Saturday, October 19, 2019
Follow Us on :

టీడీపీతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయ్: చంద్రబాబు నాయుడు

By BhaaratToday | Published On Mar 4th, 2019

 హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని.. అలాంటిది ఇప్పుడు తనపైనే దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇంతకుముందు మీరు ఎక్కడున్నారో, మీ స్థాయి ఏంటో ఆలోచించుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈరోజు జరిగిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చిత్తూరులోనే పుట్టి, పెరిగాననీ, అంచెలంచెలుగా ఎదిగాననీ గుర్తుచేసుకున్నారు. చిత్తూరులో పశ్చిమ మండలాలు బెంగళూరు వాతావరణంతో ఉంటాయని చెప్పారు. నీటి కొరత లేకుండా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.  గతంలో నీళ్లు లేక రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లడంతో.. 1984లో ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుట్టారన్నారు. తాను ఎక్కడున్నా ఈ గడ్డకు బిడ్డనేనని..  సీమ ప్రజల కష్టాలు తీరడానికి పోలవరం ప్రాజెక్టును కడుతున్నామన్నారు. అది పూర్తవడానికి సమయం పట్టేలా ఉండటంతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. 

వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని.. ప్రజా సమస్యలను పట్టించుకోరు. అయినా జీతాలు మాత్రం తీసుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకుడు సమాజహితం కోసం పనిచేస్తాడన్నారు. తాను ఇందిరాగాంధీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ చాలామందిని చూశానని తెలిపారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే టీడీపీని ఆదరించాలని కోరారు. చిత్తూరు పశ్చిమ మండలాలు టీడీపీకి కంచుకోట అనీ, అందుకే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. ఈ నెల చివరికల్లా కుప్పానికి నీళ్లు తీసుకెళతామని ప్రకటించారు.

టీడీపీతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయ్.. ఎక్కడా తిరిగే పరిస్థితే ఉండదు’ అని హెచ్చరించారు. ‘తమ్ముళ్లూ.. మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఎలా వచ్చాయి? నావల్ల కాదా? సైబరాబాద్ నగరం ఎలా ఏర్పడింది? నావల్లే కదా తమ్ముళ్లూ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందని తాను చెప్పాకనే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందని తెలిపారు.  కేసీఆర్ జగన్ తో లాలూచీ పడి టీడీపీని దెబ్బతీయాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికీ, పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వడానికే తెలంగాణ పోలీసులు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ డేటా ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనీ, దీనిపై విచారణ చేయడానికి మీరు ఎవరని  ప్రశ్నించారు. ఏపీ డేటా హైదరాబాద్ లో ఉంటే వెంటనే తమకు పంపించాలని సూచించారు. ఈ విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఉంటూ ఆయన కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు.