Tuesday, May 21, 2019
Follow Us on :

త‌న కుమార్తె ఫోన్ నంబ‌ర్ వేరే వ్య‌క్తికి ఇచ్చింద‌ని..ప‌ట్ట‌ప‌గ‌లే అంద‌రు చూస్తుండ‌గా..

By BhaaratToday | Published On May 15th, 2019

క‌డ‌ప జిల్లా, బ‌ద్వేలు మండ‌లంలో దారుణం జ‌రిగింది. తన కుమార్తె ఫోన్‌ నంబర్‌ను వేరే వ్యక్తికి ఇచ్చి ఇబ్బందుల పాలు చేస్తోందన్న కారణంతో ఓ వ్యక్తి మంగ‌ళ‌వారం పట్టపగలు అందరూ చూస్తుండగానే మహిళ గొంతు కోశాడు. తీవ్రగాయాల పాలైన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌హిళ పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న చూసిన వారంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.  సిద్దవటం రోడ్డులోని నూర్‌బాషాకాలనీలోని పొట్టేటి వెంకటసుబ్బారెడ్డి, సుబ్బలక్షుమ్మ (48) దంపతులు నివసిస్తున్నారు. ఈమె భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఒక్కతే జీవ‌నం కొన‌సాగిస్తోంది. అదే కాలనీలో నివసించే దివానీబాషా అలియాస్‌ రాయపాటి బాషా టైలర్‌ పనిచేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. చిన్న కుమార్తె భర్త బెంగళూరులో పనిచేస్తుండడంతో ఆమె నూర్‌బాషాకాలనీలోని తండ్రి వద్దే ఉంటుంది. కొద్ది రోజులుగా దివానీబాషా కుమార్తెకు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్‌ చేసి తరచూ వేధిస్తున్నాడు. ఆ వ్యక్తికి దివానీబాషా ఫోన్‌ చేసి విచారించగా, సుబ్బలక్షుమ్మ తనకు ఫోన్‌ నంబర్‌ ఇచ్చిందని చెప్పాడు. దీంతో సుబ్బలక్షుమ్మపై కక్ష పెంచుకున్న దివానీబాషా ఆమెతో పలుమార్లు ఘ‌ర్ష‌ణ‌కు  దిగాడు. అప్ప‌టికే మాటు వేసి ఉన్న దివానీబాషా మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన సుబ్బలక్షుమ్మను గొంతు కోశాడు. అత‌ని నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూ, పెనుగులాటలో ఆమె భుజంపై, చేతివేళ్లపై కూడా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సుబ్బలక్షుమ్మను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కాగా సుబ్బలక్షుమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దివానీబాషాను అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.