Thursday, September 19, 2019
Follow Us on :

అదిగదిగో అపు‘రూపం’..!..

By BhaaratToday | Published On Apr 12th, 2019

సైన్స్ చరిత్రలో మహాద్భతం. వెలుగుచూసిన నిగూఢ రహస్యం. టెలిస్కోప్ కంటికి చిక్కిన కృష్ణబిలం. మానవాళికి ఇదే తొలి పరిచయం. శాస్త్రవేత్తల ఊహలకు ‘చిత్ర’రూపం. ఇక, బ్లాక్ హోల్ పై పరిశోధనలకు ఊతం. అదిగదిగో అపు‘రూపం’..!..

ఒకటి, రెండు కాదు ఏకంగా వందల ఏళ్లు. ఆ మాటకు వస్తే నాగరికత మొదలై.. సాంకేతిక అంశాలపై అవగాహనకు వచ్చాక.. మనిషి మనసులో వచ్చిన సందేహాలెన్నో. అలాంటి ఓ సందేహ నివృత్తి జరిగింది. సమాధానం దొరకని ఒక అంశానికి సంబంధించిన ఫోటో తొలిసారి ప్రపంచం ముందుకు వచ్చింది. అదే కృష్ణబిలం ఛాయాచిత్రం. ఇంతటి అరుదైన ఫోటో ప్రపంచంలో మరేదీ ఉండదేమో. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇన్నాళ్లూ మస్తిష్కంలోనే ఒదిగిన ఊహాచిత్రం.. ఇప్పుడు అపూరూప ఛాయాచిత్రంగా రూపుదిద్దుకుంది. అంతరిక్ష మండలంలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఒళ్లు పులకరించే దృశ్యాలు,.. వహ్వా! అనిపించే సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ అనంత కోటి విశ్వంలో అలాంటి దృశ్యమే బ్లాక్ హోల్. అంతుచిక్కకుండా పాలపుంతల మధ్య దాగుడు మూతలు ఆడిన ‘కృష్ణబిలం’.. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి మానవాళికి పరిచయమైంది. కానీ, ఇది ఒక్కరోజులో సాధ్యమైన విజయం కాదు. దీనివెనుక దశాబ్దాల కృషి వుంది. పురాణ కాలం నుంచి.. నేటి ఆధునిక యుగం వరకు బ్లాక్ హోల్స్ అలియాస్ కృష్ణబిలానికి సంబంధించి ఇప్పటివరకూ మాట్లాడుకోవటమే కానీ.. అదెలా ఉంటుందన్నది ఎవరికీ తెలీదు. మొత్తానికి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అది మానవాళికి పరిచమైంది. ఇంతకీ, కృష్ణబిలం అంటే ఏమిటి..? అది ఎక్కడ వుంటుంది..? అందులో ఏముంటుంది..? అనంత విశ్వంలో అది ఏం చేస్తుంది..?

సైన్స్ చరిత్రలో మరో మహాద్భుతం ఘట్టం ఆవిష్కృతమయ్యింది. కొన్ని దశాబ్దాల నుంచి కేవలం శాస్త్రవేత్తల మస్తిష్కంలోనే మెదులుతున్న కృష్ణబిలం అసలు స్వరూపం సాక్షాత్కారమైంది. మనకు 55 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఎం-87 అనే నక్షత్రమండలంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలం ఫొటోను పరిశోధకులు బుధవారం విడుదల చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ చారిత్రకఘట్టం వివరాలను వెల్లడించారు.  శాస్త్రవేత్తలు విడుదల చేసిన కృష్ణబిలం ఫొటో.. ఇప్పటివరకు అచ్చంగా సైన్స్ ఆర్టిస్టులు ఊహించిన బ్లాక్‌హోల్‌లాగే ఉంది. మధ్యలో నల్లగా, చుట్టూ నారింజరంగు జ్వాలలతో, వేడి వాయువులు, ప్లాస్మాతో ఈ కృష్ణబిలం దర్శనమిచ్చింది. హవాయి, అరిజోనా, స్పెయిన్, మెక్సికో, చిలీ, దక్షిణధృవ దేశాలు, ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 రేడియో టెలిస్కోపుల ద్వారా.. 