరిపి తూటాలు వృథా చేయవద్దు. గురి చూసి గుండెలపై కాల్చండి. పడినవారు తిరిగి లేవకూడదంటూ రక్తపిపాసి జనరల్ డయ్యర్‌ ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన 50 మంది సైనికులు ఏకధాటిగా పదినిమిషాల పాటు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. చివరకు తూటాలు అయిపోవడంతో కాల్పులు ముగిశాయి. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించడంతో అమాయక సామాన్య ప్రజలు అసువులుబాశారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ, ఈ ఘటనలో 1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు సైతం ఉన్నారు. ఈ హఠత్పారిణామానికి నిశ్చేష్ఠులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో.. నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఈ బ్రిటీష్ తూటాలకు బలైపోవడం ఇష్టంలేక.. కొందరు పార్కులోని బావిలో దూకేశారు. ఘటన అనంతరం బావిలోంచి దాదాపు 120 మృతదేహాలు వెలికితీశారు. ఇందులో మహిళలు, పసికందులు, వృద్ధులు ఉన్నారు. జలియన్‌ వాలా బాగ్‌ లో నరసంహారం తర్వాత డయ్యర్ ఆరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు తన క్యాంప్‌ చేరుకున్నాడు. మొత్తం పట్టణానికి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. రాత్రి పది గంటలకు పట్టణంలో మరోసారి పర్యటించాడు. అది కూడా, ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదన్న తన ఆదేశాలను జనాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకే రాత్రివేళ పర్యటించాడు. తమ వారు అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక సతమతమవుతున్న జనాలను.. సాయం అందించేందుకైనా ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లకుండా నిలువరించి తన కర్కషత్వాన్ని చాటుకున్నాడు జనరల్ డయ్యర్. దేశ చరిత్రలో ఇదో ఘోరమైన నరమేధం. బ్రిటిషువారి అహంకార, దుర్మార్గ వైఖరికి జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం అద్దంపడుతుంది. ఈ ఘటన తర్వాత.. బక్కప్రాణులపై ఇంతటి బలప్రయోగమేంటని దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఈ ఘటనపై నిర్ఘాంతపోయారు. తనకు బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించిన నైట్‌హుడ్‌ బిరుదును తిరస్కరించారు. జలియన్ వాలా భాగ్ నరమేధంతో ప్రతి భారతీయుడి రక్తం ఉడికిపోయింది. గదర్ పార్టీ వ్యవస్థాపకులు బాబా సోహన్ సింగ్ భాక్నా అనుయాయుడైన ఉధమ్ సింగ్ ఆవేశంతో రగిలిపోయాడు. భారత స్వాతంత్రాభిలాషను అంతర్జాతీయంగా వ్యాప్తి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ పర్యటించాడు ఉధమ్ సింగ్. తన ప్రయత్నంలో చాలావరకు సఫలమయ్యాడు. ఎన్నో కష్టాలకోర్చి ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మీదుగా చివరకు 1934లో ఇంగ్లాండ్ చేరుకున్నాడు. ఈ క్రమంలో జలియన్ వాలా బాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవటానికి ఎన్ని అవకాశాలు వచ్చినా.. తన చర్య ప్రపంచం మొత్తానికి తెలియజేయగలిగే సమయం కోసం ఉధమ్ సింగ్ ఎదురుచూశాడు.  చివరికి 1940 మార్చి 13న లండన్ లోని కాక్ స్టన్ హాల్ లో నరమేధానికి ప్రధాన కారకుడైన నాటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖెల్ ఓ డయ్యర్ ను హతమార్చాడు ఉధమ్ సింగ్. కాక్ స్టన్ హాల్ సమావేశానికి మైఖేల్ డయ్యర్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ఉధమ్ సింగ్.. ఓ పుస్తకంలో తుపాకీ పెట్టుకుని హాల్ లోపలికి వెళ్లాడు. సమావేశం ముగిసిన వెంటనే వేదికపై నుంచి దిగుతున్న డయ్యర్ పై రెండు రౌండ్లు కాల్పు జరిపాడు. దీంతో మైఖేల్ డయ్యర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు కారకులైన వారిని తుదముట్టించేందుకు.. తాను చేసిన ప్రతిజ్ఞను 21 సంవత్సరాల తరువాత నెరవేర్చుకున్నాడు ఉధమ్ సింగ్. డయ్యర్ హత్య తర్వాత ఉధమ్ సింగ్ ను అరెస్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం.. 1940 జూలై 31న ఉరితీసింది. ఉధమ్ సింగ్ అస్థికలను భారత్ పంపమని ఎన్ని విన్నపాలు వచ్చినా.. జైలు ఆవరణలో ఉధమ్ సింగ్ ను సమాధి చేసారు. 1974 లో సాధుసింగ్ థిండ్ అనే ఎమ్మెల్యే కృషితో సమాధి నుండి అస్థికలను వెలికితీసి భారత్ కు పంపించారు. భారత్ లో ఉధమ్ సింగ్ అస్థికలకు అపూర్వ స్వాగతం లభించింది. నేటికీ ఉధమ్ సింగ్ అస్థికలు జలియన్ వాలా బాగ్ లో భద్రపరచబడి ఉన్నాయి. ఇక భారతీయుల పై బ్రిటిష్ ప్రభుత్వం అంత్యంత పాశవికంగా జరిపిన కాల్పుల తర్వాత మరింత ఐకమత్యం పెల్లుబికింది. ఈ దారుణ ఉదంతం భారతీయుల స్వాతంత్ర్య కాంక్షను అణచలేకపోయింది. ఉద్యమం మరింత ఎగసింది. ఫలితంగా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది.

