Saturday, August 24, 2019
Follow Us on :

రెండు ప్ర‌భుత్వాల మాటల యుద్ధం

By BhaaratToday | Published On Mar 7th, 2019

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో రాజకీయ పార్టీలు తలమునకలౌతుంటాయి. అయితే ఒకప్పుడు ఎన్నికలంటే.. విమర్శలు - ఆరోపణలు, హామీలు - ప్రలోభాలు, వినూత్న పథకాలు - విభిన్న ప్రచారాలే కీలకంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి మాత్రమే కాదు.. కార్పొరేట్ స్థాయి వ్యూహాలు, సమాచార సేకరణ కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలంటే.. సర్వేలు - అంచనాలు, ఓటర్ల సమాచారం - ఓట్ల గల్లంతు, డేటా వినియోగం - సోషల్ మీడియా ప్రచారం. అసలు పార్టీల కార్పొరేట్ వ్యూహాలు దేనికి సంకేతం..? గెలుపోటములపై ఈ డేటా ప్రభావమెంత..? ఇదే ఇవాళ్టీ లీడ్ స్టోరి.

డేటా చౌర్యం ఇరు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ కేసుపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అసలు డేటా చౌర్యం సాధ్యాసాధ్యాలు ఏమిటి..? ఎన్నికల ఫలితాలపై ఈ డేటా ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది..? అన్న అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. మరోవైపు.. ఓట్ల గల్లంతు కోసమే టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే... తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. అయితే.. అధికార, విపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఎంత..? అసలు ఓట్ల గల్లంతు సాధ్యమేనా..? అన్న డౌట్ పలువురు వ్యక్తం చేస్తున్నారు. 

అటు.. డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర యాప్ లో సమాచారం ఎలా తీసుకున్నారు అన్నది వివరించారు. ఇదిలా ఉండగా.. ఐటీ గ్రిడ్ కేసుపై టీడీపీ సర్కార్ సీరియస్ గా ఉంది. టీసర్కార్ పై పరువు నష్టం కేసు పెట్టేందుకు సిద్ధమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఏపీ ప్రజలలో గందరగోళం సృష్టించడం, టీడీపీకి సంబంధించిన డేటాను వైసీపీకి అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్న టీఆర్ఎస్ సర్కార్.. వైసీపీకి ప్రయోజనాల కోసమే ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు బనాయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎన్నికల వ్యూహాల్లో సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తోంది. ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు ఆయా పార్టీలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను విరివిగా వినియోగిస్తున్నారు. వైరి పక్షాలను ఎండగడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రజల సమాచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు సేకరిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇందు కోసం కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పని చేస్తుంటాయని చెబుతున్నారు. తెలుగు దేశం కోసం ఐటీ గ్రిడ్, వైసీపీ కోసం ఐ-పాక్ సంస్థలు డేటా సేకరిస్తుంటాయని.. కులాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి.. వాటిని అనలైజ్ చేసి.. సానుకూల ఓటర్లు ఎంతమంది.. ప్రతికూల ఓటర్లు ఎంతమంది అనే సమాచారాన్ని ఆయా పార్టీలకు అందిస్తుంటాయని తెలిపారు. అయితే సంస్థలు సేకరించే ఈ సమాచారం ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి పొలిటికల్ పార్టీలు ఉపయోగించుకోగలవా? అన్నది చర్చనీయాంశమవుతోంది.

ఒకప్పటికీ ఇప్పటికీ ఎన్నికల వ్యూహాల్లో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం ప్రచారాలు, హామీలు, విమర్శలు, ఆరోపణలకే పరమితమైన పార్టీలు... నేడు కార్పొరేట్ స్థాయి వ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఇందుకు సోషల్ మీడియా, డేటా సేకరణపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల గెలుపోటములుపై ఈ డేటా ప్రభావమెంత..? అన్నది ఐటీ నిపుణులకే తెలియాలి.