Thursday, September 19, 2019
Follow Us on :

ఓటంటే ఒక్క రోజు తంతేనా..?

By BhaaratToday | Published On Apr 10th, 2019

ఓటంటే.. ఐదేళ్ల నీ అభివృద్ధి. నీ పౌరసత్వానికి అస్తిత్వం. ప్రజాస్వామ్యానికి దిక్సూచి. కానీ, మనలో ఎంతమంది ఓటేస్తున్నాం..? అసలు ఎందుకు ఓటెయ్యాలి..? ఎలాంటివారికి ఓటేయాలి..? ఓటంటే..?.. 

ఓటు.. ప్రతి పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ఓటు అనే ఆయుధానికి ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఉంది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలనే తాపత్రయం ఉంటే సరిపోదు.. ఓటు వేయడం ముఖ్యమే. పద్ధెనిమిదేళ్లు దాటిన ప్రతి యువకుడు ఓటరుగా నమోదైతే.. దేశ రాజకీయ చిత్రమే మారిపోతుంది. ఎన్నికల వ్యూహంలో మార్పులు వస్తాయి. ప్రస్తుతం కులాల ఆధారంగా సాగుతున్న రాజకీయ వ్యవస్థ.. వయోజన ఓటర్ల ఆధారిత వ్యవస్థగా మారుతుంది. కానీ, యువత అందుకు సాహసించడంలేదు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన యువతీ, యువకులు ఇప్పటికీ పోలింగ్ బూత్ కు దూరంగానే వుంటున్నారు. ఇదే ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 62 ప్రకారం.. ఓటర్ల జాబితాలో పేరున్న ఓటర్లందరూ ఓటు వేయడానికి అర్హులే. ఇంత స్పష్టంగా రాజ్యాంగమే చెప్తున్నా చాలామంది ఓటు వేయడానికి ఎందుకు ఆసక్తి కనబర్చడం లేదు..? ఓటు హక్కు అనేది రాజ్యాంగపరంగా పౌరుడికి ప్రసాదించిన కీలకమైన హక్కు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా మౌలికమైన ఆధారమని సాక్షాత్తు సుప్రీంకోర్టే 2013లో స్పష్టం చేసింది. అయినా ఓటర్లలో తగినంత చైతన్యం రావడం లేదు.

