Saturday, October 19, 2019
Follow Us on :

ఓ వైపు చెడ్డీ గ్యాంగ్.. మరోవైపు ఇరానీ గ్యాంగ్‌.. బీ అలర్ట్

By BhaaratToday | Published On Jan 22nd, 2019

చెడ్డీలు వేసుకొని రావడం... చకచకా చోరీలు చెయ్యడం... చటుక్కున తప్పించుకోవడం... చెప్పాలంటే చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు చాలానే ఉన్నాయి. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండదంటున్నారు సైబరాబాద్ పోలీసులు. చెడ్డీ గ్యాంగ్‌కి చెక్ పెడతామని శపథం చేస్తున్నారు. 

చెడ్డీ గ్యాంగ్ పేరు వినే ఉంటారు. ఇదో స్పెషల్ గ్యాంగ్. హైదరాబాద్‌లో వరుస దొంగతనాలతో హడలెత్తించారు. ఇందులో దాదాపు పదిమంది గుంపుగా వస్తారు. అందరూ చెడ్డీలే వేసుకుంటారు. సిటీ శివారు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి.. దొంగతనాలు చేస్తారు. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో తిష్ట వేసిన ఈ గ్యాంగ్.. వరుస పెట్టి చోరీలు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడూ సీసీ కెమెరాల ఫుటేజ్‌లో కనిపిస్తున్నా... పోలీసులకు మాత్రం దొరకట్లేదు. తాజాగా సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లడంతో... అదే అదనుగా వరుస చోరీలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో... పక్కా నిఘా పెట్టిన పోలీసులు.. చెడ్డీ ముఠాను పట్టుకున్నారు. వీళ్లలాగే చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్‌ని సైతం అరెస్టు చేశారు.

ఇక ప్రమాదకరమైన ఈ చెడ్డీ గ్యాంగ్.. రాత్రిళ్లు చోరీలు చేసి తెల్లారితే అందర్లాగే... మామూలు డ్రెస్సుల్లో తిరుగుతారు. అన్నట్లు వీళ్లు చోరీ చేసేటప్పుడు ఎవరైనా పట్టుకున్నా, ఎదురు తిరిగినా తీవ్రంగా గాయాలు చేస్తారు. సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించకపోవడంతో ఇన్నాళ్లూ వీళ్లను కనిపెట్టడం కష్టమైంది. దీంతో పక్కా ప్లాన్ తో ఈ కంత్రీగాళ్లకు పోలీసులు చెక్ పెట్టేశారు.

మరోవైపు ఇరానీ గ్యాంగ్‌… అటెన్షన్‌ డైవర్షన్‌ తో బీభత్సం సృష్టించి దోపిడీలు చేస్తుంటుంది. రాత్రి సమయాల్లో చెడ్డీ గ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటుంది. దొంగతనం సమయంలో ఎవరైనా అడ్డొస్తే తీవ్రంగా గాయపరచడం చెడ్డీ గ్యాంగ్‌ కు అలవాటు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం సైబరాబాద్‌ పరిధిలో పోలీసు కమిషనర్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

రెండు ముఠాల నుంచీ పెద్ద మొత్తంలో డబ్బు, నగలు రికవరీ చేసుకున్నట్లు తెలిపిన సైబరాబాద్ పోలీసులు... త్వరలోనే వాటిని బాధితులకు అందజేస్తామన్నారు. ఈ రెండు గ్యాంగులూ దొరికాయి కదా అని హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఈ సిటీ ఉత్తరాది రాష్ట్రాల దొంగలకు హాట్ కేకులా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లతో గ్యాంగులుగా ఏర్పడి దోచేస్తున్నారు. సో బీ అలర్ట్.