Saturday, December 07, 2019
Follow Us on :

రెండిళ్ల పూజారిగా రాహుల్ గాంధీ

By BhaaratToday | Published On Apr 3rd, 2019

వయనాడ్ బరిలో రాహుల్. కేరళపై యువనేత నజర్. అమేథీపై అపనమ్మకమా..? లేక, దక్షిణాదిలో బలపడే వ్యూహమా..? కమ్యూనిస్టులతో జరుగుతున్న కాంగ్రెస్ అనూహ్య పోరులో గెలిచేదెవరు..? రాహుల్ దక్షిణాదిలో పోటీ చేయడానికి కారణాలేంటి..? ‘వై’యనాడ్..?.. 

2019 ఎన్నికల్లో జాతీయ పార్టీల వ్యూహం మారిందా..? నార్త్‌ కన్నా సౌత్‌ పైనే ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. వారణాసి బరిలో నిలిచిన ప్రధాని మోదీ.. బెంగళూరు నుంచి కూడా పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తుండగానే.. ఏకంగా రాహుల్ గాంధీ తన రెండో రణక్షేత్రాన్ని ప్రకటించేశారు. కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అమేథీ నాదే, వాయనాడ్ నాదే అంటున్న రాహుల్.. ఓ కాలు ఉత్తరాన, మరో కాలు దక్షిణాన వేసి ఉంచడంతో ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. దక్షిణాది రాష్ర్టాలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పేందుకు రాహుల్ కేరళ నుంచి పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ చెబుతుంటే.. అమేథీలో ఓటమి భయంతోనే దక్షిణాదికి పారిపోయారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలావుంటే తమ స్నేహబంధాన్ని మరిచి.. తమపైనే పోటీకి దిగడంతో అటు వామపక్షాలు సైతం రాహుల్ పై గుర్రుగా వున్నాయి. వయనాడ్ కాంగ్రెస్ యువనేతను ఓడిస్తామనే సంకేతాలిస్తున్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా బరిలోకి దిగుతుండటంతో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వయనాడ్. ఇంతకీ రాహుల్ తన రెండో రణక్షేత్రంగా వయనాడ్ ను ఎంచుకోవడానికి కారణాలేంటి..? అమేథీలో ఓటమి భయంతోనే దక్షిణాదివైపు చూస్తున్నారా..? లేక దక్షిణాదిలో నానాటికీ దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితిని మెరుగు పరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా..?