జలియన్ వాలా బాగ్ మారణకాండకు కారకులు ఇద్దరు డయ్యర్లు. ఒకరు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్. మరొకరు అమృత్ సర్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్. వీరిద్దరిని బ్రిటీష్ ప్రభుత్వం శిక్షించలేదు సరికదా సన్మానించింది. జలియన్‌ వాలాబాగ్‌ ఘటనపై బ్రిటిషు ప్రభుత్వం నియమించిన హంటర్‌ కమిషన్‌ ముందు హాజరైన అతన్ని సభ్యులు పలురకాలుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. ప్రధాన ద్వారం వద్దకు భారీ సైనిక వాహనాన్ని తీసుకువెళ్లారు కదా.. ఎందుకు లోపలికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. ప్రవేశమార్గం చిన్నది కావడంతో తీసుకెళ్లలేకపోయాయమని.. ఒక వేళ వెళ్లివుంటే మెషిన్‌ గన్‌తో కాల్చేవాళ్లమని.. దాంతో ఇంకా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అని డయ్యర్‌ చెప్పిన సమాధానం అతనిలో పరమ దుర్మార్గ వైఖరికి అద్దం పట్టింది. అయినా.. నరమేధంపై నాటి బ్రిటిష్ సర్కార్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు సరికదా.. వందలాది మందిని పొట్టనబెట్టుకున్న నరరూప రాక్షసులిద్దరినీ వెనకేసుకొచ్చింది. మైఖేల్ ఓ డయ్యర్ ను విధుల నుంచి తప్పించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని ఇంగ్లండ్ పంపి చేతులు దులుపుకుంది. ఇక ప్రత్యక్ష్యంగా నరమేధంలో పాల్గొన్న జనరల్ డయ్యర్ ను ప్రశంసలు, నగదు బహుమతులతో ఇంగ్లండ్ కు పంపించింది. అయితే, మైఖేల్ డయ్యర్ ను ఉధమ్ సింగ్ హతమార్చగా.. అనేక రోగాలతో దీర్ఘకాలం బాధపడిన జనరల్ డయ్యర్ 1927లో చనిపోయాడు. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగి వందేళ్లు పూర్తయినా.. బ్రిటిష్ వైఖరిలో మార్పు లేదు. నరమేధం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయడం తప్ప.. ఇప్పటికీ భారతీయులకు క్షమాపణలు చెప్పలేదు. 1997లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించిన సమయంలో.. రాణి ఎలిజబెత్‌-2 భారత్‌ తో తమ గత చరిత్రలో ఈ దురాగతం ఓ బాధాకరమైన ఉదాహరణ అని మాత్రమే పేర్కొన్నారు తప్ప.. ఏనాడు క్షమాపణ కోరలేదు. మొన్నటికి మొన్న బ్రిటిష్ ప్రధాని థెరీసా మే సైతం.. జలియన్ వాలాబాగ్ ఉదంతం ఓ మాయని మచ్చ అంటూ ముసలి కన్నీరు కార్చారు. 1919 లో జరిగిన ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బ్రిటన్ పార్లమెంట్ ప్రతిపక్ష నేత లేబర్ పార్టీ నాయకుడు జెరేమీ కార్బిన్ మాత్రం.. జలియన్ వాలాబాగ్ ఉదంతంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిన జలియన్‌ వాలా బాగ్ ఊచకోత జరిగి వందేళ్లయిన సందర్భంగా, ఈ ఘోర కృత్యానికి బ్రిటన్ క్షమాపణ చెప్పాలన్న వాదన మరోసారి ముందుకువచ్చింది. దీంతో బ్రిటిష్ ప్రధాని థెరీసా మే మొక్కుబడిగా విచారం వ్యక్తం చేయడంపై జలియన్ వాలాబాగ్ సెంటినరీ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక జలియన్‌ వాలాబాగ్ నరమేథంపై బ్రిటన్ క్షమాపణ చెప్పాల్సిందేనని, కేవలం విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, ఆ ఘాతుకంలో మరణించినవారి వారసులు డిమాండ్ చేస్తున్నారు. తరాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా కొన్ని దురంతాలకు సంబంధించిన జ్ఞాపకాలు చెదిరిపోవు. అవి పదే పదే స్ఫురణకొస్తూనే ఉంటాయి. ఆగ్రహాగ్నిని రగిలిస్తూనే ఉంటాయి. ప్రపంచ చరిత్రలోనే ఒక నెత్తుటి అధ్యాయంగా మిగిలిపోయిన జలివాలాబాగ్‌ దురంతం అటువంటిదే. ఆ దుర్మార్గం ఆ ఒక్క రోజుతోనే ఆగిపోలేదు. మరో మూడు నాలుగు రోజులపాటు సాగింది. అమృత్‌సర్, ఆ చట్టుపట్ల ప్రాంతాల్లో మార్షల్‌ లా విధించి, పౌరులను అత్యంత అమానుషంగా హింసించారు. మండుటెండలో రోడ్లపై పౌరులను దొర్లిస్తూ వారిని కొరడాలతో కొట్టారు.  