Thursday, October 17, 2019
Follow Us on :

మిషన్ కశ్మీర్..!..

By BhaaratToday | Published On Jun 6th, 2019

కశ్మీర్ పై పునర్విభజన అస్త్రం. మారనున్న లోయ ముఖచిత్రం. ఉగ్రవేటకు సరికొత్త వ్యూహం. ఏరివేతకు సర్వం సిద్ధం. మొదలైన షా ఆపరేషన్. వేర్పాటువాదులకు పరేషాన్. మిషన్ కశ్మీర్..!.. 

లోయలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నాలను ముమ్మరం కేంద్రం. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టిన మోదీ ప్రభుత్వం.. రెండోసారి అధికారంలోకి రాగానే కార్యచరణ ముమ్మరం చేసింది. అపర చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షాకు హోంశాఖ పగ్గాలు అప్పగించడం ద్వారా.. ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తామనే సంకేతాలిచ్చింది. అటు అమిత్ షా కూడా రంగంలోకి దిగారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో కశ్మీర్ వేర్పాటు వాదం ఒకటి. కశ్మీర్ బయట వున్న మనమంతా కేవలం పాకిస్తాన్ నే శత్రువుగా చూస్తాం. వాళ్లు మన ఆర్మీపై కాల్పులు జరిపితే ఆవేశపడతాం. లేదంటే ఏ క్రికెట్ మ్యాచ్ టైంలోనో దేశభక్తితో రగిలిపోతాం. కానీ, కశ్మీర్ సమస్యకు మరో కోణం వుంది. అదే ఇంటి దొంగల కోణం. అందుకే పాక్ నుంచి లోయలోకి వలస వస్తున్న ఉగ్రవాదులను అంతమొందిస్తూనే.. ఇంటి దొంగల పని పడుతోంది మోదీ సర్కార్. జమ్మూకశ్మీర్ లో సైన్యం సరికొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకు దూసుకుపోతోంది..! టెర్రరిస్టులే టార్గెట్ గా ఆపరేషన్ ఆల్ అవుట్ ఆయుధంతో ఉగ్రవాదులను మట్టుబెడుతోంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రూపొందించిన ఈ ఆపరేషన్ కు ఉగ్రమూకలు చిత్తవుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో సాగిన ఆపరేషన్ ఆలౌట్ ప్రోగ్రాం.. ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో మరింత వేగంగా ముందుకుసాగుతోంది.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆపరేషన్ కశ్మీర్ కు శ్రీకారం చుట్టిన మోదీ సర్కార్.. ఇప్పటికే వేల  సంఖ్యలో ముష్కరలను ఏరివేసింది. కొందరు కరుడుగట్టిన ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టింది. అంతేకాదు, పాత నోట్ల రద్దు ద్వారా.. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అందుతున్న నిధులకు కళ్లెం వేసింది. మొత్తానికి, ఉగ్ర రక్కసిపై పైచేయి సాధించింది. ఇక ఉరి, పుల్వామా ఘటనల విషయంలోనూ తీవ్రంగా స్పందించిందిన మోదీ ప్రభుత్వం.. పీవోకేతో పాటు.. పాక్ సరిహద్దుల్లోని ఉగ్రశిబిరాలపై వ్యూహాత్మక దాడులు చేసి ముష్కరుల పీచమణిచింది. ఇక రెండోసారి పగ్గాలు చేపట్టగానే లోయలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అపరచాణక్యుడిగా పేరుగాంచిన.. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కు.. వ్యూహాత్మకంగానే హోంశాఖ పగ్గాలు అప్పగించింది. ఇక అమిత్ షా నేతృత్వంలో కేంద్ర హోంశాఖ అప్పుడే దూకుడు చూపించింది. తాజాగా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణపై కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాదులు షబ్బీర్‌షా, ఆసియా అంద్రబి, మసారత్ ఆలంభట్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఆ ముగ్గురికి ఢిల్లీ కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్‌సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు