
సంక్షేమంతో పాటు అనేక కార్యక్రమాల్లో మనం దేశానికి దిక్సూచిగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ... వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అని, ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడి ప్రజలేనని కొనియాడారు. ఇక్కడి ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదన్నారు. చైతన్యవంతమైన జిల్లా నుంచి స్ఫూర్తివంతమైన తీర్పు వస్తుందని భావిస్తున్నానన్నారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్టే గెలుపులో కూడా అగ్రభాగాన ఉండాలన్నారు.
ఈ ఎన్నికల్లో కూడా దయచేసి అగ్రభాగాన నిలబెట్టాలని కోరుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ఐదేండ్ల క్రితం మన తెలంగాణ ఎంట్లుండే? ఈవాళ తెలంగాణ ఎట్ల ఉన్నది? ఐదేళ్ల క్రితం కూడా ప్రభుత్వాలు ఉన్నాయి.. కరెంటు కోసం లాఠీ చార్జీలు జరిగాయి..కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎన్నో చూశాం.. ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పరిస్థితి తారుమారైందని పేర్కొన్నారు. 75 టీఎంసీల కెపాసిటీ గల దేవాదు నిర్మాణం కూడా పూర్తి చేశామని, మరో పది నెలలు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు ఉండేలా సిద్ధం చేశామన్నారు. త్వరలో ప్రతీ జిల్లాలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి తానే స్వయంగా సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. ప్రభుత్వమంటే ఇలా పనిచేస్తుందా అని అందరూ ఆశ్చర్యపడేలా చేస్తామని కేసీఆర్ చెప్పారు.