Friday, July 19, 2019
Follow Us on :

పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేద్దాం : రాహుల్

By BhaaratToday | Published On Mar 31st, 2019

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం కోసం ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని అబద్ధాలు చెప్పారని.. మోదీలా తాను అబద్ధాలు చెప్పనని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ క‌ట్టుబ‌డిఉంద‌ని అన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు పరచలేదన్నారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు ప్రధాని మోదీపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయాయని ప్రశ్నించారు. ఉపాధి పథకం కింద లక్షల రూపాయల పనులతో పేదవారిలో వెలుగులు నింపామన్నారు. మోదీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని నీరుగార్చిందని విమర్శించారు. దేశంలో ఏపీని అగ్రగామిగా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కంకణం కట్టుకుందని.. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని రాహుల్ అన్నారు. 

దేశంలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని , దేశంలో ఎక్కడ చూసినా భయాందోళనే నెలకొన్నదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. గబ్బర్‌సింగ్‌ టాక్స్‌తో చిరు వ్యాపారస్తులు, తమ వ్యాపారాలు మూసుకునే విధంగా మోదీ వ్యవహరించారని విమర్శించారు. విజయ్‌ మాల్యా రూ. 10 వేల కోట్లతో విదేశాలకు పారిపోవడం వెనక ప్రభుత్వ పాత్ర ఉందని.. దేశానికి కాపలాదారుడిగా ఉన్నానన్న మోదీ రూ.30 వేల కోట్లను మాత్రం రాఫెల్‌ కాంట్రాక్ట్‌లో అంబానీకి దోచిపెట్టారని ఆరోపించారు. పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేద్దామని రాహుల్‌ పిలుపునిచ్చారు. 20 శాతం ప్రజలు, రూ.12 వేల కన్నా తక్కువ జీతంతో కాలం వెళ్లదీస్తున్నారని, ఆధార్‌తో పేద ప్రజల వివరాలు సేకరిస్తామని, అధికారంలోకి రాగానే ఆ 20 శాతం ప్రజలకు సంవత్సరానికి రూ.72 వేలు అకౌంట్‌లో వేస్తామని హామీ ఇచ్చారు.