Thursday, April 25, 2019
Follow Us on :

లేదు..లేదు..పాక్ నా పాట‌నే కాపీ కొట్టింది: పాక్ ఆర్మీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ రాజాసింగ్‌

By BhaaratToday | Published On Apr 15th, 2019

‘హిందుస్తాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌.. హర్‌ దిల్‌కీ అవాజ్‌..’  పాటను గోషామహల్‌ ఎమ్మెల్యే, శ్రీరామ్‌ యువసేన భాగ్యనగర్‌ అధ్యక్షుడు టి.రాజాసింగ్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటను తన అధికారిక ట్విటర్‌లో రాజాసింగ్‌ షేర్‌ చేశారు. ఈ పాటను భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. అయితే ఈ పాటను రాజాసింగ్‌ కాపీ కొట్టారని పాక్‌ ఆర్మీ ఆరోపించింది. మార్చి 23 పాకిస్థాన్‌ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’  పాటకు కాపీనని పేర్కొంది. ఈ పాటను సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషంగా ఉందని, కానీ కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలి కదా! అని పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు రాజాసింగ్‌ పాడిన సాంగ్‌ను కూడా జతచేశారు. రాజా సింగ్‌.. ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌ ’  పాటను ‘హిందూస్తాన్‌ జిందాబాద్‌ ’ గా మార్చి భారత సైన్యానికి అంకితమిచ్చారని పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది.


అయితే దీనిపై రాజాసింగ్ స్పందించారు. పాట పాకిస్థాన్ ఆర్మీకి చెందినట్లు తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ‘నేను ఇప్పటివరకూ ఆ పాటను వినలేదు. పాకిస్థాన్ వాళ్లు ఈ పాటను కంపోజ్ చేసి ఉంటారని నాకు ఎలా తెలుస్తుంది? పాకిస్థాన్ వాళ్లే నా పాటను కాపీ కొట్టి ఉండవచ్చు. ఎందుకంటే శ్రీరామనవమికి కొన్ని నెలలకు ముందే మేం పాటను రూపొందిస్తాం’ అని చెప్పారు. రాజాసింగ్ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.