కశ్మీర్ లోయ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రత్యేక జడ్జి రాకేశ్ సయాల్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సమయంలోనే ఆ ముగ్గురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసిందని నిందితుల తరఫు న్యాయవాది వెల్లడించారు. షబ్బీర్ షా, ఆసియా అంద్రబి వేర్వేరు కేసుల్లో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్నారు. కాగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడన్న ఆరోపణపై అరెస్టయిన మసారత్ ఆలంను బదిలీ రిమాండ్‌పై జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీకి తరలించారు. మరోవైపు కేంద్రం హోంశాఖ టాప్ టెన్ ఉగ్రవాదుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ రియాజ్ నైకూ, లష్కరే తొయిబా జిల్లా కమాండర్ వసీం అహ్మద్ అలియాస్ ఒసామా, హిజ్బుల్ సంస్థకు చెందిన అష్రాఫ్ మౌల్వీల పేర్లను చేర్చింది. కేంద్ర బలగాలు ఇచ్చిన సమాచారంతో ఈ జాబితా తయారు చేసింది కేంద్ర హోంశాఖ. జమ్ము కశ్మీర్‌లోని పలు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ సంస్థలకు చెందిన వాంటెడ్ టెరరిస్టుల పేర్లను జాబితాలో చేర్చింది. అంతేకాదు, బారాముల్లాలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన డిస్ట్రిక్ట్ కమాండర్ మెహ్రాజుద్దీన్, శ్రీనగర్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ సైఫుల్లా, పుల్వామా జిల్లా కమాండర్‌గా పనిచేస్తున్న అర్షద్ ఉల్ హక్, జైషే మహ్మద్‌కు చెందిన ఆపరేషనల్ కమాండర్ హఫీజ్ ఒమర్ తో పాటు.. అదే సంస్థకు చెందిన జహీద్ షేక్, అల్ బదర్ సంస్థకు చెందిన జావేద్ మటూ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కుప్వారా డిస్ట్రిక్ట్ కమాండర్ ఇజాజ్ అహ్మద్ మాలిక్ పేర్లను జాబితాలో చేర్చింది. ఇకఇప్పటి వరకు 102 మంది మిలిటెంట్లను కశ్మీర్‌లోయలో మట్టుబెట్టినట్లు చెప్పిన హోంశాఖ, ఇంకా 286 మంది క్రియాశీలకంగా ఉన్నారని వెల్లడించింది. అటు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమిత్ షాను జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు. 15 నిమిషాల పాటు సమావేశమైన గవర్నర్ సత్యపాల్ మాలిక్.. అమరనాథ్ యాత్ర పట్ల ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో వివరించారు. జూలై 1 నుంచి 46 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర ఉంటుంది. మాసిక్ శివరాత్రి రోజున ప్రారంభమై ఆగష్టు 15 శ్రావణ పూర్ణిమ సందర్భంగా ముగియనుంది. ఇక జమ్ముకశ్మీర్‌లోని శాంతిభద్రతలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.  ఓవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూనే.. కశ్మీర్ లోయలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది మోదీ సర్కార్. ఇందులో భాగంగా.. జమ్మూ ప్రాంతానికి చెందిన శాసనకర్తలకు.