Wednesday, November 20, 2019
Follow Us on :

సన్ ‘స్ట్రోక్’..!..

By BhaaratToday | Published On Apr 30th, 2019

నడినెత్తిన నిప్పుల కుంపట్లు. తెలంగాణలో భానుడి భగభగలు. మించిపోతున్న ఉష్ణోగ్రతలు. ముంచుకొస్తున్న తుపాన్లు. గతి తప్పుతున్న రుతురాగాలు. విచిత్ర వాతావరణ పరిస్థితులు. సన్ ‘స్ట్రోక్’..!.. 

దేశంలో ఓవైపు ఎన్నికల సెగలు రగులుతుంటే.. మరోవైపు భానుడు కూడా అంతకు రెట్టింపు స్థాయిలో మండిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపుతూ పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. మొన్నటిదాకా ఓ మోస్తరుగా కాసిన ఎండలు.. ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలకు, వడగాలులు కూడా తోడవడంతో జనం విలవిలలాడుతున్నారు. తెలంగాణలో దంచికొడుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు మంటలు ముందే వున్నాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, స్కైమెట్ చెప్పినట్టే.. దాదాపు భారత వాతావరణ శాఖ కరువు తప్పదని హెచ్చరిస్తోంది. 2016, 17 లో అన్నదాత వెన్నువిరిచిన ఎల్ నినో ఈసారి కూడా పొంచిందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండ వేడికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎండ బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు పగటి పూట బయటకు వెళ్లే సాహసం చేయడంలేదు. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం వడగాలుల వలయంలో చిక్కుకొని అల్లాడుతోంది. వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ మొత్తం కుతకుత ఉడికిపోతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. భానుడి ప్రతాపం కర్ఫ్యూను తలపిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా.. పగటివేళ ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. సోమవారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ లో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, జగిత్యాల జిల్లా ఐలాపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక నిర్మల్ జిల్లా భైంసాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజధాని హైదరాబాద్ లో ప్రతిరోజూ 40 డిగ్రీలకు తగ్గకుండా ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. వడగాలులతో ఇప్పటికే అనేకమంది చనిపోయారు. వడదెబ్బతో ఆదివారం ఐదుగురు మృత్యువాతపడ్డారు. అంతేకాదు, మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.  ఇక వాతావరణంలో చోటుచేసుకునన అస్థిరత వల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వీటి ప్రభావం వల్ల ఉరుములతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం వుందని.. కొన్ని చోట్ల వడగండల్ల వర్షం పడటానికి కూడా అవకాశం వుందని అంటున్నారు. అంతేకాదు, పగటివేళ అత్యధిక ఉష్ణోగ్రతలతో వడగాలుల తీవ్రత పెరుగుతుందని.. ఉదయం 11 గంటల నుండి సాయం త్రం 4 గంటల వరకు ప్రజలు ఎండలో పనిచేయడం మానేయాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఎండలో తిరగాల్సి వస్తే తలకు రుమాలు చుట్టుకోవడం, వీలైనంత వరకు తెలుపురంగు బట్టలు లేదా లేత రంగుల బట్టలు ధరించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసార్లు మంచినీళ్లు, జ్యూసులు తీసుకోవాలని అంటున్నారు. గ్రామాల్లో రైతులు, వృత్తిపనులు చేసే వారు ఇతరత్రా పనులు చేసేవారు ఎండలో కాకుండా నీడలో పనిచేస్తే మంచిదని.. వీలైనంత వరకు నీళ్లు ఎక్కువగా తాగాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఓవైపు తెలంగాణలో ఎండలు మండిపోతుంటే.. ఏపీలో తుపాను గండం వణికిస్తోంది. ఫణి తుపాను ప్రభావం.. శ్రీకాకుళం, విజయం నగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం వుండే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా వుండే అవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే తుపాను ఎప్పుడు తీరం దాటుతుందనేది అప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు. ఇలా ప్రీమాన్సూన్ సీజన్ తో పాటు.. మాన్సూన్ సీజన్ తర్వాత.. అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా తుపాన్లు ఏర్పడటం సాధారణంగా జరగుతుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే, ఏప్రిల్, మే నెలల్లో ఏర్పడే తుపాన్లు చాలా తీవ్రంగా వుంటాయని.. గాలి తీవ్రతతో పాటు.., అధిక వర్షపాతం నమోదుకావడం జరుగుతుందని చెబుతున్నారు. ఫణి తుపాను తీవ్రంగా ఉండే అవకాశం వున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. గత శుక్రవారం నుంచే మత్సకారులను చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంపై పోర్టులన్నింటికీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఫణి తుపాను ప్రభావం ఎలావుంటుందన్నది పక్కనబెడితే.. ఈసారి మండిపోతున్న ఎండలు మాత్రం.. ఈ ఏడాది దేశంలో కరువును సూచిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈసారి రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. స్కైమెట్ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాలు సాధారణం కన్నా తక్కువగా ఉంటాయని చెప్పింది. పసిఫిక్ మహాసముద్రం సగటు కంటే ఎక్కువ వేడిగా ఉందని.. మార్చి నుంచి మే మధ్య ఎల్ నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో జూన్ నుంచి ఆగస్ట మధ్య వర్షపాతం తగ్గి 60 శాతంగా ఉండవచ్చని స్కైమెట్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటుందని, వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. 2014 నాటి కరువు పరిస్థితులు దాపురించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

