Thursday, April 25, 2019
Follow Us on :

ఏపీ చరిత్రలో ఇన్ని అరాచకాలు ఎప్పుడూ లేవు..!

By BhaaratToday | Published On Apr 13th, 2019

ఏపీ చరిత్రలో ఇన్ని అరాచకాలు ఎప్పుడూ లేవని సీఎం చంద్రబాబు అన్నారు. నేడు డిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను చంద్రబాబు కలిశారు. గంటన్నర పాటు సీఈసీతో చంద్రబాబు బృందం భేటీ అయింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నేరస్తులు చెబితే అధికారులను బదిలీ చేశారని, ఏపీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేశారని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని బాబు ధ్వజమెత్తారు. అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. 

ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వీవీప్యాట్లను లెక్కించడానికి 6 రోజులు పడుతుందని.. సుప్రీంకోర్టుకు ఈసీ ఎందుకు చెప్పిందని ఫైర్ అయ్యారు. మా పోరాట ఫలితంగా వీవీప్యాట్లు వచ్చాయని.. కానీ వీవీప్యాట్లపైనా నమ్మకం లేకుండా చేశారని అన్నారు. ఈవీఎంలు వద్దు.. పేపర్‌ బ్యాలెట్లు కావాలని.. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని అన్నారు. 

రాష్ట్రంలో జరిగిన అవకతవకల్ని దేశానికి చాటిచెబుతామని... ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షం ఎందుకు మాట్లాడలేదని.. ప్రతిపక్షమే హింస చేసింది కాబట్టి మాట్లాడలేదని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ప్రజలంతా తిరుగుబాటు చేశారని అన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చి ఓటు వేశారని చంద్రబాబు అన్నారు.