Thursday, October 17, 2019
Follow Us on :

వివాద ‘రాగా’లు..

By BhaaratToday | Published On May 1st, 2019

ఓవైపు పౌరసత్వ కష్టాలు. మరోవైపు సుప్రీం మొట్టికాయలు. ప్రచారంలో తప్పటడుగులు. చుట్టుముడుతున్న వివాదాలు. ఎన్నికల వేళ చిక్కుల సుడిగుండంలో కాంగ్రెస్ చీఫ్. వివాద ‘రాగా’లు.. 

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కష్టాల కడలని ఈదుతోంది. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఆయన బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో రాహుల్ రాజకీయ భవిష్యత్తుపై ప్రమాదంలో పడందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ నిజంగానే బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారా..? రాహుల్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకమేనా..? రాహుల్ బ్రిటీష్ పౌరసత్వంపై బీజేపీ మాటల దాడి ప్రారంభించింది. ఇక రాహుల్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనని కమలనాథులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. రాహుల్ పై అభియోగాలు అవాస్తవమని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలే వారసత్వ వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాహుల్ గాంధీకి.. కోర్టు ధిక్కరణ కేసు ఆయన మెడకు చుట్టుకుంటోంది. చౌకీదార్ చోర్ అని సుప్రీం కోర్టు కూడా చెప్పిందన్న రాహుల్ వ్యాఖ్యలు.. ఆయనకు శాపంగా మారాయి. సుప్రీం కోర్టు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, రెండుసార్లు అఫిడవిట్లు దాఖలు చేసినా.. కనీసం క్షమాపణలు చెప్పకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని ఆందోళనలకు గురిచేస్తోంది.

