Friday, December 13, 2019
Follow Us on :

‘యతి’శయం..!..

By BhaaratToday | Published On May 2nd, 2019

మంచుకొండల్లో ‘మాయా’ గుర్తులు. అంతుచిక్కని ‘అడుగు’ జాడలు. అవి ‘యతి’ పాదముద్రలేనా..? లేక, అదృశ్య శక్తుల ఆనవాళ్లా..? ఇంతకీ, మన జవాన్లు చూసిందేంటి..? శాస్త్రవేత్తలు చెబుతున్న నిజమేంటి..? ‘యతి’శయం..!.. 

హిమాలయాలంటేనే అంతుచిక్కని పర్వతాలు.. అక్కడ సంజీవని సహా ఎన్నో విశిష్ట మూలికలు.. విచిత్ర జంతువులు ఉంటాయని.. పురాణాల్లో చదువుకున్నాం. కానీ, వాటిని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు అలాంటిదే మరో మాయాజాలం తెరపైకి వచ్చింది. అదే వింతజీవి సంచారం. మన ఆర్మీ జవాన్లు చూసిన అడుగు జాడలు ఆ వింత జీవియేనా..? అవి మంచు మనిషి ఆనవాళ్లేనా..? ఈ అనంత విశ్వంలో మనిషి ఛేదించలేని, శోధించలేని, కనుగొనలేని రహస్యాలు, అంతుబట్టని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో యతి కూడా ఒకటి. యతి ఉనికిపై వందల ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటివరకు యతి ఉందని మాత్రం నిర్ధారించలేకపోయారు..? అసలు నిజంగా యతి జీవి ఉందా..? ఉంటే అసలు మానవ జాతికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో ఎందుకు ఉంటోంది..? యతిపై శాస్త్ర పరిశోధనల మాట ఎలా వున్నా.. హిందూ పురాణాల్లో మాత్రం ‘యతి’ ప్రస్తావన వుందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. మన పురాణాల్లో చిరంజీవులుగా చెబుతున్నవారంతా యతీంద్రులనే వాదన కూడా వుంది. అంతేకాదు, బౌద్ధులు కూడా యతిని పూజించేవారని చరిత్ర చెబుతోంది. టిబెటన్లు సైతం యతిని కొలిచేవారని చెబుతారు.

దశాబ్దాలుగా మానవాళిలో ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిన ఓ మంచు మనిషి మిస్టరీ మళ్లీ తెరపైకి వచ్చింది. ‘యతి’గా భావిస్తున్న ఆ మంచు మనిషి.. హిమాలయాల్లో సంచరిస్తున్నాడంటూ గతంలో ఎన్నో కథలు, కథనాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, భారత సైన్యానికి చెందిన ఓ పర్వతారోహణ బృందం.. ఇదిగో యతి అడుగుజాడంటూ.. పర్వతశ్రేణుల్లో తాము గుర్తించిన పాదముద్రలను ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో హిమాలయ పర్వత శ్రేణుల్లో వెలుగుచూసిన పాదముద్రలు యతివేనన్న చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. మేజర్ మనోజ్ జోషి నేతృత్వంలోని 18 మంది సైనికులతో కూడిన బృందం ఏప్రిల్ 2న నేపాల్‌లోని మకలు పర్వతారోహణకు వెళ్లింది. ప్రపంచంలోనే ఐదో ఎత్తయిన పర్వతం మకలు. దీని ఎత్తు 8,485 మీటర్లు. నేపాల్, టిబెట్, చైనా సరిహద్దులో ఎవరెస్ట్ పర్వతానికి ఆగ్నేయంగా సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏప్రిల్ 9న మకలు బేస్ క్యాంప్ కు చేరుకున్న ఆర్మీ బృందం అంతుచిక్కని పాదముద్రలను గుర్తించింది. ఆ పాదముద్రలు 32 ఇంచుల పొడవు 15 ఇంచుల వెడల్పు ఉన్నాయి. పాదముద్రలను గుర్తించడమే కాదు, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. ఈ పాదముద్రలు యతికి సంబంధించినవేనని చెబుతున్నారు. ఇప్పటివరకు యతికి సంబంధించినవన్నీ కథలుగానే వెలుగు చూసినా, తాజా భారీ పాద ముద్రలు ఈ మిస్టరీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, ఆర్మీ ట్వీట్లపై పలువురు పరిహాసం చేస్తుండడంతో ఆర్మీ అధికారులు స్పందించారు. మంచుమనిషికి సంబంధించిన ఆధారాలను ఫొటోలు తీశామని, శాస్త్రీయ నిర్ధారణ కోసం వాటిని నిపుణులకు అందజేయనున్నట్లు తెలిపారు. సగటు మనిషి కంటే పెద్దగా, ఎత్తుగా ఉండే కోతిలాంటి జీవి - హిమాలయాలు, సైబీరియా, మధ్య-తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు నేపాలీ జానపద కథలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఆర్మీ జవాన్లు గుర్తించిన పాదముద్రలు ఏ జీవికి సంబంధించినవో తెలుసుకునేందుకు.. నిపుణుల సాయం తీసుకోనున్నారు. అయితే, ఏ రంగంలోని నిపుణులకు వీటిని పంపిస్తున్నదీ సైనిక వర్గాలు వెల్లడించలేదు. హిమాలయాల్లో తిరుగుతున్న పురాతన జీవి యతి అని పిలుస్తూ వుంటారు. ఆ జీవి పెద్ద కోతిలా ఉంటుందని, మనిషి కన్నా భారీ ఆకారం ఉంటుందని చెబుతూ ఉంటారు. అంతేకాదు.. ఎలుగ్గొడ్డులా ఉంటుందనేది మరికొందరివాదన. కొందు దాన్ని మెతె అనీ కూడా పిలుస్తుంటారు. గతంలోనూ ఎన్నోసార్లు యతిని గుర్తించిన సంఘటనలు వెలుగుచూశాయి. 2007లో అమెరికా టీవీ ప్రెజెంటర్ యతి అడుగులను గుర్తించినట్టు చెప్పారు. దానిపై వరుస కథనాలు ప్రసారం వేశారు. 2008 జూలై 25న ఈశాన్యభారతలోని గారో హిల్స్ లో  దొరికిన వెంట్రుకలను ఆక్స్ ఫర్డ్​ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధకులు పరీక్షించారు. దానిపై బీబీసీ కథనం రాసింది. 2011 లో రష్యాలో పెట్టిన ఓ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సైంటిస్టులు, చరిత్రకారులు యతి ఉంది అనేందుకు 95 శాతం కచ్చితమైన ఆధారాలున్నాయని చెప్పారు. తర్వాత ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. 2013లో ఆక్స్ ఫర్డ్​, లౌసానే యూనివర్సిటీ పరిశోధకులు  ఆ జీవి డీఎన్ఏని పరీక్షించారు. ఇండియాలోని లద్ధాఖ్ , భూటాన్ లో ఓ గుర్తు తెలియని జంతువు వెంట్రుకలు సేకరించిన సైంటిస్టులు పోల్చి చూశారు. ఎలుగును చూసి అందరూ యతి అనుకుంటున్నారని తేల్చారు. ఇక ఇటీవల 2017లోనూ దొరికిన శాంపిళ్లపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఎలుగుబంట్లవేనని తేల్చారు. ఈ నేపథ్యంలో, తాజాగా వెలుగుచూసిన వింతజీవి ఆనవాళ్లు యతివేనా..? లేక ఎలుగుబంటివా..? అనేది మిస్టరీగా మారింది. యతి ఉందా లేదా అన్నది పక్కనపెడితే.. ఎన్నోసినిమాలు, కార్టూన్లు, పుస్తకాలు, వీడియోగేమ్స్ లలో యతి ప్రస్తావన వచ్చింది. మిస్టర్ నట్జ్​ అనే వీడియోగేమ్ లో మిస్టర్ బ్లిజర్డ్​ అనే క్యారెక్టర్ ను యతిగా చూపించారు. 2006 టైటాన్ క్వెస్ట్​ వీడియోగేమ్ లో యతిని క్రూరమృగంగా చూపించారు. వాల్ట్​ డిస్నీ వరల్డ్స్​ ఎక్స్ పెడిషన్ ఎవరెస్ట్​లో 25 అడుగులఎత్తయిన యతి కేరెక్టర్ ఉంటుంది. 1964లో వచ్చి నరుడాల్ఫ్ ద రెడ్ నోస్డ్​ రెయిన్ డీర్ అనే క్రిస్మస్ స్పెషల్ షో లో బంబుల్ అనే యతి ఉంటుం ది. స్నో మాన్ స్టర్ గా చిత్రీకరించారు. మాన్ స్టర్స్, ఐ.