Thursday, October 17, 2019
Follow Us on :

వార్ ఆఫ్ వెనెజులా..

By BhaaratToday | Published On May 4th, 2019

వెనెజులాలో రాజకీయ సంక్షోభం. అగ్నికి ఆజ్యం పోస్తున్న అగ్రరాజ్యం. విపక్షనేతను ఎగదోస్తున్న ట్రంప్. అధ్యక్షుడికి అండగా పుతిన్. చమురు దేశంపై కర్రపెత్తనం. అమెరికా వైఖరిపై ఆగ్రహం. వార్ ఆఫ్ వెనెజులా.. 

వెనెజులా విపక్ష నేత జువాన్ గువాయుడో తిరుగుబాటుతో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం ముదిరిపాకన పడింది. జనవరిలో గువాయుడో తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించకున్నప్పటి నుంచి వెనెజులాలో ఇంటర్నల్ వార్ మొదలైంది. అధ్యక్షుడు మదురో, విపక్ష నేత గువాయుడోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వెనెజులా సంక్షోభం కాస్తా.. ఇప్పుడు అమెరికా, రష్యాల మధ్య పోరుగా మారింది. విపక్ష నేత గువాయుడోకు మద్దతు పలుకుతున్న అమెరికా రాజకీయ సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు మదురోకు వెన్నుదన్నుగా నిలిచిన రష్యా.. అమెరికా కుట్రలను భగ్నం చేస్తోంది. వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఆ దేశంలోని సహజవనరైన చమురే కారణమా..? ఆ దేశంలో గల అపార చమురు నిల్వలపై ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా, రష్యా పోటీపడుతున్నాయా..? అందుకే, దేశీయ దళారీ పాలక వర్గాలతో కుమ్మక్కయి అమెరికా, దాని ఐరోపా మిత్ర దేశాల చమురు కంపెనీలు.. వెనెజులాలో రాజకీయ సంక్షోభం సృష్టించాయా..? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉరిము ఉరిమి మంగళం మీద పడట్టు.. ప్రపంచాన్ని శాసించాలనే అమెరికా యావ.. అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. చమురు నిల్వలు పుష్కళంగా వున్న దేశాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా.. ఇప్పటికే ఇరాక్, లిబియాదేశాలను చెరబట్టింది. ఆ దేశాధినేతల ప్రాణాలు తీసింది. మొన్నటికి మొన్న పశ్చిమాసియాలో తమ అదుపాజ్ఞల్లో లేని ఇరాన్ పై పడింది. ఇప్పుడు వెనెజులాలో రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసింది.

పెట్రో దేశమైన వెనెజులాలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్ష పదవి విషయంలో ఘర్షణలు చెలరేగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తానే దేశ అధ్యక్షుడినని ప్రతిపక్ష నేత గువాయుడో ప్రకటించుకున్నారు. అధ్యక్షునిగా ఆయనను గుర్తిస్తున్నట్టు అమెరికాతో పాటు, పొరుగుదేశాలైన బ్రెజిల్‌, కొలంబియా, పెరు, అర్జెంటినాలు ప్రకటించాయి. అయితే ఈ చర్యను రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు ఖండించాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్‌ మదురోకే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాలని ఐక్యరాజ్య సమితి సూచించగా, తాజాగా ఎన్నికలు జరపడమే మేలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడింది. చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ మదురో పాలనలో వెనెజులా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయన సైన్యం, రష్యా సహకారంతో పాలన కొనసాగిస్తున్నారు. పరిస్థితులను గమనించిన విపక్ష నేత గువాయుడో తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను దేశ తాత్కాలిక నేతగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన విడుదల చేశారు. దీనికి బదులుగా అమెరికాతో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు మదురో తెలిపారు. అయితే మాజీ అధ్యక్షునిగా మారినందున ఆయనకు ఆ అధికారం లేదని అమెరికా తిప్పికొట్టింది. ఇలా వెనెజులా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టింది అమెరికా. దీంతో కొన్ని నెలలుగా వెనెజులాలో రాజకీయ, భద్రతా పరిస్థితులు క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు జువాన్‌ గువాయుడో, నికోలస్‌ మదురోను గద్దె దింపేందుకు పోరాడాలని పిలుపు నిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో సైన్యం కూడా తమకు మద్దతు ఇవ్వాలని గువాయుడో కోరారు. కానీ సైన్యం దీనిని పట్టించుకోలేదు. తాము మదురో వెనుకే ఉన్నామని సైన్యం ప్రకటించింది. అయితే ట్రంప్‌ కార్యవర్గం గువాయుడోకు పూర్తి మద్దతుగా నిలిచింది. అతనికి మద్దతుగా ట్వీట్లు కూడా చేసింది. గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష నేత గువాయుడో అమెరికాతో టచ్‌లో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో అమెరికా నుంచి గువాయుడోకు అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు లభించలేదు. దీంతో ఈ తిరుగుబాటును.. అధ్యక్షుడు మదురోకు మద్దతుగా ఉన్న సైన్యం అణచి వేసింది. ఈ అణిచివేత సందర్భంగా చెలరేగిన హింసలో దాదాపు 52 మంది గాయపడ్డారు. ఇదిలావుంటే, వెనిజులా అధ్యక్షుడు మదురో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు తనతో చేతులు కలపాలంటూ ప్రతిపక్ష నేత జువాన్‌ గువాయుడో ఇచ్చిన పిలుపును ఆ దేశ రక్షణ మంత్రి వ్లాదిమిర్‌ పడ్రినో తీవ్రంగా ఖండించారు. మదురో సర్కారును కూలదోసేందుకు ప్రయత్నిస్తే వెనిజులా సైనికదళాలు తగిన విధంగా బుద్ధి చెబుతాయని ఆయన హెచ్చరించారు. దేశంలో హింసను రెచ్చగొట్టేందుకు ఉద్దేశించిన గైడో కుతంత్రాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అని అన్నారు. దేశంలో హింస, భయభ్రాంతులను సృష్టించేందుకు కొందరు కుహనా రాజకీయ నేతలు సైన్యాన్ని, పోలీసులను పావులుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.  మదురో సర్కారుకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో చేతులు కలిపేందుకు ముందుకు రావాలంటూ గువాయుడో చేసిన ప్రకటనను ఆ దేశ కమ్యూనికేషన్ల మంత్రి జార్జ్‌రోడ్రిగ్జ్‌ కూడా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు సైన్యంలోని 'కొంతమంది ద్రోహులు' ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ద్రోహుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన తన ట్వీట్ లో హెచ్చరించారు. మొత్తానికి, ప్రతిపక్ష నేత గువాయుడోను పావుగా చేసుకుని అమెరికా ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. వెనిజులాలో క్యూబా దళాలు ఉన్నాయంటూ అసత్యాలను అలవోకగా ప్రచారంలో పెడుతోంది. క్యూబా దళాలు లేకపోయినా ఉన్నాయని చెబుతూ, అమెరికా నేరుగా తన సైన్యాన్ని దించేందుకు పథక రచన చేసింది. అమెరికా అండ చూసుకుని మితవాద నేత గువాయుడో ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నాడు. దేశంలో