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వవస్థీకరణ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా అడుగులు వేస్తున్నారు. దీనిపై చర్చించేందకు మంగళవారం కేద్రం హోం శాఖ ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్ జరిపింది. అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, హోం కార్యదర్శి రాజీవ్ గవుబా, రా చీఫ్ తదితరులు పాల్గొన్నారు. జమ్ము కశ్మీర్ లో నియోజకవర్గాల్ని పునర్విభజించి, హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం పెంచాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం త్వరలోనే ఓ డీలిమిటేషన్‌ కమిషన్‌ వేయనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడమే కాక అనేక స్థానాలను రిజర్వుడు సీట్లుగా చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే జమ్ము కశ్మీర్ లో హిందువుల అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. దీంతో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి శ్రీఘ్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంటుంది. ప్రధానంగా మూడు ప్రాంతాలున్న జమ్మూకశ్మీర్‌లో విస్తీర్ణ పరంగా జమ్మూ పెద్దది. జమ్మూ విస్తీర్ణం 25.93 శాతం కాగా కశ్మీర్‌ విస్తీర్ణం 15.73 శాతం. లడక్ ప్రాంతం 58.33 శాతం ఉన్నా అదంతా హిమాలయాలు, కనుమలతో నిండి ఉండే ప్రాంతం. జమ్మూ, లడక్ లలో బీజేపీకి పూర్తి పట్టుంది. కశ్మీర్‌ అంతా లోయలో ఉంటుంది, ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో కశ్మీరీ పార్టీలదే ఆధిపత్యం. వేర్పాటువాదం, పాక్‌-అనుకూలత కూడా ఇక్కడ చాలా ఎక్కువ. కశ్మీర్‌ అసెంబ్లీ 1939లోనే ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి షేక్‌ అబ్దుల్లా ఏకపక్షంగా కశ్మీర్‌ అసెంబ్లీలో నియోజకవర్గాల ఏర్పాటును చేశారు. జమ్మూకు 37, కశ్మీర్‌ కు 46 మందిని కేటాయించారు. లడక్ నుంచి ఇద్దరు ఉంటారని ఆయనే తీర్మానించేశారు. లడక్ నుంచి మాత్రం మరో రెండు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 87కు చేరింది. చివరిసారిగా డీలిమిటేషన్‌ 1995లో కేకే గుప్తా కమిషన్‌ చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం ప్రతీ పదేళ్లకోసారి పునర్విభజన చేయవచ్చు. కానీ 2002లో అప్పటి ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా ఈ పునర్విభజన 2026దాకా చేపట్టాల్సిన పనిలేకుండా ప్రక్రియను స్తంభింపజేశారు. ఈ మేరకు కశ్మీర్‌ రాజ్యాంగంలోని సెక్షన్‌ 47 (3)ని, 1957 నాటి కశ్మీర్‌ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయించారు. 2026 తరువాత చేపట్టే తొలి జనాభా లెక్కలు అందేదాకా పునర్విభజన చేపట్టనవసరం లేదని ఆ బిల్లులో స్పష్టం చేశారు. కానీ, అసెంబ్లీ రద్దై గవర్నర్‌ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ - అసెంబ్లీ చేసిన నిర్ణయాలను తిరగతోడడానికి రాష్ట్ర రాజ్యాంగం వీలు కల్పిస్తుంది. దీనిని ఉపయోగించే 1993లో నాటి గవర్నర్‌ జగ్మోహన్‌.. పునర్విభజన ప్రక్రియ చేపట్టి సీట్ల సంఖ్యను 87కు పెంచారు. ఇపుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. ఫరూఖ్‌ అబ్దుల్లా సర్కార్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేయించే దిశగా పావులు కదుపుతోంది.  జమ్మూలో 11 శాతం ఉన్న గుజ్జర్లు, బకేర్వాల్‌లు, గడ్డీలకు షెడ్యూల్‌ తెగల హోదా ఇచ్చారు తప్ప రాజకీయ ప్రాతినిధ్యం కల్పించలేదు. జమ్మూలో 12.4శాతం దాకా ఎస్సీలున్నారు. రాష్ట్రంలోని 7 రిజర్వుడు నియోజకవర్గాలు రొటేషన్‌ మీద కొనసాగుతాయి.. సిప్పీలు, గుజ్జర్లతో పాటు ఉన్న కొన్ని ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించడం ఇపుడు మరో కీలకాంశం. ఇవన్నీ గవర్నర్‌ పాలనలోనే చేపట్టేయాలని అమిత్‌ షా యోచిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. హిందూ ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో ఇన్నాళ్లూ కశ్మీర్ ను భారతీయ జనజీవన స్రవంతిలో కలవకుండా అడ్డుకుంటున్న.