Tuesday, October 15, 2019
Follow Us on :

ఎన్నారైలు నిర్వహిస్తున్న సభకు హాజరుకావడానికి ట్రంప్ ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు..?

By BhaaratToday | Published On Sep 22nd, 2019

‘హౌదీ-మోదీ’ కార్యక్రమానికి ట్రంప్ రూపంలో అనుకోని అతిథి దొరికారు. ఎన్నారైలు నిర్వహించనున్న ఈ కార్యక్రమం.. ముందస్తు ప్రణాళికలో ట్రంప్ ప్రస్తావన లేదు. అయితే, తాను ‘హౌదీ-మోదీ’ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు ప్రకటించి.. అమెరికా అధ్యక్షులవారు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంతకీ.. ఎన్నారైలు నిర్వహిస్తున్న ఈ సభకు హాజరుకావడానికి ట్రంప్ ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు..? ట్రంప్ - మోదీ ల భేటీతో భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయా..?

అమెరికాలో భారతీయ - అమెరికన్ల ప్రాధాన్యతతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న టెక్సాస్‌లోని హూస్టన్‌లో జరగనున్న భారతీయ-అమెరికన్ల సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడమే దీనికి నిదర్శనం. ‘హౌదీ-మోదీ’ సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారని వైట్ హౌజ్ అధికారికంగా ప్రకటించింది.‘హౌదీ-మోదీ’ సభకు ట్రంప్ రాక పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సభకు ట్రంప్‌ రాక ఎంతో ప్రత్యేకమన్నారు మోదీ. భారత్‌, అమెరికా మధ్య ఉన్న ప్రత్యేక స్నేహబంధాన్ని సూచిస్తుందని అన్నారు. భారతీయ సంతతి ప్రజలు నిర్వహించే ఆ కార్యక్రమానికి ట్రంప్‌ను ఆహ్వానించేందుకు ఆస్తికగా ఉన్నట్లు మోదీ తన ట్విట్‌లో తెలిపారు. ట్రంప్‌ రాక.. అమెరికా ఆర్థిక వ్వవస్థ బలోపేతానికి భారతీయులు అందిస్తున్న భాగస్వామ్యాన్ని గుర్తిస్తుందని తెలిపారు.

ఇలా మోదీ-ట్రంప్‌ ఒకే వేదికను పంచుకోనుండటంతో.. గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య విబేదాలకూ తెరపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీకి ట్రంప్ వ్యక్తిగతంగా గట్టి సపోర్టుగా నిలబడతారనడానికి దీనిని సంకేతంగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హ్యూస్టన్ కార్యక్రమంలో కీలక ప్రకటన గురించి బుధవారం ట్రంప్ ను విలేకరులు కూడా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. మోదీకి తనకు మధ్య స్నేహ బంధం ఉందని మాత్రమే చెప్పి వెళ్లిపోయారు. ప్రకటన గురించి స్పష్టంగా చెప్పకపోయినా పరోక్షంగా మాట్లాడి వెళ్లిపోయారు. కానీ మీడియా కథనాలు, నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో కీలక ఒప్పందాన్ని ఖరారు చేసుకొనే అవకాశముందని తెలుస్తోంది.

మోదీ అమెరికా పర్యటనపై భారత విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ స్పందించారు. భారత్-అమెరికా సంబంధాలు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలను ఆయన 90శాతం నిండిన గ్లాసుతో పోల్చారు. మరో 10శాతం సగమేనని వ్యాఖ్యానించారు. మోదీ, ట్రంప్‌లు వేలాది మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. ఇదొక గొప్ప కార్యక్రమమని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు సుదీర్ఘంగా కొనసాగుతాయని, రాజకీయంగా, భద్రతా పరంగా సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. గత 20ఏళ్ల కంటే కూడా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగున్నాయని అన్నారు. వ్యాపార పరంగా పలు సందర్భాల్లో బేధాప్రాయాలు రావడం సహజమేనని అన్నారు.

‘హౌదీ-మోదీ’ సభకు ట్రంప్ హాజరు కానుండటం వెనుక మరో వాదన కూడా వినిపిస్తోంది. మోదీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు.. 2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలించే అంశాలుగా అభిప్రాయపడుతున్నారు. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన భారతీయుల మనసులని గెలుచుకొనేందుకు ఇదో మంచి అవకాశంగా ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. భారత్-అమెరికా వాణిజ్యసంబంధాలని మరింత సరళతరం చేసేందుకు ట్రంప్ ప్లాన్ చేసినట్టు సమాచారం. తద్వారా వచ్చే ఎన్నికల్లోగా భారతీయుల మనసులని గెలవాలని చూస్తున్నారు.

‘హౌదీ-మోదీ’ కార్యక్రమాన్ని.. డెమొక్రాట్ నేత తులసి గబ్బార్డ్ స్వాగతించారు. భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీంతో తాను ఈ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నట్లు ఆమె స్పష్టంచేశారు.

హౌదీ-మోదీ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నందుకు క్షమించమని కోరారు తులసి గబ్బార్డ్. ముందస్తు కార్యక్రమాల మేరకు కుదరడంలేదని ఓ వీడియే సందేశాన్ని విడుదల చేశారు. భారత సంతతి ప్రజలంతా ఒక్కచోట కలవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లోని తన తోటి సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్య భాగస్వామి అని కొనియాడారు.

ఒకవేళ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి.. తులసీ గబ్బార్డ్ గెలిస్తే.. అరుదైన ఘనతలు సొంతం చేసుకోనున్నారు. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళగా, పిన్నవయస్కురాలిగా, తొలి భారత సంతతి వ్యక్తిగా, హిందువుగా చరిత్రలో నిలవనున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిని అయిన తులసీ.. హవాయ్ నుంచి నాలుగు సార్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు ఎంపికయ్యారు.