ఇంత చరిత్ర ఉన్న ఈ అమానుషత్వంపై క్షమాపణ చెప్పడానికి బ్రిటన్‌ ప్రభుత్వానికి నోరు పెగలడం లేదు. అది సిగ్గుమాలిన చర్య, ఒక విషాదకరమైన ఘటన అని మాత్రం బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే అంటున్నారు. జలియన్‌ వాలాబాగ్‌ దురంతానికి కేవలం డయ్యర్‌ అనే సైనికాధికారి తప్పిదం మాత్రమే కారణం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో తెల్లజాతి కొనసాగించిన రాక్షస పాలనలో భాగం. దశాబ్దాలు గడిచిపోయినప్పుడూ, తరాలు మారిపోయినప్పుడూ ఇలా క్షమాపణలు చెప్పమని అడగటం ఏమంత న్యాయమని ఎవరికైనా అనిపించవచ్చు. దానివల్ల చరిత్రలో భాగమైపోయిన తప్పును ఎలా సరిదిద్దగలమన్న సందేహం కలగొచ్చు. నిజానికి క్షమాపణ అనేది అడిగితే చెప్పేది కాదు. అది లోలోపలి నుంచి పెల్లుబికి రావాలి. అందులో పశ్చాత్తాపం ఉండాలి. వ్యక్తులకైనా, దేశాలకైనా ఇది నాగరిక లక్షణం. బాధితులకు, వారి వారసులకు అలాంటి క్షమాపణ ఓదార్పునిస్తుంది. సాంత్వన కలిగిస్తుంది.

బ్రిటిష్ ప్రభుత్వపు హేయ‌మైన చర్యకు వందేళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో అమృత్‌ స‌ర్‌ లోని జ‌లియ‌న్ వాలా బాగ్ గత చరిత్రను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమైంది. స్మార‌కం స్థూపం వ‌ద్ద నివాళ్లు అర్పించడానికి నేతలు, ప్రజలు క్యూ కట్టారు.  రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా జలియన్‌ వాలా బాగ్ అమరవీరులకు నివాళి అర్పించారు. వందేళ్ల క్రితం ఇదే రోజున స్వాతంత్య్ర సమరయోధులు అమరులయ్యారని, అదో క్రూరమైన ఊచకోత అని, నాగరికతపై ఓ మచ్చ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ ట్విట్ చేశారు. దేశ విముక్తికోసం అమరులు చేసిన త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మరువబోదని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినవారి సాహాసాన్ని, త్యాగాన్ని మరిచిపోలేమన్నారు ప్రధాని మోదీ. వారి జ్ఞాపకాలు నవ భారత నిర్మాణం కోసం మరింత కష్టపడేలా చేస్తున్నాయన్నాయని తెలిపారు. జలియన్ వాలాబాగ్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రతి భారతీయుడు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. జలియన్ వాలా బాగ్ అమరవీరులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. అమృత్‌ సర్‌ లోని జలియన్‌ వాలాబాగ్ అమర వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. బ్రిటన్ హైకమిషనర్ సర్ డొమినిక్ అస్కిత్ జలియన్ వాలాబాగ్ అమరవీరులకు నివాళి అర్పించారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. చరిత్రను మార్చలేమన్న డొమినిక్ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఉత్తమం అన్నారు. నేతలు, అధికారులే కాదు, సామాన్య ప్రజలు సైతం జలియన్ వాలాబాగ్ స్థూపాన్ని సందర్శించిన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. బ్రిటిష్ దుర్మార్గపు చర్యను తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తెల్లవాడి హేయమైన చర్యకు గుర్తుగా వున్న ఆ స్మారక స్థూపం దశాబ్దాలుగా రోదిస్తూనేవుంది. 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరణ జరిగింది. ఆ నాటి నుంచి జలియన్ వాలాబాగ్ స్థూపం వద్ద నిరంతరాయంగా మండుతున్న అఖండ జ్వాల నాటి బ్రిటిష్ దురాగతాన్ని గుర్తుచేస్తూనేవుంటుంది. ప్రక్కనే వున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను నెత్తుటి మరకల్ని జ్ఞాపకం చేస్తూనేవుంటుంది. బులెట్లల నుంచి తప్పించుకోవడానికి బాధితులు దూకిన బావి నాటి గాయాన్ని రేపుతూనేవుంటుంది.

- ఎస్. కె. చారి