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు పడే పాట్లు, చేసే ఫీట్లు అన్నీఇన్నీ కావు. ఎప్పుడూ మురికివాడల్లోకి అడుగు పెట్టనివారు ఎన్నికలనగానే ఇల్లిల్లూ తిరిగి ఓట్లడుగుతారు. సమస్య చెప్పడానికి వెళ్తే వినేందుకు సమయం లేదని చెప్పేవాళ్లు.. తాము ఎన్నికైతే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెబుతారు. తమ అధికారం, పలుకుబడి అన్నీ పక్కనపెట్టి జనంలో ఒకడిగా కలిసిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఓటర్లని ఆకట్టుకొనేందుకు టీ బంకులో చాయ్ వాలా అవుతారు. ఇస్త్రీ చేస్తారు. చెత్త ఊడుస్తారు. ఇంకెన్ని పనులైనా చేస్తారు. కార్మికుల ఓట్ల కోసం కూలీ పనులు, రైతులకు గాలం వేసేందుకు వ్యవసాయ పనులు, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటి పనులు చేస్తూ ఫొటోలకు పోజులిస్తారు. చివరకు చిన్నపిల్లల ముక్కులు తుడుస్తూ ఫొటోలు తీయించుకున్నసందర్భాలూ ఉన్నాయి. ఇలా శుష్క వాగ్దానాలు చేసే నాయకులకు ఓటేయాలా..? అసలు ఎందుకు ఓటేయాలి..? ఎవరికి ఓటేయాలి..? కనీస వాగ్దానం చేసేవారికి ఓటు వేయాలి. సాధ్యంకాని, అమలుకాని పనులు చేస్తామని ఉచిత హామీలు ఇచ్చేవారికి కాకుండా సాధ్యమయ్యే, సాధ్యం చేసి చూపెట్టే వారికి ఓటేయడం మంచిది. కనీస వాగ్దానం చేసి కూడా దాన్ని నెరవేర్చకపోతే.. హామీ ఇచ్చింది చెయ్యలేదనే కనీస నిరాశ అతడిలో ఉంటుంది. ఏదో వేయాలి కాబట్టి, పదే పదే అడిగారు కాబట్టి ఓటేస్తున్నాం అని కాకుండా నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేవారికి, వీరైతే అంతో ఇంతో చేస్తారు అనే నమ్మకం ఉన్నవారికి ఓటు వేయాలి. శుష్క వాగ్దానాలు చేసే నాయకులకు బుద్ది చెప్పాలంటే.. ఓటు అనే సక్రమమైన దిశలో ప్రయోగించాలి. ఓటు హక్కును వినియోగించుకోకపోతే.. అలాంటి శుష్కవాగ్దానాలు చేసే నాయకుల చేతికే అధికార వెళ్తుంది. అప్పుడు మీరు ఓటు వేసినా ప్రయోజనం వుండదు. అందుకే.. నిజాయితీగా వుండే నాయకులకు, అమలు సాధ్యమయ్యే వాగ్దానాలు చేసే నాయకులకు మాత్రమే ఓటు వేయాలి. కానీ, కచ్చితంగా ఓటు వేయాలి. వాస్తవానికి ఓటు వేయకపోతే మనం లెక్కలో లేనట్లే. జన సామాన్యంలో కూడా ఈ అభిప్రాయం బలంగా ఉంది. అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారం అంటారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా.. దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడికి.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటు హక్కు కల్పించింది. 125 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో దాదాపు వంద కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 50 కోట్ల లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకంటే శక్తివంతమైన పాత్ర.. శాసనాలు తయారుచేసే పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఉటుంది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నేతలే నేరస్తులైతే నేరమయ భారతం నిర్మితమవుతుంది. దీన్ని అడ్డుకొనే సంస్కరణలు తీసుకు రావడానికి 1975లో తార్కుండే కమిటీ, 1998లో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు అనేక ఉన్నతమైన సంస్కరణలు ప్రతిపాదించాయి. అందులో భాగంగానే 1971 నుండి ఎన్నికల కోడ్‌ ఆప్‌ కండక్ట్‌ అమలవుతోంది. లోక్‌ సభ ఎన్నికల ఖర్చు 25 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు10 లక్షలు దాటకూడదని 2004లో నిబంధనలు విధించినప్పటికీ అభ్యర్థులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అభ్యర్థి నేరస్తుడైనా కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి ప్రతి పార్టీ ప్రోత్సహిస్తోంది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా పాలకుల మితిమీరిన జ్యోక్యంతో సత్ఫలితాలు రావడం లేదు. మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి భేదభావాలు లేకుండా ఓటు హక్కును కల్పించింది మన రాజ్యాంగం. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదేనని, రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్‌కు సమర్పిస్తూ అంబేద్కర్‌ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనలో నుంచే వచ్చింది అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగ నిపుణులు కోరుతున్నారు.

