Tuesday, October 15, 2019
Follow Us on :

ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే

By BhaaratToday | Published On Aug 3rd, 2019

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో నేడు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగైదు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసింది.

కొద్ది రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. శుక్రవారం నాడు కూడా తెలంగాణలో పలు చోట్ల కుంభవృష్టి పడింది. గరువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు తెలంగాణలోని ములుగు వెంకటాపూర్‌లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం పగటిపూట అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 7.1 సెం.మీ.ల వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రూరల్ జిల్లాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది.