Saturday, October 19, 2019
Follow Us on :

నిన్న కేటీఆర్.. నేడు రాహుల్ గాంధీ.. యువ శాస్త్రవేత్తకు ప్రశంసలు

By BhaaratToday | Published On Feb 10th, 2019

పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నాడు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 22ఏళ్ల కుర్రాడు సిరిపురం సాయితేజ. ఈ యువ శాస్త్రవేత్త చదివింది 10వ తరగతే అయినా ఆలోచనలు, ఆవిష్కరణలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రైవర్ మద్యం తాగాడా లేదా అని గుర్తించే పరికరాన్ని కనిపెట్టాడు సాయితేజ. ఒకవేళ డ్రైవర్ మద్యం తాగినట్టైతే ఆ పరికరం గుర్తిస్తుంది. ఇంజిన్ పనిచేయకుండా ఆపేస్తుంది. దీంతో వాహనం ముందుకు కదలడం సాధ్యం కాదు. అంతేకాదు... అందులో ముందే ఫీడ్ చేసిన మొబైల్ నెంబర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా పంపించడం ఈ పరికరం ప్రత్యేకత. 

గుర్తింపు తెచ్చిన భారత్ టుడే

సాయితేజ ప్రతిభను ఇటీవలే భారత్ టుడే వెలుగులోకి తెచ్చింది. అతనికి యువ సంకల్పదివస్ అవార్డునిచ్చింది. ఈ విషయం తెసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయితేజను అభినందించారు. అతనికి ఐటీ రంగంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలని ఆయన నిర్ణయించారు. కేటీఆర్ సాయి తేజను ఐటీ రంగంలోకి ఆహ్వానించారు. ఇక తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాయితేజను ప్రశంసించారు.  ‘సాయితేజ జీ.. యువర్స్‌ ఈజ్‌ యాన్‌ ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ’ అంటూ రాహుల్‌గాంధీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. సాయితేజ ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టిన రాహుల్ గాంధీ... ‘‘సాయితేజ జీ.. మీది స్ఫూర్తినిచ్చే గాథ. ఇది మీలో దాగి ఉన్న ప్రతిభను తెలియజేస్తోంది. దానిని కొనసాగించండి. ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ అభినందించారు. దీంతో సరికొత్త మేథాసంపత్తికి కలిగిన సాయితేజ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. 

15 ఏళ్లకే ఆనారోగ్యం

అయితే పదిహేనేళ్ల వయసులోనే సాయితేజ మెదడు రక్తనాళంలో రక్తం గడ్డ కట్టింది. ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్లాల్సిన వయసులోనే అనారోగ్యం కాటేసింది. కానీ ఇవేవీ ఆ కుర్రాడిని ఆపలేకపోయాయి. ఒక వైపు పేదరికంతో, మరో వైపు అనారోగ్యంతో పోరాడుతూనే టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. పలు వినూత్న పరికరాలకు రూపకల్పన చేశాడు. తాను కొన్ని కారణాల వల్ల 10వ తరగతి తర్వాత చదువు మానేశానని చెబుతున్నాడు సాయితేజ. 

ఇంటర్నెట్ ద్వారా నేర్చుకొని..

ఎలక్ట్రానిక్స్ అంటే ఎక్కువ ఆసక్తి చూపే సాయితేజ వాటి గురించి ఇంటర్నెట్‌ ద్వారా నేర్చుకున్నాడు. ఇంటర్నెట్‌లోనే కోడ్ నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ సృష్టించాడు. డ్రైవర్ 30 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే వాహనం ఇంజిన్ స్టార్ట్ కాదు. మరోవైపు ఈ పరికరం తయారు చేయడానికి సాయితేజకు 15 రోజుల సమయం పట్టింది. 2500 రూపాయల వరకు ఖర్చయింది. డ్రైవర్ మద్యం తాగితే వాహనం ఇంజిన్‌ను ఆపెయ్యడమే కాదు.. అందులోని మైక్రో కంట్రోలర్‌లో సేవ్‌ చేసిన ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ వెళ్లేలా దీన్ని రూపొందించాడు. పదో తరగతి మాత్రమే చదివిన కుర్రాడు ఇంటర్నెట్ సాయంతో ఆల్కహాల్ డిటెక్టర్ తయారు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం మీద మనలో దాగి ఉన్న ప్రతిభను చూపించడానికి చదువు ఒక్కటే మార్గం కాదని నిరూపించాడు సాయితేజ. సో.. సాయితేజ మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించాలని ఆశిద్దాం.