2017 ఏప్రిల్‌లో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఫలితంగా కృష్ణబిలం చిత్రం ఆవిష్కృతమైంది. ఈ టెలిస్కోప్ ఫొటోలు తీసి, వాటిని ఒకదాంతో ఒకటి కలిపి మొత్తం ఒకే ఫొటోగా రూపొందించామని ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ డైరెక్టర్ షెఫర్డ్ డొలెమన్ చెప్పారు. ఈ వివరాలు కృష్ణబిలం ఫొటో ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రచురితమయ్యిందని తెలిపారు. భూమికి అత్యంత దూరంలో ఉన్న ఎం-87 గెలాక్సీలో ఉన్న ఈ కృష్ణబిలాన్ని భూమి మీద అమర్చిన మల్టిఫుల్ అబ్జర్వేటరీ టెలిస్కోపులు ఫోటోలు తీశాయి. ఈ చిత్రంలో కృష్ణబిలం నీడ కనిపిస్తుంది. ఈ ఫోటో శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయంగా చెప్పక తప్పదు. వేల ఏళ్లుగా మానవాళి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దానికి ఫోటో రూపం ఇన్నాళ్లకు బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. కృష్ణబిలాల గురించి శాస్త్రవేత్తలు 18 శతాబ్దం ఆరంభం నుంచే అంచనావేస్తున్నారు. మొత్తానికి ఈవెంట్‌ హొరైజన్ టెలిస్కోప్‌ రూపొందించిన బృందం అద్భుత కృషితో బ్లాక్ హోల్ చిత్రం వెలుగుచూసింది. బ్లాక్‌ హోల్‌ చిత్రాన్ని తీయడానికి భారీ స్పేస్‌ టెలిస్కోప్‌ను రూపొందించాల్సి ఉంటుందని కొన్నేళ్ళ క్రితమేం శాస్త్రవేత్తలు భావించారు.  ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న రేడియో టెలిస్కోప్‌ లను మరింత వృద్దిచేస్తే ఈవెంట్‌ హొరైజన్ టెలి స్కోప్‌ను రూపొందించవచ్చని భావించిన పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అవి ఫలించడంతో ఈ టెలిస్కోప్‌ రూపుదిద్దుకుంది. కృష్ణ బిలాన్ని కనుగొనడానికి బహుళ తరంగాలను కనుగొనే వర్కింగ్‌ గ్రూపు సాగించిన కృషి ఫలించించింది. మొత్తానికి శాస్త్రవేత్తల కృషి ఫలించి.. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా కృష్ణబిలం చిత్రాలు కనువిందు చేశాయి. బ్లాక్‌ హోల్‌ గురించి దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. కానీ, వాటి ఛాయా చిత్రాలను ఎన్నడూ చూడలేదు. మొత్తానికి ఈ అద్భుత దృశ్యాన్ని నాసా ప్రపంచం ముందు ఉంచింది. భూమికి 55 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఈ బ్లాక్ హోల్ చిత్రాన్ని ఈవెంట్‌ హోరైజైన్‌ టెలిస్కోప్‌ క్లిక్‌ మనిపించింది. ఈ ఆవిష్కరణతో బ్లాక్ హోల్ కు సంబంధించిన పరిశోధనలు మరింత వేగవంతం కానున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిద్వారా మరిన్ని సృష్టి రహస్యాలు వెలుగుచూసే అవకాశం కూడా వుందంటున్నారు.

కృష్ణబిలం ఉంటుందని తెలుసు. కానీ, అది ఎలా ఉంటుందో ఇప్పటివరకు తెలియదు. ఎలాగైనా దాన్ని మానవాళికి చూపించాలని తపించిన ఖగోళ శాస్త్రవేత్తలు..  ‘ఎం-87’ అనే పాలపుంత మధ్యలో ఉన్న ఈ అద్భుతాన్ని బంధించారు. మధ్యలో కటిక చీకటి, చుట్టూ భగభగమండే అగ్ని గోళాన్ని, దాని నీడను కలిగివుందా కృష్ణ బిలం. ఈ చిత్రాన్ని బంధించేందుకు 200 మంది శాస్త్రవేత్తలు, పదేళ్ల పాటు శ్రమించారు. కృష్ణ బిలాన్ని చిత్రీకరించడం ఒక్క టెలిస్కోపు వల్ల అయ్యే పనికాదు. అందువల్ల హార్వర్డ్‌ స్మిత్సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ షెపర్డ్‌ డోల్‌మన్‌ నేతృత్వంలో ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. ఒక భారీ టెలిస్కోపును నిర్మిస్తే స్వీయబరువు కారణంగా అది కుప్పకూలుతుందని అంచనావేశారు. అందువల్ల హవాయ్‌, ఆరిజోనా, స్పెయిన్‌, మెక్సికో, చిలీ, దక్షిణ ధ్రువం వద్ద ఉన్న 8 టెలిస్కోపులను కలగలపడం ద్వారా ‘ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోపు’  పేరుతో ఒక భారీ సాధనాన్ని సిద్ధం చేశారు. విడివిడి భాగాలతో ఏర్పడ్డ ఒక భారీ అద్దం తరహాలో ఈ టెలిస్కోపు 12 వేల కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక వర్చువల్‌ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసి బ్లాక్ హోల్ చిత్రాన్ని క్లిక్ మనిపించారు శాస్త్రవేత్తలు. బ్లాక్‌ హోల్‌ నుంచి కాంతి కూడా తప్పించుకో లేదు. కాబట్టి నేరుగా ఒక కృష్ణబిలాన్ని ఫొటో తీయడం అసాధ్యం. దీంతో రేడియో సిగ్నళ్లు.. తరంగాలను అంకెల రూపంలో సేకరించి.. బ్లాక్ హోల్ చిత్రానికి తుదిరూపం ఇచ్చారు. అన్ని రేడియో టెలిస్కోపుల సంకేతాలను వెరీ లాంగ్‌ బేస్‌లైన్‌ ఇంటర్‌ ఫెరోమెట్రీ టెక్నాలజీతో ప్రాసెస్‌ చేసి.. ఆ నెంబర్లను చిత్ర రూపంగా మార్చారు. వాస్తవ చిత్రం కాకపోయినా.. అత్యంత కచ్చితత్వంతో కూడిన చిత్రంగా మలిచారు. 2017 ఏప్రిల్‌ లో అనేక రోజుల తరబడి శాజిటేరియస్‌-ఎ, ఎం87 అనే నక్షత్రమండలంలోని కృష్ణబిలం పైకి ఈవెంట్ హొరైజన్ ద్వారా శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. అయితే చలికాలంలో తలెత్తిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణ ధృవం టెలిస్కోపు నుంచి డేటా సేకరణ వీలుకాలేదు. దీంతో 6 నెలల పాటు వేచి చూడాల్సి వచ్చింది. 2017 డిసెంబర్‌ 23న డేటా అందింది. ఈ డేటాను మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోనమీ శాస్త్రవేత్తలు కష్టపడి కుదించారు. దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు సాగించి, తొలి చిత్రాన్ని సంపాదించగలిగారు. ఇక బ్లాక్ హోల్ ఫోటో తీసిన తరువాత, బ్రసెల్, షాంఘై, టోక్యో, వాషింగ్టన్, శాంటియాగో, తైపీల్లోని శాస్త్రవేత్తలు ఏకకాలంలో మీడియా ముందుకు వచ్చి ఈ ఘనతను మానవాళి ముందుంచారు.  నిజానికి, విశ్వం మొత్తంవిద్యుదయస్కాంత ‘ధ్వని’తో నిండి ఉంటుంది. దీంతో భారీ డేటా నుంచి ఎం-87లోని అస్పష్ట సంకేతాలను ఒడిసిపట్టడం కష్టం. డేటా భారీగా ఉండటం వల్ల ఇంటర్నెట్‌ ద్వారా పంపడం కూడా సాధ్యం కాలేదు. అందువల్ల దాన్ని వందలాది హార్డ్‌ డిస్క్‌లలో నిల్వ చేసి, సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ కేంద్రానికి తరలించారు. డేటానంతా ఒక చోటికి చేర్చి, ఒక పూర్తిస్థాయి చిత్రంగా మలచడానికి మరో ఏడాది పట్టింది. అంతిమంగా ఎం-87లోని కృష్ణబిలం చిత్రం స్పష్టంగా ఆవిష్కృతమైంది. అయితే శాజిటేరియస్‌-ఎ చాలా క్రియాశీలంగా ఉండటంతో దాని స్పష్టమైన చిత్రం దొరకలేదు. ఇక ఎం-87లోని బ్లాక్ హోల్ కచ్చితత్వాన్ని నిర్ధరించుకోవడానికి 4 బృందాలతో నాలుగుసార్లు పరిశీలన చేయించారు. ప్రతిసారీ ఇదే చిత్రం రావడంతో దీన్ని తాజాగా వెలువరించారు. ఎం-87 మనకు 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఉంది. దీనితో పోలిస్తే శాజిటేరియస్‌-ఎ భూమికి