Tuesday, September 24, 2019
Follow Us on :

నేనంటే చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంది: కేసీఆర్‌

By BhaaratToday | Published On Mar 17th, 2019

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కరీంనగర్ నుంచి సమరశంఖం పూరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయ‌న‌ ప్ర‌సంగించారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణ తెస్తనని తాను చెబితే..నాడు అవహేళన చేసిన చంద్రబాబు.. నేడు తనను చూసి భయపడుతున్నారని వ్యాఖ్య‌నించారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌తో ఏం అవుతది.. ఏం చేసినా కర్త, కర్మ, క్రియ అన్నీ తానేనని మాట్లాడిన చంద్రబాబు.. నేడు నన్ను చూసి భయపడుతున్నారు. గడిచిన మూడు నెలల నుంచి చంద్రబాబు నన్ను మూడువేల తిట్లు తిట్టాడు’’ అని కేసీఆర్ అన్నారు. ఆంధ్రాలో ఓడిస్తాననే భయం చంద్రబాబును పట్టుకుందని, దీన్ని బట్టే ఎక్కడి కేసీఆర్.. ఎక్కడికి వచ్చిండనేది స్పష్టమవుతుందన్నారు. ఆనాడు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయని, ఆనాడు ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాల కాలం పట్టేదని అన్నారు. ఐదేళ్ల నాటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందని, ఐదేళ్ల కిందటి తెలంగాణను గుర్తు చేసుకుంటే భయమేస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్ గా ఉందని, విద్యుత్ రంగంలో అద్భుతం సృష్టించామని చెప్పారు.