అశాంతిని రెచ్చగొడుతున్నాడు. మదురోను అధికారం నుండి తొలగించేందుకు చివరి ప్రయత్నంగా లక్షలాది మంది వెనిజులియన్లు వీధుల్లోకి రావాలంటూ గువాయుడో ట్విట్టర్‌లో ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. రాజధాని కారకాస్‌ నగరంలో అధికశాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధుల్లోకి వచ్చిన కొద్ది మంది దాడులు, దౌర్జన్యాలకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు నేషనల్‌ గార్డ్స్‌ బాష్పవాయువును ప్రయోగించారు.  బుధవారం నాడు భారీ మేడే ర్యాలీని ఉద్దేశించి మదురో మాట్లాడుతున్నప్పటి ఫొటోలు మీడియాలో వచ్చినా, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు బోల్టన్‌ మాత్రం పచ్చి అబద్ధాలాడాడు. మేడే నాడు బహిరంగంగా ర్యాలీలో మాట్లాడాల్సిన మదురో బంకర్లలో దాక్కున్నాడని, దీనికి భిన్నంగా గువాయుడో చాలా ధైర్యంగా వెనిజులా ప్రజలకు నాయకత్వం వహిస్తూ వాహనంలో ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారని బోల్టన్‌ ట్వీట్‌ చేశాడు. బోల్టన్‌ తప్పుడు ప్రచారాన్ని వెనిజులా ప్రభుత్వం ఖండించింది. బోల్టన్‌ అసత్య ప్రచారంలో నాజీలను మించిపోయాడని వెనిజులా విదేశాంగ మంత్రి జోర్గె అరేజా అన్నారు.  ఇక గత నెల 30న వెనిజులాలో సైనిక కుట్రకు జరిగిన యత్నాల వెనుక అమెరికా ప్రభుత్వం, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ఉన్నారని వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో వెల్లడించారు. ఈ కుట్రకు బాధ్యులైన అమెరికా ప్రభుత్వంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంనాడు జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి అధ్యక్షుడు మదురో ప్రసంగించారు. మంగళవారం నాటి కుట్రకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ నేతృత్వం వహించారని మదురో చెప్పారు. వెనిజులా ప్రజలు ముక్తకంఠంతో ఈ నేరగాళ్ల ముఠాను తిరస్కరిం చటం వల్లే ఈ కుట్ర విఫలమైందని అన్నారు. వెనిజులాలో అమెరికా కుట్రలను రష్యా తీవ్రంగా విమర్శించింది. మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తనకు సహకరించాలంటూ గైడో ఇచ్చిన పిలుపును సైనిక దళాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. అమెరికా ప్రలోభాలకు ఎవరూ లొంగరాదని, ఒకవేళ ఎవరైనా తప్పుడు మార్గం తొక్కితే వారిని క్షమించేది లేదని సైన్యం స్పష్టంగా హెచ్చరించింది. సైన్యం యావత్తూ ఇప్పటికీ మదురో వెంట వుందని తెలిపింది. ఇదిలావుంటే, మదురో సర్కారుపై ఆంక్షలు విధించిన ట్రంప్‌ ప్రభుత్వం వెనిజులాలో అన్ని రకాల యత్నాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో గురువారం బహిరంగంగా ప్రకటించాడు. అయితే, వెనిజులా విషయంలో అమెరికా ఏ మాత్రం దూకుడుగా వ్యవహరించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లెవరోవ్‌ అమెరికాను హెచ్చరించారు. మొత్తానికి ప్రజాస్వామ్యం పేరుతో పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టే అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం రాలేదు. భౌగోళిక రాజకీయాల్లో రష్యా ఎంత బలమైందో అమెరికాకు మరోసారి అర్థమైంది. దీంతో వెనెజులాలో అధికార మార్పిడికి చేసిన తిరుగుబాటు యత్నం విఫలమైంది.