కేవలం 26 వేల కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. ఎం-87 నక్షత్ర మండలంలోని కృష్ణబిలాన్ని ఫొటో తీయడమంటే చంద్రుడి మీదున్న చిన్న గులకరాయిని క్లిక్‌ మనిపించడంతో సమానం. కృష్ణబిలంలో ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే అది అంతపెద్దగా ఉంటుంది. తాజాగా తీసిన ఎం-87లోని కృష్ణబిలం వెడల్పు 40 బిలియన్‌ కిలోమీటర్లు. భూమితో పోలిస్తే ఇది 30 లక్షల రెట్లు ఎక్కువ. సూర్యుడితో పోలిస్తే దీని ద్రవ్యరాశి 650 కోట్ల రెట్లు అధికం. శాస్త్రవేత్తలు చిత్రంగా మలిచిన తాజా బ్లాక్ హోల్.. సుమారు 40 బిలియన్ల కిలోమీటర్ల వెడల్పులో ఉన్నట్లు తేలింది. భూమి కన్నా దాదాపు 30 లక్షల రెట్లు పెద్దగా ఉందని వెల్లడైంది. భూమికి సుమారు 500 ట్రిలియన్ల కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ బిలం చుట్టూ ఎగిసిపడే భారీ స్థాయి జ్వాలలు చివరికి ఎక్కడి నుంచి కూడా చిన్నపాటి కాంతిని కూడా దరిదాపులలోకి రానివ్వవు. అటువంటి కృష్ణబిలం ఫోటోను తీయడం ఖగోళ పరిశోధనలలో అరుదైన విజయంగా భావిస్తున్నారు. విశ్వంలో అక్కడక్కడ ఇలాంటి కృష్ణబిలాలు పొదిగినట్లుగా ఉన్నాయి. ఈ బిలాల చుట్టూ నారింజ రంగు మంటల వలయం నెలకొని ఉంది. తెల్లటి జ్వాలల చివరన ఉండే రంగులతో ఉండే ఈ కృష్ణ బిలం చిత్తరువు ఇప్పుడు 30 ఏళ్ల పరిశోధనల తరువాత సాక్షాత్కరించిన కళాకారుడి చిత్తరువుగా వెలువడింది. కృష్ణబిలాల గురించి నిజానికి 18వ శతాబ్దం నుంచే ప్రశ్నలు తలెత్తుతూ వస్తున్నాయి. అయితే గత టెలీస్కోప్ ద్వారా ఈ బ్లాక్‌హోల్ ఫోటోను తీయడం ఇదే తొలిసారి.

కృష్ణబిలం పేరును వింటున్నాం తప్పిస్తే దాన్ని ఎవరూ ఇంతవరకూ చూసిన దాఖాలు లేవు. అంతరిక్ష నౌకలు, టెలిస్కోపులకు కూడా దొరకని ఆ నల్లరంధ్రాలు ఎట్టకేలకు టెలిస్కోప్ కంటికి చిక్కాయి. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఈ కృష్ణ బిలం గురించి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసారు. కృష్ణబిలం అంటే అంతరిక్షంలో పెద్ద నక్షత్రాలు కాంతి హీనమైనప్పుడు ఏర్పడే చీకటి ప్రాంతం. కృష్ణ బిలానికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అందువల్ల దాని దగ్గరికి ఏ వస్తువు వెళ్లినా తిరిగి రావడం అసాధ్యం. సూర్యుని కన్నా ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలు కాంతివిహీనం అయినప్పుడు కృష్ణబిలం ఏర్పడుతుందని.. ఫ్రాన్స్‌ కి చెందిన స్వార్జ్‌ చైల్డ్‌ అనే శాస్త్రవేత్త నిర్దారించారు. బ్లాక్‌ హోల్‌ గురించి మొదట సిద్దాంతీకరణ చేసింది ఆయనే. కాంతిని పీల్చి వేసే గుణాన్ని కలిగి ఉండటం వల్లనే దీనికి బ్లాక్‌ హోల్‌ అనే పేరొచ్చింది. బ్లాక్‌ హోల్‌ పేరును 1960లలో అమెరికా భౌతికశాస్త్రవేత్త జాన్‌ ఆర్చిబాల్డ్‌ వీలర్‌ పెట్టారు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న నక్షత్రాలు చివరి దశకు చేరుకున్నప్పుడు, వాటిలోని గురుత్వాకర్షణ బలాలు ఎక్కువైపోతాయి. దాంతో అవి తమ కేంద్రం వైపు కుంచించుకుపోతాయి. వాటి ద్రవ్య సాంద్రత అనంతంగా పెరుగుతుంది. దీన్నే కృష్ణబిలం అంటారు. కృష్ణబిలంలో దేశ, కాలాలు వాటంతట