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లు దక్షిణాది కోసం హోరాహోరీగా పోటీపడుతున్నాయి. మోదీ బాటలోనే కాంగ్రెస్ సారథి కూడా నడుస్తున్నారు. ఇప్పటికే మోదీ వారణాసిలో పోటీచేస్తుండగా, ఇక బెంగళూరు సౌత్‌నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రాహుల్ కేరళలో కర్చీఫ్ వేశారు. కర్మభూమిగా భావించే అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్‌ నుంచి బరిలో దిగుతున్నారు. రాహుల్ కేరళకు రానుండడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నాయి. ఇక వయనాడ్ నుంచి రాహుల్ బరిలోకి దిగుతున్నారని కాంగ్రెస్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలన్న దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తల కోరిక మేరకే రాహుల్ వయనాడ్ నుంచి పోటీకి ఒప్పుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి పోటీచేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తూనేవుంది. తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని కర్ణాటక, కేరళ, తమిళనాడు పీసీసీలు తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపాయి. దీంతో ఆయన తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని వయనాడ్, కర్ణాటకలోని బెంగళూరు రూరల్ స్థానాల్లో ఏదొక చోట నుంచి పోటీ చేయడానికి రాహుల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, కన్యాకుమారిలో పోటీచేస్తే పూర్తిగా డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావచ్చనే భావన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమైంది. దీంతో కన్యాకుమారి స్థానాన్ని లిస్ట్ నుంచి తీసేశారు. ఇక బెంగళూరు రూరల్ విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ గట్టిపోటీనిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక కూడా ఒకటి కావడంతో.. రిస్క్ ఎందుకనే భావనలో ఆ స్థానాన్ని కాదనుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ రెండు స్థానాలను కాదని.. పార్టీ సీనియర్ నేతల సలహాతో చివరికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి వయనాడ్ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు రాహుల్ గాంధీ.  ఇక తాను వయనాడ్ నుంచి ఎందుకు బరిలోకి దిగాల్సివచ్చిందో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తనను దక్షిణాది నుంచి పోటీకి నిలపాలనే డిమాండ్ ఉందన్న రాహుల్.. ప్రస్తుతం ప్రభుత్వం తమను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న భావన దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో బలంగా వుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నుంచి దక్షిణ భారతదేశం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించిన ఆయన.. దక్షిణాది ప్రజలు మోదీ తమను శత్రువుగా చూస్తున్నారనే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. దేశానికి సంబంధించిన నిర్ణయాల్లో తాము భాగస్వాములం కావడం లేదనే భావన దక్షిణాది ప్రజల్లో ఉందన్న రాహుల్.. దక్షిణాది నుంచి పోటీ చేయడం వల్ల వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఉందనే సందేశాన్ని ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఈ కారణంగానే వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. కేరళ నుంచి పోటీ చేయడం వల్ల తమకు మిత్రపక్షంగా ఉండే వామపక్షాలతో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రాహుల్ గాంధీ పరోక్షంగా అభిప్రాయపడ్డారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తమకు మిత్రపక్షాలు ఉన్నాయని.. కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఇలాంటి వాదనలు రావొచ్చని అన్నారు.  మొత్తానికి వయనాడ్ నుంచి బరిలోకి దిగాలన్న రాహుల్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాహుల్ నిర్ణయంపై వామపక్షాలు మాత్రం గుర్రుగా వున్నాయి. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతుండటంతో కమ్యూనిస్టులు అప్రమత్తమయ్యారు. సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్, సీపీఐ నేత డీ రాజా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర భేటీ అయి ప్రచార వ్యూహంపై చర్చించారు. నియోజకవర్గంలో ప్రచారానికి సీనియర్ నేతలను పంపాలని సమావేశంలో నిర్ణయించారు. రాహుల్ గాంధీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో పనిచేయాలని నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ఇక రాహుల్ పోటీపై కేరళ సీఎం పినరయి విజయన్ పెదవి విరిచారు. తన పోరాటం బీజేపీపైనేనని చెప్పుకునే రాహుల్‌.. మాటనిలబెట్టుకోవడం లేదని అన్నారు. వాయనాడ్‌ స్థానంలో రాహుల్‌ను ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ విసిరారు. వామపక్షాలపై రాహుల్ పోటీకి దిగడం చూస్తే కేరళలో వామపక్షాలను కాంగ్రెస్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతోందని  సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. రాహుల్‌ ఓడించేందుకు పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ కేరళకు రావడం, ఎల్డీఎఫ్ పై పోటీకి దిగడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ఇదిలావుంటే, కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయంపై బీజేపీ సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే దక్షిణాదిన అధిక స్థానాలు గెల్చుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్న కమలనాథులు.. వయనాడ్ లో ఎలాగైనా రాహుల్ ని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా కేరళలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న భారత్ ధర్మ జనసేన చీఫ్ తుషార్ వెల్లపల్లిని రాహుల్ పై పోటీకి దింపారు. వయానాడ్ లోక్ సభ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా తుషార్ వెల్లపల్లయ్ ని సగర్వంగా ప్రకటిస్తున్నానని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా సోమవారం ట్వీట్ చేశారు. డైనమిక్ యూత్ లీడర్ తుషార్ సహకారంతో కేరళలో ఎన్డీయే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అమిత్ షా ధీమాగా చెబుతున్నారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం జనరల్ సెక్రటరీ వెల్లపల్లి నటేశన్ కుమారుడే ఈ తుషార్. 2015లో నటేశన్ భారత్ ధర్మ జనసేనను పార్టీని స్థాపించారు. రాహుల్ కి తుషార్ గట్టి పోటీ ఇస్తాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీకి సిద్ధం కావడంపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. హిందూ మ‌త‌స్తులను చూసి రాహుల్ గాంధీ భ‌య‌ప‌డుతున్నార‌ని.. అందుకే ముస్లిం మెజారిటీ ఉన్న వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రాహుల్ సిద్ధమయ్యారని ప్రధాని మోదీ విమర్శించారు. ఓటమి భయంతోనే రాహుల్ కేరళ కు పారిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి ఓటమి భయం పట్టుకుందని. అందుకే వాయినాడ్ లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు.  అమేథీలో రాహుల్ గాంధీ పీఠం కుదులుతోందని, ఆయన దారుణంగా ఓడిపోతారనే విషయం కాంగ్రెస్‌కు బాగా తెలుసునని.. అందుకే ఆయన వయనాడ్ కు పారిపోయారని ఎద్దేవా చేశారు.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. అమేధీ ప్రజలపై విశ్వాసం లేకనే రాహుల్ గాంధీ వయనాడ్ కు పారిపోయారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. మొత్తానికి వయనాడ్ నుంచి బరిలోకి దిగాలన్న రాహుల్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మూడో ఫేజ్ పోలింగ్ లో భాగంగా.. ఏప్రిల్ 23న వయనాడ్ లో పోలింగ్ జరుగనుంది. దీంతో రాహుల్, తుషార్ మధ్య పోటీతో వయనాడ్ దేశవ్యాప్తంగా ఆసక్తిగా రేపుతోంది.