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఎ వంటి కీలక అధికరణలను తొలగించేందుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, కశ్మర్ లో ఇకపై భారత ప్రభత్వం చేసే ఏ చట్టాలైనా.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేకుండానే నేరుగా అమలు చేయవచ్చు. తద్వారా లోయలో పెచ్చరిల్లుతున్న ఉగ్రరక్కసితో పాటు.. వేర్పాటువాద భావజాలాన్ని పూర్తిగా అంతమొందించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లు చూసి దేశప్రజలు అందరూ నిట్టూర్పులు విడుస్తుంటారు. అక్కడ మళ్ళీ ఎప్పటికైనా శాంతి నెలకొంటుందా..? దివిపై వెలసిన స్వర్గం వంటి కాశ్మీరులో ఎప్పటికైనా మళ్ళీ కాలు పెట్టగలమా..? అని బాధ పడుతుంటారు. కశ్మీర్ లో ఈ పరిస్థితి ఏర్పడటానికి ఒక్కటి కాదు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. పాక్ కుట్రలు. రెండు.. వేర్పాటువాదం. మూడు.. వేర్పాటువాదుల ప్రాపకం కోసం అర్రులు చాచే రాజకీయ నేతలు. నాలుగు.. జమ్మూ కశ్మీర్ ప్రజలలో జాతీయ భావం పెంపొందించడంలో పాలకుల నిర్లక్ష్యం. ఇవే కాకుండా ఉగ్రవాదుల దాడులు. ఆ కారణంగా నిత్యం సైనికుల మధ్యనే జీవితం గడపవలసిరావడం చేత ప్రజలలో అభద్రతా భావం, ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోవడం. ఇలాగా చెప్పుకొంటూపోతే చాలా కారణాలే కనబడతాయి. అయితే ఈ సమస్యలకి మూల కారణాలు రెండే కనిపిస్తున్నాయి. ఒకటి.. పాక్ కుట్రలు. రెండు.. వేర్పాటువాదం. ఈ రెంటి నుంచే మిగిలినవన్నీ పుట్టుకొచ్చాయి. కనుక ఆ రెండు సమస్యలని పరిష్కరించనంత కాలం కశ్మీర్ సమస్యని శాశ్వతంగా పరిష్కరించడం అసాధ్యమేనని చెప్పక తప్పదు. సరిహద్దుల వద్ద గస్తీ పెంచుకునో... లేకపోతే చైనాలాగా గోడ కట్టేసుకునో పాకిస్తాన్ ను అడ్డుకోవచ్చు. కానీ ఇంటి దొంగలని ఈశ్వరుడైన పట్టుకోలేడన్నట్లుగా కశ్మీర్ లో తిష్టవేసుకొన్న వేర్పాటువాదులని నియంత్రించనంత వరకు వారు పాక్ సహకారంతో కశ్మీర్ లో చిచ్చుపెడుతూనే ఉంటారు. 2106లో భారత్ ఆర్మీ ఒక ఉగ్రవాదిని కశ్మీర్ లో హతం చేసింది. ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని అంతమయ్యాడు. ఇక అక్కడి నుంచి కశ్మీర్ కాలిపోతూనేవుంది. వందలు, వేల సంఖ్యలో నిరసనకారులు రోడ్లపై వచ్చి ఆర్మీపై రాళ్లు రువ్వటం, పోలీస్ స్టేషన్లపై దాడి చేయటం రొటీన్ అయిపోయింది. ఆత్మ రక్షణ కోసం ఆర్మీ, పోలీసులు కూడా పెల్లెట్ గన్నుల్లాంటివి ఉపయోగించటంతో చాలా మంది గాయపడ్డారు.  కొన్ని మీడియా సంస్థల లెక్కల ప్రకారం పది వేల మంది గాయాల పాలయ్యారు. 71 మంది వరకు చనిపోయారు. ఒక ఉగ్రవాదిని హతం చేస్తే ఇంతలా నిరసనలు ఎందుకు..? ఈ ప్రశ్నకి సమాధానంగానే కశ్మీర్ లోని ఇంటి దొంగలు బయటపడతారు. వాళ్లకు సాయం చేస్తున్న సో కాల్డ్ లిబరల్స్ కూడా కలుగుల్లోంచి బయటకొస్తారు. కేంద్రంలో బీజేపీ వున్నా, కాంగ్రెస్ వున్నా కశ్మీర్ ని కాశ్మోరా పిశాచాల్లా పీక్కుతినే కొన్ని వర్గాలు జమ్మూ, కశ్మీర్లోనే తిష్ట వేశాయి. వాళ్లని టోకుగా చెప్పుకుంటే వేర్పాటువాదులు అనొచ్చు. హురియత్ పేరుతో స్థానిక అమాయక, ఆవేశపూరిత యువతని