Tuesday, October 15, 2019
Follow Us on :

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు అరుదైన గౌరవం…ప్రధాని మోదీని స్వాగతించిన సంజయ్

By BhaaratToday | Published On Aug 4th, 2019

కరీంనగర్‌ బీజెపీ ఎంపీ బండి సంజయ్‌కు అరుదైన గౌరవం లభించింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు అభ్యాసవర్గ పేరిట బీజేపీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో శనివారం ప్రధాని మోదీకి కండువా కప్పి సంజయ్‌ ఆహ్వానించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై శని, ఆదివారాల్లో శిక్షణ తరగతులను బీజేపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ అధిష్ఠానం, కరీంనగర్‌లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి పోరాటం సాగిస్తోన్న బండి సంజయ్‌కు ఈ శిక్షణ తరగతుల్లో అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది. ప్రధానికి స్వాగతం పలికే అవకాశం బండి సంజయ్ కి కల్పించింది పార్టీ అధిష్ఠానం. దీంతో అధిష్టానానికి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీ సంజయ్‌ వారికి కూడా కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు.