Monday, November 18, 2019
Follow Us on :

చందన, నందకుమార్‌ ప్రేమ పెళ్లి.. గ్రామంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున గొడవలు..!

By BhaaratToday | Published On Oct 15th, 2019

మొన్న నెల్లూరులో ప్రేమ పెళ్లి చేస్కుందని కర్కశంగా కత్తితో దాడి చేశారు తల్లిదండ్రులు. నిన్న కామారెడ్డిలో ఇష్టం లేని పెళ్లి చేస్కుందని ఇంట్లో వాళ్లతో సహా నవవధువును హత్య చేశాడో ప్రభుద్దుడు. నేడు చిత్తూరు జిల్లాలో తక్కువ కులం వాడిని చేస్కుందని పెళ్లి రోజే కాల్చి బూడిద చేశారు కన్నవారు. ఇలా పరువు కోసం కన్నపేగును కూడా కాటికి పంపుతున్నారు. ఏ మాత్రం జాలి, దయ లేకుండా నమ్మించి గొంతులు కోస్తున్నారు. అడపిల్లలను అడ్డంగా నరుకుతూ నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.   

మొన్న నెల్లూరు.. నిన్న కామారెడ్డి.. నేడు చిత్తూరు. పరువు హత్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. పిల్లల ప్రేమ పెద్దలకు మింగుడు పటడం లేదు. ప్రేమ పెళ్లిళ్లపై కన్న వారే కత్తి దూస్తున్నారు. కర్కశంగా కడుపున పుట్టిన బిడ్డలని కూడా చూడకుండా కాటికి చేరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పరువు హత్యల పరంపర అందర్ని ఆందోళన కలిగిస్తోంది. తక్కువ కులం అబ్బాయిని చేస్కుందని కాళ్ల పారాణి ఆరకముందే కాల్చి బుడిద చేశారు కన్న తల్లిదండ్రులు.

చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటన శాంతిపురం మండలం రెడ్లపల్లిలో చోటుచేసుకుంది. చందన అనే యువతి రెండు రోజుల క్రితం నందకుమార్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పెద్దల మధ్యవర్తిత్వంతో ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంట్లో చందన అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఎవరికీ తెలియకుండా హుటాహుటిన తల్లిదండ్రులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 

రెడ్లపల్లి చెందిన చందన, నందకుమార్‌ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతి. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం దగ్గర్లోని ఓ ఆలయానికి వెళ్లి చందన, నందకుమార్‌ లు వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 12న వారు తిరిగి ఇంటికి వచ్చారు. వారు గ్రామంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి. పెద్దల మధ్యవర్తిత్వంతో నందకుమార్‌ ను అతని ఇంటికి పంపించారు. చందనను ఆమె తల్లిదండ్రులు దగ్గరే ఉంచారు. 

 అదే రోజు రాత్రి ఎవరూ ఊహించని విధంగా చందన ఇంట్లో శవమై తేలింది. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటికీ అంతుచిక్కని సమస్యగా మారిపోయింది. చందన మరణించడంతో ఆ వెంటనే ఆమె తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. దహన సంస్కారాలు ముగిసిన తర్వాత చివరకు బూడిద, కాల్చిన తాలూకు ఆనవాళ్లు కానరాకుండా మూటగట్టి దగ్గర్లోని చెరువులో విసిరివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన మరుసటి రోజు తెల్లవారుజామున వెలుగుచూసింది. దీంతో శాంతిపురం మండలమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. అయితే చందన తల్లిదండ్రులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కానీ వారి మాటల్లో పొంతన లేకపోవడం, ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే చందన తల్లిదండ్రులను విచారిస్తున్నారు. కుప్పం పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

అయితే బూడిద, ఆనవాళ్లు ఎక్కడ పడేశారో తెలుసుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు చందన నిజంగా ఉరివేసుకుని చనిపోయిందా లేదా తల్లిదండ్రులే చంపారా అనేది తేలాల్సివుంది. చందన తండ్రి వెంకటేశ్ మాట్లాడుతూ వారిని దూరంగా ఉంచాలని ప్రయత్నం చేశామని చెప్పారు. తమ కుమార్తె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందన్నారు. తమ గ్రామ సంప్రదాయం ఉరివేసుకున్న వారిని ఇంట్లో ఉంచకూడదన్న క్రమంలో అర్ధరాత్రి వేళ గ్రామ పెద్దలమంతా కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశామని చెప్పారు. అయితే వెంకటేశ్ మాటల్లో వాస్తవం, నిజాయితీ కనిపించలేదు. కుప్పం పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు.

జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసుగా చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లో ఇది మూడో ఘటనగా భావిస్తున్నారు. నందకుమార్‌ పరారీలో ఉన్నాడు. యువతి తరపు గ్రామస్తులు తమను చంపేస్తారని.. ఇప్పటికే భార్యను చంపేశారు కాబట్టి తమను కూడా చంపేస్తారనే భయంతో యువకుడు, అతని తండ్రి పరారీలో ఉన్నారు. నందకుమార్‌ తల్లి మాత్రం తమ కోడల్ని ఆమె తల్లిదండ్రులే చంపేశారని చెబుతోంది. 

అయితే చందన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న సజీవంగా ఉన్న అమ్మాయి నేడు కడసారి చూపుకి నోచుకోలేకపోయాయనని నందకుమార్ బోరున విలపించాడని అతని తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇక నవవధువు మృతిపై నిజానిజాలు తేలకుంటే ఉద్యమం తప్పదని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి.