Tuesday, September 24, 2019
Follow Us on :

చైనాటకం

By BhaaratToday | Published On Mar 18th, 2019

మసూద్ పై నిషేధం కోసం భారత్ ‘విశ్వ’ ప్రయత్నం. ఐక్యరాజ్య సమితిలో అగ్రదేశాల ప్రతిపాదన. అయినా, అడ్డుతగిలిన చైనా. జైషేతో జిన్ పింగ్ స్నేహం..! ఉగ్రరాక్షసుడిని కాపాడే ప్రయత్నం. డ్రాగన్ కంట్రీకి ఎందుకీ స్వార్థం..? ‘సాయం’ వెనుక ఏమిటి పరమార్థం..? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశంగా తనకున్న వీటో అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ఉగ్ర రాక్షసుడిని మరోసారి కాపాడింది జిత్తులమారి చైనా. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ పై.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడకుండా అడ్డుతగిలింది. మసూద్ అజర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ కు అగ్రదేశాలు మద్దుతు పలుకుతున్నా.. డ్రాగన్ కంట్రీ తన కుంటిసాకులతో నాలుగోసారి మసూద్ ను వెనకేసుకొచ్చింది. ఒక ఉగ్రవాదిని అంతర్జాతీయ టెర్రరిస్టుగా గుర్తించాలంటే నిబంధనలేంటి..? దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో ఎలాంటి విధివిధానాలున్నాయి. మసూద్ ను వెనకేసుకురావడంలో.. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశంగా చైనా చూపుతున్న కారణాలేంటి..? అసలు ఆ కారణాలు సమంజసమైనవేనా..? ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు.. ఏకంగా నాలుగు సార్లు మసూద్ అజర్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్టు ముద్ర నుంచి కాపాడింది డ్రాగన్ కంట్రీ. అసలు అజర్ చైనా ఎందుకు వెనకేసుకొస్తోంది..? అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నా.. ఓ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఎందుకు కాపాడుతోంది..? అంటే, చైనా స్వార్థ ప్రయోజనాలు ఎన్నో కనపడతాయి. 

పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గత కొంతకాలంగా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే చైనా మరోసారి భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడ్డుతగిలింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలో వీటో అధికారం కల్గిన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాలు ఫిబ్రవరి 27న ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. దీనిపై పది రోజుల్లోగా నిర్ణయం ప్రకటిస్తామని ఆంక్షల కమిటీ అప్పట్లో తెలిపింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్ అజర్ ను నిషేధించే విషయంలో మరింత సమగ్ర సమాచారం అవసరం ఉందని.. దీనిపై లోతుగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కుంటిసాకులు చెప్పింది. తనకున్న వీటో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మసూద్ అజర్‌ను కాపాడింది. అంతకుముందు కూడా జైషే మహ్మద్ చీఫ్ మసూదేనని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవని చైనా ఆరోపించింది. మార్చి 13న డెడ్‌లైన్ విధిస్తూ.. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేసిన ప్రతిపాదనను.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా మాత్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలో జైషే చీఫ్ మసూద్ అజరేనన్న తన వాదనకు బలం చేకూర్చేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ ఆడియో టేప్స్ సమర్పించినట్లు తెలుస్తోంది. గతంలోనూ భారత్‌ యత్నాలను చైనా అడ్డుకుంది. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి సూత్రధారి అయిన అజర్ ను బ్యాన్ చేయాలన్న భారత్ డిమాండ్ ను.. కారణం తెలపకుండా చైనా వ్యతిరేకింది. అయితే ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 15 దేశాలకు గాను 14 దేశాలు గట్టిగా మద్దతు పలికాయి. అణు సదస్సు - 2016 కు ముందు భారత్ మసూద్ అజర్ ను పఠాన్ కోట్ ఉగ్రదాడికి సంబంధించి ఐక్యరాజ్య సమితి విచారించాలని గట్టిగా కోరింది. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి. అయితే, అజర్ ను నిషేధించాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తుంటే.. చైనా మాత్రం ఇలా ప్రతీసారి అడ్డుతగులుతోంది. తొమ్మిది నెలల కిందట కూడా ఇలాగే తన వీటో అధికారాన్ని వినియోగించి మసూద్‌ నిషేధానికి సాంకేతికంగా అడ్డుపడింది. 