Friday, July 19, 2019
Follow Us on :

డ్రగ్స్ కేసు గప్ చుప్ : డ్ర‌గ్స్ కోర‌ల్లో టాలీవుడ్‌

By BhaaratToday | Published On May 15th, 2019

- సినీ ప్రముఖులు అందరికీ క్లీన్ చిట్
- సిట్ చార్జ్ షీట్ లోని పేర్లు ఏమయ్యాయి..?

డ్రగ్స్... డ్రగ్స్... ఇప్పుడు టాలీవుడ్ చుట్టూ పరిభ్రమిస్తున్న మత్తు పదార్థమిది.  డ్రగ్స్ ఇండస్ట్రీ అంటూ... మత్తు చిత్తు... అంటూ గమ్మత్తైన పదాలతో టాలీవుడ్ డ్రగ్స్ కోణం ఆవిష్కృతమవుతోంది. సినీతారలు డ్రగ్స్ తీసుకుంటూ... జీవితాలను సినీ తారులు చిత్తు చేసుకుంటున్నారని వార్తలు టాలీవుడ్ లో గుప్పుమంటున్నాయ్. సినీ ప్రపంచం ఇప్పుడు డ్రగ్స్ గురించి బెంబేలెత్తిపోతోంది. డ్రగ్స్ తో మునిగి తేలిన సినీ జనం తామేం పాపం ఎరుగమంటున్నారు. డ్రగ్స్ ఆరోపణలపై పోలీసులు నోటీసులు పంపితే మాకేం సంబంధం లేదంటున్నారు. 30 వేల మంది తారలున్న టాలీవుడ్ లో పది మంది డ్రగ్స్ తీసుకుంటే మొత్తం ఇండస్ట్రీపైనే వేలెత్తి చూపిస్తారా అంటూ వాపోతున్నారు. డ్రగ్స్, పాలిటిక్స్ ఇప్పుడు తెలుగునాట రసవత్తర సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాయ్. సెలబ్రిటీలుగా నలుగురికి మార్గదర్శనంగా ఉండాల్సిన తారలు ఇలా చేస్తున్నారంటని సినీ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. 

డ్ర‌గ్స్ కోర‌ల్లో టాలీవుడ్‌:
టాలీవుడ్ ఇప్పుడు డ్రగ్స్ కోరల్లో చిక్కుకుపోయింది. డ్రగ్స్ భూతం టాలీవుడ్ ను అధఃపాతాళానికి నెడుతోంది. మొన్నటి వరకు వారు సెలబ్రిటీలు... హీరోలుగా చెలామణీ అయ్యారు. అయితే డ్రగ్స్ భూతం దెబ్బకు ఒక్కసారి జీరోలైపోయారు. హైదరాబాద్ లో డ్రగ్స్ బిజినెస్ తో కాకలు తీరని కెల్విన్... సినీ తారలను వలేసి పట్టుకొని వారి జీవితాల్లో చీకట్లు నింపాడు. ఇదే జగత్తు అనుకొని మురిసిపోయిన సినీ జనం డ్రగ్స్ ఆరోపణలతో బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో జరిగిన సినీ తారల డ్రగ్స్ వ్యవహారానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు కెల్విన్.

డ్రగ్స్ భూతాన్ని ఎలా విస్తరించాడు :
సినీ ప్రపంచాన్ని కుదిపేసిన డ్రగ్స్  కోరలు చాలా ప్రణాళిక ప్రకారమే విస్తరించినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కు ఎవరి సరిపోతారు. ఎవరైతే డ్రగ్స్ ను కొనుగోలు చేయగలుగుతారు... ఎవరు డ్రగ్స్ భూతానికి చిక్కుకుంటారు... అన్న లెక్కలు వేసుకున్నాకే డ్రగ్స్ పంజాను వదిలినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో టాలీవుడ్ పై విసిరి కెల్విన్ డ్రగ్స్ కోరలకు టాలీవుడ్ విలవిలలాడిపోతోంది. ఒక్కొక్కరుగా బయటకొస్తున్న పేర్లతో సినీ అభిమానులు అవాక్కవుతున్నారు. తన అభిమాన తారలు, దర్శకులు ఇలాంటి వారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. కెల్విన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకున్నాడు. డ్రగ్స్ వ్యాపారాన్ని పెంచేసుకోవాలి. అందరూ డ్రగ్స్ తీసుకోవాలి. ఇందుకు ఎవరైతే సరిపోతారన్న దానిపై అంచనాకు వచ్చిన...  కెల్విన్ అడుగు ముందుకేశాడు. మత్తు మందులు అవసరమైనవారున్నారు...  అవి కొనే స్తోమత ఉన్నవారి అన్న లెక్కలను ఆరాతీశాడు. ఉన్నత పాఠశాలల్లో చదివే సంపన్నుల కుటుంబాల పిల్లలు, విలాసాల కోసం ఎదురు చూసే సినీ జనాలను టార్గెట్ గా చేసుకొని మత్త ప్రవాహాన్ని పారించాడు కెల్విన్. 