2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా 18-19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఓటర్లుగా నమోదయిన సంఖ్యను అదే వయసు ఓటర్ల జాబితా 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో విడుదలయినప్పటి నుంచి పోల్చి చూస్తే కేవలం 45 శాతం మంది యువత మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. యువతలో 55 శాతం మంది వారిపేర్లు ఓటర్ల జాబితా లో నమోదుకాలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నమోదయిన మొత్తం ఓటర్లలో యువ ఓటర్లు దాదాపు 2.6 శాతం మాత్రమే. అయితే అదే వయస్సు యువత.. జనాభా వయోజనులతో పోల్చి చూస్తే 6.4 శాతం నమోదైంది. ఈ అంకెలను పరిశీ లిస్తే యువ ఓటర్ల నమోదులో ఏదో పొరపాటు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అత్యధిక సంఖ్యలో యువ భారతీయులు చాలా రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదు కావడం లేదని స్పష్టమవుతోంది. గతంలో అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఓటు వినియోగించుకునే వారు కాదు. కానీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారు బీజేపీకి ఎక్కువగా ఓటు వేసినట్టు ఇతర వయోజన ఓటర్లతో పోల్చిచూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా నరేంద్ర మోడీపై ఆకర్షణే దీనికి కారణం. యువకులంతా ఓటర్లుగా నమోదయి ఉంటే ఇంకా అఖండమైన విజయం బీజేపీకి లభించేదనే వాదన కూడా వుంది. ఎన్నికల ఓటర్ల జాబితాలు విడుదలయినప్పుడు లెక్కలు సరిగ్గా లేని జాబితాలు ఎక్కువగా వచ్చాయి. గత ఎన్నికల్లో యువత బీజేపీకి ప్రాధాన్యం ఇచ్చింది. ఏదేమైనా ఓటర్ల నమోదు స్వల్పంగా ఉండడం ఎన్నికల జాబితాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ముఖ్యమయిన అంశంపై అంటే పౌరులు ఓటర్లుగా నమోదు అయ్యే అంశంపై దృష్టి కేంద్రీ కరించవలసిన అవసరం వుంది. ఓటర్లుగా అర్హత కలిగిన యువతకు, వివిధ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదవుతున్న యువతకు మధ్య తేడా బాగా కనిపిస్తోంది. ఈ వ్యత్యాసం మొత్తం మీద 55 శాతం వరకు ఉంటోంది. 18-19 ఏళ్ల వయస్సున్న యువతలో కనీసం ప్రతి పదిమంది పేర్లు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. కానీ ఇలా నమోదవుతున్న పది మందిలో కేవలం నలుగురి పేర్లే జాబితాలో కనిపిస్తున్నాయి. ఆరుగురి పేర్లు గల్లంతవుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, నాగలాండ్‌, చంఢీగఢ్‌ రాష్ట్రాల్లో యువత ఓటర్ల అర్హులైనవారికి, తగినట్లు నమోదు అవసరం లేదు. నమోదు చాలా భూయిష్టంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో యువ ఓటర్లు నమోదు చాలా లోపభూయిష్టంగా ఉంటోంది. ఆయా రాష్ట్రాల యువ ఓటర్లు అర్హులైన వారికి తగినట్టు ఓటర్ల నమోదు ఉండడం లేదు. చంఢీగఢ్‌ రాష్ట్రంలో కేవలం 15 శాతం, హిమాచల్‌, మహారాష్ట్రల్లో 24 శాతం, ఢిల్లీలో 32 శాతం, ఉత్తరాఖండ్‌, హర్యానాలో 35 శాతం యువ ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. మిగతా రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు 50 శాతం కన్నా తక్కువగా ఉంటోంది.  అయితే, ఎన్నికల కమిషన్‌ అవగాహన శిబిరాలు నిర్వహించడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఎన్నికల జాబితాలు గతంలో కన్నా ఇప్పుడు చాలా కచ్చితంగా ఉంటున్నాయి. జాతీయ రాష్ట్రస్థాయి ఎన్నికల్లో అధిక సంఖ్యలో యువ ఓటర్లు పాల్గొనేలా చేసే కృషికి ఎన్నికల కమిషన్‌కే ఆ కీర్తి దక్కుతుంది. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నికల కమిషన్‌ ఇటీవల యువత తమంతట తామే ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి కనబరిచేలా ఫేస్‌బుక్‌ను ప్రయోగించడం కొంతవరకు సహాయపడుతోంది. కానీ అనుకున్న ఫలితాలు రాడానికి ఇది ఉపయోగ పడకపోవచ్చనే అభిప్రాయం కూడా వుంది. యువత ఓటర్ల నమోదు కొంత మెరుగైనా.. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం వుంది. అయితే, ఓటు నమోదు చేసుకున్న ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే.. సరైన నాయకులు ఎన్నికవుతారు.