2009, 2016, 2017లోనూ ఇదే విధమైన వైఖరిని చైనా ప్రదర్శించింది.  చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్‌ అంతకుముందే సంకేతాలిచ్చారు. మొత్తానికి అజర్ ను కాపాడిని చైనా వైఖరిపై భారత్ తీవ్రంగా మండిపడింది. భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాది మసూద్ అజార్‌పై అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకోవడం నిరుత్సాహానికి గురిచేసిందని భారత్ వ్యాఖ్యానించింది.  చైనా తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డ్రాగన్ డబుల్ గేమ్ ఆడుతోందని విదేశాంగ, రక్షణ రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల పట్ల ఆ దేశానికి గౌరవం లేదని మండిపడుతున్నారు. ఇక మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిందుకు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలకు భారత్ ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు, తమ దేశ పౌరులపై జరిగే ఉగ్రదాడులతో సంబంధం ఉన్నవారి విషయంలో పలు అంతర్జాతీయ వేదికలపై నిరంతరం చర్చిస్తూ న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేసింది. మరోవైపు, చైనా వైఖరిపై అమెరికా తీవ్రంగా మండిపడింది. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని, ఈ విషయంలో చైనా వైఖరి తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత సాధనకు కూడా ఇది గొడ్డలిపెట్టుగా నిలుస్తోందని తెలిపింది. అంతేకాదు, మసూద్‌ అజర్‌ ను ఐక్యరాజ్య సమితి ఆంక్షల తీర్మానం ప్రకారం ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మద్దతు కోసం తాము కృషి చేస్తున్నామని కూడా అమెరికా వెల్లడించింది. ఈ విషయంలో చైనాను ఒప్పించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపింది. పాకిస్తాన్‌ నుండి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే ఉగ్రవాదిని కాపాడటం ఒక బాధ్యతాయుతమైన దేశంగా చైనాకు ఏ విధంగానూ మంచిది కాదని స్పష్టం చేసిన అమెరికా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చైనా స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం వుందని తెలిపింది. ఇదిలావుంటే, అజర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రపడకుండా చైనా అడ్డుపడినా.. ఫ్రాన్స్ మాత్రం తనవంతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో మసూద్ అజర్ కు చెందిన ఆస్తులను స్తంభింపజేస్తున్నామంటూ ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. ఫ్రాన్స్ ఆర్థిక, ద్రవ్య విధానం అనుసరించి మసూద్ ఆస్తుల స్తంభనపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. అంతేకాకుండా, యూరోపియన్ యూనియన్ అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజర్ పేరు కూడా చేర్చేలా ఫ్రాన్స్ కృషి చేస్తుందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మసూద్ అజర్ పై తీర్మానాన్ని చైనా వీటోతో కొట్టిపారేసిన కొన్నిరోజుల్లోనే ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకోవడం భారత్ కు గణనీయమైన విజయంగానే భావించాలి.  ఇప్పటికే మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన విషయంలోనూ ఫ్రాన్స్ కొంతకాలంగా ఒత్తిడి తెస్తూనేవుంది. మసూద్‌ అజర్‌ ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించాలంటూ భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జీగ్లర్‌ ఇటీవల తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి యునైటెడ్‌ నేషన్స్‌లో తాము గట్టిగా పట్టుబడతామన్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలతో ఫ్రాన్స్‌ కూడా బాగా దెబ్బ తిన్నదని తెలిపారు. ఇదిలావుంటే, మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేదాకా వెనక్కి తగ్గేది లేదని.. ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. నాలుగోసారి అజర్ ను కాపాడిన చైనా వైఖరిని... అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ మరింత ముమ్మరంగా ప్రయత్నించాలని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. 

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత పరిణామాలు భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ భారత్‌కు అప్పగించడంతో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. అయితే, ఇటీవల కశ్మీర్‌లో జైషే మహమ్మద్ మరో ఉగ్రదాడికి చేసిన కుట్రను నిఘావర్గాలు ఛేదించడంతో మరోసారి ఉగ్రఛాయలు వెలుగుచూశాయి. కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడికి సంబంధించి సోషల్ మీడియాలో జైషే మహమ్మద్ మెసేజ్‌లను ఇంటలిజెన్స్ గుర్తించింది. దాడికి సంబంధించిన వివరాలను సీక్రెట్ కోడ్ రూపంలో ఓ క్లోజ్డ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడాన్ని గుర్తించింది. ఇంటలిజెన్స్ వర్గాలు దాన్ని డీకోడ్ చేయగా.. పుల్వామా ఉగ్రదాడి లాగే 200కేజీల పేలుడు పదార్థాలతో మరో ఉగ్రదాడికి పాల్పడబోతున్నట్టు అందులో వుంది. మరోవైపు జైషే మ‌హ్మ‌ద్‌, తాలిబ‌న్ ఉగ్ర‌వాద సంస్థ‌లు సంయుక్తంగా భార‌త్‌ లో దాడుల‌కు ప్ర‌య‌త్నిస్తున్నాయనేది ఆందోళన కలిగించే అంశం. పాక్‌కు చెందిన గూఢాచార ఏజెన్సీ ఐఎస్ఐ.. ఈ కుట్ర‌కు ప్రాణం పోసిన‌ట్లు అనుమానిస్తున్నారు. జైషే, తాలిబ‌న్ల‌ను ఒక్క గ్రూపుగా మార్చేందుకు పాక్ ఐఎస్ఐ ప్లాన్ వేసిన‌ట్లు తెలిసింది. బాలాకోట్‌లో భార‌త వైమానిక ద‌ళం దాడులు చేయ‌క‌ముందే ఈ ప్ర‌ణాళిక ర‌చ‌న జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. జైషే, తాలిబ‌న్‌, హ‌క్కానీ గ్రూపులు జిహాదీ దాడుల‌కు అంగీక‌రించిన‌ట్లు కూడా తెలుస్తోంది. ఈ మూడు ఉగ్ర సంస్థ‌లు భార‌త్‌తో పాటు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో దాడుల‌కు ప్లానేశాయి. పాకిస్థాన్‌లో డిసెంబ‌ర్ 15 నుంచి 20 మ‌ధ్య ఈ మీటింగ్ జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు అమెరికా నిర్ణ‌యించిన త‌ర్వాత‌.. పాక్‌కు చెందిన ఐఎస్ఐ ఈ మూడు ఉగ్ర సంస్థ‌ల‌ను ఒక్క‌టి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. పీవోకేలో మొత్తం 16 టెర్ర‌ర్ గ్రూపులు ప‌నిచేస్తున్నాయ‌ని, వాటిల్లో గ‌త ఏడాది 560 మంది ట్రైనింగ్ తీసుకున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇలా ఉగ్ర సంస్థలు మాటిమాటికీ దాడులకు వ్యూహరచన చస్తూనేవున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ లో రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఆ సంస్థ మూలాలు పాకిస్తాన్ లోనే వున్నాయన్నది జగమెరిగిన సత్యం. భారత్ తో పాటు అగ్రదేశాలకు ఇది తెలియని విషయమేమీ కాదు. పాకిస్థాన్ లో 22 టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్లు 22 ఉన్నాయట. అందులో జైషే మహ్మద్ సంస్థకు చెందినవే 9 ఉన్నట్లు ఆ అధికారి వెల్లడించాయి. ఆ సంస్థలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే గాకుండా ఉద్రిక్తత మరింత పెంచే దిశగా పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్ నీతిమాలిన చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల పలు టెర్రరిస్టు సంస్థలకు చెందిన నేతలను పాకిస్థాన్ గృహనిర్భందం చేయడం లాంటి చర్యలను డ్రామాగా రక్షణ రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. భారత్ లో ఉగ్రదాడుల తర్వాత ప్రతిసారి ఇలా చేయడం.. గృహనిర్భందం పేరుతో వారికి సకల సదుపాయాలు కల్పించడం పాకిస్తాన్ కు వెన్నతో పెట్టిన విద్య. పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్లీ వారిని స్వేచ్ఛాజీవులుగా విడిచిపెట్టడం ఆ దేశానికి ఆనవాయితీగా మారింది. పాకిస్తాన్ లోని ఉగ్రసంస్థలు.. వాటి అధినేతలను నామరూపాల్లేకుండా చేసినప్పుడే ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పడతాయి. అలా చేయాలంటే మసూద్ అజర్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను ఇంటర్నేషనల్ టెర్రరిస్టులుగా గుర్తంచి ఉక్కుపాదం మోపాలి. ఏళ్ల తరబడి భారత్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూనేవుంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాయి. కానీ, చైనా మాత్రం ప్రతీసారి అడ్గుతగులుతూనేవుంది. 