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ ఎక్కడ లేని కష్టాలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజులుగా పౌరసత్వ వివాదం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమేథీ బరిలో నిల్చున్న స్వతంత్ర అభ్యర్థి ధృవ్ లాల్.. రాహుల్ గాంధీ నామినేషన్‌ పై అభ్యతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం.. చినికి చినికి గాలివానలా మారింది. నామినేషన్ సందర్భంగా డాక్యుమెంట్లలో తన పౌరసత్వంపై రాహుల్ ఇచ్చిన వివరణ సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేశారు ధృవ్‌లాల్. విద్యార్హతలు, గుర్తింపు, పౌరసత్వం, యూకేలో ఆస్తులు, తను ఆర్జించిన లాభాలు ఇలా చాలావాటిపై రాహుల్ గాంధీ తప్పుడు సమాచారం ఇచ్చారని ధృవ్‌ లాల్ ఫిర్యాదు పేర్కొన్నారు. ధృవ్ లాల్ అభ్యంతరాలను బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు రూపంలో కేంద్ర హోంశాఖకు చేరవేయడంతో రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. నిజానికి, రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై గతంలోనే సుబ్రహణియన్ స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ బ్రిటీష్ సిటిజన్ షిప్ కలిగి ఉన్నారని 2017 సెప్టెంబర్ 21న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు ఆధారాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉండటంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2003వ సంవత్సరంలో బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ అయ్యింది. 51 సౌత్ గేట్ స్ట్రీమ్ విన్చిస్టర్, హ్యాంప్‌షైర్ S023 9EK చిరునామాతో నమోదైంది. అందులోని డైరెక్టర్లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆ కంపెనీకి సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఆ కంపెనీ 10 అక్టోబర్ 2005, 31 అక్టోబర్ 2006లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా అందులో పుట్టిన తేదీ 19/06/1970గా ఉందని, బ్రిటీష్ పౌరుడిగా డిక్లేర్ చేసినట్లు అందులో ఉందని రాహుల్ గాంధీకి పంపిన నోటీసుల్లో కేంద్రహోంశాఖ పొందుపర్చింది. నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా రాహుల్‌ను ఆదేశించింది కేంద్రం హోంశాఖ. మరోవైపు, రాహుల్ నామినేషన్లను కూడా సవాల్ చేస్తూ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉందని, భారతీయుడు కాని ఆయన భారత ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. రౌల్ విన్సీ పేరిట లండన్ లో రాహుల్ కు సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ఉందని.. అంతేకాక.. రెండు ఇండియన్ పాస్ పోర్టులతో పాటు బ్రిటీష్, ఇటాలియన్ పాస్ పోర్టులు కూడా ఉన్నట్లు సుబ్రమణియన్ స్వామి ఆరోపిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా సైతం పౌరసత్వ వివాదంలో చిక్కుకున్నారు. ప్రియాంక వాద్రా ఇటలీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారంటూ ఓ ఆర్మీ అధికారి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రియాంక పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ తాజాగ ఓ ఆర్మీ అధికారి ఆమెకు లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. నోటీస్ ప్రతిని రాష్ట్రపతి, సీఈసీ, వారణాసి రిటర్నింగ్ ఆఫీసర్‎కు పంపించారు. దీంతో ప్రియాంక పౌరసత్వం వ్యవహారం అనేక ప్రశ్నలు లెవనెత్తుతోంది.  ప్రియాంక వాద్రాకు ఇటలీ పౌరసత్వం ఉందని.. ఆమె భారత రాజ్యాంగ ప్రకారం ఎన్నికల బరిలో దిగేందుకు అనర్హురాలంటూ లెఫ్ట్‎నెంట్ కల్నల్ ముకుల్ చౌహాన్ లీగల్ నోటీస్ పంపించారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రియాంక వాద్రా 12 జనవరి, 1972న జన్మించారని.. ఆ సమయంలో సోనియా గాంధీ ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నారని నోటీస్‎లో పేర్కొన్నారు. ఇటలీ పౌరులు ప్రపంచంలో ఎక్కడైనా సంతానం కలిగి ఉంటే.. వారి సంతానం కూడా ఇటలీ పౌరులుగానే గుర్తిస్తారని నోటీస్‎లో ఆర్మీ అధికారి స్పష్టం చేశారు. విదేశీ పౌరసత్వం రద్దు చేసుకోనంత వరకు భారత పౌరసత్వం పొందడానికి వీళ్లేదని నోటీస్‎లో తేల్చిచెప్పారు.  ఈనెల 17న ప్రియాంకకు నోటీస్ పంపించిన లెఫ్ట్‎నెంట్ కల్నల్ ముకుల్ చౌహాన్.. ఇటలీ పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నట్టుగా రుజువును చూపించాల్సిందిగా ఆయన కోరారు. భారత పౌరులు కానివారు లోక్‎సభ సభత్వం పొందేందుకు అర్హులు కారన్నారు. తగిన సమయంలో స్పందించకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు ముకుల్ చౌహన్. మొత్తానికి అన్నాచెల్లెళ్ల పౌరసత్వంపై రాజకుంటున్న వివాదం.. చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎన్నికల వేళ ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది.

రాహుల్ గాంధీ పౌరసత్వ అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. రాహుల్ సిటిజన్ షిప్ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతుండటంపై కమలనాథులు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ పౌరసత్వంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ఓ కంపెనీలో రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడిగా నమోదై ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. యూకే కంపెనీలో రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడిగా ఉందంటే అది సామాన్యమైన విషయం కాదని.. అక్కడ పౌరసత్వం ఉంటేనే ఆ కంపెనీ బ్రిటీష్ పౌరుడని పేర్కొన్నదని స్పష్టం చేశారు జీవీఎల్. ఇదిలావుంటే, రాహుల్ పౌరసత్వంపై స్పందించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పార్లమెంటు సభ్యులు ఏ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినా, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం సిటిజన్ షిప్, కన్ఫ్యూజన్, క్లారిటీ అనే మూడు అంశాలను కాంగ్రెస్ ను పట్టిపీడుస్తున్నాయని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. దీనికి కాంగ్రెస్ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, బ్రిటీష్ పౌరసత్వం అంశంలో.. రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ భారతీయుడేనని ఆయన సోదరి ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి కన్ఫాం అయిపోయిందని.. అందుకే, కాంగ్రెస్ పై బురద జల్లుతోందని చెప్పుకొచ్చారు మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ. రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై సీపీఐ కూడా స్పందించింది. ఎన్నికల సమయంలోనే ఇలాంటి అంశాలు గుర్తుకు రావడం హాస్యాస్పదం అన్నారు సీపీఐ నేత డి. రాజా. అటు బీఎస్పీ సైతం కేంద్రంపై మండిపడింది. మొత్తంమ్మీద రాహుల్ గాంధీ పౌరసత్వం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించాలన్న కాంగ్రెస్ అధినేత కలలు కలలుగానే మిగిలిపోతాయా..? రాహుల్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకమేనా..? రాహుల్ బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారా..?  బీజేపీ విమర్శల్లో వాస్తవమెంత..? అవాస్తవమెంత..? అన్నది చర్చనీయాంశమైంది.