ఎన్.సి. అనే సినిమా చివర్లోనూ యతి కనిపిస్తుంది. యతిపై బెంగాల్ లో యతి ఒభిజాన్ అనే సినిమా తీశారు. 2016లో ఓ ట్రావెల్ చానెల్ ఎక్స్ పెడిషన్ అన్ నోన్ అనే సిరీస్ లోహంట్ ఫర్ యతి అనే కథనాన్ని నాలుగు ఎపిసోడ్లలో తీసింది. టిన్ టిన్ ఇన్ టిబెట్ అనే కార్టూన్ ఫిల్మ్​లోనూ యతిని చూపించారు. కార్టూన్ చిత్రాల్లోనే కాదు, ఎన్నో హాలీవుడ్ సినిమాల్లోనూ మంచుమనుషులను చూపించారు. డేవిడ్‌ హీవ్లెట్‌ అనే హాలీవుడ్ దర్శకుడు 2011 ‘రేజ్ ఆఫ్ యతి’ పేరుతోనే సినిమాను తెరకెక్కించాడు. ఆర్కిటిక్‌లో ఉన్న విలువైన సంపదను చేజిక్కించుకోవాలనే రెండు బృందాల కథే యతి. విపరీతమైన చలిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిధిని వెతుకున్న వారికి యతి రూపంలో ప్రమాదం ఏర్పడుతుంది. దానిని నుంచి వారు ఎలా బయటపడ్డారనే కథతో ఈ సినిమా సాగుతుంది. యతి కథాంశంతో హాలీవుడ్ లో 1950 వ దశకం నుంచే ఎన్నో సినిమాలు వచ్చాయి. ది స్నో క్రియేచర్, ది అబోమినేబుల్ స్నోమాన్ ఆఫ్ ది హిమాలయాస్, స్నో బియెస్ట్, యతి : ట్వంటీయత్ సెంచరీ జాయింట్, ది మిస్టీరియస్ మాన్ స్టర్స్ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. గతేడాది రిలీజ్ అయిన ‘స్మాల్ ఫూట్’ అనే త్రీడీ మూవీ కూడా యతి కథాంశంతో రూపుదిద్దుకున్నదే. ఇదిలావుంటే, భారత సైన్యం చేసిన ట్వీట్‌తో హిమాలయాల్లో యతి మనుగడపై మళ్లీ చర్చ మొదలైంది. అసలు అలాంటి జీవి ఉందా..? ఉంటే అది మనిషా..? జంతువా..? అన్న ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి యతి మనుగడపై శాస్త్రజ్ఞులు, పరిశోధకులు చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. యతి కాల్పనిక జీవి కాదని, అది నిజంగానే ఉందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ ప్రొఫెసర్ బ్రయాన్ సైక్స్ గతంలోనే ప్రకటించారు. యతి వెంట్రుకలుగా ప్రచారంలో ఉన్న కేశాలపై ప్రయోగాలు చేసి యతి డీఎన్ఏ లక్షా ఇరవై వేల ఏళ్ల నాటి పురాతన ధ్రువపు ఎలుగుబంటి డీఎన్ఏతో సరిపోలుతోందని చెప్పారు. మొత్తానికి, యతి అడుగుజాడల అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను గుర్తించినట్టు భారత సైన్యం ఫొటోలు పోస్టు చేసిన తర్వాత సర్వత్ర ఆసక్తి నెలకొంది. పురాణాల్లో వినడం, అప్పుడప్పుడు సినిమాల్లో చూడడం తప్ప వీటిని ప్రత్యక్షంగా చూసిన వారెవరూ లేరు. అసలు భూమిపై మంచుమనిషి ఉన్నాడా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

యతి అనే పదం మనకు 1వ శతాబ్దంలోనే పరిచయమైందని చరిత్ర చెబుతోంది. నేపాల్‌కు చెందిన షెర్పాస్‌ తెగ వారు తొలిసారిగా యతిని గుర్తించారని చెబుతారు. యతి నాలుగు కాళ్లు లేదా రెండు కాళ్లపై అలవోకగా నడుస్తుందట. దాని వేగాన్ని అందుకోవడం మనుషులకు సాధ్యం కాదంటారు. అలాగే యతికి వృద్ధాప్యం కూడా వస్తుందని, అది అనారోగ్యం బారిన కూడా పడుతుందని.. అలాంటి సమయంలో దాన్ని పట్టుకునేందుకు వీలవుతుందని.. రోమన్‌ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్‌ తాను రాసిన నేచురల్‌ హిస్టరీ ఇన్‌ ది ఫస్ట్‌ సెంచరీ ఏడీ అనే పుస్తకంలో చెప్పారు. అంతేకాదు, యతి చాలా భయంకరంగా అరుస్తుందని, ఒళ్లంతా వెంట్రుకలు, నీలం రంగు కళ్లు, కుక్కలను పోలి ఉండే దంతాలు కూడా దానికి ఉంటాయని ప్లినీ తెలిపారు. అలాగే కొన్ని రకాల యతులకు ఒంటిపై ఉండే వెంట్రుకలు బూడిద లేదా ఎరుపు రంగులో ఉంటాయట. యతిని అనేకమంది అనేక పేర్లతో పిలుస్తున్నారు. పురాణాల ప్రకారం ‘యతి’గా పేర్కొంటే, టిబెటియన్లు ‘కొండ ప్రాంతాల్లో ఉండే పెద్ద ఎలుగు’ అని చెబుతారు. అంతేకాదు, వీరినే ‘ఎలుగు మనిషి’ అని కూడా పిలుస్తారు. నేపాల్‌లోని ‘షెర్పాస్‌’ అనే తెగ యతిని ‘క్యాటిల్‌ బేర్‌’గా పేర్కొంటుంది. ‘హిమాలయన్‌ బ్రౌన్‌ బేర్‌’, ‘జంగిల్‌ మ్యాన్‌’, ‘స్నో మ్యాన్‌’, ‘మ్యాన్‌-బేర్‌ స్నోమెన్‌’ ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. ఇక ప్రముఖ పర్వాతారోహకుడు రెనిహోల్డ్‌ మెస్నెనర్‌ యతిని అతి పురాతన మనిషిగా అభివర్ణించాడు. నేపాలీ జానపదాల్లో యతి ప్రస్తావన ఉంది. యతిని వారు ‘భయంకరంగా ఉండే మంచు మనిషి’గా అభివర్ణించేవారు. సాధారణ మనిషి కంటే చాలా ఎత్తుగా, బలంగా యతి ఉండేదని నమ్మేవారు. హిమాలయాలు, సైబీరియా, మధ్య, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఇవి నివసించేవని చెబుతుంటారు. 19వ శతాబ్దంలో యతిని మంచుమనిషిలా భావించేవారు. కొన్ని తెగలు యతిని ప్రత్యేకంగా పూజించేవి. పెద్ద రాయిని యతి ఆయుధంలా ఉపయోగించేదని, పెద్దగా అరిచేదని చెప్పేవారు. శరీరం నిండా పెద్దపెద్ద వెంట్రుకలతో ఉండే ఈ భారీ జీవి హిమాలయ పర్వతసానువుల్లో తిరుగాడేదని, ఇవి పలుమార్లు పర్వాతారోహకుల కంట పడేవని గతంలో కథనాలు వచ్చాయి. 1920 నుంచి నేపాల్‌లో అడపాదడపా ఇవి కనిపిస్తూనే ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. సంవత్సరాలుగా వీటిపై కథనాలు వస్తున్నా వాటికి సంబంధించిన చిత్రాలను మాత్రం ఎవరూ పట్టుకోలేకపోయారు. హిమాలయ ప్రజలు వీటిని యతి లేదంటే మే-తే అని పిలుస్తారు. టిబెటన్ భాషలో యతి అంటే ‘మిచే’ అని అర్థం. అంటే ‘మనిషిలాంటి ఎలుగుబంటి’ అని అర్థం. అలాగే, ‘డిజు-తే’ అని కూడా పిలిచేవారు. అంటే ‘హిమాలయన్ బ్రైన్ బేర్’ అని అర్థం. ‘మిగోయి’ అనే పేరు కూడా ఉంది. అంటే ‘ఆటవికుడు’ అని పిలిచేవారు. నేపాలీలు ‘బన్‌ మంచి’ అనేవారు. అంటే ‘అడవి మనిషి’ అని అర్థం. హిమాలయాల్లో యతి ఉనికి ఉన్నట్లు తొలిసారిగా 1832లో పాశ్చాత్యదేశాలకు తెలిసింది. ‘ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌’ పేరుతో బ్రిటిషర్‌ బీహెచ్‌ హోడ్జ్‌సన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే అది ఎర్రని జట్టుతో కొండప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు రాశారు. ‘అమాంగ్‌ ది హిమాలయన్స్‌’ పేరుతో లారెన్స్‌ వాడెల్‌ 1899లో రాసిన పుస్తకంలో యతి అడుగు జాడల గురించి స్పష్టంగా చెప్పారు. యతి గురించి ఎన్నో కథలు స్థానికుల నుంచి విన్నానని చెప్పిన ఆయన, తొలిసారి యతి పాద ముద్రలను కూడా గుర్తించినట్లు చెప్పారు.  ఎన్‌ఏ టాంబ్జి అనే గ్రీక్‌ ఫొటోగ్రాఫర్‌ హిమాలయాల్లో యతి గురించి స్పష్టమైన వివరాలను వెల్లడించారు. అతను అచ్చం మనిషిలా ఉన్నాడని.. అప్పుడప్పుడూ ఆగుతూ, వడివడిగా అడుగులు వేస్తున్నాడని తెలిపాడు. అతని ఒంటిపై దుస్తులేవీ లేవని.. తాను ఫొటో తీసేలోపే ఆ యతి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడని తెలిపాడు. అయితే, అతని అడుగుజాడలను మాత్రం ఫొటో తీశానని.. 16 నుంచి 24 అంగుళాల వెడల్పైన మొత్తం 15 అడుగులు గుర్తించానని తెలిపాడు. 1920 నుంచి 1950 మధ్యకాలంలో యతి గురించి పరిశోధన చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో అనేకమంది హిమాలయాల్లో పరిశోధించారు. పలువురి యతి అడుగులను సైతం ఫొటోలు తీశారు. అయితే టెన్సింగ్ నార్కేతో కలిసి తొలిసారి ఎవరెస్ట్‌ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ మాత్రం యతి ఉన్నదన్న మాటని కొట్టి పారేశారు. కనిపించిన పాదముద్రలు మనుష్యులవేనని మంచు కరగటం వల్ల అవి వ్యాకోచించి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవలి శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ యతికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఒకప్పుడు యతి ఉన్న మాట వాస్తవమేనన్న అంగీకారానికి శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. 2017లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొందరు యతికి ఉనికికి సంబంధించి కొన్ని నమూనాలు సేకరించారు. హిమాలయ పర్వత సానువుల్లో లభ్యమైన వీటిని ఆ తర్వాత ఎలుగుబంటివిగా తేల్చారు. 2008లో అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సగం మనిషి, సగం కోతితో ఉన్న జీవికి సంబంధించి కొన్ని నమూనాలు సేకరించారు. అయితే అవి కూడా యతికి సంబంధించినవి కావని తేలింది. మళ్లీ ఇన్నాళ్లకు యతి పాదముద్రలు కనిపించడం ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. ఇక యతి ఉన్నాడా, లేడా అనే విషయానికి వస్తే.. భారత ఆర్మీనే కాదు, గతంలోనూ కొందరు ఇలాంటి ఫొటోలనే సాక్ష్యాలుగా చూపించారు. కొందరు యతి వెంట్రుకలు, చర్మం, గోళ్లు అంటూ కొన్ని సాక్ష్యాలను తెచ్చారు. కానీ అవి యతికి చెందినవేనని ఎవరూ నిరూపించలేకపోయారు. అవన్నీ పలు జాతులకు చెందిన జంతువులవని తేల్చారు. ఇక భారత ఆర్మీ ఇప్పుడు తీసిన ఫొటోలను బట్టి చూస్తే.. వాటిని కూడా శాస్త్రీయంగా నిరూపించే వరకు యతి ఉన్నాడని నమ్మలేం. కానీ చాలా మంది మాత్రం యతి నిజంగానే ఉన్నాడని విశ్వసిస్తున్నారు. అయితే కొందరు మాత్రం యతి లేడని, అంతరించిపోతున్న ఏవో అరుదైన జాతులకు చెందిన జీవాలను అందరూ చూసి యతి అని భ్రమిస్తున్నారని ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. యతి గురించిన ప్రస్తావన రావడం ఇదేం తొలిసారి కాదు. అయితే, ఆనవాళ్లు కనిపించిన ప్రతీసారి సరైన ఆధారాలు మాత్రం దొరకలేదు. యతుల గురించి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా.. ఇప్పటివరకు నిజనిర్ధారణ మాత్రం జరగలేదు. దీంతో తాజాగా లభించిన ఆనవాళ్లపై కూడా విస్తృత పరిశోధనలు జరగాలంటున్నారు సైంటిస్టులు.