గ్లోబల్‌ వార్మింగ్, పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతీ పదేళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతంలో కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి. అయితే ఈసారి మాత్రం 50 డిగ్రీల వరకు కూడా ఎండలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది. 2016, 17 సంవత్సరాల్లో రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్‌నినో ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపే అవకాశం వుందంటున్నారు శాస్త్రవేత్తలు. అకాశం నిర్మలంగా ఉండడంతో పాటుగా కాలుష్యం, అడవుల నరికివేత ప్రస్తుత పరిస్థితికి కారణంగా వాతావరణవేత్తలు చెబుతున్నారు. సాధారణం కన్నా నాలుగు నుండి ఐదు రెట్లు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా మారిపోవడంతో సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల వాటి ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఈ కాలంలో ఆకాశంలో మబ్బుల వల్ల కొద్దిగా ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని అయితే ఆ ఛాయలు కనిపించకపోవడం వల్ల ప్రస్తుతం ఎండ తీవ్ర ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నిపుణల అభిప్రాయం. ఈ పరిస్థితులు చూస్తుంటే.. 2019లో అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్ నినో వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. అధికంగా టెంపరేచర్లు నమోదవుతాయని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. ఎల్ నినో పసిఫిక్ జలాలతో సమ్మిళితమై ఉపఖండం వాతావరణంపై విపరీతమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు.  2018లో శీతలగాలులు దేశమంతా విస్తరించి విపరీతమైన చలి సంభవించినట్టు భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు పడిపోయాయని ఆయన అన్నారు. అయితే కొత్త సంవత్సరంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఎల్‌నినో, ప్రపంచ వాతావరణ మార్పులు ప్రభావం వల్ల వేసవి, శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. ఇక ఎల్‌నినో ముందే ప్రవేశించడం వల్ల రుతుపవనాలు, వర్షాలపైనా తీవ్రంగా ఉంటుందన్నారు. ఏప్రిల్-మే మాసానికి ఎల్‌నినో వెళ్లిపోయినా దాని ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగానే ఉంటుందని ఆయన తెలిపారు. అననుకూల వాతావరణ పరిస్థితులు తీవ్రమైన ప్రభావం చూపుతాయని మహాపాత్ర చెప్పారు. వేడిగాలులు అల్లకల్లోలం రేపుతాయని ఇటీవలే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే తెలంగాణపై వేడిగాలుల ప్రభావం తీవ్రంగా వుంది. ఇదిలావుంటే, ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఇప్పటికే బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 2023 వరకు 150 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు 2015లో మొట్టమొదటిసారి ప్రీ ఇండస్ట్రీయల్ లెవెల్ కన్నా 1 డిగ్రీ అధికంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని గుర్తుచేసిన బ్రిటన్ వాతావరణ శాఖ.. అప్పటి నుండే ఈ పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది. ఈ పెరుగుదల 1.5డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని.. తాత్కాలికంగానే అయినా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల నమోదు ప్రక్రియ మొదలైన 1850 తర్వాత.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2018 నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది పరిస్థితులు చూస్తుంటే.. ఆ రికార్డు బ్రేక్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

ఈ ఏడాది ఎండలు మండిపోతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు జాగ్రతగా ఉండాలన్న సూచనలు వెలువుడుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో, అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చితే మెట్రోనగరాల్లో యూవీ ప్రభావం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ ప్రమాదకర కిరణాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం అలసట, వేడి బయటకు రావడం వంటివి మాత్రమే కాకుండా మీరు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి శరీరం వేడెక్కి నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం కనిపించక తప్పదు. ఒళ్ళంతా చెమటలు, నీరసం, స్పృహ కోల్పోవడం, అధిక దాహం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు.. ఇలా ఎన్నో సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తిరీత్యా బయట తిరిగే వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ పసిపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సీ. అందుకే దీనిబారిన పడినపుడు వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంది. తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ వడదెబ్బబారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చల్లని ప్రదేశంలో ఉండేలా చూసుకోవడం, తరచుగా నీరు తాగడం, తెల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించడం లాంటి చర్యలు తీసుకుంటే వేడిమి తాకిడి నుంచి బయటపడటమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఎండాకాలంలో డీ హైడ్రేషన్‌ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వేసవి తాపానికి విరుగుడుగా నీళ్లతో పాటు పుచ్చకాయలను, ఇతర పళ్లరసాలను తీసుకోవాలి. చల్లటి మజ్జిగ, కొబ్బరి బోండాలు, నిమ్మరసం తాగడం ఉత్తమం. అన్నింటికంటే కీలకం రోజుకి కనీసం మూడు, నాలుగు లీటర్లు మంచి నీరు తాగాలి. ఎండలు తీవ్రంగా ఉన్నందున కెఫెన్ అధికంగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాని వైద్యులు సూచిస్తున్నారు. మఖ్యంగా ఆల్కాహాల్ కు ఎంత దూరంగా వుంటే అంత మంచిది. చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, ఆర్టిఫిషియల్ జ్యూస్ లవల్ల  మరింత డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  ఎండాకాలంలో శరీరానికి అతుక్కుని, బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం ఉత్తమం. లేత రంగు దుస్తులు, లేదంటే తెలుపు దస్తులను ధరించడం మంచిది. బయటకు వెశ్లే సమయంలో తలను పూర్తిగా కప్పే విధంగా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు గొడుగు, సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ వాడాలి.

-ఎస్. కె. చారి