Thursday, August 22, 2019
Follow Us on :

వారు భయపెట్టారు.. అందుకే గ్రామానికి దూరంగా అంత్యక్రియలు!

By BhaaratToday | Published On Apr 14th, 2019

సైన్స్ బాగా అభివృద్ధి చెంది.. మనిషి తన విజ్ఞానంతో అద్భుతాలు సాధిస్తున్నాడు. ఐనా, ఈ రోజుల్లోనూ పిచ్చి నమ్మకాలతో, భయాలతో.. తోటి వారిపై వివక్ష చూపుతూ కొందరు రాతి మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. అగ్రకుల పెత్తందార్ల ఒత్తిడి కారణంగా.. చనిపోయిన ఇంటి పెద్దకు గ్రామానికి దూరంగా అడవిలో అంత్యక్రియలు నిర్వహించిన అమానుష ఘటన హిమాచల్ ప్రదేశ్లొని కుల్లు జిల్లా దారా గ్రామంలో చోటుచేసుకున్నది. వందేండ్లకు పైబడిన ఓ దళిత మహిళ అనారోగ్య కారణాలతో గురువారం చనిపోయింది. ఆమె మనవడు తాపేరాం ఆమె అంత్యక్రియలను గ్రామ స్మశాన వాటికలో నిర్వహించేందుకు సిద్దమయ్యాడు. ఐతే ఆ ఊళ్లోని అగ్రకుల పెత్తందార్లు దళిత మహిళ అంత్యక్రియలను గ్రామంలో చేయడానికి ససేమిరా అన్నారు. 

చేసేదేమి లేక ఆమె మృతదేహానికి అడవిలోని ఓ కాలువ దగ్గర తాపేరాం అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో తాపేరాం మాట్లాడుతూ.. మా బామ్మకు గ్రామంలో అంత్యక్రియలు చేసినట్టయితే.. గ్రామ ప్రజలకు ఏమైనా చేడు జరిగితే దానికి మేమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అగ్రకుల పెత్తందార్లు భయపెట్టారు. అందుకే గ్రామానికి దూరంగా అంత్యక్రియలు చేశాము అంటూ తెలిపాడు. కుల్లు డిప్యూటీ కమిషనర్ యూనస్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. నిజానిజాలు తెలుసుకుని బాధ్యులను వదిలిపెట్టమని తెలిపారు.