Saturday, August 24, 2019
Follow Us on :

హే భగ భగ వాన్

By BhaaratToday | Published On Mar 14th, 2019

ఏపీలో భగభగలు. తెలంగాణలో సెగలు. ఫిబ్రవరిలోనే నిప్పుల కుంపట్లు. 40కి చేరువలో ఉష్ణోగ్రతలు. కాలం గతి తప్పిందా..? రుతువుల రూటు మారిందా..?  ఉదయం ఏడు గంటలకే సూర్యారావు స్వాగతం పలుకుతున్నాడు. రావడమే ఆలస్యం ఇలా టెంపరేచర్ పంపింగ్ ప్రారంభిస్తున్నాడు. మార్చిలోనే మంటపుట్టిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నాడు. అసలే భారీ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతుంటే, వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఇకముందు భానుడు మరింత రెచ్చిపోతాడని సెలవిచ్చింది. అంతేకాదు, పగటి పూట బయటికి రావొద్దని హెచ్చరికలు జారీచేసింది.
సూర్యభగవానుడు మార్చిలోనే మాడు పగులగొడుతున్నాడు. ఉదయం తొమ్మిది దాటిందంటే చాలు.. బెత్తెం పట్టుకుని భయపెడుతున్నాడు. భానుడి భగ భగలతో జనం విల విలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ సారి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావారణ విభాగం తెలపడంతో హైరానా పడుతున్నారు. కొద్దిరోజులుగా తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌లో 40, నిర్మల్‌, బోధన్‌లలో 39.9, ఖమ్మం జిల్లా పెనుబల్లి, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలలో 39.8, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల, భూపాలపల్లి మల్హర్‌మండలం తాడిచెర్లలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ సోమవారం ప్రకటించింది. అటు గాలిలో తేమ శాతం తగ్గిన కారణంగా ఉష్ణోగ్రతలు పెరగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుంటే, పలుచోట్ల ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మృత్యవాత పడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో వడదెబ్బతో ఐదుగురు చనిపోయారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన ముగ్గురు ఉపాధి కూలీలతో పాటు.. ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. వెలుగులోకి రాని ఘటనలు ఇంకా ఎక్కువే ఉండే అవకాశం వుంది. తెలంగాణలో 1971 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 2010, 2016 సంవత్సరాల్లో వడగాడ్పులు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతోపాటు 2015లో రాష్ట్రంలో అత్యధికంగా 540 మంది వడదెబ్బతో మరణించారు. 2008 నుంచి 2018 మధ్య తెలంగాణలో 1711 మంది ఎండలకు ప్రాణాలు వదిలారు. పదేళ్లలో 211 రోజులు వడగాడ్పులు వీచినట్లు వాతావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా సాధారణ ఉష్ణోగ్రత కన్నా 0.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం అనంతపురం కడపలో 40.2, కర్నూలులో 39.9, తిరుపతిలో 39.7 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో రాయలసీమ, కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని పలుచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్ సొసైటీ అధికారులు తెలిపారు.  అటు ఏపీలో హీట్‌ ఇండెక్స్ కూడా 42 డిగ్రీలు దాటి పరుగులు పెడుతోంది. బయట వాతావరణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లుగా శరీరం అనుభూతి చెందడాన్ని హీట్ ఇండెక్స్‌ అంటారు. వాతావరణ ఉష్ణోగ్రత, సాపేక్ష తేమ శాతం ఆధారంగా హీట్ ఇండెక్స్‌ను కొలుస్తారు. వాతావరణంలో ఉష్ణోగ్రత 32 ఉన్నా మన శరీరం 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు అనుభూతి చెందుతుంది. ఈ ఏడాది వేసవిలో కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 6 డిగ్రీల వరకూ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రత ఎలా ఉన్నా, హీట్ ఇండెక్స్ కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలను దాటడం ఆందోళన కల్గించే అంశమే. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు, ప్రజలు, ఉపాధి కూలీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు తెలుగు రాష్ట్రాల్లో అల్ట్రా వయొలెట్‌ రేడియేషన్‌ ఇండెక్స్‌ కూడా ‘పది’ పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్‌ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది. యూవీ సూచీ పెరిగితే అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల చర్మంపై దద్దర్లు రావడమే కాకుండా.. మంటపుడుతుంది.  సూచీ తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్‌ 6 ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్‌బర్న్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచీ 12 కనుక ఉంటే 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచీని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచీ ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తుంటాయి. ఇక తెలంగాణతో పాటు దేశంలో పెరుగుతున్న వెట్‌ బల్బ్ కూడా భయాందోళనలు కలిగిస్తోంది. ఉష్ణోగ్రత, తేమశాతం కలిపి వెట్‌ బల్బ్‌ అంటారు. ఇప్పుడు వెట్‌ బల్బ్ 31 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం శాస్త్రవేత్తలు, నిపుణులను కలవరపెడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌, పచ్చదనం తరిగి పోతుండటంతో ఇది పెరుగుతూ వస్తోంది. సాధారణంగా మానవుని శరీర అంతర్గత ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌. చర్మం ఉష్ణోగ్రత 33-36 డిగ్రీలు. ఈ స్థితిలో సహజ సిద్ధంగా జీవక్రియలతో వేడెక్కే శరీరాన్ని చల్లబరిచేందుకు దేహం చర్మంపైకి చెమటను విడుదల చేస్తుంది. వెట్‌ బల్బ్‌ ఉష్ణోగ్రత కనుక చర్మం ఉష్ణోగ్రతను అధిగమిస్తే జీవ క్రియలు దెబ్బతింటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రకృతి విధ్వంసం, పట్టణీకరణల ప్రభావం కూడా వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయని సూచిస్తున్నారు. సాధారణంగా మానవునిలో జరిగే జీవ క్రియలతో శరీరంలో 100 వాట్స్‌ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వేడిని చల్లబరిచేందుకు శరీరం చెమటను విడుదల చేస్తుంది. ఒక వేళ వాతావరణంలో ఉష్ణోగ్రత.. దేహం ఉష్ణోగ్రతను దాటితే బయటి వేడిని శరీరం స్వీకరిస్తుంది. దీనినే వడదెబ్బగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఈ వేడిమిని తట్టుకున్నప్పటికీ 40 డిగ్రీలు దాటినట్లయితే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఇక ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని అనుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రత 31 డిగ్రీలు ఉన్నప్పుడు గాలిలో తేమ 100 శాతానికి చేరితే ఆ సమయంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఎంత ప్రభావం చూపుతుందో అలా ఉంటుందని వివరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉంటే సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణకు 50 డిగ్రీల వద్ద తేమ శాతం 40కి తగ్గితే కంట్లో నీరు కూడా ఆవిరై కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడే వారిలో అవయవాలు ఒక్కొక్కటి నీరసించి పోతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 1880 నుంచి సగటు ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగిందని ఆయన పేర్కొంటున్నారు. దీనివల్ల వేసవిలో మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని.. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీటిని తాగాలని సూచిస్తున్నారు.