మత్తు మందులు ఎవరికిస్తున్నాం... ఎంత వయసు వారికి ఇస్తున్నామన్న లెక్కలు అసలే పట్టించుకోలేదు. ముఖ్యంగా మైనర్లకు సైతం డ్రగ్స్ అందించాడు. తొలుత ఉచితంగానూ డ్రగ్స్ అందిస్తూ... క్రమేపీ అవి లేకుండా బతకలేమన్నంతగా వారిని మార్చేశాడు. డ్రగ్స్ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న పోలీసులకు సినీ జనాలకు మత్తును సరఫరా చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో... ఇక పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా పేర్లు బయటకు రావడంతో పోలీసులే షాక్ తిన్నారు. దాంతోపాటు... ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నటుడు భరత్ సెల్ ఫోన్ ఆధారంగా కూడా...డ్రగ్ అండ్ సప్లై గురించి సమాచారం పోలీసులుకు తెలిసినట్టుగా తెలుస్తోంది. 

కెల్విన్ హైదరాబాద్ లో పలువురు సినీతారలకు ఎల్.ఎస్.డీ సరఫరా చేస్తున్నాడన్న విషయం పోలీసులు విచారణలో తేలింది. గతంలోనూ గంజాయితో కెల్విన్ పట్టుబడ్డ విషయాన్ని పోలీసులు రిమైండ్ చేసుకున్నారు. నాలుగేళ్లలో కెల్విన్ మత్తు సామ్రాజ్యాన్ని శాఖోపశాఖలుగా విస్తరించేశాడు. సినీతారలకు కావాల్సిన మత్తులను అందిస్తూ...  టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయాడు. సినీతారలను పట్టుకోవాలంటే... వారికి సన్నిహితంగా ఉండే ఈవెంట్ మేనేజర్లు కీలకమని భావించిన కెల్విన్... మేనేజర్లతో సంబంధాలు పెట్టుకొని వారికి భారీ మొత్తాలలో ఆఫర్లిచ్చేవాడు. వారి ద్వారా సినీ తారలకు మత్తు... గమ్మత్తు గురించి వివరించేవాడు. ఒకరి తర్వాత ఒకరికి డ్రగ్స్ ను చేరివేసి...కోట్లు గడించాడు.

డ్ర‌గ్స్ తీసుకున్న సినీ తార‌ల‌కు నోటీల‌సు విష‌యంలోనూ...
డ్రగ్స్ తీసుకున్న సినీతారలకు నోటీసుల విషయంలోనూ పలు ఆసక్తికర ఘటనలు చేటుచేసుకున్నాయ్. బడా నిర్మాతల పిల్లలు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయ్. అయితే వాటిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే... తాజాగా ప్రముఖంగా విన్పించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారించిన జర్నలిస్టులకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయ్. నేను చెప్పింది మీరు రాయగలరా అంటూ ఆయన జర్నలిస్టులను ప్రశ్నించాడని...  15 మందికి నోటీసులు అని చెప్పి... కేవలం 8 మంది పేర్లు మాత్రమే వేస్తున్నారని... మిగతా వారి పేర్లు ఎందుకు బయటపెట్టరంటూ పూరీ మీడియాను నిలదీశార‌ట. నోటీస్ ఇస్తే విచారణకు వెళ్లి చెప్తానంటూ పూరీ చెప్పుకొచ్చారని...  కొంత మంది విషయంలోనే ఎందుకు దూకుడు ప్రదర్శిస్తారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన్టటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చేతినిండా డబ్బు... సమాజంలో గౌరవం... ఏం చేసినా చెల్లుబాటయ్యే పరిస్థితులు... మత్తుకు బానిసలవుతున్న విధానమిదే...  తాజాగా 15 మంది సినీ తారలు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమనడం... కొంత మంది కాదు... లేదన్న అభిప్రాయం చెప్పడం అంటుంచితే... మరికొందరి పేర్లు మిస్సయ్యాయంటూ మరో వర్గం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. జీవితమనేది అతి కష్టమైన, క్లిష్టమైన పరీక్ష. ఈ పరీక్షలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు . దీనికి కారణం వాళ్ళు పక్కనోళ్ళని చూసి కాపీ కొట్టడానికి ప్రయత్నించడమే. వాళ్లకి అర్ధం కాని విషయం ఏమిటంటే… ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ప్రశ్నపత్రం ఉంటుంది. దీన్ని గుర్తుంచుకుని ముందుకు వెళ్లాల్సిందే.