కాశ్మీరియత్ రొంపిలోకి దించుతున్నారు. మామూలు టైంలో జమ్మూ కశ్మీర్ ప్రజలకు తిండి, గుడ్డ, గూడు అన్నీ భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే నడుస్తాయి. ఇక వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు అయితే నూటా ఇరవై కోట్ల మంది భారతీయులు కట్టిన ట్యాక్స్ లతోనే కశ్మీర్లో సహయక చర్యలు సాగుతాయి. అలాంటి అవసరమైన సందర్బంలో ఈ వేర్పాటువాదులు సిగ్గు లేకుండా ఇండియన్ ఆర్మీ సహకారం పొందుతారు. తరువాత మాత్రం అదును చూసి ఉగ్రవాదులకి, పాకిస్తాన్ కి మేలు జరిగేలా యూత్ ను రెచ్చగొడుతుంటారు. వేర్పాటువాదుల దుర్మార్గం ఒకవైపు అయితే అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే మేధావులు, కొన్ని మీడియా సంస్థల గోల మరోవైపు. వీళ్లు పైకి వేర్పాటువాదం సమర్థించినట్టు కనిపించకున్నా లోలోపల వాళ్లతో కలిసి మెలిసి తిరుగుతుంటారు. అసలు యాకుబ్ మెమన్, కసబ్ మొదలు బుర్హాన్ వని దాకా ఉగ్రవాదులందరి మీదా కొన్ని మీడియా సంస్థలకి ఎందుకంత ప్రేమ, గౌరవం అన్నది ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్న. జమ్మూ, కశ్మీర్లోని గొడవలకి, మన దేశంలోనే అడ్డూ అదుపు లేకుండా కథనాలు ప్రసారం చేసే కొంత శాతం మీడియా కారణమన్నది అనుమానమక్కర్లేని విషయం. ఇక వేర్పాటు వాదులు, కొన్నివర్గాల మీడియా పైత్యమే కాక ప్రతి పక్షం లో వుండే రాజకీయ నేతల స్వార్థం మరోవైపు. ఎవరు అపోజిషన్లో వున్నా ప్రజల తరుపున మాట్లాడుతున్నట్టు నటిస్తూ వేర్పాటువాదుల్ని బలపరుస్తారు. కశ్మీర్లో ఇంత ఘారం జరుగుతున్నా భారత్ సంతోషించాల్సిన విషయం ఒక్కటే. ఈ అల్లర్లు మొత్తం ఓ అయిదు శాతం అరాచకుల పనే. మిగతా 95 శాతం ఇండియాకి విదేయంగా వుండేవారు. కాబట్టి మోదీ ప్రభుత్వం అటు పాకిస్తాన్ ని పీఓకే విషయంలో, బలూచిస్తాన్ విషయంలో అంతర్జాతీయంగా కార్నర్ చేస్తూ.. ఇటు ఈ ఇంటి దొంగల ఆటకట్టించాలి. లేదంటే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే కశ్మీరు వేర్పాటువాదులతో కఠినంగా వ్యవహరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది. 2014లో అధికారంలోకి రాగానే.. వేర్పాటువాదులపై అణిచివేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అటు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో సాగిన ఆపరేషన్ ఆలౌట్ ద్వారా వందలాది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గత ఐదు నెలల్లోనే వందమంది తీవ్రవాదులు హతమయ్యారని తాజా భద్రతా దళాల అధికారులు తెలిపారు. అయితే పుల్వామ దాడిలో మృత్యువాత పడిన 40 మందితోపాటు మే 31 వరకు 52మంది జవాన్లు కూడ మిలిటెంట్ల దాడిలో మృతి చెందారని భద్రతా దళ అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఉగ్రవాదుల్లో చేరే వారు కూడ 50 మంది వరకు చేరారని వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లో తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం రోజుకోకరి చొప్పున ఏరి పడేస్తుంది. ఇక పుల్వామా దాడి తర్వాత అప్రమత్తమైన భద్రత దళాలు తీవ్రవాదులపై దాడీని తీవ్రతరం చేశాయి. ఈనేపథ్యంలో పుల్వామా దాడీ తర్వాత ఇప్పటి వరకు 100 మంది తీవ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. అందులో ఇరవై అయిదు మంది విదేశీ తీవ్రవాదులు కాగా మిగతా 75 మంది స్థానిక తీవ్రవాదులు ఉన్నట్టు భద్రత దళాలు చెప్పాయి.