మంచు దుప్పటి కప్పుకున్న హిమసానువుల్లో దొరికిన ఆనవాళ్లతో.. అందర్ని ఆలోచింపజేస్తున్న 'యతి' గురించి మన హిందూ పురాణాల్లో స్పష్టంగా రాసి ఉంది. భారత పురాణాల ప్రకారం ఈ ప్రపంచంలో చిరంజీవులుగా వెలుగొందుతున్న అతి కొందరిలో హనుమంతుడు ఒకరు. హిందూ పురాణాల ప్రకారం ప్రపంచంలో చిరంజీవులుగా అంటే చావు లేని వ్యక్తులుగా చెలామణీలో ఉన్నది హనుమంతుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, పరుశురాముడు, వేదవ్యాసుడు.. వంటి వాళ్లే కాకుండా మార్కండేయుడు, జాంబవంతుడు, సప్తర్షులుగా చెబుతారు. వీరందరినీ యతీంద్రులని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికీ హనుమంతుడు హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నారని హిందూ భక్తుల విశ్వాసం. యతి పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఆంజనేయస్వామి అక్కడ తిరుగుతున్నారని భక్తులు నమ్ముతారు. అయితే, అందుకు ఆ కాలి జాడలు తప్ప మరో ఆధారం లేదు. ఇంకొందరు ఆ యతిని చూశామని ఎలుగుబంటి రూపంలో యతి సంచరిస్తున్నాడని, ఆయనే జాంబవంతుడని అంటారు. కానీ, ఎవరూ ఆ యతిని కలిసింది లేదు. ఇదంతా భక్తి, విశ్వాసాలకు సంబంధించిన అంశం.  తాజాగా యతి ప్రస్తావన రావడంతో ఆయన ఆంజనేయస్వామి అంటూ దాదాపు 18 అడుగుల ఎత్తు ఉంటారనీ, ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారని చాలా మంది రుషులు, జ్ఞానులూ చెప్పిన మాటలను హిందువులు ప్రస్తావన తీసుకువస్తున్నారు. యతి హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము యతిని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫొటోలు కూడా విడుదల చేశారు. అవన్నీ గ్రాఫిక్సేనని కొట్టిపారేశారు మరికొందరు. మరోవైపు మనమంతా హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాము. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం, హనుమంతుడు సింధూర వర్ణములో తనను తాను మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఎరుపు రంగే హిందువుల విశ్వాసానికి బలాన్ని చేకూర్చుతోంది. గతంలో హిమాలయాల్లో శాస్త్రవేత్తలు యతి గురించి అన్వేషించిన సమయంలోనూ ఓ భారీ ఆకారం ఒళ్లంతా ఎరుపు రంగు వెంట్రుకలతో అచ్చం మనిషిని పోలి ఉందని తేల్చారు.  ఈ పరిణామాలన్నీంటి నేపథ్యంలో యతి రూపంలో హనుమంతుడు ఇంకా హిమాలయాల్లో శంబలా అనే ప్రాతంలో ఉన్నాడని ఇప్పటికి హిందువులు విశ్వసిస్తున్నారు. తాజాగా ఆర్మీ కూడా యతికి సంబంధించి అడుగులు జాడలు విడుదల చేయడంతో హిందువుల విశ్వాసానికి కాస్త బలం చేకూరుతోంది. అయితే అసలు యతి ఉందో లేదో ప్రపంచానికే అంతు చిక్కని ప్రశ్నగా మారిన ఈ సమయంలో యతి రూపంలో హనుమంతుడు ఉన్నాడనే వాదన బలంగా వినిపించడం కొసమెరుపు.

-ఎస్. కె. చారి