
- ఏపీ ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్కు అసూయ, ద్వేషం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని, అలాగే కేసుల మాఫీ కోసం, డబ్బుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచీ పడ్డారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు కలిగిన పార్టీ వైసీపీ అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎవర్ని ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో ప్రజలే తేలుస్తారని అన్నారు. ఇక కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల సమీక్ష పూర్తయిందని, నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష పూర్తికాగా, మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఏపీని సామంత రాజ్యం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని, అందుకు, ఎన్నో బలహీనతలు ఉన్న జగన్ ని పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్ఎస్ వేధిస్తోందని, ఏపీ రాజకీయాల్లో తాము చెప్పినట్టుగా పని చేయాలని బెదిరిస్తున్నారని, ద్వితీయశ్రేణి టీడీపీ నేతల ఆస్తులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని, ఎదిరించి పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ద్వారా ఆస్తులు పోయినా ఆత్మ గౌరవం కోసం పోరాడతామని అన్నారు.