Friday, July 19, 2019
Follow Us on :

ఈ ప్ర‌మాదానికి ఏడాది పూర్తి

By BhaaratToday | Published On May 15th, 2019

గత ఏడాది మే నెల 15వ తేదీన దేవీపట్నం గోదావరి నదిపై 44 మందితో ప్రయాణిస్తున్న బోటు నీట మునిగి 16 మంది మృతి చెందారు. ప్రమాదానికి అసలు కారణం ఈ గోదావరి లోయ ప్రాంతంపై అధికారుల నిర్లక్ష్యమేన‌ని తేలింది. ఈ లోయ గ్రామాలకు రహదారులు, ప్రజా రావాణా వ్యవస్ధలు లేకపోవడంతో రక్షణ లేని జల రవాణాలనే గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగిన, ఎన్ని గిరిజన ప్రాణాలు పోయిన అధికార యంత్రాంగంలో కదలిక లేదు. రోడ్లు వేస్తామని, ఐటీడీఏ తరుపున లాంచీ ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతులన్నీ గోదావరిలో కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా గోదావరి తీర ప్రాంత వాసుల బ్రతుకులు నేటికీ మారలేదు. గత ఏడాది మే 15వ తేదీన దేవీపట్నం మండలానికి చెందిన తాళ్ళూరు, గొందూరు, కచ్చులూరు, తెలిపేరు, పెద్దగూడెం, మంటూరు గ్రామానికి చెందిన గిరిజనులు ఉపాధి వేతన బిల్లులు, ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు, నిత్యావసర వస్తువుల కొనుగోలు ఇతర అవసరాల కోసం మండల కేంద్రమైన దేవీపట్నం వచ్చి పనులన్ని ముగించుకుని సాయంత్రం 4 గంటలకు స్వగ్రామాలకు తిరుగుముఖం ప‌ట్టారు. 40 మంది సామార్ధ్యం గల లాంచీలో సిబ్బందితో పాటు సుమారు 60 మంది దాకా ఎక్కేశారు. వీరితో పాటు లాంచీలో సిమ్మెంట్‌ బస్తాలు, గ్యాస్‌బండ్‌లు, వివిధ రకాల బరువైన వస్తువులతో లాంచీ బయలుదేరి వెళ్తుండ‌గా, పెనుగాలులు, జోరువాన మొదలై గోదావరిలో తీవ్ర అలజడి చెలరేగింది. దీంతో గాలీవాన దెబ్బకు లాంచీ గోదావరిలో ప్రమాదానికి గురై మునిగిపోయింది. చిమ్మచీకటిలో దిక్కు తోచని స్ధితిలో గోదావరి తల్లిఒడిలో మునిగిపోయిన గిరిజనులు ఈతకొట్టుకుంటూ 22 మంది ఒడ్డుకు చేరుకోగా మిగితా వారు నది గర్భంలో ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటన అప్పట్లో పెను సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయక చర్యలు, మృతదేహాల వెలికితీత కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అయితే సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే నానా హడావిడి చేసిన అధికారులు అటు తర్వాత ఆయా పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దశాబ్దాలు గడుస్తున్నా గోదావరి తీర ప్రాంత వాసుల బ్రతుకులు మారడం లేదు.