2008లో ముంబయి దాడులకు లష్కరే తోయిబా కారణమని ఆరోపించిన భారత్ మసూద్ అజర్‌తోపాటు తమ జాబితాలో ఉన్న అందరినీ అప్పగించాలని పాకిస్తాన్‌ను కోరింది. కానీ పాక్ వారిని ఇప్పటికీ అప్పగించలేదు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి తర్వాత పాక్ అధికారులు మసూద్ అజర్‌ను 'ప్రొటెక్టివ్ కస్టడీ'లోకి తీసుకున్నారు. కానీ, అతడిపై ఈ దాడి అభియోగాలు మోపలేదు. ఆ తర్వాత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలని 2016లో భారత్ ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదనలు పంపింది. అయితే, పాకిస్తాన్ మిత్రదేశం చైనా భారత ప్రయత్నాలను 'సాంకేతిక కారణాల' సాకుతో అడ్డుకుంది. 2016లో భారత్ ప్రతిపాదనను వీటో అధికారం ఉపయోగించి బ్లాక్ చేసింది, 2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా పెట్టిన అదే ప్రతిపాదనను కూడా చైనా మరోసారి అడ్డుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో.. మసూద్ అజర్‌ను ఉగ్రవాది ప్రకటించాలన్న భారత్ అభ్యర్థనను వ్యతిరేకిస్తున్న ఏకైక దేశం చైనా మాత్రమే. డ్రాగన్ కంట్రీ అజర్ ను కాపాడటం ఇది నాలుగోసారి.  నిజానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267 కమిటీలో టెర్రరిస్టు సంస్థలు లేదా ఏవరైనా వ్యక్తిని చేర్చే ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించవచ్చు. అయినప్పటికీ, లిస్టింగ్ విషయంలో 1267 కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, సిద్ధాంతాలను పాటించాలని, తగిన ఆధారాలతో, మిగతా సభ్యుల ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవాలని చైనా కుంటిసాకులు చెబుతూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 కమిటీ టెర్రరిస్ట్ సంస్థలపై ఆంక్షలు, చర్యల అమలును పర్యవేక్షిస్తుంది. తీర్మానాల జాబితాలో ఉన్న నిబంధనల ప్రకారం తగిన వ్యక్తులు, సంస్థలను సూచిస్తుంది. ఉగ్ర సంస్థల విషయంలో.. ఆంక్షల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం గురించి వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై నిర్ణయం తీసుకుంటుంది. ఆంక్షల జాబితాలో చేర్చే వ్యక్తులు, సంస్థల గురించి ప్రత్యేక సమీక్షలను నిర్వహిస్తుంది. ఆయా సంస్థలు, వ్యక్తులపై పర్యవేక్షణ బృందం సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది. ఆంక్షలు అమలు చేయడం గురించి ఏటా భద్రతా మండలికి నివేదిక ఇస్తుంది 1267 కమిటీ ఆంక్షల ప్రకారం.. జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఆయుధాలను వినియోగించటంపై.. వారి ప్రయాణాలపై నిషేధం వుంటుంది. అంతేకాదు, ఆయా సంస్థలు, వ్యక్తుల ఆస్తుల స్వాధీనం చేసుకుంటుంది. ఈ చర్యలకు తుదిగడువు అంటూ ఏదీ ఉండదు. ఈ ఆంక్షలు, చర్యలను 18 నెలలకొకసారి సమీక్షిస్తారు. భద్రతా మండలి 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీలో ఇప్పటివరకూ 257 మంది వ్యక్తులు, 81 సంస్థలను నమోదు చేశారు. 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక ప్రత్యేక అంశంపై ఏకాభిప్రాయం సాధించలేకపోతే, కమిటీ అధ్యక్షుడు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించవచ్చు. అప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోతే, ఆ అంశాన్ని భద్రతా మండలికి సమర్పించవచ్చు. సాధారణంగా, ఏ అభ్యంతరాలూ లేనట్లయితే ఐదు రోజుల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు. పేర్ల నమోదుకు, తీసివేయడానికి నో అబ్జక్షన్ ప్రక్రియ పది రోజుల వరకూ పడుతుంది. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఎలాంటి కాల పరిమితి లేకుండా సభ్యులు హోల్డులో ఉంచవచ్చు. అయితే పెండింగులో ఉన్న అంశాన్ని పరిష్కరించడానికి మూడు నెలల తర్వాత అప్ డేట్స్ అందించాలని అభ్యర్థించవచ్చు. అజర్ పై నిషేధం విషయంలో.. ఇలాంటి కొన్ని వెసులు బాట్లను.. ఐక్యరాజ్యసమితిలో తనకున్న శాశ్వత సభ్యత్వాన్ని వాడుకుని చైనా నాటకాలాడుతోంది. తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉగ్రరాక్షసుడిని వెనకేసుకొస్తోంది. 

ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నా.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాలు చివాట్లు పెడుతున్నా.. డ్రాగన్‌ కంట్రీ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజర్‌ ను ఏకంగా నాలుగు సార్లు కాపాడి.. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు తెలిపింది చైనా. అయితే, చైనా ఇలా ప్రవర్తిండానికి అనేక కారణాలున్నాయి. పలు భౌగోళిక రాజకీయాంశాలు, ఆర్థిక అవసరాలు, దేశ అంతర్గత విషయాలు.. చైనా మసూద్ ను వెనకేసుకురావడానికి దోహదం చేస్తున్నాయి. ఇందులో మొదటిది చైనా, పాకిస్తాన్ బంధం. ఈ రెండు దేశాల సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌పై పాకిస్థాన్‌ ఎక్కుపెట్టే ఆయుధాల్లో చాలావరకు చైనా నుంచి వచ్చేవే. భారత్‌కు చైనా, పాక్‌లు శత్రుదేశాలే. ఇదే అంశం వారిని దగ్గర చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ను నష్టపర్చేలా పాక్‌ చేపట్టే ఏ చర్యకైనా చైనా మద్దతు ఉంటుంది. కొన్ని లోపాయకారిగా ఉంటే.. మరికొన్ని బహిరంగంగానే ఉంటాయి. అలా బహిరంగంగా ఉండే వాటిల్లో మసూద్‌ అజర్‌ అంశం కూడా ఒకటి. ఇక రెండో కారణం దలైలామా. టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్‌ కొన్ని దశాబ్దాలుగా ఆశ్రయం ఇస్తోంది. ఈ అంశం చైనాకు కంటగింపుగా మారింది. ఎన్నోసార్లు చైనా బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయినా భారత్‌ దీనిని పట్టించుకోలేదు. అందుకే భారత్‌కు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ నాయకులు ఎంతో.. తమకు దలైలామా అంతే అన్నట్లు చైనా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ను విసిగించేందుకు మసూద్‌ అజర్‌ను వాడుకొంటోంది.  ఇక మరో ముఖ్యమైన కారణం ఉయ్‌గుర్‌ ముస్లింలు. చైనా జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో కొన్ని లక్షల మంది ఉయ్‌గుర్‌ ముస్లింలపై డ్రాగన్ కంట్రీ దమనకాండ సాగిస్తోంది. వారి ప్రతికదలికపై నిఘా ఉంచి అణగదొక్కుతోంది. అఫ్గాన్‌ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం నుంచి తమ ప్రధాన భూభాగానికి ఉగ్రముప్పు పొంచి ఉందనేది చైనా అనుమానం. మరోవైపు మసూద్‌ అజర్‌కు చెందిన జైషే సంస్థకు పాక్‌, అఫ్గాన్‌ సరిహద్దుల్లో మంచి పట్టు ఉంది. ఇప్పుడు మసూద్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి మద్దతు ప్రకటిస్తే.. అఫ్గాన్‌కు చెందిన ఉగ్రమూకలు చైనాలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అసలే తనను వ్యతిరేకించిన పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ పైనే జైషే హత్యాయత్నాలు చేసింది. అటువంటి ఉగ్రసంస్థతో తలనొప్పి దేనికి అనుకొని చైనా తీర్మానాన్ని వ్యతిరేకించింది.  మరోవైపు ఉయ్‌గుర్‌ల విషయంలో ముస్లింల వ్యతిరేకి అనే విమర్శలను డ్రాగన్‌ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో  మసూద్‌ను రక్షించడం ద్వారా తాను ముస్లింలకు వ్యతిరేకి కాదనే విషయాన్ని ప్రపంచానికి చాటాలనేది చైనా పన్నాగం. పాక్‌లోని మసూద్‌ని రక్షించడం ద్వారా ముస్లిం దేశాల్లో ఇమేజ్‌ పెంచుకోవాలనే తాపత్రయం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. దక్షిణాసియాలో భారత్‌ అత్యంత కీలకమైన స్థానంలో ఉంది. యుద్ధానికి ముందు