Thursday, July 18, 2019
Follow Us on :

వారిద్ద‌రు సన్‌రైజర్స్‌ కోసం కలిసి పని చేయడం నేర్చుకున్నారు

By BhaaratToday | Published On Apr 6th, 2019

ఇంగ్లాండ్‌ వన్డే జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌ స్టో భాగస్వామ్యాన్ని అభినందించాడు. వారిద్దరూ కలిసి చక్కగా ఆడుతున్నారని ప్రశంసించాడు. వార్నర్‌, బెయిర్‌ స్టో జోడీని ఫుట్‌బాల్‌ స్టార్లు.. మాంచెస్టర్‌ యునైటెడ్‌ మాజీ ఫార్వర్డ్స్‌ వేన్‌ రూనీ, క్రిస్టియానో రొనాల్డొతో అతడు పోల్చాడు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌లో వార్నర్‌, బెయిర్‌ స్టోకు సత్సంబంధాలు లేవు.

2017 యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ను వికెట్ల వెనకాల నుంచి బెయిర్‌ స్టో పదేపదే విగిసించాడు. ఇప్పుడు అదే వార్నర్‌, బెయిర్‌ స్టో సన్‌రైజర్స్‌ కోసం కలిసి పని చేయడం నేర్చుకున్నారని మోర్గాన్‌ అన్నాడు. ‘ప్రస్తుతం వారిద్దరూ ఒకే జట్టు సభ్యులు. ఫ్రాంచైజీ క్రికెట్‌లోని అందం అదే. కలిసి ఆడతామని కలలోనైనా ఊహించని వ్యక్తులతో భుజాలు రాసుకొని తిరగాల్సి వస్తుంది’ అని ఇయాన్‌ వెల్లడించాడు. ఈ సీజన్‌లో వార్నర్‌, బెయిర్‌స్టో జోడీ నాలుగు అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.