Friday, July 19, 2019
Follow Us on :

ఆయన కేవలం ఒక రాజు కాదు...మరాఠా సింహం!

By BhaaratToday | Published On Feb 19th, 2019

మన భారత దేశ చరిత్రలో గడిచిన వెయ్యి సంవత్సరాల కాలానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ కాలంలో భారతీయ సంస్కృతి, హిందూ ధర్మంపై ఘోరమైన దురాక్రమణలు జరిగాయి. విదేశీ దురాక్రమణదారులు వారితో చేతులు కలిపిన స్వదేశీయులైన దేశద్రోహులు ఒకవైపున ఉండగా..., మరోవైపున ఈ పుణ్యభూమి సంస్కృతీ, స్వాతంత్ర్యాల కోసం, పౌరుష పరాక్రమాలతో అలుపెరగని పోరాటం సలిపిన దేశభక్తులు, వీరులు ఉన్నారు.

క్రీ.శ.1193లో ఉత్తరభారత దేశంలోని హిందూ చక్రవర్తి పృథ్వీరాజు చౌహాన్ పతనం తర్వాత ఈ ఘర్షణ మరింత తీవ్రమయ్యింది. ఇటు దక్షిణ భారతంలో హంపీ విజయనగరం వంటి హిందూ మహాసామ్రాజ్యం పీఠం కూడా శిథిలమైంది. ఇక ఈ దేశపు స్వాతంత్ర్యభానుడు అస్తమించాడేమో అన్నంతగా గాఢాంధకారం సమస్త భారతదేశాన్ని అలముకుంది. కానీ ఈ కటిక చీకటిని చేధించే ఓ ఆశాకిరణం పడమటి కనుమల్లోని సహ్యాద్రికొండల్లో ఉదయించింది. ఆ ఉదయించిన హిందూ సింహమే ఛత్రపతి శివాజీ..! శివాజీ ఫిబ్రవరి 19, 1630న శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి దంపతులకు జన్మించాడు. శివాజీ జ‌యంతి సంద‌ర్భంగా భార‌త్‌టుడే ప్ర‌త్యేక క‌థ‌నం.

క్రీ.శ. 1100 నుంచి క్రీ.శ 1800 సంవత్సరం వరకు ఏడు శతాబ్దాల పాటు ముస్లిం ఆక్రమణకారులతో హిందూ వీరులు ఎడతెరపి లేకుండా పోరాటం చేశారు. హిందూ జాతీయవాద శక్తులు సాగించిన ఈ పోరాట పరంపరలో... నిర్ణయాత్మకమైన అంతిమ విజయానికి రూపకల్పన చేసింది ఛత్రపతి శివాజీయే. ఈ వేయి సంవత్సరాల పోరాటంలో మన హిందూ సమాజం పొందిన అనుభవాలు, పాఠాలు ఆధారంగా తన జీవితాన్ని మలచుకుని క్లిష్టపరిస్థితి నెదిరించిన శివాజీ ప్రభువు కాలఖండంలో అత్యంతకీర్తిశాలి, జాతీయ వీరుడు.

హిందూ స్వరాజ్య పోరాటంలో ఛత్రపతికి మొదట్లో పెద్ద పెద్ద సర్దార్లు ఎవరు సహకరించలేదు. అయితేనేం ఆయన తన యుక్తి, శక్తితో సొంతంగా సైన్యాన్నితయారు చేసుకున్నాడు. గ్రామీణ ప్రజలు, గిరిజనులనే ఆయన పోరాటయోధులుగా మలిచాడు. విజయప్రాప్తికి అవసరమైన నూతన యుద్ధకళను మన దేశంలో ప్రవేశపెట్టిన ఘనత ఛత్రపతి శివాజీ మహారాజుదే. ఆయన తన సైనాన్ని చిన్న చిన్న దళాలుగా రూపొందించాడు. అంతేకాదు భారీ సైన్యాలను ఓడించగల గెరిల్లా రణతంత్రాన్ని అవలంబించాడు. శత్రువులపై ఆకస్మికంగా దాడి చేసి వారు తేరుకునే లోపలే మాయమవడం ఈ పద్ధతి. అఫ్జల్ ఖాన్ ను ఈ మాయలోకి దింపే హతమార్చాడు. హిందువుల్లో ఆత్మవిశ్వాసం నింపాడు.

కొంతమంది చరిత్రకారులు...మార్క్స మెకాలే వాదులు శివాజీని దోపిడీదారుగా, బందిపోటుగా తులనాడారు. శివాజీ అన్నను, శృంగారపురం హిందూ రాజును కపటంతో చంపినవాడు అఫ్జల్ ఖాన్. శివాజీని సైతం కపటంతోనే చంపేందుకు యత్నించాడు. మోసాన్ని మోసంతోనే తిప్పికొట్టి అఫ్జల్ ను హతమార్చాడు. ఇలాంటి సాహసం గతంలో ఏ హిందూ రాజు చేయలేదు.