అప్పుడే ఏమైంది.. అసలు మంటలు ముందున్నాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.  ఏప్రిల్, మే నెలల్లో రికార్డులు బద్దలకావడం దాదాపు ఖాయమేనంటున్నారు. 2016, 17 లో అన్నదాత వెన్నువిరిచిన ఎల్ నినో ఈసారి కూడా పొంచిందని చెబుతున్నారు.  గ్లోబల్‌ వార్మింగ్, పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతీ పదేళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతంలో కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి. అయితే ఈసారి మాత్రం 50 డిగ్రీల వరకు కూడా ఎండలు పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. 2016, 17 సంవత్సరాల్లో రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్‌నినో ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపే అవకాశం వుందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అంచనాలు ప్రస్తుతానికి మాత్రమేనని, ఈ ఏడాది రుతుపవనాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మార్చి చివరినాటికి, లేదంటే ఏప్రిల్‌ 15 నాటికి మాత్రమే తెలుస్తుందంటున్నారు. అకాశం నిర్మలంగా ఉండడంతో పాటుగా కాలుష్యం, అడవుల నరికివేత ప్రస్తుత పరిస్థితికి కారణంగా వాతావరణవేత్తలు చెబుతున్నారు. సాధారణం కన్నా నాలుగు నుండి ఐదు రెట్లు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా మారిపోవడంతో సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల వాటి ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఈ కాలంలో ఆకాశంలో మబ్బుల వల్ల కొద్దిగా ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని అయితే ఆ ఛాయలు కనిపించకపోవడం వల్ల ప్రస్తుతం ఎండ తీవ్ర ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నిపుణల అభిప్రాయం. ప్రపంచ వ్యాప్తంగా భూవాతావరణం వెడెక్కడం వంటి కారణాలు కూడా కలిపి మార్చి రాకుండానే ఎండలు మండిస్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తుంటే.. 2019లో అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్ నినో వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. అధికంగా టెంపరేచర్లు నమోదవుతాయని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్- 2019 ఫిబ్రవరి వరకూ ‘ఎల్ నినో’ ప్రభావం అధికంగా ఉండి, 75-80 శాతం నమోదవుతుందని సంస్థ తెలిపింది. ఎల్ నినో పసిఫిక్ జలాలతో సమ్మిళితమై ఉపఖండం వాతావరణంపై విపరీతమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు.  2018లో శీతలగాలులు దేశమంతా విస్తరించి విపరీతమైన చలి సంభవించినట్టు భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు పడిపోయాయని ఆయన అన్నారు. అయితే కొత్త సంవత్సరంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఎల్‌నినో, ప్రపంచ వాతావరణ మార్పులు ప్రభావం వల్ల వేసవి, శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర స్పష్టం చేశారు. ఇక ఎల్‌నినో ముందే ప్రవేశించడం వల్ల రుతుపవనాలు, వర్షాలపైనా తీవ్రంగా ఉంటుందన్నారు. ఏప్రిల్-మే మాసానికి ఎల్‌నినో వెళ్లిపోయినా దాని ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగానే ఉంటుందని ఆయన తెలిపారు. అననుకూల వాతావరణ పరిస్థితులు తీవ్రమైన ప్రభావం చూపుతాయని మహాపాత్ర చెప్పారు. వేడిగాల్పులకు అల్లకల్లోలం రేపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఇప్పటికే బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 2023 వరకు 150 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతల పరిస్థితులను వివరిస్తూ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు 2015లో మొట్టమొదటిసారి ప్రీ ఇండస్ట్రీయల్ లెవెల్ కన్నా 1డిగ్రీ అధికంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరిగిందని గుర్తుచేసిన బ్రిటన్ వాతావరణ శాఖ.. అప్పటి నుండే ఈ పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది. ఈ పెరుగుదల 1.5డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని.. తాత్కాలికంగానే అయినా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల నమోదు ప్రక్రియ మొదలైన 1850 తర్వాత.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2018 నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది పరిస్థితులు చూస్తుంటే.. ఆ రికార్డు బ్రేక్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు వాతావరణ శాఖా నిపుణులు.

ఎండ వేడికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎండ బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు పగటి పూట బయటకు వెళ్లే సాహసం చేయడంలేదు. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు జాగ్రతగా ఉండాలన్న సూచనలు వెలువుడుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో, అతినీలలోహిత  కిరణాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చితే మెట్రోనగరాల్లో  యూవీ ప్రభావం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ ప్రమాదకర కిరణాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  వేసవిలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం అలసట, వేడి బయటకు రావడం వంటివి మాత్రమే కాకుండా మీరు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి శరీరం వేడెక్కి నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం కనిపించక తప్పదు. ఒళ్ళంతా చెమటలు, నీరసం, స్పృహ కోల్పోవడం, అధిక దాహం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు.. ఇలా ఎన్నో సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తిరీత్యా బయట తిరిగే వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ పసిపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.  వడదెబ్బ అనేది ఒక మెడికల్ ఎమెర్జెన్సీ. అందుకే దీనిబారిన పడినపుడు వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి. లేదంటే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంది. తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ వడదెబ్బబారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చల్లని ప్రదేశంలో ఉండేలా చూసుకోవడం, తరచుగా నీరు తాగడం, తెల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించడం లాంటి చర్యలు తీసుకుంటే వేడిమి తాకిడి నుంచి బయటపడటమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఎండాకాలంలో డీ హైడ్రేషన్‌ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వేసవి తాపానికి విరుగుడుగా నీళ్లతో పాటు పుచ్చకాయలను, ఇతర పళ్లరసాలను తీసుకోవాలి. చల్లటి మజ్జిగ, కొబ్బరి బోండాలు, నిమ్మరసం తాగడం ఉత్తమం. అన్నింటికంటే కీలకం రోజుకి కనీసం మూడు, నాలుగు లీటర్లు మంచి నీరు తాగాలి. ఎండలు తీవ్రంగా ఉన్నందున కెఫెన్ అధికంగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాని వైద్యులు సూచిస్తున్నారు. మఖ్యంగా ఆల్కాహాల్ కు ఎంత దూరంగా వుంటే అంత మంచిది. చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, ఆర్టిఫిషియల్ జ్యూస్ లవల్ల  మరింత డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  ఎండాకాలంలో శరీరానికి అతుక్కుని, బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం ఉత్తమం. లేత రంగు దుస్తులు, లేదంటే తెలుపు దస్తులను ధరించడం మంచిది. బయటకు వెశ్లే సమయంలో తలను పూర్తిగా కప్పే విధంగా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు గొడుగు, సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ వాడాలి.