పాక్ అండతో కశ్మీర్ లోయలో రక్తపాతం సృష్టిస్తోన్న ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై కదిలికలపై, నిధుల రాకపై మోదీ సర్కార్ మొదటిసారి అధికారంలోకి రాగానే పకడ్బంది నిఘా పెంచింది. ఉగ్రవాదల ఏరివేతకు జాతీయ రక్షణ సలహాదార దోవల్ తోపాటు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి.. సరికొత్త యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసింది. 2016లో బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో మొదలైన ఈ ఆపరేషన్.., సైలెంట్ గా సాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ ఆల్ అవుట్ లో రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ .."రా" గుర్తించిన.., అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను ఏరివేయడాన్నే సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాదులను లిస్ట్ అవుట్ చేసింది. వారిలో అత్యంత కరుడుగట్టిన 258 మందిని మొదట ఏరివేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగానే మొదట బుర్హాన్ వనీని ఖతం చేసినట్లు రక్షణ శాఖ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అంతేకాదు ఈ ఆపరేషన్ కు సైన్యం.. అత్యంత ఆధునిక పరిజ్ఞాన్ని వినియోగించుకుంటోంది. నిఘా వర్గాల సమాచారం, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక ఇన్ఫార్మర్ ల సాయం తీసుకుంటోంది. ఒక్కసారి ఆర్మీ రాడార్ చేతికి చిక్కిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తోంది. క్షణ క్షణానికి వారు ఏ ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారో.. వారి వద్ద ఉన్న ఆయుధాల వివరాలతోపాటు, ఉగ్రవాదులు ఉపయోగించే సాటిలైట్ మొబైల్ ఫోన్ల సంభాషణలు ట్రాప్ చేస్తున్నారు. కశ్మీర్ లోయలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న వందలాది తీవ్రవాదుల్లో ఎక్కువశాతం పాక్ ఆక్రమిత కశ్మీరు నుంచి దేశంలోకి చొరబడినవారే..! అలాగే కశ్మీర్ లో రక్తపాతం సృష్టిస్తున్న  సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సైన్యం... నిఘా వర్గాలు సమన్వయంతో షేర్ చేసుకుంటున్నాయి. గతంలో సేకరించిన వివరాలతో క్రోడికరించుకుంటున్నాయి. లోయలో లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, అల్ బదర్ లాంటి సంస్థలపై 24x7 నిఘా పెట్టింది. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో మొదలైన ఈ ఏరివేత ఆపరేషన్.. అప్రతిహతంగా సాగుతూనేవుంది. ఉగ్రదాడుల్లో వీరసైనికుల బలిదానం వృధా కానివ్వమంటున్న భారత సైన్యం.. చెప్పినట్లుగానే ఉగ్రవాదుల ఖేల్ ఖతం చేస్తోంది.

-ఎస్. కె. చారి