జనవరి నెలలో వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గువాయిడో తనకు తాను ప్రకటించుకున్నాడు. ఆ తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మదురో ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రలు చేస్తూ వచ్చాడు. అంతిమంగా అమెరికా ప్రోద్బలంతో మంగళవారంనాడు తిరుగుబాటుకు విఫలయత్నం చేసాడు. వెనెజులా సైన్యంగానీ, పోలీసులుగానీ, ప్రజలుగానీ తిరుగుబాటుకు అనుకూలంగా స్పందించలేదు. వాలంటాడ్‌ పాపులర్‌ పార్టీని లోపెజ్‌ స్థాపించాడు. జాతీయ శాసనసభలో ఈ పార్టీకి గువాయిడో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ శాసనసభకు 2015లో ఎన్నికలు జరిగాయి. 2017లో రాజ్యాంగ శాసన సభకు ఎన్నికలు జరగటంతో ఈ శాసనసభ రద్దయినట్టేనని మదురో ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా ప్రభుత్వ ప్రోద్బలంతో వెనెజులాలో జరిగిన ఈ ఘటన 1954లో గువాతెమాలాలో, 1964లో బ్రెజిల్‌లో, 1973లో చిలీలో, 1979-1990 సంవత్సరాల మధ్య కాలంలో నికరాగ్వాలో, 1979-1992 సంవత్సరాల మధ్యకాలంలో ఎల్‌ సాల్వెడార్‌ 1983లో గ్రెనడాలో, 1994లో హైతీలో జరిగిన సంఘటనలను తలపిస్తున్నాయి. వేరేమాటల్లో చెప్పాలంటే 2019లో అమెరికా ప్రభుత్వం లాటిన్‌, దక్షిణ అమెరికా దేశాలపట్ల వ్యవహరించే విధానం గతంలో తాను అవలంబించిన హింసాత్మక సామ్రాజ్యవాద పంథాను తలపిస్తోంది. అమెరికా ఈ దేశాలను తన సొంత ఆస్తిగా భావిస్తోంది. ఆయా దేశాలలో తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పెత్తనం సాగిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ వెనెజులా ప్రతిపక్ష నాయకుడు జువాన్‌ గువాయిడోతో తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ దేశంలోని అపార చమురు వనరులపై పట్టును సాధించాలనేది అమెరికా వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పుడు సమస్య వెనెజులా ప్రజల ముందు, సైన్యం ముందు ఉంది. వెనెజులా ప్రజలు, సైన్యం విడదీయరాని బంధంలో ఉన్నారు. మదురో ప్రభుత్వం కొనసాగటం వెనెజులాకే కాకుండా ఆ ప్రాంతం మొత్తానికి కూడా అవసరం. అయితే అమెరికా ప్రేరేపిత సైనిక తిరుగుబాట్లను ప్రజలు, సైన్యం ఎంతవరకు ఎదిరించి నిలబడగలుగుతారు, ఎంతవరకు ప్రతిఘటించగలుతారు అనేదాని పైనే వెనెజులా భవిష్యత్తు ఆధారపడి ఉంది. వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఆ దేశంలోని సహజవనరైన చమురే కారణం. ఆ దేశంలో గల అపార చమురు నిల్వలపై తిరిగి ఆధిపత్యం సాధించటానికి దేశీయ దళారీ పాలక వర్గాలతో కుమ్మక్కయి అమెరికా, దాని ఐరోపా మిత్ర దేశాల చమురు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే ఈ సంక్షోభం.  1999లో భూసంస్కరణ, సంపద పునఃపంపిణీ, సామాజిక న్యాయం, సామ్రాజ్యవాదంపై పోరువంటి ప్రజారంజక కార్యక్రమం ఆధారంగా హ్యూగో చావెజ్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూలదోయటానికి అమెరికా చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. ప్రపంచంలో ఉన్న సైనిక శక్తినంతా ఉపయోగించినా ఒక సామ్రాజ్యాన్ని అధికారంలో కొనసాగించటం సాధ్యంకాదనే చరిత్ర చెబుతున్న పాఠాలను ఇంకా అమెరికా పాలక వర్గాలు నేర్వలేదు. పర్షియన్‌, గ్రీక్‌, రోమన్‌, ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ సామ్రాజ్యాలు అలానే కాలగర్భంలో కలిసిపోయాయి.  హ్యూగో చావెజ్‌ చెప్పినట్టుగా అమెరికా సామ్రాజ్యవాదంతో భూగోళానికే పెనుప్రమాదం ఏర్పడింది. ఈ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటించటానికి యావత్‌ ప్రపంచ ప్రజాస్వామిక శక్తులు పూనుకోవాలి. అటువంటి ప్రతిఘటనకు నేడు వెనెజులా మొదటి వరుసలో ఉంది. అన్యాయం ఎక్కడ జరిగినా అది న్యాయానికి విఘాతంగా మారుతుందనే స్పృహతో వెనెజులా ప్రజలకు సంఘీబావం తెలుపడమే నేడు ప్రజాస్వామికవాదులందరి ముందున్న కర్తవ్యం.

