Tuesday, October 15, 2019
Follow Us on :

భారీ భ‌ద్ర‌త‌లో ఉప్ప‌ల్ స్టేడియం

By BhaaratToday | Published On Feb 28th, 2019

భారత్, ఆసీస్‌ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా మార్చి 2న జరుగనున్న తొలి వన్డే మ్యాచ్‌ కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ పేర్కొన్నారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరుగనున్న ఈ మ్యాచ్‌కు దాదాపు 38 వేలకు పైగా ప్రేక్షకులు తరలి రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 2300 మంది పోలీస్‌ సిబ్బందితో స్టేడియం పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయ‌న తెలిపారు. 

పోలీస్‌ పహారాలో క్రికెట్‌ స్టేడియం
భద్రత దృష్ట్యా మూడు రోజుల ముందు నుంచే స్టేడియం, పార్కింగ్‌ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటునట్లు ఆయన తెలిపారు. 200 సీసీ కెమెరాలు, చెక్‌ పాయింట్లు, స్కానర్లు, బాంబు స్క్వాడ్‌ టీమ్‌తో 24 గంటలు పహారా కాస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవ్‌ టీజర్ల భరతం పట్టేందుకు స్టేడియం పరిసరాల్లో షీ టీమ్‌లు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అధిక ధరలకు తినుబండారాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వెండర్‌ సూపర్‌ వైజింగ్‌ టీమ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు.

స్టేడియంలో అనుమతించని వస్తువులు...
ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరెట్స్, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్‌ బాటిల్స్, పెన్నులు, పర్‌ఫ్యూమ్స్, సెల్‌ ఫోన్‌ రీచార్జీ బ్యాటరీలను లోనికి అనుమతించరు. మొబైల్‌ ఫోన్‌లకు అనుమతి ఉన్నట్లు సీపీ తెలిపారు.

ట్రాఫిక్‌ దారి మళ్లింపు
మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వెళ్లే భారీ వాహనాలను అనుమతించరు. సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి మీదుగా చెంగిచర్ల నుంచి వరంగల్‌ హైవేకు కలవాల్సి ఉంటుంది. అటు నుంచి వచ్చే వారు కూడా అదే  దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే వాహనాలు బోడుప్పల్, చెంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది.