Thursday, April 25, 2019
Follow Us on :

శ్రీరాముడి బాటలోనే తాను ఐదేళ్లూ సుపరిపాలన సాగించాను..!

By BhaaratToday | Published On Apr 13th, 2019

కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనకు మార్గదర్శి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశవిదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీరాముడి బాటలో ఐదేళ్లూ తాను సుపరిపాలన సాగించామని, అందుకే మొన్నటి ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజానీకం పోలింగ్ కేంద్రాలకు విశేష సంఖ్యలో తరలివచ్చి తనకు మద్ధతు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

సమస్యల నుంచి పారిపోకుండా, సంక్షోభాలను ఎలా ఎదుర్కొని విజయాలు సాధించవచ్చో శ్రీరాముడు లోకానికి చాటారని ముఖ్యమంత్రి అన్నారు. ధర్మానికి నష్టం వాటిల్లితే ఎంతటి వారినైనా శిక్షించటానికి దశరథ తనయుడు వెనుకాడలేదని చంద్రబాబు చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ సంప్రదాయ, సంస్కారాలను రామాయణం మనకు నేర్పిందని, అది భారతీయులకు నిత్యజీవన పారాయణమని  అన్నారు. 

ఏపీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని భ్రష్టుపట్టించిన వైనాన్ని దేశమంతటికీ తెలిసేలా అన్ని రాష్ట్రాల్లో ప్రచారోద్యమం చేపడతామని చెప్పారు. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని తాము ఆరంభించామని, ఈ పర్యాయం కూడా సీతారాముల కల్యాణోత్సవ వేడుకను ప్రభుత్వం నిర్వహిస్తోందని గుర్తుచేశారు. ఈ నాలుగేళ్ళలో ఒంటిమిట్ట ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రముఖ దర్శనీయ స్థలంగా మార్చామని అన్నారు.