Monday, September 23, 2019
Follow Us on :

విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య బెడిసికొట్టిందా.. వాటినే వివాదం అనుకుంటే ఎలా..?

By BhaaratToday | Published On Sep 11th, 2019

టీమిండియా క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య విబేధాలు వచ్చాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. విండీస్ టూర్ లో కూడా ఒకరినొకరు సరిగా పలకరించుకోలేదని వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై భారతజట్టు కోచ్ రవిశాస్త్రి స్పందించారు. జట్టులో 15 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం కలిగివుండే అవకాశం ఉంది. అది అవసరం కూడా. అందరూ ఒకే అభిప్రాయం వెల్లడించాలని నేను కోరుకోను. ఓ అంశంపై చర్చ జరిగినప్పుడు జట్టులో ఎవరో ఒకరు సరికొత్త వ్యూహం వెల్లడిస్తే, దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం. ఒక్కోసారి జట్టులోకి అప్పుడే కొత్తగా వచ్చిన ఆటగాడు ఏదైనా ప్లాన్ చెబితే దాని గురించి కూడా చర్చిస్తామని ఆయన అన్నారు.  ఓ విషయంలో భేదాభిప్రాయం ఉన్నంత మాత్రాన అది వివాదం అనుకుంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పేలా ప్రోత్సహించి, ఏది అత్యుత్తమమో దాన్ని ఖరారు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. 

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు అసలు పడడం లేదని.. భారత క్రికెట్ జట్టు రెండుగా చీలిందని వరల్డ్ కప్ సెమీస్ అనంతరం పుకార్లు వచ్చాయి. దీనికి తోడు రోహిత్ అనుష్క శర్మను అన్ ఫాలో చేయడం కూడా పెద్ద చర్చకు తెర లేపింది. రోహిత్ శర్మ విండీస్ టూర్ కి కెప్టెన్సీ చేస్తాడని చెప్పిన సెలెక్టర్లు.. అనూహ్యంగా కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ చేయబోతున్నాడని.. రెస్ట్ ఏమీ లేదని ప్రకటించడం ఎన్నో సందేహాలకు దారి తీసింది.