వరకు చైనాతో భారత్‌ మంచి సంబంధాలు పెట్టుకుంది. కానీ, యుద్ధం తర్వాత చైనా మన దాయాది పాక్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో భారత్‌.. జపాన్‌, అమెరికాలతో సంబంధాలను పటిష్ఠం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశ దూకుడుకు అమెరికా, జపాన్‌లు కళ్లెం వేస్తున్నాయి. దీనికి భారత్‌ సహకరిస్తోంది. ఇప్పుడు దీంతో మన శత్రువైన పాక్‌ను సంతోషపెట్టేందుకు మసూద్‌కు చైనా సాయం చేస్తోందనేది కాదనలేని వాస్తవం. అంతేకాదు, భారత్‌ ఇటీవల కాలంలో వియత్నాంతో సంబంధాలను పెంచుకుంటోంది. ఆ దేశానికి ఆయుధాలను కూడా సరఫరా చేస్తోంది. వియత్నాంతో చైనాకు కొన్ని అంశాలపై తీవ్ర విభేదాలు ఉన్నాయి. అటువంటి వియత్నాంకు భారత్‌ ఆయుధాలు సరఫరా చేయడం కూడా చైనా ఆగ్రహానికి కారణం అవుతోంది.  ఇక అన్నింటి కంటే అతి ముఖ్య కారణం సీపెక్‌. మసూద్ ను రక్షించాడనికి చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కూడా కారణం. అందరూ సీపెక్‌ పాకిస్థాన్‌కు గుండెకాయ అనుకుంటారు. కానీ, ఇది చైనాకు ఆక్సిజన్‌ అందిస్తుంది. ఇప్పటి వరకు చైనాకు చమురు రవాణా చేయాలంటే అది భారత్‌ కనుసన్నల్లోని మార్గాల నుంచి జరగాల్సిందే. చైనాకు వెళ్లే చమురు నౌకలను భారత్‌ అండమాన్‌ దీవుల వద్ద తన నావికాదళంతో అడ్డుకొనే అవకాశం ఉంది. ఇదే జరిగితే చైనా వృద్ధిరేటు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతుంది. ఈ విషయం కూడా చైనాకు తెలుసు. అందుకే ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా జింగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాకిస్థాన్‌లో గ్వాదర్‌ పోర్టు వరకు సీపెక్‌ పేరుతో కారిడార్‌ నిర్మాణం చేపట్టింది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే చమురు, గ్యాస్‌లను ఈ మార్గం నుంచి చైనాకు తరలించనుంది. ఇది అత్యంత సురక్షితమైన చౌక వ్యవహారం. ఇక్కడే మసూద్‌ పాత్ర తెరపైకి వచ్చింది. ఈ సీపెక్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వెళుతుంది. ఇక్కడ చైనా, పాక్‌ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సీపెక్‌ నిర్మాణాన్ని పాక్‌ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పాక్‌లోని ఖైబర్‌ కనుమల్లోని మాన్‌ షెహ్‌రా నుంచి కూడా సీపెక్‌ మార్గం వెళుతుంది. ఇక్కడికి అత్యంత సమీపంలోని బాలాకోట్‌ వద్ద కూడా చైనా భూములను తీసుకుంది. అంతేకాదు సీపెక్‌, గ్వదర్ పోర్టు పనుల్లో దాదాపు 60 వేల మంది చైనీయులు పనిచేస్తున్నారు. 2022 వరకు గ్వదర్ పోర్టు నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలున్నాయి. గ్వదర్ పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ టౌన్ లో 5 లక్షల మంది చైనీయులు నివాసం ఏర్పరుచునే అవకాశం వుంది. దీంతోపాటు అక్కడ పలు కీలకమైన విద్యుత్తు ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. ఈ సమయంలో జైషే నిషేధానికి మద్దతు తెలిపితే ఆ సంస్థ సీపెక్‌, గ్వదర్ పోర్టుపై దాడులు మొదలు పెట్టే అవకాశం ఉంది. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. సీపెక్ దాదాపు 51 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టు. అందుకే చైనా కిమ్మనకుండా జైషేకు మద్దతు ఇస్తోంది. ఇదీ మసూద్‌కు చైనా మద్దతు వెనుక అసలు కారణం.