Friday, December 13, 2019
Follow Us on :

ఫైనల్ పోరుకు వేళాయే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్

By BhaaratToday | Published On Jul 14th, 2019

ప్ర‌పంచ‌క‌ప్ చివరి ద‌శ‌కు చేరింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు మ‌రికాసేప‌ట్లో ఫైనల్ పోరుకు సిద్ధం అయ్యాయి. లీగ్ దశ నుంచి.. సెమీస్ వరకు ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లను ఓడించడంతో వారిలో విశ్వాసం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సొంతగడ్డపై ఆడుతుండటం కూడా వీరికి కలిసొచ్చే అంశం. జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, ఆర్చర్, వోక్స్.. ఈ జట్టులో కీలకమైన ఆటగాళ్లు. 

అటు న్యూజిలాండ్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. లీగ్ స్టేజిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోయినా.. సెమీస్‌లో భారత్‌ పై విజయం సాధించడంతో వారు ఆత్మ‌విశ్వాసంతో ఉన్నార‌ని చెప్పాలి. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జిమ్మీ నీషం, హెన్రీ, బౌల్ట్.. ఈ జట్టులో కీలక ఆటగాళ్లు. మరోవైపు ఇంగ్లాండ్ 27 ఏళ్ళ తర్వాత ఫైనల్స్‌కు చేరడంతో.. ఈసారి కప్పు ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంది. అటు న్యూజిలాండ్ కూడా 2015 ఫైనల్‌లో చేసిన తప్పిదాలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. మరి వీరిద్దరిలో విజేతో వేచి చూడాల్సిందే.