అమేథీలో ఎన్నిక అంటే గాంధీల కుటుంబానికి ఒకప్పుడు నల్లేర మీద నడక అన్నట్టు ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 2009లో రాహుల్‌ అమేథీ నుంచి మూడు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. 2014 వచ్చే సరికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మతి ఇరానీ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చారు. దాదాపు మూడు లక్షల ఓట్లను స్మతి సాధించడంతో రాహుల్‌ కేవలం లక్ష ఓట్ల మెజారిటీతో మాత్రమే గట్టెక్కారు. మూడు దశాబ్దాలుగా అమేథీ ప్రజలు గాంధీ కుటుంబాన్ని గెలిపిస్తున్నప్పటికీ ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇటీవల జరిగిన విధానసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింటిని గెలుచుకుంది. గాంధీ కంచుకోటలోకి స్మతీ ఇరానీ చొరబడి పెద్ద ఎత్తున ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమేథీ నుంచి మాత్రమే బరిలో నిలిస్తే కొంప కొల్లేరవడం ఖాయమని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. అమేథీ నుంచి రాహుల్‌ ఓడిపోతే ఆయనకు వ్యక్తిగతంగానే కాదు పార్టీకి కూడా తీరని నష్టమని విశ్లేషణలు చేసుకుంటున్నాయి. అందుకే రాహుల్‌ కోసం మరో సేఫ్‌ సీట్‌పై పార్టీ శ్రేణులు దష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక వయనాడ్ ఎంపికపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయం. దేశవిదేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కాఫీ, టీ, కోకా, మిరియాలు, యాలకులు ఎక్కువగా సాగు చేస్తారు. మలప్పురం, వయనాడ్, కోజికోడ్ జిల్లాల పరిధిలో విస్తరించిన వయనాడ్ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో నాలుగు స్థానాలను సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే, లోక్‌ సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జయభేరి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి షానవాజ్ 2009 ఎన్నికల్లో లక్షా 50 వేలకు పైగా మెజార్టీ తో గెలుపొందగా, 2014 ఎన్నికల్లో మాత్రం 20 వేల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఈ సమీకరణాలే రాహుల్ గాంధీ వయనాడ్ ను ఎంచుకునేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు మైనార్టీ ఓట్ల ప్రాబల్యం కూడా రాహుల్ వయనాడ్ ను ఎంచుకోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో కాంగ్రెస్ మిత్రపక్షం అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో క్రిస్టియన్ ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మోదీని దీటుగా ఎదుర్కోగల రాహుల్‌ వైపే మైనార్టీలు మొగ్గుచూపుతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక సమీకరణాలు కూడా రాహుల్ వయనాడ్ ను ఎంచుకోవాడనికి కారణమైనట్టు తెలుస్తోంది. ఉత్తర కేరళలో ఉన్న వయనాడ్.. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలతో సరిహద్దును కలిగి ఉంది. కర్నాటక లోని చామరాజ నగర, తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గాలతో సరిహద్దులు కలిగివుండటంతో.. ఇక్కడి నుంచి రాహుల్ పోటీ చేయడం ద్వారా కేవలం కేరళలో మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులోనూ దాని ప్రభావం ఉంటుందని, దక్షిణాదిలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఇది దోహదపడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వామపక్షాలు చాలా తక్కువ సీట్లకే పరిమితమవుతాయని, ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతర పొత్తులపై పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే కమ్యూనిస్టులతో సైతం పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. పైగా బీజేపీని గద్దె దింపాలని మెజారిటీ విపక్షాలు కోరుకుంటున్నాయని, ఒకవేళ హంగ్ ఏర్పడితే అవి బీజేపీతో కలిసే అవకాశాలు లేవని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. ఇది సహజంగా తనకు కలిసివస్తుందని భావిస్తోంది. మరోవైపు, రాహుల్ గాంధీ ఎంపిక సరైందేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీ ప్రచారాన్ని ముందుండి నడిపించాల్సిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు అమేథీ, వయనాడ్ లకే పరిమితమైతే పరిస్థితి ఏంటనే సందేహాలు కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అక్కడ స్థానిక సమస్యలపైనా రాహుల్ దృష్టిసారించాలి. ముఖ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మిరియపు రైతులకు భరోసా కల్పించాలి. అప్పుడే ఓటర్ల కరుణ రాహల్ కు దక్కుతుంది. సొంత నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడల్లా కాంగ్రెస్ అధినాయకత్వానికి దక్షిణాది అండగా నిలిచింది. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ కూడా గతంలో దక్షిణాది నుంచి పోటీచేసి గెలిచారు. 1978లో కర్ణాటకలోని చిక్కమగళూరు, 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ నుంచి ఇందిరాగాంధీ విజయం సాధించారు. సోనియాగాంధీ 1999లో బళ్లారి నుంచి గెలుపొందారు. తాజాగా రాహుల్ కూడా కేరళ నుంచి పోటీచేస్తున్నారు. మరి, తన తల్లి సోనియాగాంధీని, నాయనమ్మ ఇందిరాగాంధీని గెలిపించిన దక్షిణాది ఓటర్లు రాహుల్ గాంధీని కూడా అక్కున చేర్చుకుంటారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

-ఎస్. కె. చారి