Thursday, November 14, 2019
Follow Us on :

బ్రింగ్ రహానే బ్యాక్ అంటూ ఫ్యాన్స్.. పంత్ అంటూ బీసీసీఐ.. ఇంత‌కు ఎవ‌రు?

By BhaaratToday | Published On Jun 11th, 2019

ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. అయితే వరుస విజయాలతో మంచి జోరు మీదున్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో అతన్ని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సూచించారు. దీంతో తదుపరి మ్యాచుల్లో ధావన్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే విషయమై బీసీసీఐ ఆలోచ‌న‌లో ప‌డింది.
 
ఇదిలావుంటే.. ధవన్ స్థానంలో కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా.. రిషబ్ పంత్‌ని జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అయితే అభిమానులు మాత్రం మరో డిమాండ్‌ని బీసీసీఐ ముందుకు తెచ్చారు. ధవన్ స్థానంలో అజింక్యా రహానేని ఓపెనర్‌గా తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బ్రింగ్ రహానే బ్యాక్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విట్టర్‌లో వైరల్ చేశారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్‌లో రహానే రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్‌లో సెంచరీ కూడా సాధించాడు. గతంలో భారత జట్టులో ఓపెనర్‌గా రహానే తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం అతను చోటు దక్కలేదు. ఇప్పుడు ధవన్ గాయపడటంతో రహానేని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌ మరింత ఊపందుకుంది. రహానేని జట్టులోకి తీసుకుంటే.. జట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అభిమానులు అంటున్నారు. 

కానీ, ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన తుది జట్టులో రహానే పేరు లేదు. దీంతో నిబంధనల ప్రకారం అతన్ని జట్టులోకి తీసుకోవడం వీలుపడదు. మరోవైపు న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో రహానేను భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు పిలిపించి.. అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.