Saturday, December 14, 2019
Follow Us on :

నగల మాయంపై భారీ ఉద్యమాన్ని చేపడతామన్న బీజేపీ..!

By BhaaratToday | Published On Aug 28th, 2019

కొద్ది రోజుల క్రితం తిరుమలకు వెళ్లే బస్సులో అన్యమత ప్రచారం జరిగిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఏకంగా టీటీడీ ట్రెజరీ నుంచి కిరీటం, ఉంగరాలు మాయమవడం తీవ్ర దుమారం రేపుతోంది. టీటీడీ ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఏఈవో శ్రీనివాసులుపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆభరణాల విలువను అతని జీతం నుంచి రాబట్టారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని కొందరు అంటున్నారు. ఈ ఘటనకు కారకులు ఎవరో తెలుసుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడం సరికాదంటున్నారు.  

ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకుంది. బీజేపీ నేతలు చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు. నగల మాయంపై దర్యాప్తు జరిపించాలని కోరారు. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నగలు మాయమైన వెంటనే పోలీసులకు టీటీడీ అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. నిందితులను పట్టుకోకపోతే భారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.