వెనెజులా.. మూడు కోట్ల జనాభా కలిగిన అతి చిన్న దేశం. వైశాల్యం పరంగా చూస్తే మనదేశంలో నాలుగో వంతు. అయినా కరువు తాండవిస్తోంది. దాదాపు నరమాంస భక్షకులులా బ్రతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అక్కడి ప్రజలకు వ్యవసాయం లేదు, పంటలు లేవు, పశువులు లేవు, పాలు లేవు, అన్ని నదులు, చుట్టూ సముద్రం ఉండి కూడా మత్స్య సంపద ఉపయోగపడదు. కారణం ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం. మన ఒక్క రూపాయికి 3607 వెనెజులా బోలివర్స్ వస్తాయి. ఒకప్పుడు మన కంటే ధనిక దేశం. ఒకప్పుడంటే ఎప్పుడో కాదు. కేవలం 20 సంవత్సరాల క్రితం వరకు కూడా మనకంటే ధనిక దేశమే. రోజుకు మిలియన్ బారెల్స్ వెలికి తియ్యగల ఆయిల్ నిక్షేపాలు ఆ దేశం సొంతం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఏర్పడ్డ పెట్రోల్ అవసరాలను తీర్చిన దేశం వెనెజులా అంటే అతిశయోక్తి కాదు. సరిగ్గా అప్పుడే ఆ దేశంలో రాజకీయ నాయకులు వింత వింత మేనిఫెస్టోలతో ముందుకు వచ్చారు. అన్నీ ఫ్రీ అంటూ సెలవిచ్చారు. ఇంకేముంది ప్రజలు సోమరులయ్యారు. 1950, 60 లలో ప్రపంచ దేశాలు ఉత్పాదకలో పోటీ పడుతుంటే, అక్కడి ప్రజలు గుండు సూది కూడా దిగుమతి చేసుకున్నారు. ప్రపంచానికి వారివద్ద ఉన్న ఆయిల్ ఇచ్చి ప్రతిదీ దిగుమతి చేసుకున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చాయి. ఉచిత భోజనం, ఉచిత వైద్యం, అన్ని సేవలూ ఉచితమే. విదేశీయులు వస్తే కూడా.. వారి ఉచిత సేవలు మాకెందుకంటూ పని చేయనివ్వలేదు. దీంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది వెనెజులా. ఇప్పుడు దీనిని సాకుగా చూపిస్తూ.. అక్కడి ప్రజల దీనస్థితికి ప్రస్తుతం మదురో ప్రభుత్వమే కారణమంటూ మండిపడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి వెనెజులాను గట్టెక్కిస్తామంటూ బీరాలు పలుకుతోంది. అయితే, దీని వెనుక వెనెజులాలో వున్న అపార చమురు సందపదను గుప్పిట్లో పెట్టుకునే కుటిల పన్నాగం వుందనేది అక్షర సత్యం. అందుకే, విపక్ష నేత జువాన్ గుయిడోను ఉసిగొల్పింది. ఆ దేశంలో రాజకీయ సంక్షోభాన్ని రాజేసింది.  ఒక్క వెనెజులా మాత్రమే కాదు.. ఆయల్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలపైనా ఆంక్షల పేరుతో అణచివేయాలని చూస్తోంది అమెరికా. మొన్నటికి మొన్న ఇరాన్ పైనా ఆంక్షల పేరుతో ఆ దేశ చమురు ఎగుమతులకు అడ్డుకట్ట వేసింది. ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలకు మినహాయింపులు కట్ చేసి.. ఆ దేశాన్ని ఆర్థిక దిగ్బంధం చేసేందుకు ప్లాన్ చేసింది. ఏడాది కిందట కూడా ఇలాగే చమురు దిగుమతిని నిలిపేయాలని భారత్, చైనా సహా మిగతా దేశాలను ఆదేశించింది. ఇరాన్‌ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవాలని అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. అమెరికా చేపట్టిన ఈ చర్యతో.. ఇరాన్ మీది కోపం భారత్‌ లాంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు శాపంగా మారింది. చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం పశ్చిమాసియాపై కన్నేసిన అమెరికా చేయని దాష్టీకం లేదు. గతంలో వివిధ దేశాలను అనేక సాకులతో అదిరింపు బెదిరింపులకు గురిచేసి లొంగదీసుకునే చర్యలకు దిగింది. అంతర్గత ప్రజాస్వామ్య పరిరక్షణ, అణ్వస్త్ర ప్రమాదాన్ని నివారించే పేరిట నేరుగా జోక్యం చేసుకుని ఆయా దేశాలలోని రాజకీయ వ్యవస్థలను కూలదోసింది.  తమ భూభాగాల్లో చమురు నిల్వలు ఉండటమే ఇరాక్, లిబియాలాంటి దేశాలకు శాపంగా మారింది. అమెరికా చెరబట్టి ఆ దేశాధినేతల ప్రాణాలనే తీసింది. పశ్చిమాసియాలో అమెరికా అదుపాజ్ఞల్లో లేని దేశంగా ఇరాన్ ఒకటే మిగిలి ఉంది. ఇప్పుడు ఇరాన్ ను కూడా లొంగదీసుకుంటే పశ్చిమాసియా ఆసాంతం తన అదుపాజ్ఞాల్లో ఉంటుందని ఎత్తుగడలు వేస్తోంది. దీంతో ప్రాచ్య, యూరప్ దేశాలన్నీ తన కనుసన్నల్లోకి వస్తాయని అగ్రరాజ్యం కుటిల పన్నాగం. ఇందుకోసం ఎప్పటిలాగానే అణ్వాస్ర్తాలు తయారుచేస్తున్నారన్న సాకును బయటకు తీసింది. గతంలో ఇరాక్‌పై కూడా ఇదే సాకుతో దాడిచేసింది. ఇప్పుడు ఇరాన్ వంతు అయ్యింది.  కొన్నేళ్లుగా అమెరికా ఆంక్షలతో ఇరాన్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. పాలు, ఔషధాలు, నిత్యావసరాలూ తీరని దుర్భరస్థితిలో ఇరాన్‌లో ప్రజలు, పసిపిల్లలు చనిపోతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవటం ద్వారా ఇరాన్‌ను పూర్తిగా దిగ్బంధం చేసి పాదాక్రాంతం చేసుకోవటానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఉరిమి ఉరిమి ఊరుమీద పడ్డట్లు అమెరికా ఆగ్రహం ఇరాన్ మీద అయితే, దాని ప్రభావం చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఎందుకు అనుభవించాలన్నదే ఆలోచించాల్సిన అసలు విషయం. మన దేశ అవసరాల్లో 80 శాతం చమురు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. భారత్‌ కు అధికంగా చమరు సరఫరా చేసున్న దేశాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్ ఉన్నాయి. ఇరాన్ నుంచి రోజుకు రెండు లక్షల బ్యారెళ్ల ముడిచమురు భారత్‌కు దిగుమతి అవుతోంది. ఇంత పెద్ద మొత్తం చమురు దిగుమతి ఆగిపోతే దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఏర్పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని తాకుతాయి. ఇలా అమెరికా చమురు దాహం భారత్ తో పాటు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

-ఎస్. కె. చారి