ఓటు.. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటు సొంతం. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు.. ఓటూ ముఖ్యమే.  ఓటు రైఫిల్ లాంటిది. దాని ఉపయోగం ఓటేసే వారిని బట్టి ఉంటుంది. మీరు వేసిన ఓటు దుర్వినియోగం కావద్దనుకుంటే.. ఓటు అనే రైఫిల్ సరైన దిశగా ప్రయోగించాలి. అభివృద్ధిని కోరుకునేవారికే ఓటు వేయాలి. సెంటిమెంట్ ప్రకారమో, సింపథీ ప్రకారమో ఓటు వేస్తే ప్రజా ప్రతినిధి ఎంపికలో మీరు తప్పటడుగు వేసినట్లే. ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఈ రకమైన అవగాహన కలిగించేందుకు తెలంగాణవ్యాప్తంగా విస్త్రృత ప్రచారం జరిగింది. ఓటు వేయడం అంటే ఏదో ఎన్నికల తంతు మాత్రమే కాదు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఆ ఒక్క రోజు జరిగే హడావిడి అంతకన్నా కాదు. ఓట్ల ప్రక్రియ ఒక యజ్ఞం లాంటిది. దాన్ని రాజకీయాంశంగా మాత్రమే భ్రమపడితే పొరపాటే. జాతీయతా భావాన్ని పెంపొందించే సాధనం ఓటు. సమర్థవంతమైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకొని సాంఘీక, ఆర్థిక, సమానత్వం సాధించడానికి పౌరులంతా ఓటు వేయాల్సిందిగా భారత రాజ్యాంగం సూచిస్తోంది. రాజకీయ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అవుతూ పాలనలో ప్రత్యక్ష పాత్ర పోషించడానికి, రాజ్యాంగ వ్యవస్థను నిలబెట్టేందుకు దేశ పౌరులు ఓటు వేసి రాజ్యాంగ హక్కును పరిరక్షించుకోవాలి.  ఓటు చెల్లింపు వంటిది. అది పనిచేయడం సాధ్యమైతే ఓటు పొందిన వారిలో నిర్లక్ష్యం కనిపించదు. చెల్లింపు అంటే ఓటుకు నోటు చెల్లింపు అని కాదు. మనం మన భవిష్యత్‌ను ఓటు రూపంలో చెల్లిస్తున్నాం అన్నమాట. ఆ చెల్లింపే రేపటి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేలా ఉండాలనేది రాజ్యాంగం ఉద్దేశం. ఏవో చిన్నపాటి నజరానాల కోసం కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, జన బాహుళ్యానికి అవసరమయ్యే శాశ్వత ప్రయోజనాల గురించి ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వ్యవస్థలో మార్పుకు నాంది పలుకాలి. పురోగతి సాధించడానికి ఆయుధం అవ్వాలి. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో నాయకుల్లో నైతికత ఉండేది. విలువలు ఉండేవి. కానీ ఇవన్నీ రానురాను తగ్గిపోయాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. అయితే, మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన వారు.. ముఖ్యంగా యువ ఓటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగించే విషయం. ఓటు వేస్తే మనకేంటి..? అనే నెగెటివ్ ధోరణితో ఉంటోంది యువత. ఓటు వేస్తే మన జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయో..? మనం చెల్లించే డబ్బులు తిరిగి మనపై ఎలా ఖర్చు చేస్తారో..? అనే విషయాలు నేటికీ 90% ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనేది నిజం. కాబట్టి అక్కడే ఆగిపోయి మార్పు రావడం లేదు అనే బదులు బాధ్యతగా ఓటేసి.. బాజాప్తా నిలదీస్తే మార్పు దానంతట అదే వస్తుంది. మనం వేసే ఓటు ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజానికి మేలు జరుగాలి. అలా ఉన్నవారికే ఓటు వేయాలి. అలా కాకుండా సమాజానికి హాని తలపెట్టే వారికిగానీ, అభివృద్ధి చేయలేరు అని భావించేవారికి గానీ ఓటు వేస్తే దాని ఫలితం శూన్యం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఎవరికీ ఓటు వేయడానికి మనసు ఒప్పుకోకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది. నోటా ద్వారా సాధించేది పెద్దగా ఉండకపోయినా ఇరువురి పట్లా అసంతృప్తి వ్యక్తం చేసేందుకు ఈ ఆప్షన్ పనికొస్తుంది. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన ఆఖరి హక్కు. నోటు కోసం ఓటుని అమ్ముకుంటూ జీవితాలని నాశనం చేసుకోకుండా.. ఓటుకు నోటును ప్రోత్సహించకుండా ఉండేందుకు నోటా చివరి అవకాశం. ఓటు వేయకపోతే మనం లెక్కలో లేనట్లే లెక్క. జన సామాన్యంలో కూడా ఈ అభిప్రాయం బలంగా ఉంది. అన్నీ తెలిసినవాళ్లు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దీనిని ప్రజాస్వామ్య సంస్కారం అంటారు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనలో నుంచే వచ్చింది అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మంచి నాయకత్వం, సమాజ అభివృద్ధి కావాలని ఆశించడంలో అర్థం లేదు.

ఎస్. కె. చారి