అవి మలుపుతిరిగి దాంట్లోకి కలిసిపోతాయి. కృష్ణబిలం మీద పడే ద్రవ్యం, కాంతి కూడా వెనక్కి తిరిగి రాలేవు. కాబట్టి వీటిని మనం చూడలేం. సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.4 రెట్లు ఎక్కువగా ఉండే నక్షత్రాలే కృష్ణబిలాలుగా మారతాయని ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సుబ్రహ్మణ్యం సిద్ధాంతీకరించారు. సూర్యుని కన్నా అంత పెద్దగా ఉండే ఓ నక్షత్రం కృష్ణబిలంగా మారితే దాని వ్యాసం కేవలం 2.9 కిలోమీటర్ల వరకూ కుంచించుకుపోతుంది. నక్షత్రాలే కాదు, ఏ వస్తువులోని ద్రవ్యరాశి అయినా కేంద్రంలోకి కుంచించుకుపోయి, సాంద్రత అనంతంగా పెరిగితే, అది కృష్ణబిలంగా మారుతుంది. మన భూమి బఠాణీ గింజ పరిమాణానికి కుంచించుకుపోతే, అది కూడా బ్లాక్‌ హోల్‌ అయిపోతుంది. ఇలాంటి కృష్ణబిలాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. బిలాలుగా పేర్కొంటున్నప్పటికీ నిజానికి అవి ఖాళీగా ఉండవు. వాటిలో భారీ మొత్తంలోని పదార్థం.. ఒక చిన్న ప్రదేశంలోకి కుచించుకుపోయి ఉంటుంది. ఫలితంగా ఈ ఖగోళ వస్తువుకు అపరిమిత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. వాటి నుంచి కాంతి పుంజం కూడా తప్పించుకోలేదు. ఈ బ్లాక్‌ హోల్‌ లోని పదార్థాలు.. సూర్యునిలోని పదార్ధాల కన్నా 6.5 బిలియన్‌ రెట్లు ఎక్కువ. అధిక సాంద్రత కలిగిన పదార్ధాలు కాంతిని ప్రసారం కానివ్వవు. చుట్టూ ఉన్న పదార్ధాలను కృష్ణబిలం తనవైపునకు లాక్కుంటుంది. కృష్ణబిలం వెలుపలి అంచును ‘ఈవెంట్‌ హొరైజన్‌’గా పేర్కొంటారు. అక్కడికి చేరిన ఏది తిరిగి రావడం అంటూ ఉండదు. అదృశ్యంగా ఉండే ఈ ‘చీకటి నక్షత్రాలు’ 18 శతాబ్దం నుంచే శాస్త్రవేత్తల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీటిపై పరోక్ష ఆధారాలే లభించాయి. ఇవి ఎన్నడూ టెలిస్కోపు కంటికి చిక్కలేదు. గతంలో శాస్త్రవేత్తలు పలు కృష్ణ బిలాలను గుర్తించినప్పటికీ.. వాటిని ఎప్పుడూ ఫొటో తీసిన దాఖలాలు లేవు. 2011లో సుమారు 10 బిలియన్‌ సూర్యుల పరిమాణంలో వున్న కృష్ణబిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో అది గిన్నిస్ బుక్ లో నమోదైంది. అయితే, 2016లో గుర్తించిన మరో కృష్ణబిలం ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా 17 బిలియన్‌ సూర్యులు ఒదిగిపోయేంత పరిమాణంలో ఈ కృష్ణబిలం ఉన్నట్లు అప్పట్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా కృష్ణబిలాన్ని ఫొటో తీయడం ద్వారా ఖగోళ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కీలక మైలురాయిని చేరుకున్నారు.  తాజా పరిశోధన బ్లాక్ హోల్స్ కు సంబంధించిన అనేక రహస్యాలను చేధించేందుకు బాటలు వేస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ పరిశోధన ద్వారా కృష్ణ బిలం ఎలా ఉంటుంది అనే విషయాలపై కూడా ఊహాచిత్రాలతో కొంత చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఈ కృష్ణ ఇలాలు సౌర కుటుంబంలో, అంతరిక్షంలో ఉన్నాయని, వీటి ద్వారా జీవ వినాశనం జరిగుతుందని, కొత్త సృష్టి ఏర్పడుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

-ఎస్. కె. చారి