‘చౌకీదార్ చోర్’.. ప్రధాని మోదీని విమర్శించేందుకు రాహుల్ గాంధీ ఎంచుకున్న పదం. ఈ పదం ఆయనకు ఊతపదంగా మారిపోయింది. సందర్భమేదైనా.. అవసరం వున్నా.. లేకపోయినా.. ఈ పదాన్ని పదే పదే ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు అదే రాహుల్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఏకంగా సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురిచేసింది. ఈ మాటలే ఇప్పుడు రాహుల్ గాంధీ మెడకు చుట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఫ్రాన్స్ తో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు రాహుల్ గాంధీ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రాఫెల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన రాహుల్.. సుప్రీంకోర్టు నిర్ణయంతో నైతిక విజయాన్ని సాధించామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టే చెప్పిందని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాఫెల్ కుంభకోణంలో జారీ చేసిన ఉత్తర్వుల్లోని తమ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఉత్తర్వుల్లోని తమ వ్యాఖ్యలను వక్రీకరించినందుకు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. రాఫెల్‌ తీర్పులో తాము మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్’ అని వ్యాఖ్యానించామని.. ఆ వ్యాఖ్యలను తమకు ఆపాదిస్తూ మీడియాలో రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారని కోర్టు మండిపడింది. అటువంటి వ్యాఖ్యలు తాము చేయలేదని, పత్రాల అంగీకార యోగ్యతపై మాత్రమే నిర్ణయం తీసుకున్నామని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ.. తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఈ నెల 22న కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ నెల 23న కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన ఆయన సోమవారం మరోసారి అఫిడపవిట్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థను రాజకీయాల్లోకి లాగాలన్న ఉద్దేశం తనకు లేదని రాహుల్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపై ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా.. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తన రాజకీయ లబ్ది కోసం కోర్టును రాజకీయ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. ధిక్కార పిటిషన్‌ను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ముమ్మర ఎన్నికల ప్రచార వేడిలో తానా వ్యాఖ్యలు చేశానని, సుప్రీంకోర్టు తీర్పులను తప్పుగా వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. రాఫెల్ కేసులో కోర్టు ఉత్తర్వులను చదవకుండానే ఎన్నికల వేడిలో మాటలన్నానని రాహుల్ తెలిపారు. తన మాటలను ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నాయని, దుర్వినియోగం చేశాయని విమర్శించారు. తాను 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక బాధ్యతాయుతమైన రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని పేర్కొంటూ.. కోర్టు ప్రక్రియపై తప్పుడు ప్రభావం చూపించే లేఖి పిటిషన్‌ను తోసిపుచ్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సారి కూడా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన రాహుల్‌.. వాటికి అఫిడవిట్‌లో ఎక్కడా క్షమాపణలు చెప్పలేదు.  ఇక రాహుల్ గాంధీ రెండోసారి దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా క్షమాపణలు చెప్పకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. అఫిడవిట్ లో ఎక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ రెండు అఫిడవిట్లను ఎందుకు దాఖలు చేశారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చౌకీదార్ వ్యాఖ్యలపై తమను తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాహుల్‌ గాంధీ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణలు కోరలేదని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే, రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పకపోవడంపై బీజేపీ మండిపడింది. న్యాయస్థానానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నట్లు స్పష్టం చేశారని కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. వేడెక్కిన రాజకీయా ప్రసంగాల్లో పొరపాటున సుప్రీంకోర్టుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని అభిషేక్ సింఘ్వీ వివరించారు. మొత్తానికి రాహుల్ గాంధీ వేస్తున్న తప్పటడుగులు ఎన్నికల వేళ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఆయన వ్యవహారశైలి పార్టీకి శాపంగా మారుతోందని.. కాంగ్రెస్ లోనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

-ఎస్. కె. చారి