Saturday, December 07, 2019
Follow Us on :

ఢిల్లీలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిది!

By BhaaratToday | Published On Apr 14th, 2019

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తరువాత, అధికారుల బదిలీల తరువాత, నిత్యమూ వైసీపీ, బీజేపీ, ఈసీలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అదే రీతిలో విమర్శల వర్షం కురిపిస్తున్నానరు. పోటీ చేసిన వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైపోయిందని, దాన్ని ఎవరూ మార్చలేరని తెలిసి కూడా ఆయన, ఢిల్లీ స్థాయిలో తన పోరాటం కొనసాగిస్తూ నిరసనగళాన్ని వినిపిస్తున్నారు. ఎన్నికలు మాత్రమే ముగిసి, నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ, నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, ఎన్నికల పోలింగ్ తీరుపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈసీ అధికారులతో సమావేశమైన చంద్రబాబు, అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్, "మీరు ఎందుకిలా విమర్శలు చేస్తున్నారు? ఓడిపోతారనే భయమా?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు, ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, వాటి పనితీరుపై ఒక్క మాట కూడా మాట్లాడని వైసీపీ సంగతేంటని ఎదురు ప్రశ్నించారు. ఇంతవరకూ జగన్ అసలు స్పందించలేదని గుర్తు చేస్తూ, జగన్ వైఖరికి కారణమేంటని మండిపడ్డారు తప్పితే, సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మాత్రం బాబు సూటిగా జవాబు చెప్పలేకపోయారు.