Thursday, April 25, 2019
Follow Us on :

మంచి పని చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్

By BhaaratToday | Published On Mar 21st, 2019

ఈ ఏడాది ఐపీఎల్ ఇంకో రెండు రోజుల్లో మొదలుకాబోతోంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.  

ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై లోని చెపాక్ మైదానం వేదికగ జరిగే తొలి మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ చెక్కును టీమ్ కెప్టెన్ ధోనీ వారికి అందజేయనున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నై, బెంగళూరు మధ్య ఈ నెల 23న జరగనుంది.  టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమంతా పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు సీఎస్‌కే టీమ్ డైరెక్టర్ రాకేష్ సింగ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

ఇక కొద్ది రోజుల క్రితమే సైనిక సంక్షేమ నిధికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చు రూ. 15 కోట్లతో పాటు అదనంగా మరో ఐదు కోట్లు జతచేసి సంక్షేమ నిధికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.